Monday, 8 July 2019

ఆంధ్రాలో భాజపాకి నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ఒక్కడే!బాబుకి ఆయువు తీసి జగనుకి కొమ్ములు పెంచి భాజపా సాధించింది ఏమిటి?

బాబు మీద పగబట్టి అతన్ని వోడించటానికి చేరదీసిన ఇద్దరూ భాజపాకి ద్రోహం చేశారు - కేసీయార్ ఎన్నికల్లో వాళ్ళకీ వీళ్ళకీ డబ్బులిచ్చాడని తెలిసింది,జగను తాము కుదరదంటున్న ప్రత్యేకహోదా కోసం తీర్మానం చెయ్యటమే కాకుండా కరకట్ట మీద బాబు ఇంటి గురించి గొడవ చేసి తమ పార్టీవాడైన గంగరాజుకీ చెడ్డపేరు తెచ్చిపెట్టాడు!చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మొదట బాబుని టార్గెట్ చేసినప్పుడు చంకలెగరేసి తమవాణ్ణి ముట్టుకుంటున్నాడని తెలియగానే వార్నింగులిస్తే పోయిన పరువు తిరిగొస్తుందా?తమ రెండు నాల్కల ధోరణి బయటపడిపోలేదూ!

బీజేపీ ఒక కఠినమైన వాస్తవాన్ని గమనించాలి - తెదెపా వాళ్ళని లాక్కుని బాబుని దెబ్బతియ్యడం ఘనకార్యం అని భావించేముందు కాంగ్రెసు గతంలో చేసిన ఇలాంటి దగుల్బాజీ పనుల వల్లనే ఇంకో వందేళ్ళ వరకు ఆ పార్టీకి వోటు వెయ్యకూడదన్నంతగా ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకున్నారు - వాళ్ళకీ  ఆ దుస్థితియే కావాలా?సుజనా చౌదరి పేరుని చంద్రబాబు ఇచ్చినప్పుడు "ఇతనే దొరికాడా!" అని ఈసడించుకున్నారు,అతను అవినీతిపరుడని నిరూపించడానికి కేసులు పెట్టిందీ వాళ్ళే, ఇవ్వాళ అతను తెదెపా నుంచి బయటికి వస్తే అక్కున చేర్చుకుంటున్నదీ వాళ్ళే - ఇది కాంగ్రెసు తరహా రాజకీయం కాదా!

అన్నిటికన్న కఠినమైన వాస్తవం యేమిటంటే తెలంగాణలో అయినా నాలుగు లోక్ సభ స్థానాలు గెలవగలిగారు గానీ ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు ఇప్పటికీ!"చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ఆలయంలో జరుగుతున్నవాటి పట్ల స్పందిస్తున్న తీరు అసలుకే మోసం తెచ్చి వచ్చే ఎన్నికల్లో ఓటమిని చూపించవచ్చు!" అనే పోష్టులో నేను "బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడానికి అన్ని గతిలేని పనులు చెయ్యాల్సి రావడం కాంగ్రెసు క్రమేణా బలం పుంజుకుంటున్నదనే దానికి సంకేతం - అది వాళ్ళకి అర్ధం కావడం లేదు!బండ పద్ధతుల్లో అప్పటికి అధికారం దక్కితే దక్కవచ్చు గాక,వాటి నుంచి పాఠం నేర్చుకోవటం లేదు వాళ్ళు.అధికారంలో లేని కాంగ్రెస్ ఏమి మంచి పనులు చేసిందని ప్రజలు కాంగ్రెసుకి అంత బలం ఇస్తున్నారు?తమ పట్ల వ్యతిరేకత కాదా!ఒక వోటరు తను వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషిస్తాడు,అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా రాకపోతే అందుకు కారణమైనవాణ్ణి మరింత ద్వేషిస్తాడు - ఇది జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే నిజం!2019 ఎలెక్షన్స్ బీజేపీకి నల్లేరు మీద బండి నడక కాదు - ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి.కర్నాటకలో మిగిలిన అన్ని అంశాలతో పాటు చంద్రబాబు స్టేట్మెంటు కూడా పనిచేసింది.ఎన్నికల తర్వాత 2014లో కన్న బలహీనపడినప్పుడు చంద్రబాబు అవసరం తప్పనిసరి!" అని చెప్పినది ముమ్మాటికీ నిజం.మొన్నటి ఎన్నికల్లో మీరు మోదీని తీసుకొచ్చి పెద్ద యెత్తున ప్రచారం చేసినా కోడి పోయి కత్తి వచ్చె డండండం అన్నట్టు బాబు పోయి జగన్ రావడం తప్ప భాజపాకి ఎంత మేలు జరిగింది?అదే, బాబుకి మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సహాయం చేసి ఎన్నికల సర్దుబాటులో కొన్ని ఎక్కువ సీట్లని తీసుకుని వాటిలో మీ సొంత బలం చూపించి గెలిచి ఉంటే ఎంత బాగుండేది?మోదీ వచ్చి ప్రచారం చేసినా బాబు వ్యతిరేక వోట్లు జగనుకి పడి అతను గెలవటం అంటే మిగిలిన దేశమంతటా అప్రతిహతంగా ఉన్న జాతీయ పార్టీకి ఎంత అప్రదిష్ట - ముఖ్యంగా ప్రధాని స్థానంలో ఉన్న మోదీకి ఎంత పరువు తక్కువ!

