Tuesday, 11 July 2023

ఈశావాస్య ఉపనిషత్తు లేక వాజసనేయ సంహిత

వేదములు అన్నీ యథార్థమునకు  ప్రతీకలు అయితే  ఉపనిషత్తులు  వేద తత్వాన్ని మానవ జాతి దగ్గరకు చేర్చే ప్రణాళికలు.  కొంత మంది ”ఉపనిషత్తులు  కొన్ని సత్యాలను బోధిస్తుంది.  వేదాలు చేస్తున్నది  కూడా ఇదే కదా.  మరి ఉపనిషత్తుల ప్రత్యేక ప్రయోజనము ఏమిటి?” అని ప్రశ్నిస్తారు.  ఈ కోణములో  ఆలోచిస్తే మనకు మరి కొన్ని సత్యాలు బోధ పడతాయి.  సత్యాలను సత్యాలుగా బోధించేది వేదం.  సత్యాలను అనుభూతి  లోనికి తీసుకొని వచ్చేవి ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తులు ఒక సాధనా స్వరూపము.

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know".అంటే,మానవుడు తెలుసుకోగలిగిన, తెలుసుకోవలసిన, తెలుసుకోదగిన జ్ఞానం అని అర్ధం!వేదం ఒక మతగ్రంధం కానే కాదు, సార్వకాలిక సత్యాల సమాహారమైన విజ్ఞానసర్వస్వం.వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే Branch of Study అని అర్ధం.వేదములు నాలుగు - 01.ఋగ్వేదం, 02.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు, 03.సామవేదం, 04.అధర్వ వేదం. ఇక వేదాంగములు ఆరు - 05.శిక్ష, అంటే Phonetics, 06.కల్పం, అంటే Study of Rituals, 07.వ్యాకరణం, అంటే Grammer, 08.నిరుక్తం, అంటే Etymology, 09.ఛందం, అంటే Prosody, 10.జ్యోతిషం, అంటే Astronomy. ఇవి కాక ఉపాంగములు నాలుగు - 11.మీమాంస, 12.న్యాయశాస్త్రం, 13.పురాణములు, 14.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తీసుకుంటే - 15.ఆయుర్వేదం,అంటే Medical Science:ఇది ఋగ్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,16.అర్ధశాస్త్రం,అంటే Economic Science:ఇది అధర్వవేదం నుంచి పెరిగిన శాస్త్రం,17.ధనుర్వేదం,అంటే Military Science:ఇది యజుర్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,18.గాంధర్వవేదం,అంటే Musical Science:ఇది సామవేదం నుంచి పెరిగిన శాస్త్రం.

వీటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.

ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అనే అర్ధం చెప్తున్నాను నేను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అనే అర్ధం చెప్తున్నాను నేను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అనే అర్ధం చెప్తున్నాను నేను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అనే అర్ధం చెప్తున్నాను నేను.

వేదం ఒక మతగ్రంధం కానట్లే వేదం పునాదుల మీద నిలబడిన మన జీవన విధానం మతం ఎప్పటికీ కాదు.మనది సనాతన ధర్మం అనీ మనం సనాతన ధార్మికులం అనీ చెప్పుకోవడం ఉత్తమోత్తమం - హిందూమతం అనే పదాన్ని ఇతరులకు అర్ధం కావడం కోసం మాత్రమే వాడాలి. ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో సహా ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న వాటిని కూడా కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యం అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

మనలో చాలామందికి వేదం గురించి చాలా అపోహలూ ఆపార్ధాలూ తప్పుడు అభిప్రాయాలూ ఉన్నాయి.ఋగ్వేద సారం అంతా "ప్రజ్ఞానం బ్రహ్మ - అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము (Supreme Knowledge is Brahman)" అనే వాక్యంలో ఉందనీ,యజుర్వేద సారం అంతా "అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మము (I am Brahman)" అనే మహావాక్యంలో ఉందనీ సామవేద సారం అంతా "తత్ త్వమసి - అదే నేను (That thou art)" అనే మహావాక్యంలో ఉందనీ అధర్వణవేద సారం అంతా "అయమాత్మా బ్రహ్మ - ఈ ఆత్మే బ్రహ్మము (This Atman is Brahman)" అనే మహావాక్యంలో ఉందనీ ఆ నాలుగు మహావాక్యాలకీ అర్ధం తెలిస్తే చాలు నాలుగు వేదాల అర్ధమూ తెలిసినట్టే అనీ చాలామంది చెప్తారు.ఇది చాలా తప్పు.ఎందుకంటే,నాలుగు వేదాలలోని ప్రతి మంత్రమూ తనకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టతని నింపుకున్నదే!ఉదాహరణకి వ్యాసులవారు విభజించాక ఋగ్వేదంలోని ప్రధమ మంత్రం అయిన "అగ్నిమీళే పురోహితం,యజ్ఞస్య దేవమృత్విజం - హోతారం రత్నధాతమం!" అనే మూడు వాక్యాలలోని ప్రతి పదానికీ నిరుక్తం ప్రకారం సామాన్యార్ధక పదాల(Synonyms)ను మార్చడం వల్ల 50,000 పైన అర్ధాలు వస్తాయి."అగ్నిని; పురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విక్కును; హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవానిని; నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను." అనే అగ్ని సూక్తం లోని అగ్నిమీళే మంత్రం వైదిక జీవన విధానంలో యజ్ఞం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

ఇవ్వాళ వేద పాఠశాలల్లో కూడా అర్ధపాఠం వరకు వెళ్ళడం లేదు,స్వరపాఠం చెప్పేసి సరిపెట్టేస్తున్నారు.అర్ధం తెలిస్తే కదా వేదం ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం సాధ్యపడేది - మరి,అర్ధం చెప్పకపోతే ఎట్లా?అర్ధం తెలిసిన ఒక కవి ఆ మంత్రాన్ని ఆటవెలదిలో చెప్పారు,చూడండి.

 

ఆ. అగ్నిని, పురహితుని, యజ్ఞప్రకాశకు,

నసమ ఋత్విజుని విలసిత హోత

నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు

యనిలసఖుని గొలుతు ననుపమగతి.

 

ఎంత బావుంది!కొన్ని వేల సంవత్సరాల వెనకటి నుంచి అర్ధం చెప్పకపోవటం అనే తప్పును వేదపండితులైన గురువులు ఎందుకు చేశారు?బధ్ధకం వల్లనా,నిర్లక్ష్యం వల్లనా అనేది మనకి అనవసరం!ఏ కారణంతో చేసినప్పటికీ  "వేదంలో సాపాసాలు తప్ప ఇంకేం లేదు కాబట్టి వేదం చదవకపోయినా పర్లేదు!" అనే పిచ్చిమాటలు మాట్లాడే ఆస్కారం ఎవరికీ ఇవ్వకూడదు వేదపండితులు.హిందువు అయిన ప్రతి వ్యక్తీ వేదం అనేదాన్ని పరమ ప్రమాణం కింద తీసుకోవాలి అన్నప్పుడు వేదంలో ఏముందో తెలియనిదే వేదం చెప్పినట్టు ఎలా బతకగలడు?వేదంలో ఏముందో తెలియక పోవటం వల్లనే వేదం విగ్రహారాధనని వ్యతిరేకించింది అనే ఒక విచిత్రమైన వాదన ఇవ్వాళ వినబడుతున్నది.మరి, వేదం వ్యతిరేకించిన విగ్రహారాధనని ఇవ్వాళ మనం ఎందుకు చేస్తున్నాము?వేదం వ్యతిరేకించిన పనుల్ని చేస్తూ మనం వైదిక ధర్మానుయాయులం అని చెప్పుకోవటం తప్పు కదా!

మనలో కొందరు కల్ల గురువులు ఉన్నారు.వారు వేదమంత్రాలకు తప్పుడు అర్ధాలు చెప్పి మనల్ని వైదికధర్మమార్గం నుంచి పక్కకు మళ్ళించేశారు.వేదమంత్రాలకు అర్ధం చెప్పడానికి పాణినీయం పనికిరాదు.కానీ, కొందరు పాణినీయాన్ని కూడా వాడేస్తున్నారు.ప్రతి వేదమంత్రమూ ఒక సూక్తంలో భాగమై ఉంటుంది.అగ్ని సూక్తం యొక్క పరిచయ గద్యలో "ఋషిః-మధుచ్ఛందా వైశ్వామిత్రః,దేవతా : అగ్నిః,ఛన్దః  గాయత్రీ" అని ఉన్న వివరాల్ని బట్టి అర్ధం చెప్పాలి.అసలు సృష్టికర్తయే వేదంలో నిక్షిప్తం చేసిన నిరుక్తం, ఛందస్సు, వైశేషిక, న్యాయ, మీమాంసాది తర్కశాస్త్ర పరిచయం లేనివాడు వేదమంత్రాలకి అర్ధం చెప్పే సాహసం చెయ్యకూడదు.

