Saturday, 26 January 2019

ఈసారి ఆంధ్రలో ముఖ్యమంత్రి పీఠం చేతులు మారడం ఖాయమా!పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా ఉన్నాయా?

నేను ఇంతవరకు రాజ శేఖర రెడ్డి - జగన్ మోహన్ రెడ్డి ద్వయం గురించి ప్రస్తావించలేదు! కారణం శత్రుత్వమో నిర్లక్ష్యమో కాదు,ఆ అవసరం రాలేదు. ఒకసారి చెప్పాను కదా, ఏ పోష్టునీ ఇతరుల ముచ్చట కోసమో సంచలనంతో హిట్లు పెంచుకోవడానికో రాయనని - విషయం మొదట నాకు కుతూహలం పుట్టించాలి, దానితో పరిశోధన చేస్తాను, నాకు క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఇతరులతో పంచుకుంటాను.అనేకమైన విషయాల గురించి రాస్తున్నప్పటికీ Political Analysis ఎక్కువమందిని ఆకర్షిస్తున్నది.మంచి Political Analyst నిష్పక్షపాతంగానే ఉండాలనేది నాకు తెలుసు, అదే సమయంలో నిష్పక్షపాతంగా ఉండటం అంటే స్వంత అభిప్రాయం చెప్పకుండా గోడమీదపిల్లివాటం కబుర్లు చెప్పడం కాదని మీరు కూడా తెలుసుకోవాలి.

ఎన్నికల తేదీలు ప్రకటించేశారు - ఏప్రిల్ ఫూల్సు ఎవరో మే నెలలో బయటపడుతుంది!ఫిబ్రవరి నెల మొత్తం నేతలకి తిరుమలై మొక్కుల విజిట్లతోనూ ప్రజలకి ప్రచార వరదలై ఇక్కట్లతోనూ గడుస్తుంది, మే నెలలో మేకపోతు గాంభీర్యాలన్నీ వదిలిపోయి గెల్చిన పార్టీ సంబరాలతో గడుస్తుంది, జులై నెల ఓడిపోయిన పార్టీల వలవలై అయిపోతుంది!CBN,JGN అనే ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా లండన్ బ్యాంకర్ల కీలుబొమ్మలే కాబట్టి ఎప్పుడూ ప్రజలు అసలైన ఫూల్సే!అయితే ఎంత ఏడుపులోనన్నా కుసింత వినోదం కావాలి, ఏడుపు నుంచి తెప్పరిల్లి కాలు కదల్చాలి కదా, ఒక పెద్ద అపజయం నుంచి పుట్టే నిరాశని పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న విజయాలతో హుషారు తెచ్చుకోవాలి కదా - ఈ అయిదేళ్ళ కొకసారి జరిగే ఎన్నికల ప్రక్రియతో జత కలిపిన Pafliamentary Democracy కూడా లండను బ్యాంకర్ల చలవే!

దీని ఉద్దేశం కూడా ప్రజలకి తమ అనుమతి తోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనే సంతృప్తినీ తమచేత ఎన్నుకోబడినవారు తమకి ద్రోహం చెయ్యరనే నమ్మకాన్నీ కలిగిస్తూ కాలం వెళ్ళబుచ్చడమే తప్ప ప్రజలు అనుకున్నంత ప్రయోజనం ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల కలగడం లేదు. నిజమైన ప్రజాసేవకులకు ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగానూ ఉపయోగపడకపోవటం అటుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారం చేపట్టినవారు నిజమైన ప్రజాసేవకులకు అడ్డంకులను కలిగించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము కదా!నిండు మనస్సుతో ప్రజలకి నిజాలు చెప్పి మెప్పించి అధికారం చేపట్టటానికి ఇంత ఆర్భాటం, ఇంత వైభవం, ఇంత ఉత్కంఠ, ఇంత వాక్పారుష్య భాషా కాలుష్యం అవసరం లేదు.అయినా సరే ఇవన్నీ తప్పనిసరి కావటాన్నీ ఎన్నికల ఖర్చులు పెరిగిపోతూ ఉండటాన్నీ గమనించితే చాలు అసలు విషయం అర్ధం అవుతుంది.