తన సొంత పార్టీలో మామకే వెన్నుపోటు పొడిచాడు అనేది పట్టుకుని ఎంతకాలం సాగదీస్తారు?సాక్షాత్తూ లక్ష్మీపార్వతి మొదటి భర్త ఇంటర్వ్యూ బయటపడిన ఇవ్వాళ అది ఎంత పిచ్చిమాట!నాదెండ్ల భాస్కరరావుది నిజమైన వెన్నుపోటు!అప్పుడు చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల్ని కాపాడుకోకపోయి ఉంటే రామారావు ఎన్ని కబుర్లు చెప్పినా వెర్రివెధవలా మిగిలిపోయి ఉండేవాడు కాదా!ఇవ్వాళ్టికీ అన్ని పార్టీల నాయకులూ అదే సమస్య వస్తే చంద్రబాబునే అనుసరిస్తున్నారు కదా!మరి, భార్య స్థానాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుదామని ప్రయత్నిస్తున్న లక్ష్మీపార్వతిని ఆనాడు నిగ్రహించకపోయి ఉంటే తెలుగుదేశం ఈరోజున ఎలా ఉండేది!ఇవ్వాళ మోదీ మీద తను యుద్ధం ప్రకటిస్తే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి రాజకీయ నాయకుడూ అతని పక్కకి వెళ్ళారంటే అది అతనికి ఉన్న విశ్వాసనీయత కాదా?వేరే పార్టీ టిక్కెట్లతో గెలిచినవాళ్ళకి మన పార్టీ కండువా కప్పెయ్యడం ద్వారా అధికారంలోకి రావడం ఆ ఒక్కసారికీ తక్షణలాభం తీసుకొస్తుంది గానీ ప్రజల్లో ద్వేషాన్ని పెంచి కాంగ్రెసుకి మల్లేనే పుట్టగతులు లేకుండా చేస్తుంది.

ఎవరు ఎంత దీమా చూపించినా ఆంధ్రాలో చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోకుండా అతనికి ప్యాకేజీ ద్వారా ఇచ్చే సహాయమైనా నిజాయితీగా చేసి ఎన్నికల సమయంలో ఇదివరకటి కన్న ఎక్కువ సీట్లు తీసుకుని చంద్రబాబు విజయంలో మా ప్రోత్సాహం కూడా ఉందని చెప్పుకుని ఉంటే ఇప్పటికన్న మంచి ఫలితం దక్కి ఉండేది.ఇప్పుడు ఏమైంది?జగను తమకి బెండు పెడుతూ కేసీయారు పక్కకి చేరినా ఏమీ చెయ్యలేని పరిస్థితి దాపరించింది. గట్టిగా విమర్శిస్తే ఎందుకు ప్రోత్సహించారనే ప్రశ్న తమనే దోషిగా నిలబెడుతుంది.హిందూత్వం నినాదంతో ఉన్న పార్టీ క్రైస్తవ ముద్ర ఉన్న జగనుతో కలిసి పోటీ చెయ్యగలదా?

ఈ మొత్తం సంక్షోభానికి కారణం ఆంధ్రా బీజేపీ నాయకుల కులపిచ్చి అని నా అభిప్రాయం.వాళ్ళలో ఎవడికీ ప్రజల్లౌ తిరిగి వోట్లు తెచ్చుకోగలిగిన సామర్ధ్యం లేదు. కనీసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా హిందువుల్ని వోటుబ్యాంకు కింద మార్చుకునే చాతుర్యం కూడా లేదు. ముత్యాల ముగ్గు కాంట్రాక్టరు "వెనకటికి మా మావ చెవుల్లో మీసాలు మొలిపిచ్చు మిగతాది నేంజూసుకుంటానన్నాట్ట, ఏం జూసుకున్నావ్!" అని జోకేసినట్టు బాబుని కమ్మ కులస్థుడిగా చూసి "ఈ కమ్మోడితో మనం కలవడం ఏంటి?" అని తేలిక చేసి అతన్ని పడగొట్టేస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయని వాళ్ళు నమ్మి అధిష్ఠానాన్ని నమ్మించి ఒక భాజపాయేతర పార్టీ బదులు ఇంకో భాజపాయేతర పార్టీని పవరులోకి తీసుకు రావడం తప్ప వీళ్ళు భాజపాకి ఎన్ని వోట్లు పెంచగలిగారు?

