Friday, 1 November 2019

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిషత్తు ఏమిటి?రెంటికి చెడ్డ రేవడు అవుతాడా!

తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో 2014లో అన్నా 2019లో తమ్ముడూ మమ్మల్ని దెబ్బతీశారని ఏడుస్తున్నారు, వైకాపా వాళ్ళేమో చంద్రబాబు దత్తపుత్రుడని ఏడుస్తున్నారు - ఇద్దరూ అతని మీద పడి అలా ఏడుస్తున్న అతని సొంత వాళ్ళ ఏడుపు మరోలా వుంది! నిన్ననో మొన్ననో ఒక కాపు కులస్థుడు తమ సొంత కులంవాళ్ళనే బూతులు తిడుతున్న ఒక వీడియో చూశాను.మొదటి నాలుగు వాక్యాలు వినగానే విషయం అర్ధమైపోయి ఇక మిగిలిన భాగం చూడలేదు - రాష్ట్రం మొత్తం 80% ఉన్న మన కులంవాళ్ళు వేరే కులం వాళ్ళకి వోట్లేసి ఎర్రిపప్పల్లా వేరేవాళ్ళని అధికారంలోకి తీసుకొస్తున్నారు అనే ఆరున్నొక్కరాగం తప్ప కామన్ సెన్సు కూడా లేని వెర్రివాగుడు!
అసలు ఒక కులపు మనిషి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ కులపు స్థాయి పెరుగుతుందా?ఖచ్చితంగా పెరుగుతుంది!ముఖ్యమంత్రి కావడం వల్లనే కాదు, "కులములోన నొక్క గుణవంతు డుండెనేని అతని వలన కులము వెలుగు!"ననేది అక్షరసత్యమే.గోన గన్నా రెడ్డి గురించి రెడ్లు మావాడని చెప్పుకోవటం లేదా?జాతీయ పతాక రూపశిల్పి మనవాడని తెలుగువాళ్ళు చెప్పుకోవడం లేదా?కన్యకా పరమేశ్వరి మా కులంలో పుట్టిన దేవత అని కోమట్లు చెప్పుకోవడం లేదా?
అయితే, ఆయా కులాల వాళ్ళు తమవాళ్ళని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆయా కులాల పరిధి లోనే గుడుగుడుగుంచం ఆడుకుని ఉంటే వాళ్ళకి అంత ఖ్యాతి వచ్చి ఉండేదా?ఖచ్చితంగా రాదు!వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన కృషి తమ కులాన్ని దాటి అన్ని కులాల వాళ్ళనీ మెప్పించడం వల్లనే వీళ్ళు వాళ్ళని తమకులంవాళ్ళని టముకేసుకోవడానికి పనికొస్తున్నారు.ఇది అందరికీ అర్ధమైతే రాజకీయాల్లో పేరుకుపోయిన కులపిచ్చి కొంత తగ్గే అవకాశం ఉంది - పూర్తిగా నశించిపోయినా ఆశ్చర్యపడనక్కర లేదు!