విషయానికి వస్తే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి శృంగభంగం తప్పదని అందరూ అనుకుంటున్నారు.నేను చాలా కాలం క్రితమే రాహుల్ గాంధీ మీద జోకులు వెయ్యడాన్ని తగ్గించి "ఎదుగుతున్నాడు!ఎదుగుతున్నాడు!రాహుల్ మేధావి అవుతున్నాడు!" అని బిల్డప్ ఇస్తున్నప్పుడే అనుమానించాను.తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంలో తప్పించుకుని తప్పించుకుని ఆఖరికి తల బాదుకుంటూ చేసిన అభినయంతో వెగటు పుట్టించి రాహుల్ గాంధీ కన్నుకొట్టిన దృశ్యానికి లైక్స్ రప్పించడంతో మీడియా ముందస్తు వాతావరణాన్ని సృష్టిస్తున్నదని తేలిపోయింది. సరిగ్గా పెద్ద నోట్ల రద్దు నుంచే మీడియా శత్రుత్వం ఎందుకు ప్రకటించిందో తెలియదు గానీ అప్పుడు సమర్ధించినవాళ్ళు కూడా దాని వల్ల వచ్చిన వ్యతిరేకతని తగ్గిస్తుందని ఆశించి ప్రకటించిన GST నుంచి శత్రువుల కింద మారిపోయారు - ఇది యేమి చిత్రమో!Economic Times వంటి కొన్ని పత్రికలు GSTని పొగుడుతున్నప్పటికీ అవి ఎంతమంది చదువుతున్నారు?

వైకాపా జగనూ జన్సేనా పవనూ ప్రత్యేకహోదా తెచ్చుకోలేని అసమర్ధుడని బాబుని రెచ్చగొట్టి తెదెపా భాజపా మిత్రత్వాన్ని చెడగొట్టేసిన మొదట్లో తెదెపాకి ప్రతికూలత అనుకున్నది కాస్తా ఇప్పుడు అనుకూలత అయ్యింది!దూరమైన కొత్తల్లో తప్పనిసరై పొమ్మనకుండా పొగ పెట్టించుకుని వచ్చినందుకు బిక్కమొగం వేసిన చంద్రబాబు ఇప్పుడు ఒక జాతీయ స్థాయి పార్టీకి మిత్రపక్షం అనే ఇల్లరికపు మజాని అనుభవిస్తూ చూరు పట్టుకుని వేళ్ళాడకుండా తెగదెంపులు చేసుకుని వచ్చేసినందుకు "అంతా మన మంచికే, అధికారం ఇక మనకే - ఇక మనకే!" అని సంబరపడుతూ ఉండి ఉండాలి.

జగన్ దురదృష్టం ఏమిటో గానీ అతను ఎంత పోరాటతత్వంతో విజృంభించి ఎంత నిశితమైన బుద్ధితో ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పదని అనుకుని పన్నిన వ్యూహం సైతం అతనికే నష్టాన్ని కలిగిస్తున్నది కానీ శత్రువుని దెబ్బ తియ్యలేకపోతున్నది - బాబుని భాజపా నుంచి దూరం చేసి తను భాజపా సాయంతో అధికారంలోకి రావాలని వేసిన మాస్టర్ ప్లాన్ మొదటి దశ పూర్తయిందని సంతోషించడానికి ఆస్కారం లేకుండా రెండో దశ ఇట్లా తయారయ్యింది!