"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అనే సూక్తిని తీసుకుంటే ఇది సత్యం ఒక్కటే అయినప్పటికీ విప్రులు దాన్ని అనేక రకాల వాదనలతో విశ్లేషించి చెప్తారు అని చెప్తూ అది పెద్ద తప్పు కాదని సమర్ధిస్తున్నట్టు అనిపిస్తుంది, కదూ!దీన్ని ఎక్కువ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శుధ్ధాద్వైత, మధ్వాద్వైత, మధ్యాద్వైత, మిధ్యాద్వైత వాదులు వాడుతూ ఉంటారు.కానీ, ఇది మొత్తం అర్ధానికి వ్యతిరేకమైన అర్ధం వచ్చే ద్విపంక్తి మంత్రంలోని ఒక పదవిభాగం మాత్రమే.

 

ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్ |

ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం యమం మాతరిశ్వానమాహుః ||. (Rigveda 1-164-46)

Sanskrit text [Accents, Plain, Transliterated]:

इन्द्रंमित्रं वरुणमग्निमाहुरथोदिव्यः सुर्णो रुत्मान्एकंसद्विप्राबहुधा दन्त्यग्निं मं मारिश्वानमाहुः

इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः सुपर्णो गरुत्मान्एकं सद्विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः

indram mitra varuam agnim āhur atho divya sa suparo garutmān | eka sad viprā bahudhā vadanty agni yamam mātariśvānam āhu ||

English translation:

“They have styled (him, the Sun), Indra, Mitra, Varua, Agni, and he is the celestial, well-winged Garutmat, for learned priests call one by many names as they speak of Agni, Yama, Mātariśvan.”

తెలుగు అనువాదం:

(ఇంద్రం) పరమైశ్వర్య వంతుడు (మిత్రం) అందరికీ మిత్రుడు (వరుణం) శ్రేష్ఠుడు (అగ్నిం) విద్యుదాది గుణములు కలిగిన అగ్ని (ఆహుః) ఆ పరమాత్ముడు (అథో) ఆ పిదప (దివ్యః) ప్రసిద్ధ ప్రకాశమయుడు (సుపర్ణో) పాలనము మొదలగు కర్మలు గల (గరుత్మాన్) మహాన్ ఆత్మ (ఏకం) ఒకటి (సత్) నాశనం లేని వాడు, అని (విప్రా) బుద్ధిశాలురు (వదంతి) చెప్పుదురు (అగ్నిం) సర్వవ్యాపి (యమం) సర్వ నియంత (మాతరిశ్వానం) వాయు గుణాలు కలిగిన వాడు (ఆహుః) ఆ పరమాత్ముడు.

ఇప్పుడు,పూర్తి అర్ధాన్ని చూడండి!"దేవుడొక్కడే అయినప్పటికీ దివ్యజ్ఞానం కలవారు ఆయనను ఎన్నో పేర్లతో పిలిచారు.అనేక రూపాలలో దర్శించి మనకు చెప్పారు.కొందరాయనను ఇంద్రుడనీ కొందరాయనను వరుణుడనీ ఇంకొందరు అగ్నియనీ మరికొందరు వాయు,యమాది పేర్లతోనూ పిలిచారు." - పండితులు ఎన్ని రూపాలతో చూసి ఎన్ని పేర్లతో పిల్చినప్పటికీ ఆ రూపాలూ ఆ పేర్లూ అన్నీ వేరు కాదు,వాళ్ళు చూస్తున్నదీ పిలుస్తున్నదీ ఒకే ఒక సృష్టికర్తను అని బల్లగుద్ది చెప్తున్న దాన్ని తీసుకెళ్ళి ఒక సత్యాన్ని తీసుకుని పండితులు అనేక రకాల వాదనలు చెయ్యొచ్చును అనే అర్ధం ఎలా వస్తుంది?

ఆఖరికి నీకు చదువు చెప్తున్న గురువు చెప్పిన విషయాన్ని సైతం సృష్టికర్తయే వేదంలో నిక్షిప్తం చేసిన నిరుక్తం,ఛందస్సు,వైశేషిక,న్యాయ, మీమాంసాది తర్కశాస్త్రంలో నిష్ణాతుడివై అది సత్యం అని నిర్ధారణ చేసుకున్నాకనే నమ్మాలి.సత్యాన్ని మాత్రమే నమ్మాలి.అసత్యాన్ని నువ్వు నమ్మకూడదు, ఇతర్లకి చెప్పకూడదు.అప్పుడే నువ్వు హిందువు లేక వైదిక ధర్మానుయాయివి అవుతావు.సత్యం పట్ల నిబధ్ధత లేనివాడు నిజమైన హిందువు కాడు,కాలేడు,కాబోడు.

స్వతఃసిధ్ధమైన వేదం మొట్టమొదట బ్రహ్మకు దివ్యవాణి వలె వినపడింది.అందుకే వేదానికి శృతి అనే పేరు కూడా వచ్చింది.మొదట వేదం ఒకటే రాశి.అధ్యయనం సుకరం కావడం కోసం కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి ఈ వేదరాశిని ఋగ్యజుస్సామాధర్వ వేదాలను చేశారు.ఒక్కొక్క వేదశాఖకు ఒక్కొక్కటి చొప్పున 1,180 ఉపనిషత్తులు ఉన్నట్టు చెప్తారు.కానీ ఇప్పటి వరకు 200 ఉపనిషత్తులు మాత్రమే అందరికీ అందుబాటులోకి వచ్చాయి.వీటిలో 108 ఉపనిషత్తులు శ్రధ్ధతో చదవదగినవి అని నిర్ణయించారు.ఉపనిషద్బ్రహ్మేంద్ర అనే మహనీయుడు ఈ 108 ఉపనిషత్తులకూ వ్యాఖ్యానం వ్రాశాడు.

అన్ని ఉపనిషత్తులలోనూ ఈశావాస్యోపనిషత్తు చాలా ప్రత్యేకమైనది.తన మొదటి మంత్రంలోని మొదటి పదాన్ని తన పేరును చేసుకున్నది.సంహితాంతర్గతమైన ఉపనిషత్తు ఇదొక్కటే.అందుకే, వాజసనేయ సంహిత అని కూడా పిలుస్తారు.ఇది శుక్లయజుర్వేద సంహిత యొక్క ఆఖరి అధ్యాయం.ఈ ఉపనిషత్తులో కనిపించే భావాలు అత్యంత సంక్లిష్టంగానూ మార్మికంగానూ ఉండటం వల్ల వీటికి అనేక రకాల వ్యాఖ్యానాలు ప్రచారంలో ఉన్నాయి.అందుచేత అన్నిటినీ తలస్పర్శి అనుశీలన చేసి ఒక సమగ్రమైన విశ్లేషణ చేస్తున్నాను నేను.ప్రతి ఉపనిషత్తుకు ముందు శాంతి మంత్రాలు ఉంటాయి.ఇవి  లోక క్షేమానికి మనము చేసే ప్రార్థన మాత్రమే కాక మన మనస్సును కూడా తృప్తి పరుస్తాయి.

ఓం  పూర్ణ  మదః  పూర్ణ  మిదం, పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।

పూర్ణస్య  పూర్ణ  మాదాయ, పూర్ణ  మేవావ  శిష్యతే ॥

పదవిఛ్చేదం:అదః = అది;పూర్ణం = అనంతం;ఇదం = ఇది;పూర్ణం - అనంతం;పూర్ణాత్ = అనంతం నుండి;పూర్ణం - అనంతం;ఉదచ్యతే = బహిర్గతమైనది;పూర్ణస్య = అనంతం నుండి;పూర్ణం = అనంతం;ఆదాయ = తీసివేసినప్పటికీ;పూర్ణం = అనంతం;ఏవ = మాత్రమే;అవశిష్యతే = మిగిలి ఉంటుంది.

అర్ధవిశేషం:మనకు తెలియనిదీ అనంతమే.మనకు తెలిసిందీ అనంతమే.ఆ అనంతం నుండి ఈ అనంతం వచ్చింది.ఈ అనంతం అంతమైన తర్వాత కూడా ఆ అనంతం ఉంటుంది.

మొదటి  మంత్రము:

ఈశా వాస్య మిదం  సర్వం, యత్కించ  జగత్యాం  జగత్ ।

తేన  త్యక్తేన  భుంజీధా, మా గృధః  కస్య  స్విద్ ధనమ్ ||

పదవిఛ్చేదం:జగత్యాం = ప్రపంచంలో;యత్ జించ = అదైతే; జగత్ = పరివర్తాన్ శీలమో;ఇదం సర్వం = ఇది అంతా;ఈశా = భగవంతుని చేత;వాస్యం = ఆవరింపబడియున్నది,ఉందవలెను;తేన త్యక్తేన = కాబట్టి పరిత్యక్తుడవై;భుంజీధా = నిన్ను నువ్వు పోషించుకో;కస్య స్విద్ ధనం = ఎవని యొక్క సంపదను గానీ;మాగృధః = ఆశించకు.

