Sunday, 10 January 2016

మృఛ్చ కటికం, కన్యాశుల్కం - రెండు మహా నాటకాలు ఒక్క పోలిక నుండు గానీ రుచుల జాడ వేరు!

      మృఛ్చ కటికం నాటకాన్ని రాసింది ఒక మహారాజు.శూద్రక మహారాజు.కన్యాశుల్కం రాసింది ఒక జమీందారు గారి దగ్గిర ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తి.రెంటిలోనూ ఉన్న విశిష్టత అనాటి  కాలానికి అట్టడుగున ఉన్న జనసమూహాన్ని పాత్రలుగా చేసుకుని బొమ్మకట్టి చూపించినట్టు ఉండటం!

      తరవాత నేను చూపించబోయే పోలికలూ తేడాలూ వాట్ని చదవని వారికి కూడా అర్ధం కావడం కోసం మొదట క్లుప్తంగా కధల్ని వివరిస్తాను.

మృచ్చకటికం:చారుదత్తుడు ఒక బతికి చెడ్డ మంచి కోమటి గృహస్థు.పెళ్ళయి రోహసేనుడు అనె కొడుకు కూడా ఉంటాడు.కధ మొదటి సన్నివేశం నాటికే వసంతసేన అనే వేశ్య చారుదత్తుణ్ణి అభిమానించటం,ఇతనూ ఆమె పట్ల సానుకూలంగా ఉన్నా తనిప్పుడు నిర్ధనుడు గదా అని వెనుకాడ్డం జరుగుతూ ఉంటుంది.అయితే వాళ్ళ మధ్యన పరిచయం పెరగడం రాజశ్యాలకుడు శకారుని పుణ్యాన జరుగుతుంది.ఒకనాటి చీకట్లు గమ్మొతున్న సాయంత్రపు వేళ శకారుడు వెంబడిస్తుంటే తప్పించుకోవటానికి చారుదత్తుడి ఇంట్లో దూరుతుంది వసంతసేన.ఆ పరిచయాన్ని పొడిగించుకోవటానికి వసంతసేన తన నగల్ని ఇక్కడ దాచమని ఇస్తుంది.అయితే వసంతసేన దగ్గిర దాసీగా ఉన్న మదనికని విడిపించటానికి శర్విలకుదు అనే దొంగ ఈ చారుదత్తుడి ఇంటికి కన్నమేసి ఆ నగలని కాజేసి వసంతసేన ఇంటికే తెస్తాడు.ఈలోపు చారుదత్తుడు తన ఇంట్లో దొంగలు పడ్డారని చెప్తే ఎవరు నమ్ముతారని విచారపడుతుంటే అతని భార్య ధూతాదేవి తన ఆభరణాలు ఇస్తుంది.అవి తీసుకెళ్ళి పోయినవాటి బదులు ఇవి జమ చేసుకోమని క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించడమూ ఆ సంభాషణ ఇద్దరి మధ్యనా ఉన్న అడ్దంకుల్ని తొలగించి వసంతసేన ఏకంగా చారుదత్తుడి ఇంటిలోన నిస్సంకోచంగా ఒక రాత్రి గడిపే వరకూ వెళ్తుంది.