అదృష్ట దురదృష్టాలతో సంబంధం లేకుండా మొదటి సన్నివేశం నుంచీ వేస్తున్న తప్పటడుగులు జగన్ యొక్క అసలైన ప్రత్యర్ధులు!తండ్రిని ప్రశంసించుకుంటూ అనుకరిస్తూ తండ్రికి తగ్గ తనయుడనే పేరుకోసం వువ్విళ్ళూరుతున్న జగన్ అసలు తన మీదకి కేసులు ఎందుకు వచ్చాయో అర్ధం చేసుకోవడం లేదు!మొత్తం భారతదేశపు రాజకీయ రంగం మీద ఇప్పటివరకు మనం చూసిన రాజకీయ నాయకులలో అత్యంత సమర్ధుడైన వ్యక్తి ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే!ఒక జాతీయ స్థాయి పార్టీలో స్థానిక నేత ఒక స్థాయిని దాటి పెరిగితే కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించే అవకాశం ఉంది, ఇటీవల భాజపాలోనూ ఇది మనం చూశాం కదా!ఆ తిరుగుబాట్లని అడ్డుకోవడానికే ఆ పార్టీలు రాష్ట్ర స్థాయి నాయకుల్ని స్వంత ప్రాభవం పెంచుకునే దిశలో ప్రోత్సహించరు - అసమ్మతి నేతలకు అధిష్ఠానమే ఆశలు కల్పించి ఎగదోస్రుంది, నిజమైన ప్రజాసేవకులకి ఈ వ్యవస్థ ఉపయోగపడదని నేను అన్నది అందుకే!కానీ రాజశేఖర రెడ్డి మాత్రం మొదటి దశలో నిత్య అసమ్మతివాది పాత్రలో ఒదిగిపోయి అధిష్ఠానానికి ఉపయోగపడి తను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అసమ్మతి లేకుండా జాగ్రత్తలు తీసుకుని అధిష్ఠానం మీద పెత్తనం చేసిన ఒకే ఒక మగాడు!అతని ధాటికే బిక్క చచ్చిపోయి ఉంటే ఇతన్ని కూడా మోస్తారని ఎట్లా అనుకున్నాడు జగన్?అందుకే, మళ్ళీ ఆ పదవి కోసం పోటీ పడనివ్వనంత బలమైన దెబ్బ కొట్టారు - అవి తప్పుడు కేసులని జగన్ వర్గం వాదిస్తూ ఉండవచ్చును గానీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని వాటినుంచి బైట పడకుండా జగన్ ముఖ్యమంత్రి కాలేడు!

జగన్ బుర్రలో తండ్రి తెలివి ఉండి ఉంటే తండ్రికి ఆప్తుడైన ఒక పెద్దమనిషిని తనే ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించి కొంతకాలం పాటు అణకువగా ఉండి తండ్రిలాగే మతకలహాలు సృష్టిస్తూ మిగిలినవాళ్ళని అసమర్ధులని చేసి అదును చూసుకుని పైకి వచ్చేవాడు - ఆనాటినుంచీ ఈనాటివరకూ అన్నీ తప్పటడుగులే తప్ప ఒక్క మెప్పుటడుగు వెయ్యలేని నిత్య అపరిణిత మనస్కుడు ముఖ్యమంత్రి కావడం అసంభవం!

అపర చాణక్యుడనీ The Greatest Manipulator of Indian Politics అనీ అనుకుంటున్న చంద్రబాబు కూడా కొన్నిసార్లు తడబాటు పడుతున్నాడు, కానీ జగన్ వాటిని పసిగట్టలేక పోవటం చేత చంద్రబాబుని ఇబ్బంది పెట్టి పైచేయి సాధించే ఎన్నో సువర్ణావకాశాల్ని వదిలేసుకున్నాడు - నాకయితే అలాంటప్పుడల్లా జగన్ మీద జాలితో ప్రాణం ఉసూరు మనిపించేది!