గద్యరూపం:ఇదం సర్వం ఈశావాస్యం.యత్కించ జగత్యాం జగత్..తేన త్యక్తేన భున్జీథా.కస్య స్విద్ ధనం మా గృధః.

అర్ధవిశేషం:అనిత్యమైన ప్రపంచంలో పరివర్తన శీలమైనది సమస్తమూ భగవంతుని చేత ఆవరించబడి ఉన్నది,అది అలాగే ఉండాలి.కాబట్టి,పరిత్యక్తుడవై భుజించు.ఇతరుల న్యాయార్జితాన్ని ఆశించవద్దు.

విశేష వ్యాఖ్య:మనకు వచ్చిన ధనము భగవంతుడి అనుగ్రహము ద్వారా వచ్చినది. దానికి మనము ధర్మ కర్తలము మాత్రమే. ధన నిర్వహణను భాద్యతగా స్వీకరిస్తూనే ధర్మ కర్తననే భావముతో ఉండుము .ఇది నాది, దీనిని నేను సంపాదించాను అనబడే  బంధాన్ని వేసుకోవలదు.  భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడనుకున్నపుడు సమస్త జీవ రాశులను భగవంతుడి రూపముగా భావిస్తాము. ఈ విధముగా సమస్త జీవ రాశి మీద మనకు ప్రేమ కరుణ ఏర్పడతాయి . ఈ అర్థము ఆచరణ  లోనికి వస్తే విశ్వమంతా శాంతి వెల్లి  విరుస్తుంది.అంతే  కాదు. మన సంప్రదాయములో “ధనమగ్నిః ధనం వాయు  దానం భూతాని పంచచ “ అని చెప్పబడినది. అంటే పంచ భూతాల స్వరూపము అయిన పరిసరాలను  ధనముగా భావించాలి. అందు వలన తన స్వార్థము కొఱకు పరిసరాలను పాడు చేసే వాడిని కూడా  దొంగగానే భావించాలి.

రెండవ   మంత్రము:

కుర్వ న్నేవేహ  కర్మాణి, జిజీవిషే చ్చతః సమాః । 

ఏవం  త్వయి నా న్య ధే తోస్తి - న    కర్మ లిప్యతే  నరే ||

పదవిఛ్చేదం:ఇహ = ఈ ప్రపంచంలో;కర్మాణి = (శాస్త్రవిహితములైన) కర్మలను;కుర్వన్ = చేస్తూ;ఏవం = మాత్రమే;శతం సమాః = నూరు సంవత్సరాలు;జిజీవిషేత్ = జీవించాల్ని కోరుకోవాలి;ఏవం = ఇదే;త్వయి = నీకు;నరే = (నూరు సంవత్సరాలు జీవించాల్ని కోరుకునే) మానవుడికి;ఇతః = ఇంతకంటె;అన్యధా = మరొక మార్గం;న అస్తి = లేదు గాక లేదు;(యేన = దేనిచేతనైతే) కర్మ = సుఖభోగానురక్త కర్మ;న లిప్యతే = మనస్సును స్పర్శించి పతనం చెయ్యవు.

గద్యరూపం:కుర్వన్ ఏవ ఇహ కర్మాణి, శతః సమాః జిజీవిషేత్, ఏవం త్వయి న అన్యథా అతః ఆస్తి - స కర్మ నరే లిప్యతే.

అర్ధవిశేషం:విధి యుక్తమయిన కర్మాచరణ చేస్తూ  నూరుకు సమానమయిన సంవత్సరాలను కోరుకోవలెను .మరో విధముగా ఏమియూ  లేదు . అటువంటి కర్మ మానవుడిని బంధించదు.

విశేష వ్యాఖ్య:మన  పరిణామమును  అనుసరించి  మనకు ఆచరణ  విధానము లభిస్తుంది .  దానిని శ్రద్ధగా, భాద్యతగా  చేస్తే  తరువాత ఏమి చేయాలో తెలుస్తుంది . అంతే  కానీ ఒకే  సారి అన్ని మెట్లు ఎక్కి వేయాలన్న భావన తప్పే. ఒక్కొక్క మెట్టే  జాగ్రత్తగా ఎక్కాలంటే  పైన చెప్పిన మానసిక స్థితి ఉండాలి.

మూడవ  మంత్రము:

అసూర్యా  నామ తే  లోకా - అంధేన  తమసావృతా ।

తాస్తే  ప్రేత్యాది గచ్చంత, యే కే  చాత్మ హానో  జనాః ॥

పదవిఛ్చేదం:అసుర్యాః = అసురులకు చెందిన;అంధేన తమసా = చిమ్మ చీకటి చేత;ఆవృతాః = ఆవ్రించబడినవి;నామ = నిజంగా;తే = ఆ;లోకాః = జన్మలు;యేతే = ఎవరేవరైతే;చ - కూడా;జనాః = జనులు;తాన్ = ఆయా లోకములను;అభిగఛ్చంతి = పొందుతారు

గద్యరూపం:అసూర్యా నామ తే లోకా, అంధేన తమసావృతా;యే కేచః ఆత్మహనః జనాః - తాం తే ప్రేత్య అభిగచ్చంతి.

అర్ధవిశేషం:ఆత్మ ద్రోహము చేసుకున్న వారు మరణము తరువాత సూర్యుడు లేని అజ్ఞాన అంధ కారములతో కూడిన లోకములకు పోయి మరల మరల అవే లోకములను పొందెదరు.

విశేష వ్యాఖ్య:ఇక్కడ మూలములో ఆసూర్య అని ఇచ్చి,  పదవిఛ్చేదం దగ్గిర అసుర్య అని ఇచ్చినారు.  అసుర శబ్దము నుండి అసుర్య వచ్చింది.  సూర్య రాహిత్యము నుండి  అసూర్య  శబ్దమువచ్చినది.  అసురులు భౌతిక వాదానికి  ప్రాధాన్యతను ఇచ్చే వారు. అయితే  సూర్యుడు ప్రజ్ఞకు  మూలము. అసూర్య  అంటే  సూర్యుడు లేనిది  అంటే ప్రజ్ఞ లేనిది.  అసురులుండే  లోకము తమసావృతము , లేదా చీకటితో నిండినది  కానవసరము లెదు. కానీ, సూర్యుడు లేని లోకము మాత్రము  అందు  వలన అంథేన అంటే గ్రుడ్డి తనము వలన తమసావృతమే అంటే చీకటితో నిండినది.

వేర్వేరు లోకములన్నీ ఒక దానితో ఒకటి కలసే యుండును. తక్కువ స్థాయి జీవితమును గడిపిన వారు అందుకు తగినట్లుగా తక్కువ స్థాయి పౌనఃపున్యము కలిగిన చీకటి లోకములకు పోయి తాము ఉత్తమ పరిణామ స్థాయికి ఎదిగే వరకు అక్కడికే పోవుచుండెదరు. మానసిక స్థాయి ఎదిగితే అందుకు తగిన సత్కర్మ చేసి ఉత్తమ లోకములను పొందెదరు.

నాల్గవ మంత్రము:

అనేజదేకం మనసో జవీయో, నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్ |

తద్దానతోsన్యానత్యేతి తస్మత్, తస్మిన్నపో మాతరిశ్వా దదాతి ||

పదవిఛ్చేదం:(తత్ = ఆ ఆత్మ) ఏకం = ఒకటే;అనేజత్ = చలన రహితమైనది(అవికార్యం);మనసః = మనస్సు కంటే; జవీఅయః = వేగవంతమైనది;దేవాః = ఇంద్రియములు;ఏనత్ = దీనిని;న ఆప్నువన్;గ్రహించ లేవు;(యస్మాత్ = ఎందు చేత నంటే); పూర్వం అర్షత్ = మనస్సు కంటే ముందు వెళ్తుంది;తత్ = అది;తిష్ఠత్ = స్థిరంగా ఉంటూ;ధావతః = పరుగెత్తుతూ ఉన్న(వికార్యములైన);అన్యాన్ = ఇతర విషయాలను; అత్యేతి = దాటిపోతుంది;తస్మిన్(నతి) = అది ఉండడం చేత;మాతరిశ్వా = విశ్వశక్తి యొక్క ప్రాణచైతన్యం(వాచ్యార్ధం గాలి);అపః = ప్రాణుల యొక్క కార్యకలాప మంతా;దధాతి = భరిస్తున్నది.