పవన్ కళ్యాణ్ సినిమాల్ని కాపులు మాత్రమే చూశారా?అతని అన్న చిరంజీవి సంగతి ఏంటి?ఏనాటి పునాది రాళ్ళు?ఏనాటి ప్రాణం ఖరీదు?ఆ నటన కులం వల్లనే వచ్చిందా!ఆ పేరు కులం వల్లనే వచ్చిందా!సరే, వీళ్ళందరికీ రోల్ మోడల్ రామారావుని మాత్రం కమ్మ కులస్థులు మాత్రమే గొప్పవాణ్ణి చేశారా?రామారావైనా చిరంజీవైనా కేవలం నటులు - వేరేవాళ్ళు రాసిన డైలాగులకి హావభవాలు చూపించటమే కదా చేసింది - ఆ డైలాగులు రాసింది వీళ్ళ కులంవాళ్ళు కాదే, వీళ్ళ సినిమాలు హిట్టయ్యి వీళ్ళకి స్టార్‌డం తెచ్చిపెట్టిన డైరెక్టర్లు వీళ్ళ కులంవాళ్ళు కాదే! రామారావు వేసిన పౌరాణిక వేషాలు రాజ్ కుమార్, శివాజీ గణేశన్ కూడా వేసినా రామారావు సాక్షాత్తూ దేవుడని ప్రేక్షకులు భ్రమపడటం వెనక మేకప్ మ్యాన్లూ డైలాగ్ రైటర్లూ డైరెక్టర్లూ చేసిన కృషి ఎంతో ఉంది - వాళ్ళలో సగం మంది బ్రాహ్మలూ సగం మంది రెడ్లూ!అన్ని కులాలవాళ్ళూ కలిసి పనిచేసిన సినిమా హిట్టవడానికి ఆ ఒక్కణ్ణి బాధ్యుణ్ణి చెయ్యడమే ఒక దరిద్రమయితే ఆ దరిద్రాన్ని ఆ ఒక్కడి కులంవాళ్ళంతా పంచుకోవడం ఇంకో దరిద్రం!స్టార్ అయ్యాక చెత్త సినిమాల్ని కూడా హిట్ చెయ్యగలిగిన క్రేజ్ తమకు అంతకుముందు చేసిన మంచి సినిమాల వల్లనే అని డబ్బు యావలో పడిన ఆయా నటులు కూడా మర్చిపోవడం వల్ల ఆ దరిద్రం ఇప్పటికీ కొనసాగుతున్నది, అసలు స్టార్ హోదా ఎవరికీ పరిధులు మించి ఉపయోగ పడటం లేదు!ఖైదీతో ప్రాణం ఖరీదు నాటి చిరంజీవిని చంపేశారు - మళ్ళీ పునాదిరాళ్ళు నాటి చిరంజీవి కనపడకపోవటం వల్లనే సైరా ఫ్లాప్ అయ్యింది!సినిమా అనేది బిజినెస్ కాబట్టి దమ్ము లేని సరుకుని అమ్ముకోవడానికి వేసే వెధవ్వేషాల్లో హీరోవేషాలు వేసేవాళ్ళకి క్రేజ్ సృష్టించడం ఒక టెక్నిక్.
రాజకీయాల్లో కూడా అదే సత్యాన్ని చూడాలి.ఎన్నికల తర్వాత తన శాసనసభ్యత్వంతో అన్ని కులాల్నీ మెప్పించాల్సినవాళ్ళు ఎన్నికల ముందు ఒక కులం వోటర్లని మాత్రమే మెప్పించి అధికారంలోకి రావడం అసంభవం!చంద్రబాబు నాయుడు మొన్న అధికారంలోకి వచ్చి నిన్న రాలేకపోయినా జగన్మోహన రెడ్డి మొన్న అధికారంలోకి రాలేక నిన్న అధికారంలోకి వచ్చినా కులం ఒకటే పనిచెయ్యలేదని గుర్తుంచుకోవాలి!మొత్తం 175 సీట్లలో మూడింట రెండు వంతులు అంటే 105కి మించి ఏ వ్యక్తి సాధించగలుగుతాడో అతను ముఖ్యమంత్రి అవుతాడు. కులసమీకరణలు కొన్ని నియోజకవర్గాలలోనే ఫలితం చూపిస్తున్నాయి.2014లో అప్పుడే విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం అనేది జనం మీద పని చేసింది.2019లో చంద్రబాబు తను చేస్తానన చెప్పిన అభివృద్ధిని ప్రజలకి చూపించలేక ఫెయిలయితే జగన్మోహనరెడ్డి  చేసిన వాగ్దానాలు ప్రజలకి నచ్చాయి.