2014 ఎన్నికల్లో తను సాధించలేమని చెప్పిన ఋణమాఫీ విషయంలో చంద్రబాబు వైఫల్యం కళ్ళ ముందు కనబడుతుంటే ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడో నాకిప్పటికీ అర్ధం కాదు. అమరావతి కోసం రైతుల నుంచి చంద్రబాబు భూమిని తీసుకున్న పద్ధతిని మొదట్లోనే వ్యతిరేకించి కట్టడి చేసి ఉండాల్సింది!ఎందుకంటే, ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని తీసుకోవడానికి ఒక చట్టం ఉన్నప్పుడు దానిని ప్రభుత్వమే పాటించకపోతే ఎట్లా?అప్పుడు వూరుకుని రైతులు భూముల్ని ఇవ్వడం పూర్తయ్యాక "నేను అధికారంలోకి వస్తే మీ భూముల్ని మీకు ఇచ్చేస్తాను!" అనడం ఎంత పిచ్చితనం?వూరికే ఇచ్చారా రైతులు భూముల్ని - చంద్రబాబు చూపించిన ప్రయోజనాలకి ఆశపడి ఇచ్చారు!నువ్వు అధికారంలోకి వచ్చాక భూముల్ని తిరిగి ఇచ్చెయ్యడం అంటే వాళ్ళకి చంద్రబాబు ఇస్తానన్న ప్రయోజనాల్ని వెనక్కి తీసుకోవడం అని అర్ధం కాదా?జనం ఇచ్చేవాడికి వోటు వేస్తారా, లాక్కునే వాడికి వోటు వేస్తారా!

గొంగళిలో కూర్చుని వెంట్రుకలు ఏరుకోవడం దేనికన్నట్టు జనం "లక్ష కోట్ల అవినీతి!","అనువంశిక కుటుంబపాలన!","ప్రజాస్వామ్యబద్ధమైన నియంతృత్వం!" అనే మూస పదాల్ని పట్టించుకోవటం మానేసి చాలా కాలమైంది.భారతదేశంలో గత కొన్ని యేళ్ల నుంచి ప్రజలు, అనగా వోటర్లు మ్యానిఫెస్టోలనీ తాయిలానీ వాగ్దానాలనీ పట్టించుకోవటం లేదు, ముఖ్యమంత్రి స్థానంలో గానీ ప్రధానమంత్రి స్థానంలో గానీ అప్పుడు వున్న సమస్యలని పరిష్కరించి తమకు భద్రతని ప్రసాదించి తమని అభివృద్ధి పధంలోకి నడిపించగలడని నమ్మకం కలిగించే వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వోటు వేస్తున్నారు, ఆ అవకాశం లేనప్పుడే ఇతరమైన అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు!

మొదటిసారి అధికారం కోసం పోటీ పడుతున్నవాడు అంతకు ముందు అధికారంలో ఉన్నవాడి కంటే తను సమర్ధుణ్ణని చెప్పుకోవాల్సి ఉంటుంది, అది చాలా కష్టమైన వ్యవహారం!కేసీయారుకి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఆ అవకాశాన్ని ఇచ్చింది.ఆ వెసులుబాటు జగనుకి లేదే! అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికే న్యాయం చెయ్యలేనివాడు ముఖ్యమంత్రి పదవికి యెట్లా న్యాయం చేస్తాడు?

ఒకసారి అధికారంలోకి వచ్చాక అతని పెర్ఫార్మెన్సుని చూస్తారు - కేసీయార్ ఓడిపోతే బాగుండునని కోరుకున్నానే తప్ప వోడిపోతాడని చెప్ప్పటానికి నేను ధైర్యం చెయ్యనిది ఎందుకు?కేసీయార్ తెలంగాణని ఒక్కసారి శిఖరాగ్రం చేర్చలేదు గానీ తెలంగాణ అభివృద్ధి పధంలోకి నడుస్తున్నదనే గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి ప్రజలు అతన్ని గెలిపించారు, అదే అనుకూలత చంద్రబాబుకీ ఉంది - అందుకే "తెలంగాణలో కేసీయార్ గెలిచినప్పుదు ఆంధ్రలో నేనెందుకు వోడిపోతాను!" అని ధీమాని చూపించాడు.