గద్యరూపం:ఏకం మనసో జవీయో అనేజత్, న ఏనః దేవాః పూర్వమర్షత్ అప్నువన్, తత్ అన్యాన్ అత్యేతి దావతి, తత్ తిష్టతి - తస్మిన్ మాతరిశ్వా ఆపః దధాతి.

అర్ధవిశేషం:తను స్థిరముగా ఉంటూనే మనస్సు కంటే ఎక్కువ వేగము కలిగిన వాడు. అతడి జ్ఞానమును ఇంద్రాది దేవతలు కూడా పొంద లేక పోయినారు. తను స్థిరముగా ఉంటూనే అత్యంత వేగముగా సాగుతున్న ఇతరులను దాటి పోగలడు అతడి ఉనికి వలననే వాయువు లాంటి దేవతలు వర్షము సమకూర్చ గలుగుతారు.

విశేష వ్యాఖ్య:ఏ కణము/అణువు కూడా వేగము పెరిగే కొద్దీ దాని వ్యాపకత కుంచించుక పోతుందనేది ఆధునిక విజ్ఞానములో తెలిసిన విషయము. వేగము శూన్యము అయినపుడు దాని వ్యాపకత అనంతము వరకు పెరుగుతుంది. ద్రవ్యము యొక్క తరంగ దైర్ఘ్యము దాని వేగమునకు విలోమ నిష్పత్తిలో ఉంటుంది. (ఆధునిక కాలములో దీనిని గమనించినది లూయిస్ డీ బ్రాగ్లీ).

అంతే గాక ఒక్క చోటనే కూర్చుని అనంత విశ్వములో ఎక్కడ ఏమి జరుగుతుందని తెలుసుకో గలిగిన యోగి కూడా ఈ ఆధారము మీదే పని చేస్తాడు. ఆల్ఫా ధ్యానము లాంటి ప్రక్రియ ఇటువంటి ఫలితాలని ఈయ గలదు. స్థిరముగా యున్న ఈశ్వరుడు అంతటను వ్యాపించి అంతటను తనలో ఇముడ్చుకో గలదు.

శివ సహస్ర నామములలో మొదటి నామము స్థిరుడు. తను స్థిరముగా యుంటూ సర్వమును గమనించ గలుగుట ఒక అద్భుత సాధన. విజ్ఞాన భైరవ తంత్రములో కూడా ఈ విషయము చెప్ప బడి యున్నది.

అయిదవ మంత్రము:

తదేజతి తన్నైజతి, తద్ దూరే తద్వంతికే |

తదంతరస్య సర్వస్య - తదు సర్వస్యాస్య బాహ్యతః ||

పదవిఛ్చేదం:తత్ = అది;ఏజతి = చలించుచున్నది;తత్ = అది;న ఏజతి = చలించడం లేదు;తత్ = అది;దూరే = దూరంలో ఉన్నది; తత్ = అది;ఉ అంతికే = దగ్గరలో కూడా (ఉన్నది);తత్ = అది;అస్య సర్వస్య = ఈ అంతటి యొక్క;అన్తః = లోపల;తత్ = అది;ఉ = ఇంకా; సర్వస్య అస్య = ఈ అంతటి యొక్క; బాహ్యాతః = వెలుపల (ఉన్నది). 

గద్యరూపం:తత్ ఏజతి, తత్ న ఏజతి, తద్ దూరే, తద్ అంతికే,తద్ అంతరస్య సర్వస్య - తత్ సర్వస్య అస్య బాహ్యస్య.

అర్ధవిశేషం:ఆ పరమ పురుషుడు నడుచును, నడవడు,చాల దూరముగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. జగత్తు లోపల జగత్తుకు బయట పరిపూర్ణముగా ఉన్నాడు.

విశేష వ్యాఖ్య:పరిస్థితులు ప్రవర్తనను నిర్దేశిస్తాయి, కానీ భగవంతుడు ఎప్పుడూ ఒకే రకముగా ఉంటాడు. సగుణ రూపములో తీసుకుంటే నడచినట్లుంటాడు. నిర్గుణ రూపములో చలనముండదు. నమ్మకము లేని వాడికి దూరముగా ఉంటాడు, భక్తులకు దగ్గిరగా ఉంటాడు. జగత్తుకు లోపల బయట అన్ని చోట్లా ఆయనే ఉంటాడు. ఆయన సర్వ వ్యాపి.

ఆరవ మంత్రము:

యస్తు సర్వాణి భూతా, న్యాత్మనే నాను పశ్యతి |

సర్వ భూతేషు చాత్మానం - తతో న విజుగుప్సతే ||

పదవిఛ్చేదం:యః = ఎవరైతే;తు = మరి; సర్వాణి = అన్ని; భూతాని = జీవులను;ఆత్మని ఏవ = తన ఆత్మ యందే;అనుపశ్యతి = దర్శించునో;చ = మరియు;సర్వభూతేషు = అన్ని జీవుల యందు; ఆత్మానం = తనను;(దర్శంచునో);తాతః = అందువలన;న జుగుప్సతే = ద్వేషింపడు.

అర్ధవిశేషం:సకల జీవులను పరమాత్మ యందు చూచు వాడు మరియు సకల జీవుల యందు పరమాత్మను చూచు వాడు ఏ జీవిని ద్వేషించడు.

విశేష వ్యాఖ్య:భగవద్గీత సైతం ఇదే విషయాన్ని చెప్తుంది కదా - ఈ విధముగా జీవించుట ఒక అద్భుతమయిన సాధన.

ఏడవ మంత్రము:

యస్మిన్ సర్వాణి భూతాని, ఆత్మనా భూ ద్విజానత |

తత్ర కో మోహః కో శోకః - ఏకత్వ మను పశ్యతి ||

పదవిఛ్చేదం:యస్మిన్ = ఎప్పుడైతే; విజానతః = విజ్ఞానికి;ఆత్మ ఏవ = ఆత్మయే; సర్వాణి = అన్ని;భూతాని = జీవులు; అభూత్ = అయినదో; తత్ర = అప్పుడు; ఏకత్వం = ఐక్యతను; అనుపశ్యతః = దర్శించే అతనికి;కః =  ఏమిటి;మోహః = మోహం;శోకః = శోకం;

అర్ధవిశేషం:సకల ప్రాణులను పరమాత్మ స్వరూపముగా తెలిసిన స్థితిలో అక్కడ మోహము ఎక్కడిది? శోకము ఎక్కడిది? అతను ఏకత్వ స్థితిని అనుభవిస్తాడు.

విశేష వ్యాఖ్య:భగవద్గీత సైతం ఇదే విషయాన్ని చెప్తుంది కదా - ఇది అద్వైత భావానికి పరాకాష్ఠ.ఈ విధముగా జీవించుట ఒక అద్భుతమయిన సాధన.

ఎనిమిదవ మంత్రము:

స పర్యగా చ్చుక్ర మకాయ మవ్రణం అస్నావిరః శుద్ధ మాపాప విద్ధం |

కవిర్మనీషీ పరిభూః స్వయం భూర్యాథా తథ్యతోర్ధాన్ వ్యదధా చ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||

పదవిఛ్చేదం:సః = అతడు;స్వయంభూః = స్వయంభువు;పర్యగాత్ = సర్వవ్యాపి;అకాయం = శరీరం లేనిది;అస్నావిరం = కందలు లేనిది;అపాపవిధ్ధం = పాపం లేదా అజ్ఞానం వలన కలుషితం కానిది;శుక్రం = ఉజ్జ్వలమైనది;అవ్రణం = గాయం లేనిది;శుధ్ధం = స్వఛ్చమైనది;కవిః = అన్నిటినీ చూచేది;మనీషీ = అన్నీ తెలిసినది; పరిభూః =అన్నిటినీ కలుపుకున్నది;యాధా తధ్యతః = యధావిధిగా;శాశ్వతీభ్యః = అననతమైన; సమాభ్యః = ప్రజాపతులకు;అర్ధాన్ = విధులను;వ్యదదాత్ = పంచి ఇచ్చాడు.

అర్ధవిశేషం:ఈ విధముగా సమస్త జీవులలో భగవంతుడిని చూడ గలిగిన వ్యక్తి తేజస్సుతో దేహ భ్రాంతి వదలి స్నాయువులు గాయములు లేని వాడయి పరమేశ్వరత్వమును పొందును. అతడు అన్నిటిని చూడ గలడు, తెలుసుకొన గలడు, స్వయముగా ప్రకటించు కొనగలడు, శాశ్వతుడు, సమస్త ప్రాణులకు కావాల్సిన పదార్థములను అందించ గలడు.

