గత ఏదాది దిశెంబర్ 29,30వ తేదీలలో అయిర్ ఇండియా విమానంలో అమెరికా వెళ్ళిన 15 మంది తెలుగు విద్యార్ధులు అమెరికా లోని నార్త్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ అనే రెండు యూనివర్శిటెలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు అమెరికన్ అధికారులు."ఎందుకు?" అని విద్యార్ధులు ప్రశ్నిస్తే తుపాకీలు గురిపెట్టి బెదిరించారు.ఉగ్రవాదులకు వేసినట్టు చేతులకు బేడీలు వేసి గంటల కొద్ద్దీ విచారణ పేరుతో భయానక వాతావరణం సృష్టిస్తే పాపం భయంతో బిక్కచచ్చిపోయి ఎన్నో ఆశలతో అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన వారంతా నిరాశగా తిరిగి వచ్చేశారు.అమెరికా చదువు కోసం తాహతుకు మించి పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా!
పైకి బ్లాక్ లిస్ట్ అయ్యాయని సాకులు,లోపల మరేవో తీరులు."ఇండియన్ డాగ్స్ వస్తున్నా"యంటూ అవహేళనలు మరింత దారుణం!అసలు బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్శిటీల నుంచి ఇక్కడికి "I20"లు ఎలా వచ్చాయి?మన దేశపు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు చిలక పలుకులు వల్లించటం తప్ప స్వంతంగా విషయం కనుక్కోవడానికి గానీ విద్యార్ధులకు అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి గానీ ఏమీ చెయలేదు.విద్యార్ధులు తప్పులు చెయ్యడం వల్లనే వెనక్కి పంపించామంటున్న అమెరికా ప్రభుత్వం భారత ప్రబ్భుత్వానికి అవి ఎలాంటి తప్పులో తెలియజేసిందా?I20, అమెరికా ప్రభుత్వం ఆమోదించిన వీసా,అన్ని పత్రాలూ ఇక్కడ చెక్ చేసి పంపించాక కూడా ఆఖరి నిమిషంలో చేసిన భీబత్సం వెనక ఉన్న గందరగోళం కధేమిటి?అమెరికా ప్రభుత్వం యొక్క బ్లాక్ లిస్టులో ఉన్న యూనివర్శిటీల నుంచి I20లు భారత్ లోని విద్యార్ధులకు ఎలా వచ్చాయనే దానికి తమ వైపున ఉన్న లొసుగులు కూడా కారణం కదా, ఏకపక్షంగా విద్యార్ధులనే నేరస్థులుగా నిలబెట్టి ఉగ్రవాదుల్ని విచారించినట్టు సంకెళ్ళు వేసి అనాదరణ చూపించడం దేనికి చేశారు - అడిగేదెవ్వరు?
మన దేశ ప్రజల్లో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది.తెలివితేటల్లో మనవాళ్ళు అఖండమైన వాళ్ళు,ఎక్కడ నిలబెట్టినా శిఖరాగ్రం చేరుకోగలరు - కానీ నిలబడకూడని చోట నిలబడతారు.తామెక్కడ నిలబడితే తమ శక్తియుక్తులు సహజ పద్ధతిలో వికసిస్తాయో తెలుసుకోరు!ఒకడెవడో ఫలానా దేశంలో ఫలానా ఉద్యోగం చేసి లక్షలు కూడబెడుతున్నాడు అని తెలియగానే గుడ్డెద్దు చేలో పడినట్టు పొలోమని వాణ్ణి అనుకరించి వాడిలాగే మనమూ జాక్పాట్ కొట్టేద్దాం అనే దురాశతో ఎండమావుల వంటి అవకాశాల కోసం విలువైన కాలాన్ని వ్యర్ధం చేసుకుని అదీ దక్కక తమ అసలైన ప్రతిభని సానబట్టుకోలేక రెంటికీ చెడుతున్నారు!