కాబట్టి రాష్ట్రంలోని వాస్తవమైన బలాబలాల్ని అంచనా వేసుకుని అహంకారాలకి పోకుండా చంద్రబాబుతో కలిసి అతని సాయంతో ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి.ఒక ఎన్నికలో వోడిపోయినంత మాత్రాన చంద్రబాబు అసమర్ధుడైపోడు, జీరో బడ్జెట్ వ్యవసాయం గురించి నాలుగేళ్ళ క్రితం అతను ప్రతిపాదించినదాన్ని ఇవ్వాళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించడమే అతని పరిపలనా దక్షతకి తార్కాణం. అలాంటివాణ్ణి శత్రువుని చేసుకోవడం కన్న మిత్రుణ్ణి చేసుకోవడమే లాభం.

మహా మేధావులూ రాజకీయ విశ్లేషకులకే కాకుండా ప్రతిరోజూ న్యూస్ పేపరు చదివే పోరగాడికి కూడా ఆనాడు కాంగ్రెసు పార్టీకి విభజన బిల్లుని ఎవరి మద్దతూ లేకుండా సభలో నెగ్గించుకోగలిగిన మద్దతు లేదనీ బిల్లులో ఆంధ్రాకి హాని జరిగే అంశాలు ఉన్నప్పటికీ బిలు నెగ్గడంలో కాంగ్రెసు కన్న బీజేపీ ప్రమేయమే ఎక్కువ అని తెలిసిపోయింది!ఎన్నికల సమయంలో తల్లిని చంపి పిల్లని పుట్టించారు అని జాలి కబుర్లు చెప్పినవాడు ఆ తల్లికి గృహప్రవేశం రోజునే హ్యాండిచ్చాడు అనేది కూడా అందరికీ తెలుసు!అక్కడి మేధావులూ ఇక్కడి మేతావులూ తమని తాము ఎంత గొప్పగా వూహించుకుని మాస్టర్ ప్లాన్లు వేసినా బీజేపీ ఆంధ్రాను బలిమిని కైవసం చేసుకోవాలనే ప్రతి ఎత్తుగడా ఆంధ్ర ప్రజల్లో బీజేపీ పట్ల  మరింత కోపాన్ని ఎగదోస్తున్నదనేది నిజం - ఈనాడు కాదు దేశంలో రాజకీయం మొదలైన తొలినాటి నుంచీ విజయవాడయే తెలుగువాళ్ళ రాజకీయ రాజధాని అనేది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం, వీళ్ళని మోసం చెయ్యడం చాలా కష్టం!ఇసుకలో తల దూర్చిన ఉష్ట్రపక్షిలా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా అమాయకత్వం నటించకండి!ఉన్న చెడ్డపేరును పోగొట్టుకోవాలంటే మంచిపనులు చెయ్యాలా మరిన్ని చెడ్డపనులు చెయ్యాలా అనేది కూడా తెలియనంత చిన్నపిల్లలు కాదు కదా, ఇప్పటివరకు తెచ్చుకున్న చెడ్డపేరును పోగొట్టుకోవాలంటే రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయటపడెయ్యటానికి చంద్రబాబుకి సహాయం చెయ్యటం తప్ప మరో మార్గం లేదు.

బుద్ధిః కర్మాను సారిణీ - తధాస్తు!

5 comments:

  1. సీ. పోదురు పోయెడి పాపకర్ములు, సరె -
    పోనిమ్ము!వారల పాప మదియె.


    ఆస్తులు పోవగ లాభము లేదని
    వదులుకు పోయెడి వారి జూచి

    వగవకుడీ, మారువేషమది బయల్ప
    డినదనుచు మురియుడి!మరి యటులె

    వత్తురు వచ్చెడివారు, పుణ్యులు గారె
    లేమిన వచ్చి నిలిచెడు వారు?

    తే. పరుల సొమ్ములు గోరక, పోయె వచ్చె
    ననుట లవిలేక యుండుచు, నిమ్మళముగ
    కుడిచి కూర్చొను వారలు కామితములు
    వదలుటం జేసి - మోక్షము వారిదౌను.
    (10/07/2019)

    ReplyDelete
  2. బాబు వెధవవేశాలు మానేసి కాళ్ళ మీద పడితే క్షమించేందుకు మోడీ-అమిత్ షా ద్వయం రెడీ

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రకు సంబంధించినంతవరకు బాబు బీజేపీ కాళ్ళ మీద పడాల్సిన అవసరమూ లేదు, మోదీ షాలకి అంత సీనూ లేదు!

      Delete
    2. పాదాల మీద పడటం గగ్గోలు పెట్టి ఏడవటం వైకాపాకి అవసరం - చేశారు, వచ్చారు, ఏం పీకారు?అయినా వీళ్ళు కాళ్ళ మీద పడటం వాళ్ళు క్షమించడం - ఏమిటీ మధ్యయుగాల నాటి చెత్త కబుర్లు?

      Delete
  3. all babu own caste fellows joins to bjp is it drama or khel katam

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...