విశేష వ్యాఖ్య:భగవద్గీత సైతం ఇదే విషయాన్ని చెప్తుంది కదా - ఇది ఆ మార్గములో వెళ్ళు వ్యక్తీ అందుకొనే స్థితిని తెలియ చేస్తుంది.

ఇప్పటి వరకు గల మంత్రాలు అన్నీ సరళమైనవి.అర్ధం చాలా సూటిగా ఉండి చదివిన ప్రతి ఒక్కరికీ మరొకరి వ్యాఖ్యానం అక్కర్లేదు అనిపిస్తుంది.ఒక విధంగా చూస్తే పౌరాణిక పారిషద ప్రసంగీకులు అందరూ వీటినే ఎక్కువ శ్రధ్ధ తీసుకుని చెప్పడం వల్ల అవి సులభ గ్రాహ్యం అవుతున్నాయని అనుకోవచ్చును.కానీ, 9 నుంచి 14 వరకు గల మంత్రాలు ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలకి భిన్నమైన అర్ధాన్ని ఇస్తూ కంగారు పెడతాయి."ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్న సూక్తిని ఊతకర్ర చేసుకుని ఎవరెవరి పాండిత్యం వారు వారు చూపించెయ్యడమే ఇవి మనని కంగారు పెట్టడానికి కారణం అనుకుంటున్నాను నేను.

ఇక్కడే నేను సరైన అర్ధం ఏది అనే ప్రశ్నతో స్వంత పరిశోధన చేశాను.ఇంతటితో ఈ మంత్రాలకు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న రకరకాల అర్ధాల వల్ల ఏర్పడిన గందరగోళం తగ్గి పౌరాణిక పారిషద ప్రసంగీకులు అందరూ ఎక్కువ శ్రధ్ధ తీసుకుని చెప్పడం వల్ల ఇవి కూడా సులభ గ్రాహ్యం అవుతాయని అనుకుంటున్నాను నేను.నా విశ్లేషణ ఒక రకమైన తీర్పు లాంటిది.

తొమ్మిదవ మంత్రము:

అంధం తమః ప్రవిశంతి యే  అవిద్యాముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ విద్య యా రతాః ||

పదవిఛ్చేదం:యే = ఎవరైతే;అవిద్యాం = అవిద్యను;ఉపాసతే = ఉపాసిస్తారో;తే = వారు;అంధం తమః = చిమ్మ చీకటిలో;ప్రవిశన్తి = కూలిపోతారు;యే = ఎవరైతే;ఉ = మరి; విద్యాయాం = విద్యలోనే;రతాః = ఆనందిస్తారో; తే = వారు;తతః = ఆంతకంటె;భూయః = ఘనతరమైన;తమః ఇవ = చీకటిలో;ప్రవిశన్తి = ప్రవేశిస్తారు.

అర్ధవిశేషం:కర్మ మార్గమును సకామముగా ఆచరించు వారు చీకటి లోకములలోకి పోవుదురు. జ్ఞాన మార్గములో అత్యంత ఆసక్తితో ఉన్నవారు కూడా బంధనాలలో చిక్కుకొని మరింత చీకటి లోకాలలోకి పోవుదురు.

విశేష వ్యాఖ్య:ఇక్కడ విద్య-అవిద్య అనే పరస్పర వ్యతిరేకార్ధాలను ఇచ్చే పదద్వందాన్ని గురించి చెప్పడం జరిగింది.అర్ధం వ్యతిరేకం అయినప్పుడు ఒకటి నష్టాన్ని కలగజేస్తుంది అని చెప్పగానే రెండోది దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇవ్వాలి అనే సామాన్య తర్కానికి విరుధ్ధమైనది కాబట్టి మనకు గందరగోళం అనిపిస్తున్నది.

కానీ ద్వంద్వాలు పరస్పర విరుధ్ధమైనవని అనుకోకూడదు.జయం-అపజయం, లాభం-నష్టం, సుఖం-దుఃఖం - ఇలాంటి జతల్ని ద్వంద్వాలు అంటారు.ప్రతి మనిషి జీవితంలోనూ ఈ ద్వంద్వాల లోని రెండు అంశాలూ ఒకోసారి ఒకేలా అనుభవంలోకి వస్తాయి.ఈ రెండూ పరస్పరాశ్రితాలు,అంటే మిశ్రమంగానే అనుభవంలోకి వస్తాయి!యే విషయంలో నైనా నూరు శాతం లాభమూ వుండదు నూరు శాతం నష్టమూ వుండదు.ఒకవైపు నుంచి చూస్తే దుఃఖాన్ని తెచ్చిపెట్టే అనుభవమే మరోవైపు నుంచి చూస్తే ఆనందాని కాధార మవడం చిత్రంగానే తోస్తుంది కానీ అందులో గందరగోళం యేమీ లేదు.

ఒక పరీక్ష ప్యాసవ్వాలంటే యేమి చేస్తున్నాం?సరదాలూ,షికార్లూ ఆపేసి అది పూర్తయ్యే వరకూ వీలైనంత యెక్కువ సమయం చదువుకే కేటాయిస్తున్నాం గదా!సరదాగా తిరగడంలోని ఆనందాన్ని మీరు నష్టపోతేనే పరీక్షలో గట్టెక్కడమనే లాభం మీకు వస్తుంది.ఇట్లాగ ప్రతి విషయంలోనూ ఈ ద్వంద్వాలు కలిసే వస్తాయి.మరి కలిసే అనుభవంలోకి వచ్చే ద్వంద్వాలకు అతీతంగా వుండటం యెట్లా కుదురుతుంది అంటే వాటికి సంబంధించిన ఒత్తిడుల్ని మన మనస్సు మీద పడనివ్వకపోవటం అన్నమాట.మనిషి ఈ ద్వంద్వాలకి సంబంధించిన ఉద్రేకాలకి దూరంగా ప్రశాంతమయిన మనస్సుతో చేసే పనులే సత్ఫలితాల నిస్తాయి, అదీ సంగతి!

పదవ మంత్రము:

అన్య దేవాహుర్విద్యయా, అన్యదాహురవిద్యయా |

ఇతి శుశ్రుమ ధీరాణాం - యేనస్తద్ విచచక్షిరే ||

పదవిఛ్చేదం:విద్యయా = విద్య చేత;అన్యత్ = మరొక;(ఫలం = ఫలితాన్ని); ఆహుః = చెబుతారు;అవిద్యయా = అవిద్య చేత;అన్యత్ ఏవ = వేరొక;(ఫలితాన్ని);ఆహుః = చెబుతారు;ఇతి = అని;యే = ఎవరైతే; సః = మాకు;తత్ = దానిని;విచచక్షిరే = వివరించారో;ఆ ప్రాజ్ఞుల నుండి;శుశ్రుమ = మేము విన్నాము.

అర్ధవిశేషం:మేము బుద్ధిమంతుల ద్వారా విన్న దాని ప్రకారము కర్మ మార్గము ద్వారా ఒక రక మయిన ఫలితములు జ్ఞాన మార్గము ద్వారా వేరొక రకమయిన ఫలితములు వచ్చును. దీనిని వారు మాకు వివరించి చెప్పిరి.

విశేష వ్యాఖ్య:ఇక్కడ విద్య-అవిద్య అనే పరస్పర వ్యతిరేకార్ధాలను ఇచ్చే అస్తిత్వాల వల్ల వచ్చే ఫలితాలను గురించి చెప్పడం జరిగింది.

పదకొండవ మంత్రము:

విద్యాం చా విద్యాం చ యస్తద్వేదోభయం సహః |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా2మృత మశ్నుతే ||

పదవిఛ్చేదం:యః = ఎవరైతే;విద్యాం చ అవిద్యాం చ = విద్యనూ అవిద్యనూ;తత్ = ఆ;ఉభయం = రెండింటినీ;సహ = కూడా; వేద = తెలుసుకుంటారో;అవిద్యయా = అవిద్య చేత; మృత్యుం = చావుని;తీర్త్వా = జయించి;విద్యయా = విద్య చేత;అమృతం = అమరుల లక్షణాన్ని (అమరత్వాన్ని);అశ్నుతే = పొందుతారు.

అర్ధవిశేషం:ఎవరయితే విద్య మరియు అవిద్య మార్గములు రెండింటిని గురించి తెలిసి ఆచరిస్తారో వారు మొదటి (కర్మ ) మార్గము ద్వారా మృత్యువును దాటుతారు. విద్య అంటే జ్ఞాన మార్గము ద్వారా (మృత్యువంటే తెలుసుకొని ) మృత్యువుకు అతీతమయిన స్థితిని అందుకుంటారు.

విశేష వ్యాఖ్య:అంటే కర్మ మార్గములో చావును దాటుతారు కానీ చావుకు అతీతులు కాలేరు. చావు మరో జన్మకు వారధి అని తెలుసుకున్న జ్ఞానులు మృత్యు రహిత స్థితిని అంగీకరించ గలుగుతారు.