తెల్లవారిన తర్వాత చారుదత్తుడి ఇంటిలో నిద్రలేచిన వసంతసేనకి ఒక ఉద్యానవనం పేరు చేప్పి అక్కడికి రమ్మని కబురందించి చారుదత్తుడు ముందే అక్కడికి వెళ్తాడు.వసంతసేన ఒక ఎడ్లబండిని మాట్లాడుకుని సిద్ధంగా ఉంటుంది.దీనికి సమాంతరంగా శకారుడి కోసం కూడా ఒక బండి సిద్దమై వస్తూ ఉంటుంది.ఈలోపు ఆర్యకుదనే రాజద్రోహనేరం మోపబడి కారాగృహంలో ఉన్నవాడు తప్పించుకున్నాడని కలకలం రేగుతుంది.రాజవీధిలో మామూలుగా ఉండే హడావిడికి తోడు ఈ హడావిడి కూడా తోడై చారుదత్తుడి దగ్గిరకి వసంతసేన వెళ్ళాల్సిన బండిలో ఆర్యకుడూ,శకారుణ్ణి తన స్వగృహానికి చేర్చటానికి శకారుడున్న చోటుకి వెళ్తున్న బండిలో వసంతసేనా ఎక్కుతారు.వసంతసేన దిగాల్సిన బండిలో నుంచి దిగిన ఆర్యకుణ్ణి చూసిన చారుదత్తుడు అతని వివరాలు తెలుసుకుని అతని పట్ల ఆదరంతో వ్యవహరించి శృంఖలాలు విడిపించి పంపిస్తాడు చారుదత్తుడు.అక్కడ శకారుడు తన దుష్టబుద్ధి ప్రకారం వసంతసేనని తన కోరిక తీర్చమని ఒత్తిడి పెట్టి ఒప్పుకోకపోవదంతో గొంతు నులిమి చంపేసి తర్వాత కంగారు పడి వసంతసేన మీద ఆకులలములు కుప్పగా కప్పేసి అక్కణ్ణుంచి పారిపోయి వస్తూ సరికొత్త ఐడియా అనుకుంటూ ఆ హత్యానేరాన్ని చారుదత్తుడి మీదకి తోస్తాడు.అయితే వసంతసేన నిజంగా చనిపోలేదు.చనిపోయిందనుకుని శకారుడు కప్పిన ఆకులలముల మీద బౌద్ధసాధువు గా మారిన సంవాహకుడు తడిబట్టని ఆరవేస్తే తడికి కదిలి లేస్తుంది.ఎవరు చనిపోయారనుకుని శిక్ష వేస్తున్నారో ఆ వసంతసేన ప్రాణాలతో కనబడ్డంతో చారుదత్తుణ్ణి న్యాయాధిపతి విముక్తుణ్ణి చేస్తాడు.కొసమెరుపుగా ఆర్యకుడు తిరుగుబాటుని జయప్రదంగా పూర్తి చేసి రాజవుతాడు.వసంతసెన చారుదత్తుడి భార్య అయితే శకారుడు తన తప్పులకి శిక్ష అనుభవిస్తాడు.