ఇవ్వాళ్టి అమేరికా ఒకప్పటి అమెరికా లాగ లేదు,ఇంకెంతో కాలం అది భూతలస్వర్గం హోదాని నిలబెట్టుకోలేదు.ఇప్పటికే ఉద్యోగ కల్పన విషయంలో ఎక్కడెక్కడి వాళ్ళూ అక్కడికే పరుగులు పెట్టడం వల్ల విపరీతంగా ఉబ్బిపోయి పగలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ మీద ఇంకా ఆశపడి ప్రయోజనం లేదు!వాళ్ళ ఆలోచనా ధోరణులు కూడా కర్కశంగా మారడం సూచనాప్రాయంగా తెలుస్తున్నది.అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నోటికేది తోస్తే అది మాట్లాడుతున్నాడు, బ్రిటిష్ ప్రధాని కామెరూన్ లండనులో ఉండాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే అంటున్నాడు!పైకి క్లీన్ షేవ్డ్ మొహాలతో త్రీ పీస్ సూట్లతో చెక్కు చెదరని నవ్వుల్తో పెదవి చివరి మర్యాదల్తో టైలర్ మేడ్ జంటిమన్లుగా కనబడుతున్నా వాళ్ళంత జాత్యహంకారులు ఈ భూప్రపంచం మీద ఇంకెవ్వరూ లేరు.వాళ్లకి పాప్యులారిటీ కూడా పెరుగుతున్నది, అంటే ఈ ట్రెండు తగ్గే సూచనలు నాకైతే కనబడ్డం లేదు!
భారతీయులు చిన్నప్పుడు మనం చదువుకున్న మూడు చేపల కధలో మొదటి చేపలా వ్యవహరించే కాలం దాటిపోయింది,కనీసం రెండవ చేపలా అయినా వ్యవహరిస్తారా!ఒక రూపాయి ఖర్చుతో పది రూపాయలు సంపాదించాలంటే కండల్ని కరిగించి శ్రమించాలి, ఒక రూపాయి ఖర్చుతో వంద రూపాయలు సంపాదించాలంటే తెలివిగా వ్యాపారం చెయ్యాలి,ఒక రూపాయితో కోటి రూపాయలు సంపాదించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవాలి,ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అష్టైశ్వర్యాలు దక్కాలంటే ముదనష్టంగానే రావాలి - భారతీయులు దేన్ని కోరుకుంటున్నట్టు?మెకాలే తమ ప్రభుత్వపు అవసరం కోసం ప్రవేశపెట్టిన క్లర్కుల్నీ ఉద్యోగుల్నీ మాత్రమే తయారు చెసే విద్యా విధానం గురించి గానీ ఇంగ్లీషు భాష గొప్పదనం గురించి గానీ చింకి లెక్చర్లు దంచే మేధావులు వీలయినంత త్వరగా తమ భ్రమల్ని వదిలించుకుంటే దేశానికీ యువతకీ భవిష్యత్తుకీ చాలా మంచిది!మితిమీరిన ఆంగ్లభాషావ్యామోహంతో ఉన్న ఈ మేధావులు మాతృభాషలో విద్యాబోధన యొక్క సానుకూలతల్ని గుర్తించలేకపోతున్నారు.ఇంగ్లీషు పట్ల వ్యామోహాన్ని వదిలేసి మొదట మాతృభాషని క్షుణ్ణంగా నేర్చుకుంటే దానితో అనుసంధానం చేసుకుని ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రాన్సు వెళ్ళవచ్చు,జర్మన్ నేర్చుకుంటే జర్మనీ వెళ్ళవచ్చు,జపనీస్ నేర్చుకుంటే జపాన్ వెళ్ళవచ్చు - పపంచం నలుమూలలకీ విస్తరించగలిగే అవకాశం వస్తుంది!సంస్కృతుల పరంగా చూసినా భారతీయ సంస్కృతి పట్ల గౌరవం అమెరికాలో కన్నా పై దేశాలలోనే ఎక్కువ.మనకి గౌరవం దక్కే చోటుకి పోకుండా మనని అవమానించే చోటుకి ఎందుకు వెళ్ళటం?