సినిమాల్లో హీరోయిజం చూపించి "పవన్ ఈజ్ గాడ్!" అనిపించుకున్న మంచి మనిషి పాలిటిక్సులో "పావలా కళ్యాణ్!" అనిపించుకుంటూ జీరో కావడం అతని అభిమానులకి కష్టంగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళడమా రాజకీయాల నుంచి విరమించుకుని సినిమా నటనకే పరిమితం కావడమా అనే ప్రాధమ్యాలని వీలయిననత త్వరగా నిర్ణయించుకుంటే మంచిది!ఇతనికన్న ముందు రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో నిజాయితీ ఉంది - కొత్త రకం రాజకీయం అని చెప్పి పార్టీ నడిపే ఖర్చుల్ని భరించలేక కాంగ్రెసులో కలిపెయ్యడం లాంటి చెత్తపనులు పవన్ కళ్యాణ్ చెయ్యడనేది గ్యారంటీ!ఉత్ధానం బాదితుల కోసం గానీ భూసేకరణ సమయంలో రైతుల కోసం గానీ మరెక్కడ అతను నిలబడినా గానీ అతని ఉనికి వల్ల ఫలితం కనిపించిందనేది వాస్తవం. తెలంగాణలో అటామిక్ ప్లాంట్ విషయంలో అతను అందరూ తప్పంటున్నారు గాబటి అతనూ తప్పనేశాడు గానీ, కొంత రీసెర్చి చేసి సొంత మాట చెప్పి ఉంటే బాగుండేది, అదీ గాక నేటివిటీ దృష్ట్యా ఇతను ఆంధ్రావాడు, ఇతను తెలంగాణలో వ్యతిరేకిస్తున్న సమయంలోనే ఆంధ్రలో కొవ్వూరు ప్లాంటు శరవేగాన ముందుకెళ్తున్నది!
పవన్ కళ్యాణ్ అంశాల ప్రాతిపదికన ఎవరు మంచి చేస్తే వారిని అభినందించడం అనే చాదస్తం మానేసి ఆసులో కండెలా అటు కాసేపూ ఇటు కాసేపూ మట్లాడి ఇద్దరితోనూ మాటలు పడటానికి బదులు ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడుతున్నట్టు ప్రకటించి సొంత బలం పెంచుకోవాలి.తన పార్టీ తరపున కనీసం 108మందిని తన చరిస్మాతో గెలిపించుకోవడానికి ప్రణాళికలు వేసుకోవాలి.పవన్ కళ్యాణ్ మొదటి నెగటివ్ పాయింట్ వాగ్ధాటి లేకపోవటం -  నీరసం, గొణుగుడు, నట్లు కొట్టడం,దిక్కులు చూడటం,పచార్లు చెయ్యడం, చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నట్టు మధ్యలో ఆపెయ్యడం లాంటివి తగ్గించి తను ఏం చెప్పదల్చుకున్నాడో దాన్ని సూటిగా చెప్పడం నేర్చుకోవాలి. రేపటి జనరల్ ఎన్నికల నాటికి CBN, JGN అనే ఇద్దరు అనుభవజ్ఞుల్ని మించి తాను ఏమి సాధించగలడో చెప్పగలిగిన స్థితిలో ఉండాలి, అది కుదరని పక్షంలో అతను రాజకీయాల్లో కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదు.
చంద్రబాబు అభివృద్ధి గురించి చెప్పుకున్నది యేదీ కళ్ళ ముందు చూపించలేకపోయాడు.రైతుల నుంచి భూమిని తీసుకోవటం వరకు గొప్పే కానీ ఆ భూమి కొందరికి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కింద మారడం లోపాయకారీగా తేలిన నిజం!ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పడమే తప్ప నాలుగేళ్ళలో కనీసం plan layout కూడా చూపించకుండా ఏం చేశాడో అర్ధం కావడం లేదు, కట్టినవేమో తాత్కాలిక భవనాలని తనే అంటున్నాడు - ప్లాన్ లేఅవుట్ కాగితం మీద కనపడితే ఇవ్వాళ జగన్ ప్రభుత్వం మాత్రం రాజధాని మార్చాలని అనే ధైర్యం చేస్తుందా!తెలుగుదేశం చేసిన ఇలాంటి తప్పుల్నీ వైకాపా ఇప్పుడు చేస్తున్న తప్పుల్నీ విమర్శిస్తూ మైలేజిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి గానీ వాళ్ళతోనూ వీళ్ళతోనూ జోకులు వేయించుకుంటే అధికారం ఎప్పటికీ దక్కదు.వ్యక్తిగతంగా ఉన్న నిజాయితీని పోగొట్టుకోకుండా అన్ని కులాలవాళ్ళనీ మెప్పించితే పవన్ కళ్యాణ్ ఒక మంచి ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకం నాకుంది.