ఋణమాఫీ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో చంద్రబాబు పనితీరు ప్రజలు "ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి మళ్ళీ అధికారం కట్టబెట్టకూడదు!" అని భావించేటంత దయనీయంగా లేదు.అధికారంలో ఉన్నది సాక్షాత్తూ శ్రీరామచంద్రుదే అయినా సరే ప్రతిపక్షం విమర్శించాల్సిందే,అతను చెయ్యాలనుకుంటున్న మంచిపనులకి అడ్డు తగలటం కూడా సరైనదే - అతన్ని మంచిపనులు చెయ్యనిస్తూ పొగుడుతూ ధర్మరాజులా ఉంటే అయిదేళ్ళ తర్వాత తమకి అధికారం దక్కదు కదా!అయితే, జగన్ నాయకత్వంలోని వైకాపా, మోదీ నాయకత్వంలోని భాజపా, పవన్ నాయకత్వంలోని జన్సేనా దీన్ని సమర్ధవంతంగా చెయ్యలేకపోయాయి. అది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ప్రతిరోజూ టీవీల్లో వార్తల్ని చూసేవాళ్ళకీ వార్తాపత్రికల్ని చదివేవాళ్ళకీ తెలిసిన విషయమే!

ఇన్నేళ్ళ పాటు విడివిడిగా ఫెయిలైనవాళ్ళు ఎన్నికల ముందు గబుక్కున కల్సిపోగానే భూమ్యాకాశాలు దద్దరిల్లిపోవు - రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో భాగస్వాములైన పొరుగురాష్ట్రం వాళ్ళతో కలిసినందువల్ల కీడు తప్ప మేలు రాదు. జగన్ పోరాటపటిమ చాలా గొప్పది. ఇన్ని ఎదురుదెబ్బల్ని తట్టుకుని నిలబడగలగటమే గొప్ప - వివేకానందుడు ప్రశంసించిన Milton విరచిత Paradise Lost కావ్యంలోని ప్రతినాయకుడైన saitan పాత్రకు దీటైన పోరాటపటిమను ప్రదర్శిస్తున్న జగన్ ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు కూడా ముచ్చట గొలుపుతున్నాడు, కానీ ఈసారి కూడా అతనికి ముఖ్యమంత్రిత్వం దక్కే అవకాశం లేదు - NTBL!


(Next Time Better Luck)!

12 comments:

  1. You are unable to digest the ground reality, as you are ana nalyst.

    ReplyDelete
  2. It is not a objective analysis. జగన్ విషయంలో మీరు చెప్పినవి కరెక్టేగానీ, చంద్రబాబుపట్ల మీ అభిమానం దాచాలన్నా దాగలేకపోతోంది సూరినేని హరిబాబుగారూ!

    ReplyDelete
  3. Good Political Analysis
    Next cm chandrababu gare.

    ReplyDelete
  4. KA PAUL మీద మీ అభిప్రాయం ఏమిటి? అతన్ని కాపు-క్రిస్టియన్ vote bank చీల్చటానికే ఉపయోగిస్తున్నారా?