కన్యాశుల్కం:ఈ నాటకం  మొదలవడం "సాయంకాలమైంది" అనే గిరీశం తొలిపలుకుతో మొదలై "డామిట్!కద అడ్డం తిరిగింది" అనే తుదిపలుకుతో సమాప్త మవుతుంది.కధ అగ్నిహోత్రావధాన్లు నే కోపిష్టి ఇంటిలో మొదలవుతుంది.పెద్ద కూతురు బుచ్చమ్మకి చిన్నప్పుడే పెళ్ళి చెయ్యడం వల్ల తలచెడి ఇంట్లో కూర్చున్నా మళ్ళీ చిన్న కూరురు సుబ్బికి కూడా కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాణ్ణి పెళ్ళికొడుకుగా నిర్ణయించేస్తాడు.భార్యకి ఇతని చాదస్తాలు ఇష్టముండదు.గొంతు పెంచి అరిచేతప్పుడు అప్పటికి మాట్లాడదు గానీ చాటుగా తను చెయ్యాలనుకున్నది చేస్తూ ఉంటుంది ఈ సంబంధం ఎట్లా అయినా చెదగొట్టమని తన అన్న కరటక శాస్తుర్లుని బతిమాలుకుంటే అతను మధురవాణిని బతిమలాడుకుంటాడు.మధురవాణి ఈ పెళ్ళి చేసి లాభం పొందాలనుకుంటున్న రామప్పంతులు ఉంచుకున్న వేశ్య!ఇక్కడ అగ్నిహోత్రావధానులు కొడుకైన వెంకటేశం అనే బడుద్ధాయకి ఇంగ్లీషు పంతులుగా వచ్చి బుచ్చమ్మని మనిద్దరం లేచిపోతే ఈ పెళ్ళి తప్పి పోతుందని నమ్మించి ఆ ప్రయత్నంలో ఉన్న గిరీశం కూదా కొంతకాలం మధురవాణికి పాత క్లయింటే!మధురవాణి వేసిన ప్లాను ప్రకారం రామప్పంతులే ప్లేటు ఫిరాయించి ఈ అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని పెళ్ళాడి ధనలాభం కిట్టించుకోవాలనుకున్న లుబ్ధావధాన్లకి ఇంతకన్నా మంచి సంబంధం అని ఆశ చూపించి కరటక శాస్తుర్లు శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్ళి చేస్తారు.ఆ తర్వాత జరిగిన గందరగోళంలో కరటక శాస్తుర్లు శిష్యుడు మధురవాణి పెళ్ళికూతురు అలంకారానికి ఇచ్చిన కంటెతో సహా ఉడాయించటంతో లుబ్ధావధాన్ల మీద పెళ్ళి కూతుర్ని చంపీన మర్దరు కేసు చుట్టుకుంటుంది.అతను నిరపరాధి అని జాలిపడి సౌకన్యారావు ఆ కేసు వాదించాలని తీసుకున్నా కోర్టులో ఎట్లా రుజువు చెయ్యాలో అతనికీ తెలియక అవస్థ పడుతుంటే మధురవాణి సౌజన్యారావు యాంటినాచ్చి అని తెలుసుకుని మగవేషంలోఅతని ముందుకు వెళ్ళి మొత్తం కధంతా చెప్తుంది. సౌజన్యారావు మధురవాణి చెప్పిన క్లూలని బట్టి లుబ్ధావధాన్లని నిర్దోషిగా విడిపిస్తాడు.లుబ్ధావధాన్లు కూతుర్ని ఏదో ఓక సహాయసంస్థలో జేర్చి తను కాశీకి పోతాననడమూ గిరీశం కూడా సౌజన్యారావుని కలవడానికొచ్చి మగవేషంలో ఉండతం వల్ల మధురవాణిని గుర్తుపట్టక సౌజన్యారావుతో కోతలు కోస్తూ పాత అలవాటు చొప్పున మధురవాణిని గురించి కూడా కారుకూతలు కూస్తే సౌజన్యారావు బూటకపు యాంటినాచ్చి గురించి తిడతాడు.గిరీశం ఇంకా "ట్ర్రూ రెపెంటెన్సు" గురించి లెక్చర్లు దంచబోతుంటే బయటకు పొమ్మనదంతో కధ ముగుస్తుంది.