చంద్రబాబులా అనుభవం గానీ జగన్మోహాన్ రెడ్డిలా వారసత్వం గానీ లేకుండా ఈ స్థాయిలో నిలబడటమే చాలా కష్టం! అయితే ఎకాఎకి ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడటం జగన్ అనే వ్యక్తిని చూస్తే 108మందిని గెలిపించటానికి సరిపడిన డబ్బుంటే చాలనిపిస్తుంది,ఒకసారి గెలిచాక రెండోసారి గెలవలేని చంద్రబాబును చూస్తే భయం వేస్తుంది.కానీ లోకంలో వీళ్ళిద్దరే కాదు, ప్రతి రాజకీయ నాయకుడూ నేనొక్కణ్ణే మీ బతుకుల్ని బాగు చేయ్యగలనని కబుర్లు చెప్తున్నవాళ్ళే - ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప! తను కాక ఒక యాభైమందిని శాసనసభకి పంపించగల స్థాయిలో పవన్ వాగ్ధాటిని పెంచుకుంటే చాలు, మిగిలిన అంశాల్తో ఇంకొంచెం బలం పెంచుకోవచ్చు. ఆ మిగిలిన అంశాల్లో ఆర్ధికాన్ని స్టడీ చెయ్యటం ఒకటి - దేశం మొత్తం రాజకీయం ఎట్లా ఉన్నా ఆంధ్రా మాత్రం కాంగ్రెసు వైపు చూడటానికి కారణం కాంగ్రెసు ప్రభుత్వాల్లోని ఆర్ధికమంత్రులు బడ్జెట్లని జాగ్రత్త్తగా రూపుదిద్దడమేనని నేను నమ్ముతున్నాను!అధికారంలోకి రావడం కన్న వచ్చాక నిలబడటమే అసలైన సమస్య అయినప్పుడు అలా నిలబడటానికి మంచి బడ్జెట్లు ఎలా వెయ్యాలి ఆనెది తెలుసుకుంటే పవన్ తను చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలడని ప్రజలకి నమ్మకం కుదురుతుంది.కాబట్టి కష్టమే అయినా అప్పటికి మార్కెట్లోకి రాని పుస్తకాల్ని కూడా చదివినట్టు పోజులు కొట్టడానికి బదులు ఎకనామిక్సు అనే సబ్జెక్టుని శ్రద్ధగా చదవాలి.ఒక ప్రభుత్వానికి గుడ్విల్ రావడానికి ఆ ప్రభుత్వాధినేత ఎన్నుకున్న అధికారుల టీం ముఖ్య కారణం కాబట్టి అధికారుల్లో తనకు స్నేహితుల్ని పెంచుకోవాలి.అనిటికన్న ముఖ్యమైనది వ్యాపార పారిశ్రామిక రంగాల వారిని మచ్చిక చేసుకోవటం - మంచి పరిపాలన అంటే ఉపాధి కల్పన అయినప్పుడు దానికి సహాయం చేసేది మార్కెట్ మీద పట్టున్న వాళ్ళే.అభివృద్ధి అంటే రాష్ట్రం యొక్క సంపదని పెంచడం కాబట్టి ఆ రకమైన సమర్ధతని పెంచుకోకుండా టైం పాస్ బఠానీ నములుడు ఎంతకాలం కొనసాగించినా పావలా కళ్యాణ్ అనే జోకులే పదతాయి తప్ప పవన్ ఈజ్ గాడ్ అని ఎవరూ అనరు.
యతో ధర్మం తతో జయం!కృషితో నాస్తి దుర్భిక్షం!సత్యమేవ జయతే!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...