విద్య అనే పదం ఒకటే గానీ వేదంలో ఉండి మనకు విద్య పేరున తెలుస్తున్నవి చాలా ఉన్నాయి.ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము, ఉఛ్చాటనము, మోహనము అనేవి షడ్విద్యలు.చతుర్వేదములకు షడంగములు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణములు, ధర్మశాస్త్రము అనేవి కలిసి చతుర్దశ విద్యలు ఉన్నాయి.మళ్ళీ చతుర్దశ విద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతిశాస్త్రము, అర్ధశాస్త్రము కలిసి అష్టాదశ విద్యలు అవుతాయి.అంటే, విద్య కానిది అవిద్య, అజ్ఞానం అనీ తెలిస్తే పండితులు దానినే మాయ అంటున్నారని అర్ధం అవుతుంది.

అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" లో అద్వైతం గురించి ఇలా చెప్పాడు. (బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః) బ్రహ్మమే సత్యం, ఈ ప్రపంచం మిథ్య. జీవునకు, బ్రహ్మం కు భేదం లేదు. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్ముక్తులవుతారన్నాడు. జ్ఞానం, కర్మ(వైదిక ధర్మాలు) రెండు పరస్పర విరుద్దాలన్నాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి కర్మ పెద్ద ఆటంకమన్నాడు. కర్మ అంటే వైదిక కర్మ అనీ, జ్ఞాన మంటే బ్రహ్మజ్ఞానమనీ చెప్పినాడు. శంకరుడు పూర్తిగా జ్ఞానంపై దృష్టిని నిలిపాడు. జ్ఞానం వలన మోక్షం వస్తుందన్నాడు.కర్మ మోక్షానికి ఆటంకమని భావించాడు. జ్ఞానాన్ని మోక్ష స్వరూపంగా స్వీకరించాడు. జ్ఞానంపై ఆయనకున్న అపారమైన ప్రేమే కర్మను తిరస్కరించడానికి కారణమైంది.

మొదటి ఎనిమిది మంత్రాలూ "వివేక చూడామణి" లో అద్వైతం గురించి చెప్పిన దాన్ని సమర్ధిస్తున్నాయి గానీ కర్మనీ జ్ఞానాన్నీ వేరు చేసి కేవలం జ్ఞానమార్గాన్ని ఉగ్గడించడం తెలిసి తెలిసీ తొమ్మిదవ మంత్రం యొక్క సరళమైన అర్ధంతో విభేధంచడం లేదా! జ్ఞానం లేని కర్మ ఎలా సాధ్యం?ఒకరు వచ్చి "శ్రీరాముణ్ణి పూజించండి!" అని చెప్పగానే "ఎందుకు శ్రీరాముణ్ణి పూజించాలి?" అని ప్రశ్నించి "శ్రీరాముణ్ణి ఇందుకోసం పూజించాలి!" అనే జవాబును సాధించని భక్తులు మరొకరు వచ్చి "ఏసును పూజించండి!" అని చెప్పగానే ఏసుకి కూడా భక్తులు అయిపోతారు కదా - మతాంతరీకరణలు మూఢభక్తి పెరిగాకనే ఎక్కువ కావడం మనం చూస్తున్నదే కదా.

పన్నెండవ మంత్రము:

అంధం తమః ప్రవిశంతి యే  అసంభూతి ముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాం రతాః ||

పదవిఛ్చేదం:యే = ఎవరైతే;అసంభూతిం = ప్రకృతిని;ఉపాసతే = ఉపాసిస్తారో;తే = వారు;అంధం తమః = చిమ్మ చీకటిలో;ప్రవిసంతి = కూలిపోతారు;యే = ఎవరైతే;సంభూత్యాం = హిరణ్యగర్భుని యందు;రతాః = ఆనందిస్తారో;తే = వారు;తతః అంతకంటె;భూయః= ఘనతరమైన;తమః ఇవ = కారు చీకటిలో;ప్రవిశన్తి = ప్రవేశిస్తారు.

అర్ధవిశేషం:అసంభూతిని లేదా ప్రకృతిని ఉపాసించేవారు గాఢమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు.అలా కాక సంభూతి అయిన హిరణ్యగర్భుని యందు ఆనందించేవారుఅంతకన్న నిబిడమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు.

విశేష వ్యాఖ్య:పన్నెండవ మంత్రం తొమ్మిదవ మంత్రానికి నకలు వలె ఉంటుంది.అక్కడి "అవిద్య" అనే పదానికి బదులు ఇక్కడ "అసంభూతి" అనే పదమూ అక్కడి "విద్య" అనే పదానికి బదులు ఇక్కడ "సంభూతి" అనే పదమూ వచ్చాయి,అంతే.

మొదట ఉపాసతే అను పదమును వాడినారు. రెండవ చోట రతాః అనే పదమును వాడినారు. మొదటిది ఆరాధన, రెండవది అనురక్తి అంటే బంధము. బంధము ఎప్పుడూ చీకటి లోనికి దారి తీస్తుందనే విషయము జగద్విదితమే. ఉపాసనతో ఆనందము కలుగ వచ్చును.అంతే గాక శక్తులను ఇస్తుంది. ప్రకృతి ఉపాసన వలన భగవంతుడి వైపు చేరే లక్ష్యము ఉండదు. హిరణ్యగర్భునితో అనురక్తి అనుకోకుండానే బంధాన్ని పెంచుతుంది. అందు వలన రెండింటి లోనూ చీకటిలో ప్రవేశిస్తారు.

పదమూడవ మంత్రము:

అన్య దేవాహుః సంభవా, దన్య దాహురసంభవాత్ |

ఇతి శుశ్రుమ ధీరాణాం - యేనస్తద్ విచచక్షిరే ||

పదవిఛ్చేదం:సంభవాత్ = హిరణ్యగర్భుని ఉపాసన వలన;అన్యత్ ఏవ = మరొక;(ఫలం = ఫలితాన్ని);ఆహుః = చెబుతారు;అసంభవాత్ = పర్కృతి యొక్క ఉపాసన అవ్లన;అన్యత్ = మరొక;(ఫలం = ఫలితాన్ని);ఆహః = చెబుతారు;ఇతి = అని;ధీరాణం = ప్రాజ్ఞు;అ నుండి;శుశ్రుమ = విన్నాము;యే = ఎవరైతే; నః = మాకు విచచక్షిరే - వివరించారో.

అర్ధవిశేషం:సంభవం లేదా హిరణ్యగర్భుని యొక్క ఉపాసాన వలన ఒక ఫలితం లభిస్తుందనీ అసంభవం లేదా ప్రకృతి యొక్క ఉపాసన వలన మరొక ఫలితం లభిస్తుందనీ మాకు దానిని వివరించిన ప్రాజుల నుండి మేము విన్నాము.

విశేష వ్యాఖ్య:పదమూడవ మంత్రం పదవ మంత్రానికి నకలు వలె ఉంటుంది.అక్కడి "విద్య" అనే పదానికి బదులు ఇక్కడ "సంభూతి/సంభవం" అనే పదమూ అక్కడి "అవిద్య" అనే పదానికి బదులు ఇక్కడ "అసంభవం/అసంభూతి" అనే పదమూ వచ్చాయి,అంతే.ఇక్కడ మూర్త్యాత్మకమైన ప్రకృతి తత్వాలను ఆరాధించడం, అమూర్యాత్మకమైన హిరణ్యగర్భుని ఉపాసించడం వల్ల వచ్చే ఫలితాలను గురించి చెప్పడం జరిగింది.యే ఒక్క సాధన లోనూ దోషం ఉందని చెప్పడం లేదనేది గమనించాలి.

పదునాల్గవ మంత్రము:

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ |

వినాశేన మృత్యుంతీర్త్వా సంభూత్యామృత మశ్నుతే ||

పదవిఛ్చేదం:(అ)సంభూతిం = ప్రకృతిని;ఛ = కూడా;వినాశం = హిరణ్యగర్భుని;చ = కూడా; తత్ = ఆ;ఉభయం = రెండింటిని;సహ = కలిపి;యః = ఎవరైతే;వేద = తెలుసుకుంటారో;వినాశేన = హిరణ్యగర్భుని ఉపాసన చేత;మృత్యుం = చావును;తీర్త్వా = జయించి; అసంభూత్యా = ప్రకృతి పట్ల భక్తి వల్ల; అమృతం = అమరత్వమును;అశ్నుతే = అందుకుంటాడు.

అర్ధవిశేషం:అసంభూతినీ వినాశాన్నీ రెంటినీ కలిపి  తెలుసుకున్నవాడు వినాసం(హిరణ్యగర్భుని) యొక్క ఉపాసన వల్ల మృత్యువును జయించి అసంభూతి పట్ల భక్తి అవ్ల్ల అమరత్వాన్ని అందుకుంతాడు.