      చారుదత్తుడు-సౌజన్యారావు,వసంతసేన-మధురవాణి,ధూతాదేవి-బుచ్చమ్మ,శకారుడు-గిరీశం లాంటి ప్రధాన పాత్రల స్వభావాలు చాలా దగ్గిరగా ఉందటమే కాకుండా కధాగమనంలో వాటి ప్రాధాన్యతలు గూడా ఒక్కలాగే ఉంటాయి.వర్ధమానుడు,స్థావరకుడు,చందనకుడు,వీరకుడు,మాధురుడు,దూతకరుడు - వీళ్ళంతా ఇక్కడి కల్లుపాక దగ్గిర జనమూ బండివాడూ లాంటివాళ్లతో పోలిన పాత్రలు.కధలో ఉన్న మెలికకి సంబంధం లేకపోయినా కధలోని పతాక సన్నివేశం ఖచ్చితంగా అటువైపుకే నడిచే నాటకీయతకి ఒక్కలాగే దోహదం చేస్తారు.

    చారుదత్తుడు వసంతసేన తన దగ్గిర దాచబెట్టిన నగలు దొంగలెత్తుకుపోతే తన భార్య నగలు ఇచ్చి భయంభయంగా క్షమాపణ చెప్పుకునే బతికి చెడిన మంచి/పిచ్చి కోమటి గృహస్థు అయితే సౌజన్యారావు డబ్బు కోసం కాకుండా నిర్దోషి అని తను నమ్మిన కేసుని డబ్బు తీసుకోకుండా వాదించే మంచి/పిచ్చి లాయరు!

      అక్క శకారుడు "కుంతిని భీముడు చెరబట్టినట్టు" అని అకటావికటంగా మాట్లాడి నవ్వు తెప్పించే కామెడీ విలన్ అయితే ఇక్కడ "నాతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్" అని గప్పాలు కొట్టుకునే గిరీశం కామెడీ విలన్.అక్కడా ఇక్కడా కూడా ఇలాంటి విలనీ కొత్తగా వీరు ప్రవేశపెట్టిన చిత్రమైన కల్పనయే - ఇప్పటి సినిమాల్లోని కామెడీ విలన్లు కూడా ఈదే మౌల్డులో ఉంటున్నారు,ఎంతటి వాస్తవికత!

      అక్కడ వసంతసేన నగల ముంత దొంగతనానికి గురై కధ మలుపు తిరుగుతుంది,అదే కధానాయకుడికి శిక్షాకారణ మవుతుంది,ఇక్కడ మధురవాణి రామప్పంతులు మంత్రాంగం ప్రకారం పెళ్ళికూతురికి ఇచ్చిన కంటెని కరటక శాస్త్రి శిష్యుడు చేసిన హడావిడి వల్ల లుబ్ధావధాన్లకి హత్యానేరం చుట్టుకుంటుంది.ఆఖరి డృశ్యంలో అవి రెండూ చేరవలసిన చోటికి చేరి కధానాయికలు న్యాయం జరిపించగలిగిన వాళ్ళ ముందుకి వచ్చి తెర వెనక జరిగిన అసలు కధని చెప్పటంతో నిరపరాధులు తమమీద అన్యాయంగా మోపబడిన నేరం నుంచి విముక్తు లవుతారు.

      ఈ రెండు నాటకాల్లోనూ ప్రధానపాత్రలు అన్నీ మొదటి నుంచీ చివరి వరకూ మనస్తత్వాలలో ఏ మార్పూ రాకుండా ఉంటాయి - ఒక్క పాత్ర తప్ప!అక్కడ సంవాహకుడు కధా ప్రారంభానికి జూదరిగా ఉన్నవాడు వసంతసేన తన అప్పులన్నీ తీర్చెయ్యగానే మారిపోయి బౌద్ధసన్యాసి అవుతాడు,ఇక్కడ లుబ్ద్ధావధాన్లు కధా ప్రారంభానికి లుబ్ధుడిగా ఉన్నవాడు సౌజన్యారావు డబ్బు తీసుకోకుండా కేవలం తనమీద జాలితో కేసు వాదించటాన్ని చూసి మారిపోయి కూతురి గురించీ తన భవిష్యత్తు గురించీ ఎంతో న్యాయమైన ఆలోచనలు చేస్తాడు.