    ReplyDelete
  5. "ఋణమాఫీ విషయంలో *తప్ప మిగిలిన అన్ని* విషయాలలో చంద్రబాబు పనితీరు ప్రజలు "ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి మళ్ళీ అధికారం కట్టబెట్టకూడదు!" అని భావించేటంత దయనీయంగా లేదు"

    2014 ఎన్నికలలో టీడీపీ ప్రధాన హామీలను చూద్దాం:

    1. రైతు రుణమాఫీ: పాక్షిక సఫలం
    2. డ్వాక్రా రుణమాఫీ: విఫలం
    3. ఇంటికో ఉద్యోగం: విఫలం
    4. పింఛన్ల పెంపు: సఫలం
    5. అన్నా కాంటీన్లు: (పాక్షిక?) సఫలం
    6. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్: విఫలం
    7. కాపు రిజర్వేషన్లు: విఫలం
    8. రోజుకు 9 ఘంటలు ఉచిత విద్యుత్: (పాక్షిక?) సఫలం
    9. బీసీ డిక్లరేషన్: విఫలం

    క్లుప్తంగా సంక్షేమ విషయాలలో టీడీపీ రిపోర్టు కార్డు బాలేదు. ఇవేవీ ముఖ్యం కాదనీ "అభివృద్ధి" బ్రహ్మాండంగా జరిగిందనీ అందువల్ల ఓట్లు పడతాయని "కడుపు నిండిన మేధావులు" (మిమ్మల్ని గురించి కాదు) వాదించవచ్చు. అది వారి ఇష్టం, నాకయితే ఈ వాదన నేల విడిచి సాములా అగుపిస్తుంది.

    నిన్నా మొన్నా జరిగిన డ్వాక్రా పసుపు కుంకుమ & జయహో బీసీల వలన కొంతయినా చలనం కనిపిస్తుంది. The main question is "is it too late and/or too little"?

    ReplyDelete
    Replies
    1. "కేంద్రం నాకు సాయం చెయ్యటం లేదు" అనే యేడుపు రాగం పాక్షిక విజయాల్ని కూడా సమర్ధిస్తుంది కదా!పోలవరం ప్రాజెక్టుని రికార్డు వేగంతో ఈ స్థాయికి తీసుకురావటానికి అంత ఖర్చు పెట్టి కూడా వీటిలో పాక్షిక విజయాలు నమోదు చెయ్యటం అంత తేలికైన విషయం కాదు.

      Delete
    2. ప్రభుత్వ కార్యకలాపాలను (స్థూలంగా) "సంక్షేమం" & "అభివృద్ధి" అని విడదీయవచ్చు. నేను పైని ఇచ్చిన చిట్టా మొత్తం సంక్షేమ పార్శ్వానికి చెందింది. పోలవరం, రాజధాని వగైరాలు అభివృద్ధి కిందికి వస్తాయి.

      అభివృద్ధి జపం మామూలుగా ఫరవాలేదు కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వీటి ప్రభావం తక్కువ. అందునా రేపెప్పుడో లాభం చేకూర్చే విషయాలు చెల్లకపోవొచ్చు. బాబు కూడా అందుకే హంద్రీ నీవా (visible benefit) గురించి ఎక్కువ పోలవరం (post dated check) గురించి తక్కువ మాట్లాడుతున్నారు.

      Delete
  6. I can clearly see that you have really done good analysis and assumptions. But, I could'nt find that you have considered the JanaSena affect :) But really nice post!! Thanks Haribabu Sir!!

    ReplyDelete
  7. Republic & India Today surveys both predicted Jagan big win. Now even Times Now survey shows the same result: 23 Loksabha seats to Jagan & only 2 to Babu.

    ReplyDelete
  8. The main unknon factor is pavan kalyan. In 2014 vote share differnse is 2%. However this 2% is not uniform. In Kosta CBN got more majority and in Rayalaseema javan got more majority. But wiht out mentioning pavan factor any analysis is incomplete. 2% vote swing can make landslide for any party. I always see there will be hype for jagan before elections. Be it 2014 or even recent nandhyala election.But actual result is always not favourable to Jagan. Also pavan has tie up with BSP predominently jagan vote bank, and reserved seats its impact is still unknown.If it takes away 4000 votes from jagan it will tilt favours in 5 constituencies. Pavan was going agressive against CBN before election. But once campain started he hit out jagan and passive in case of CBN. Overall this election is very difficult to predict.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...