మన దేశంలోని కుల వ్యవస్థలో ఒక తమాషా ఉంది.తాము కింది కులాల వాళ్ళ కన్న అధికులం, తెలివైన వాళ్ళం,సంస్కృతి కంతా పట్టుగొమ్మలం అనుకునే ఉన్నత కులాల వారే మొదటి రోజు నుంచీ చివరి రోజు వరకూ ఇంగ్లీషు వాళ్ళకి వూడిగం చేశారు!ఇంగ్లీషు వాళ్ళు తమలో తాము క్లబ్బులు పెట్టుకుని "DOGS AND INDIANS ARE NOT ALLOWED" అని బోర్డులు పెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా ప్రతిస్పందించ లేదు ఈ విజ్ఞాన తేజోరాశులైన బ్రాహ్మణ శ్రేష్టులూ పౌరుషం మూర్తీభవించిన రాజాధిరాజులూ!ఈ బోడి సత్యాగ్రహాలకి స్వతంత్రం రాదనుకుని ఆఖరు నిముషం వరకూ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లీషువాళ్లకి మిత్రులుగా గడిపి ఇంక స్వతంత్రం వచ్చేస్తుందనుకున్న వెంఠనే ముందుకు దూకి అధికార మార్పిడిలో తామే పైన ఉండేలా చూసుకున్నారు - కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్య చేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు అని వేమన్న వూరికే అన్నాడా!ఇప్పటి దళిత మేధావులు కూడా నిన్నటి రోజున ఆ అగరవర్ణాల వారు ఏమి చేశారో అదే పద్ధతిని పాటిస్తూ వారినే ఇమిటేట్ చేసి వారి స్థానంలోకి వెళ్ళడానికే చూస్తున్నారు తప్ప తమకంటూ సొంతదారిని వెతుక్కుని ముందుకు వెళ్ళగలిగే కీలకం గ్రహించటం లేదు.ఇప్పటికీ ఉద్యోగాల మార్కెట్టులో సింహభాగం ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఉన్న మంచి స్కూళ్ళలో కాలెజిలలో చదువుకుని వచ్చే డబ్బున్న అగరవర్ణాల పిల్లలదే హవా!వారితో పోటీ పడాలంటే వారికంటే మరింత వేగంగా కదిలితేనే గానీ వారికన్నా ముందుకు పోవటం సాధ్యపడదు కింది కులాల నుంచి కొత్తగా పోటీలో ప్రవేశిస్తున్న వాళ్ళకి!అదే,మాతృభాషలో చదువుకోవడం వల్ల ఈ అధికశ్రమ అవసరం ఉండదు,ఒత్తిడి ఉండదు,వెనుకబాటు తనమూ ఉండదు!
మొత్తం ప్రాధమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి.తర్వాత ఇప్పటిలా మూడు నాలుగు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు,సెకండ్ లాంగ్వేజిగా హిందీ,ఇంగ్లీష్,జపనీస్,ఫ్రెంచ్ లాంటివాటి కన్నిటికీ ఒకే రకం ప్రాధాన్యత ఇచ్చి విద్యార్ధుల్ని ఏదో ఒక్కటి మాత్రమే తీసుకుని అందులోనే ప్రావీణ్యత సంపాదించమంటే సరిపోతుంది.అప్పుడు ఆ ఒక్క భాషనీ మాతృభాషతో అనుసంధానించి నేర్చుకుంటే ఆ భాషతో ఎక్కడ నెగ్గగలిగీతే అక్కడికి వెళ్ళే విధంగా విద్యార్ధుల్ని తీర్చిదిద్దితే తప్ప ఒక్క ఇంగ్లీషునే నేర్చుకోవడం ఇంగ్లీషు పనికొచ్చే చోటనే అందరూ గుమిగూడటం అనే దరిద్రం పోయి మనవాళ్ళు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడయినా నెగ్గుజురాగలిగే విధంగా తయారవుతారు.ఇది సాంకేతికంగా కూడా విద్యార్ధుల మనస్సు మీద పోటీకి సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది,మౌలికంగా దేశపు సంస్కృతి పట్ల గర్వాన్ని పెంచుతుంది.ప్రభుత్వాలకి కూడా ఉపాధి కల్పన ఇప్పటిలా రొడ్డకొట్టుడుగా చేసి భంగపడకుండా కొత్తదారుల్ని వెతికే ఉత్సాహాన్ని ఇస్తుంది.మనం ప్రపంచానికి తిట్టించుకుని వెనక్కి వచ్చే అసమర్ధుల్ని గాక ఎక్కడి కెళ్ళినా అక్కడివాళ్ళు కళ్ళకద్దుకుని స్వీకరిస్తూ మన దేశపు సంస్కృతికి దర్పణాలుగా నిలిచే దమ్మున్న కుర్రాళ్లని సమర్పించాలి!"I am a westerner with a deep respect for your vedantic philosophy.It pains me to see the erosion of sanatana dharma in Bharat.You must keep these values alive because it is the only hope for our entire planet!When all righteousness dies in the world,We will have to live in calamities. I can see the effects of adharmic living in the west,loss of meaning,depression,addiction,materialism and suicide!Use your innate indian intelligence to see where western values will ruin india just as they are corrupting the whole world.Even the things you crave that are shown in the westernmedia are not real.We are not glamorous,educated,sexy,people like the media shows.Come to the west and you will see lonliness,despair and terrible poverty as well!Hollywood is a propaganda machine for the west and does not show the truth.The truth is a society that is ruled by greed and lust and is consuming all its treasures to become an ugly place of sterile parking lots and megastores.We go to india to find relief from the depression and ugliness here. In india people are still alive while in the west we are slowly becoming vegetables in front of our electronic devices.hold on to your values and have faith that india's value is its values!" - ఇది Rose Kerekes అనే ఒక విదశీ వనిత భారతీయులకి ఇస్తున్న సలహా, ఎంత చక్కగా చెప్పింది!