     ఈ పోలికలన్నీ చూసి గురజాడ మృచ్చకటికాన్ని కాపీ కొట్టినట్టు అనిపించవచ్చు.నా దృష్టిలో కాపీ కొట్టినా అతప్పు లేదు.ఎందుకంటే రెంటిలోనొ కధ గానీ పాత్రలు గానీ కధాగమనం గానీ అవేవీ ప్రధానం కాదు - సామాజిక చిత్రణ వల్లనే అవి రెండూ అసదృశమైనవి!కానీ ఇద్దరు రచయితల ఉద్దేశాలు వేరు,వారు వూహించుకున్న ప్రయోజనాలు వేరు.మృచ్చ కటికం నాటకానికి వినోదమే ప్రధానం.చారుదత్తుడు తన బీదరికాన్ని తలుచుకునే సమయాల్లో తప్ప మిగిలిన నాటక మంతా హాస్యభరితమే!కానీ కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఒక దురాచారానికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు రచించాడు!పాత్రలు నిలబడిన సమాజం వేరు,వాటి మధయన ఉన్న సంబంధాలు వేరు,మాట్లాడిన మాటలూ వేరు!అయితే, అవి రెండూ ఇప్పటికీ మనచుట్టూ కనబడే అతి సామాన్య వ్యక్తులనే పాత్రలుగా తీసుకున్నాయి,ప్రతి పాత్రకీ ఆ పాత్ర స్వభావాన్ని సూచించే పేరు పెట్టి కొంచెం హాస్యంతో రంగరించిన ప్రహసనం అనబడే సాహిత్య ప్రక్రీయతో నిర్మించబడ్డాయి.మృచ్చకటికం లోని సమాజమే కన్యాశుల్కం లోనూ ఉంది - ఇప్పుడూ అదే సమాజం!

      మొదటి కధ సుఖాంతమయ్యింది,కానీ రెందవ కధ అడ్డం తిరిగి ఆగిపోయింది,అంతే!మొదటి కధలో మంచివాల్ళు సంతోషంగా ఉన్నారు,చెడ్డవాళ్ళు శిక్షకి గురయ్యారు.మోద్టి కదహలో పాతర్లకి మంచిచెడ్డలకి సంబంధించి పూర్తి విబహాన ఉంది.రెందవ కధలో ప్రతి పాత్రలోనూ మంచీ-చెడొ కలగలిసి పోయి ఉన్నాయి,కధ పూర్తయ్యే సమయానికి మంచి పాత్రలతో సహా ఏ పాత్రకీ న్యాయం జరగలేదు.గురజాడ శూద్రకుణ్ణి కాపీ కొట్టడం అని కాదు గానీ వాళ్ళు పాతర్లకి తీసుకున్న వాస్తవ వ్యక్తులు ఏ కాలంలో కనబడినా వాళ్ళ స్వభావాలు అట్లాగే ఉంటాయి,బహుశా వాళ్ళ కష్టాలూ కన్నీళ్ళూ కూడా అట్లాగే ఉంటాయి కాబోలు!ఇప్పటికీ ఆయా పత్రలు మన చుట్టూ కనబడుతూనే ఉన్నాయి - వేషమూ మార్చెను,భాషనూ మార్చెను అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు అన్న కవివాక్యం ప్రకారం!

      ఈ రెంటి మధ్యనా ఉన్న మరో అద్భుతమైన పోలిక - అన్ని నాటకాలూ చదవటానికి బాగుండవు,కానీ ఇవి మాత్రం చదువుతుంటేనే దృశ్యాలు బొమ్మ్మకట్టీంట్టు కనిపించి నాతకం చూదనక్కర లేకుండానే రసస్పందన పూర్తయిపోతుంది!

మృచ్చకటికం కాలం నుంచి కన్యాశుల్కం కాలం వరకూ సమాజం ఒక్కటిగానే ఉంది - ఇప్పటికి కూడా!

1 comment:

  1. నమస్తే సర్...మీరు చెప్పిన రెండూ క్లాసిక్స్ దేనికి అవే ప్రత్యేకత కలిగినవి మరియు compare చేయదగ్గవి...కాదు.
    ఆనాటి సామాజిక పరిస్థితులకు అధ్ధం పట్టేవి అనే పాయింట్ లో సారూప్యత ఉన్నా...మిగిలిన విషయాల్లో అంత పోల్చదగ్గ సన్నివేశాలు కానీ ..కథనం కానీ లేదు
    చారుదత్తీయం అనే ఒక గ్రంథం కూడా ఉందని విన్నాను. .వివరాలు తెలియవు

    ధన్యవాదాలు

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...