విశేష వ్యాఖ్య:పధ్నాల్గవ మంత్రం పదకొండవ మంత్రానికి నకలు వలె ఉంటుంది.అక్కడి "విద్య" అనే పదానికి బదులు ఇక్కడ "సంభూతి" అనే పదమూ అక్కడి "అవిద్య" అనే పదానికి బదులు ఇక్కడ "అసంభూతి" అనే పదమూ వచ్చాయి,అంతే.

అయితే,శ్రీ శర్వానంద స్వామి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ పదవిఛ్చేదం అక్కడ విద్య స్థానంలో వచ్చిన ఇక్కడి సంభూతి ముందర "అ" ప్రత్యయాన్ని చేర్చినది జగద్గురువు ఆదిశంకరుల వారు.శ్రీ శంకరుల అభిప్రాయం ప్రకారం హిరణ్యగర్భ,ప్రకృతుల సమిష్టి ఉపాసన కర్మ వల్ల మోక్షం లభిస్తుంది.ఇక్కడ శంకరులు వ్యతిరేకిస్తున్నది లౌకిక కర్మలను కాదు,వైదిక కర్మలైన యజ్ఞాది ప్రక్రియలను సైతం ఆయన వ్యతిరేకించారు.తనకు ఇష్టమైన అర్ధాన్ని రప్పించుకోవదం కోసం అక్కడ లేని "అ" అనే అక్షరాన్ని చేర్చడం వేదాన్ని ధిక్కరించడమే కదా - జగద్గురువులు అలా ఎందుకు చేశారు?సంహితా పాఠంలో కూడా కనిపించే 14వ మంత్రానికి మార్పులు చేర్పులు చెయ్యకూడదనే చిన్న విషయం జగద్గురువులకి తెలియనిదా?

వేదంలో వాస్తవాలే ఉన్నాయి. కాని, ఆధునిక కాల్పనిక సాహిత్యంలో ఉన్నట్టి అవాస్తవాలు లేనేలేవు. దేవతలు చచ్చినవాణ్ణి బ్రతికించడం, కోపించి ఒకణ్ణి అణగదొక్కడం, ప్రసన్నులైన ఒకనికి అమాంతపు సంపద ప్రసాదించడం చేయరు.వేదంలో - మనం అనుకుంటున్నట్లు వైరాగ్యం ఎక్కడా కనిపించదు. ఇహమును గురించే ఎక్కువగా చెప్పబడింది.వేదాల్లో వైరాగ్యం లేనట్టే, ఉపనిషదాదుల్లోకూడా వైరాగ్యం లేదు. మానవుని జీవితాన్ని సుఖసంతోషాలతో నింపడానికే భారత తాత్త్వికత, భారతసాహిత్యం నిరంతరం కృషి చేసింది. వేదాంతానికి వైరాగ్యం అనే అర్థం కూడా స్వప్రయోజనపరుల కల్పనయే! వైరాగ్యాన్ని గురించి చెప్పినా అది ఇహసుఖం. కోసమే, పరలోకం కోసం కాదు. సుఖశాంతులతో కూడిన సమాజాన్ని ఏర్పరచడమే భారతీయ మేధావుల, ఋషుల, మునుల, మహాత్ముల, యోగుల, పరమ యోగుల పరితాపం, కృషి, తపస్సు!

ఆనందవల్లి "సైషానందస్య మీమాంసా భవతి,యువా స్యాత్సాధు యువాధ్యాయకః - ఆశిష్ఠో దృటిష్ఠో బలిష్ఠః తస్యేయం పృధివీ సర్వా సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. స ఏకో మానుష ఆనందః" అని బల్లగుద్ది చెప్తున్నది."కూలంకష పరిశీలన చేసి ఆనందం గురించి ఇలా సూత్రీకరించవచ్చు - విద్యావంతుడైన ఒక మంచి కుర్రాడు గనక దృఢ శరీరం గలవాడైతే  భూమి సమస్తమూ అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది.ఇది ఒక మానవపురుషతత్వం యొక్క ఆనందానికి కొలత." అని దాని అర్ధం.అలాంటప్పుడు జగద్గురువులు పుట్టిన ప్రతి శిశువునీ సన్యాసి అయిపొమ్మని ఎందుకు చెప్పారు?

ఇతర వ్యాఖ్యాతలలో ఉవటాచార్యుల వ్యాఖ్యానాన్ని సమర్ధిస్తున్నాను నేను.మొత్తం మంత్రం యొక్క అర్ధాన్ని ఆయన ఇలా వివరించారు:శాశ్వతుడైన హిరణ్యగర్భుని యొక్క మరియు నశ్వరమైన శరీరం యొక్క రహస్యాన్నీ తెలుసుకున్న యోగి జ్ఞానోత్పాదనానికి తోడ్పడే కర్మలను శరీరం చేత నిర్వహించడం వల్ల మృత్యువును జయించి బ్రహ్మజ్ఞానం వల్ల అమరత్వాన్ని పొందుతాడు.

మంత్రం యొక్క మొదటి పదం అయిన "సంభూతి"కి "అ" చేర్చక పధ్నాల్గవ మంత్రం పదకొండవ మంత్రానికి నకలు వలె ఉంటుంది గనక అదే నిర్మితి ప్రకారం ఇక్కడి మొదటి పంక్తిలోని మొదటి పదం అయిన "సంభూతి" అనే పదానికి 12,13 మంత్రాలలో చెప్పిన "హిరణ్యగర్భుడు" అనే అర్ధం తీసుకుని ఇక్కడి "వినాశం చ,వినాశేన" పదాలలోని "వినాశం" అనే పదానికి 12,13 మంత్రాలలో చెప్పిన "అసంభూతి/"అసంభవం" అనే అర్ధం తీసుకుని ఉంటే అందరికీ అదే అర్ధం వస్తుంది,కదా!

పదిహేనవ మంత్రము:

హిరణ్మయేన పాత్రే ణ సత్యస్యాపి హితం ముఖం |

తత్త్వం పూషన్నపావృణు సత్య ధర్మాయ దృష్టయే ||

పదవిఛ్చేదం:హిరణ్మయేన పాత్రేణ = బంగారు పాత్ర చేత;సత్యస్య = సత్యము యొక్క; ముఖం = ద్వరం;అపిహితం = కప్పబడి ఉన్నది;పూషన్ = ఓ సూర్యదేవా;తత్ = ఆ;సత్యధర్మాయ = సత్యమునకు అర్పితుదననిన నేను;దృష్టయే = చూచుట కొరకు;త్వం అపావృణు = నీవు తొలగించు.

అర్ధవిశేషం: ఓ పరమేశ్వరా! నీ యొక్క సత్య రూపమయిన ముఖము బంగారు పాత్ర చేత మూయ బడినది. సత్య ధర్మములను నిర్ధారించు కొనుటకు ఆ తేజస్సును కొంత తొలగించుము.

విశేష వ్యాఖ్య:ఇక్కడ వేదం చెప్పిన సత్యాలను ఎనతవరకు తెలుసుకోవాలి అనే సాధకుడి జిజ్ఞాసకు ఉపనిషత్కర్త ఒక సూచన ఇస్తున్నాడని అనుకుంటున్నాను నేను.ఒక మనిషి ఒక జీవిత కాలంలో తెలుసుకోలేని అనంతమైన వేద విజ్ఞానం నుంచి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తనకు పనికి వస్తుందని అనిపించిన కొంత భాగాన్ని మాత్రం అధ్యయనం చేసి సంతృప్తి పడాలి తప్ప అంతా ఒకే గుక్కలో ఆపోశన పట్టాకనే నాకేది హితమో తేల్చుకుని కర్మకి పూనుకుంటాను అనకూడదు.మధ్యందిన మార్తాండ తేజాన్ని కళ్ళు విప్పార్చి చూడలేము,కానీ మేఘం ఆవరించినప్పుడో నీరెండ కాస్తున్నప్పుడో సూర్యబింబాన్ని సూటిగా చూడగలం,అవునా?

పదునారవ మంత్రము:

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ |

తేజో యత్తే రూపం కళ్యాణ తమం పశ్యామి యో 2సావసౌ పురుషః సోహమస్మి ||

పదవిఛ్చేదం:పూషన్ = పోషకుడు;ఏకర్షే = ఒంటరి బాటసారి;యాం = నియంత;ప్రాజాపత్య = ప్రజాపతి పుత్రుడు;సూర్య = ఓ సూర్యుడా!;రశ్మీన్ = కిరణాలను;వ్యూహ = తొలగించు;తేజః = కాంతిని;సమూహ = ఉపసంహరించుకో;యత్ = ఏదైతే;తే = నీ యొక్క;కళ్యాణతమం = అత్యంత అవిభవోపేతమైన;రూపం = రూపమున్నదో;తత్ = దానిని; తే = నీ అనుగ్రహం చేత;పశ్యామి చూస్తాను;యః = ఎవరైతే;అసౌ = అక్కడ ఉన్న;పురుషః = పురుషుడు;సః = అతడు = అహం అస్మి = నేనే అయి ఉన్నాను.