కానీ మన దేశంలోని వాతవరణం చూస్తే ఇప్పట్లో ఆ దిశగా అడుగు పడుతుందనే ఆశ నాకేమాత్రం కలగడం లేదు."జాతుల్సెప్పుట,మృషల్ సంధించుట,అన్యాయ విఖ్యాతింబొందుట,కొండెకాడవుట - అన్నియు పరద్రవ్యంబు నాశించి" అని ఒక కవిగారు ఇవ్వాళ మనవాళ్ళు చేస్తున్న వెధవ పనులన్నిట్నీ కూలంకషంగా వర్గీకరించి మరీ చెప్పాడు!నీ జాతి వేరు వాడి జాతి వేరు వాడు నిన్ను దోచుకు తినాలని చూస్తున్నాడు నువ్వు వాడితో కలవకు అని ఎవరు చెప్పినా 90 శాతం మందిని ఒక్కటిగా కలవనివ్వకుండా కలిసి ఆలోచించనివ్వకుండా కన్ఫ్యూజ్ చెయ్యటానికీ,వాళ్ళనా కన్ఫ్యూజన్ లోనే ఉంచి వాళ్ళమీద అధికారాన్ని 10 శాతం మాత్రమే ఉన్న తమ దగ్గిరే ఉంచుకోవటానికీ, ఆ అధికారాన్ని ఉపయోగించుకుని మందిసొమ్మును దిగమింగటానికీ మాత్రమే చేస్తారు.తనకి 100 కోట్లు విలువ చేసే కాంట్రాక్టును దఖలు పరిస్తేనే అక్కడి అధికారికి ఒక కోటిని మృషగా సంధిస్తారు.తమకు లేని గొప్పదనాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే ప్రబుద్ధులు ఆ పని వూరికే చెయ్యరు - చాటుగా ఆ పేరుని సొంత సంపాదనకి ఉపయోగించుకుంటారు.వాడు మంచివాడు కాదని పక్కవాడి గురించి పైవాళ్ళకి కొండేలు చెప్పేవాళ్ళు అవతలి వాడికి పైవాళ్ళు ఇచ్చేదాన్ని తమకి ఫిరాయించుకోవడానికే ఆ పని చేస్తారు.ఇవన్నీ చెప్పి "ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో శ్రీ కాళహస్తీశ్వరా!" అని నిట్టూర్చాడు.అలా నిట్టూర్చడంలో స్వామీ నాకు మాత్రం ఆ పాడుబుద్ధులు కలగనియ్యకు అని వేడుకోవడం ఉంది!ఎందుకంటే పైన చెప్పిన వెధవపనులు నిన్నటిరోజున చేసినవాళ్ళు ఇవ్వాళ్టిరోజున చేస్తున్నవాళ్ళు రేపటిరోజున చేసేటివాళ్ళు ఎవరో ఎక్కడుంటారో ఎలా బతికారో ఎప్పుడు చచ్చారో ఎవరికీ తెలియదు.కానీ కొందరు ప్రాతస్మరణీయుల్ని దేశకాలప్రాంతభాషాదుల్ని పట్టించుకోకుండా గుర్తుంచుకుంటున్నామే, వాళ్ళు మాత్రం అట్లాంటి వెధవ పనులు చెయ్యకుండా మరో విధంగా బతకడం వల్లనే మనకి గుర్తుకొస్తున్నారు - అయితే ఇవ్వాళ వాళ్ళే నిజమైన మైనార్టీ అయిపోయారని తెలిస్తే చాలా నిర్వేదంగా ఉంటుంది?!
పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది,తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది.టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు.మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు.
ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు - నేను నిర్వేదం అని చెప్పాను!