అర్ధవిశేషం:ఓ సర్వ పోషకుడా! ఏకైక జ్ఞాన స్వరూపా! సర్వ నియంతా!(యమ) లక్ష్య ప్రదాతా! (సూర్య) సృష్టి ప్రదాతా!(ప్రజాపతి) కళ్యాణ తమమయిన నీ యొక్క తేజో రూపాన్ని చూచుచున్నాను. అదే పురుష రూపము. నేను కూడా ఆ రూపాన్నే అయి ఉన్నాను.

విశేష వ్యాఖ్య:ఇక్కడ నిజమైన అద్వైత భావనను ఉపనిషత్కర్త మనకు పరిచయం చేస్తున్నాడు.చివరి ముక్తాయింపు తప్ప ముందరి భాగం పదిహేనవ మంత్రంలోని తన అర్ధింపుకి కొనసాగింపు అవుతుంది,కదా!అయితే, ముందరి మంత్రాల్లోని "యేనస్తద్ విచచక్షిరే" అన్న పదబంధం మా పూర్వుల నుండి  మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాము అన్నట్టు ఉంటుంది గానీ ఇక్కడి ముక్తాయింపు అయిన "సోహమస్మి" తనకు తను చెప్పుకుంటున్నట్టు ఉంది తప్ప మనకు చెప్తున్నట్టు లేదు.ఇది మోక్షకాంక్షని ఇతరులు మనమీద రుద్దకూదదు,మనకు మనం మన సొంత బుధ్ధితో తర్కించి ఒక నిర్ణయానికి రావాలి అన్న నియమానికి పునరుక్తి అవుతుంది.

పదిహేడవ మంత్రము:

వాయురనిల మమృతమమథేదం భస్మాంతః శరీరమ్ |

ఓం క్రతో స్మర కృతః స్మర క్రతో స్మర కృతః స్మర ||

పదవిఛ్చేదం:అధ = ఇప్పుడు;వాయుః = ఊపిరి(ప్రాణవాయువు); అమృతం = శాశ్వతమైనది;అనిలం = (సర్వవ్యాపి యైన)వాయువును;ప్రతిపద్యతాం = పొందును గాక;ఇదం = ఈ శరీరం;భస్మాంతం = బూడిద అగును గాక;ఓం = శబ్దబ్రహ్మమును;క్రతో = ఓ మనసా;స్మర = గుర్తు తెచ్చుకో;కృతం = పూర్వ కర్మాల్ను;స్మర = గుర్తు తెచ్చుకో.

అర్ధవిశేషం:ఓం పరమేశా! ఇప్పుడు (నా మరణము తరువాత) నా పంచ ప్రాణాలు సమిష్టి వాయు తత్వములో కలిసి పోనీ.నా భౌతిక శరీరము భస్మ కృతము అగు గాక. యజ్ఞ స్వరూపా!నన్ను గుర్తుంచుకొనుము.నేను చేసిన పనులను గుర్తుంచుకొనుము.

విశేష వ్యాఖ్య:భస్మాంతం అనే పదం ఉండటం వల్ల పూర్వ విశ్లేషకులు అందరూ ఇది మరణకాల ప్రార్ధన అని చెప్పేస్తున్నారు గానీ సాధకుడి సర్వకాల సర్వావస్థల యందు నిత్యం చెయ్యాల్సిన పని అనే విశేషార్ధం గోచరిస్తున్నది నాకు.కనీసం ప్రతి రోజూ రాత్రివేళ నిద్రకి ఉపక్రమించే ముందు గతానుగతికమైన చింతన చెయ్యాలి.గతంలో ఒక చెడుపని చేసినట్టు గుర్తించినప్పుడు తను ఏ మనస్థితిలో ఏ తర్కాన్ని ఉపయోగించి ఆ చెడుపని చేశాడో తెలుసుకుని మళ్ళీ మనస్సుని ఆ స్థితిలోకి వెళ్ళనివ్వ రాదు.అప్పుడే మనం ఎల్లప్పుడూ మంచి పనులనే చెయ్యగలిగే స్థిరత్వం నెలకొంటుంది ప్రవర్తనలో.

పదునెనిమిదవ మంత్రము:

అగ్నే నయ సుపథా రా యే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ |

యుయోధ్య స్మజ్జు హురాణమేనో భూయిష్థాం తే నమ ఉక్తిం విధేమ ||

పదవిఛ్చేదం:అగ్నే = ఓ అగ్నీ!;అస్మాన్ = మమ్మల్ని; రాయే = కర్మఫలం అనుభవించుటకు;సుపధా = మంచి మార్గం లోనికి;నయ = తీసుకు పో;దేవ = ఓ దేవా!;విశ్వాని - విశ్వంలోని అన్నింట్నీ;వయునాని = అన్ని కర్మలనూ;విద్వాన్ = తెలుసుకొని;అస్మత్ = మా నుండి;జుహురాణం = వక్రమైన మాయల దారుల నుండి;ఏనః =పాపమును;యుయోధి = నిర్మూలించుము;తే = నీకు =;భూయిష్ఠాం = అనేకములైన;నమ ఉక్తిం = నమస్కార వచనా;అను;విధేమ = అర్పిస్తున్నాము.

అర్ధవిశేషం:అగ్ని దేవా! మమ్ములను మంచి మార్గములో కర్మ ఫలములను అందుకొను నట్లుగా నడిపించుము. నా కర్మలను నీవు ఎరుగుదువు. నా మార్గములో అడ్డంకులను తొలగించుము. మీకు పదే పదే నమస్కారములు చెబుతాము.

విశేష వ్యాఖ్య: వేదం అనే పదానికి విద్య, శాస్త్రం అనే పర్యాయ పదాలు ఉన్నాయి."విద్" అనే ధాతువుకు తెలుసుకొంట,అమనమ చేయుట,జ్ఞప్తిలో ఉంచుకొనుట అనే అర్ధాలు ఉన్నాయి.అలాగే "శాస్" అనే ధాతువుకు కోరుకొనుట,ఆజ్ఞాపించుట,ఉపదేశించుట అనే అర్ధాలు ఉన్నాయి.వేదంలోని కర్మకాండ ధార్మిక క్రియలనూ నియమాలనూ విధులనూ ఆచారాలనూ తెలియజేస్తుంది.ఇక జ్ఞానకాండ ఆయా ధార్మిక క్రియలలోని అంతరార్ధాలనూ తాత్విక విషయాలను గురించీ తెలియజేస్తుంది.అయితే,ఇలాంటి విభజన వల్ల వాటిలో వైవిధ్యం ఉందని అనుకోవటం తప్పు.అవి పరస్పర విరుధ్ధమైనవి కావు."నువ్వులలో నూనె వలె వేదం యొక్క సమస్త మంత్రాలలోనూ వేదాంతం సుప్రతిష్ఠితమై ఉన్నది" అని ముక్తకోపనిషత్తు చెప్పిన దానిని ప్రమాణం కింద తీసుకుని మొదట ఒక్కొక్క దానిని అర్ధం చేసుకుని ఆ తర్వాత సమన్వయం చేసుకుంటే అప్పుడు మనకు తెలిసేది సమగ్రమైన జ్ఞానం అవుతుంది.

ఓం  పూర్ణ  మదః  పూర్ణ  మిదం, పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।

పూర్ణస్య  పూర్ణ  మాదాయ, పూర్ణ  మేవావ  శిష్యతే ॥

పదవిఛ్చేదం:అదః = అది;పూర్ణం = అనంతం;ఇదం = ఇది;పూర్ణం - అనంతం;పూర్ణాత్ = అనంతం నుండి;పూర్ణం - అనంతం;ఉదచ్యతే = బహిర్గతమైనది;పూర్ణస్య = అనంతం నుండి;పూర్ణం = అనంతం;ఆదాయ = తీసివేసినప్పటికీ;పూర్ణం = అనంతం;ఏవ = మాత్రమే;అవశిష్యతే = మిగిలి ఉంటుంది.

అర్ధవిశేషం:మనకు తెలియనిదీ అనంతమే.మనకు తెలిసిందీ అనంతమే.ఆ అనంతం నుండి ఈ అనంతం వచ్చింది.ఈ అనంతం అంతమైన తర్వాత కూడా ఆ అనంతం ఉంటుంది.

హరిః ఓం!!! 

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...