Thursday 21 June 2018

ప్రేమ కోసమై బజ్జీలు తినెనే పాపం హరిబాబు - ఎంత పిచ్చి ప్రేమయో!

     నేను లయోలా కాలేజిలో చేరేనాటికి కాలం పసిడిరెక్కలు దాల్చి యెగిరిన మలి బాల్యం దాటిపోయి తొలి యవ్వనంలోకి అడుగు పెట్టాను - నామిని సినబ్బ యాసలో చెప్పాలంటే గెలల్లోకి నీళ్ళు వచ్చేసినాయి!

     మొదటి సంవత్సరం జాయినయ్యేటప్పుడు హాస్టల్ కోసం టిక్ పెట్టటం తెలియక డేస్కాలర్ లైఫ్ గడిపాను.గుణదల పంచాయితీ ఆఫీసు దగ్గిర రూము తీసుకున్నాను.నేను ఉన్న ఇంటిలో ముసలాళ్ళు ఇద్దరూ ఒక మనవరాల్ని పెంచుతున్నారు.పిల్లలు అందరూ ఫారిన్లో సెటిలయ్యారు.నేనూ రాజేంద్ర ప్రసాద్  వాళ్ళ ఇంటి లోపలి గదిలో ఉండేవాళ్ళం - ఇతనూ నేనూ క్లాస్‌మేట్స్‌మి కూడా.మా వెనక వైపు గదిలో కూడా కొందరు ఉండేవాళ్ళు - వాళ్ళు వేరే కాలేజి, ఎప్పుడో ఎదురుపడినప్పుడు నవ్వటం తప్ప పరిచయాలు కూడా లేవు.అవి గాక ఆవరణ లోపలే ఒక వరసలో నాలుగైదు రూములు ఉన్నాయి.స్నానాలకీ వాటికీ మేము కూడా అక్కడికే వెళ్ళాలి.గుణదలలో ఆ చుట్టుపక్కల దాదాపు సిటీలోని అన్ని కాలేజిల కుర్రాళ్ళూ ఉండేవాళ్ళు.పొద్దున్నే అక్కణ్ణించి లయోలా కాలేజికి నడుచుకుంటూ వెళ్ళటం కోలాహలంగా ఉండేది.మాకయితే చాలాసార్లు తిరగాల్సొచ్చేది - ట్యూషను మాస్టారి ఇల్లు ఈ దారికి మధ్యలో ఉండేది మరి!ట్యూషనుకి వెళ్ళటం,రూముకి రావటం,కాలేజికి వెళ్ళటం,లంచికి రావటం,లంచి తర్వాత వెళ్ళటం,మళ్ళీ రూముకి రావటం,స్నానాలయ్యాక మెస్సుకి వెళ్ళటం,మళ్ళీ రూముకి రావటం - చచ్చేవాళ్ళం!

     ఆ ఫస్టియరు మాకు రోజూ కనబడే అమ్మాయిలు ముగ్గురే ముగ్గురు మా ఇయస్సెన్ మూర్తి గారి ట్యూషనుకి వచ్చే స్టెల్లా కాలేజి అమ్మాయిలు!అయితే,మా మూర్తిగారు తన వశిష్ఠ విశ్వామిత్ర శౌనకాది మునులకి కూడా సాధ్యం కాని బ్రహ్మాండమైన  మేధస్సుతో వాళ్ళూ మేమూ అస్సలు కలవడానికి వీల్లేని బ్రహ్మభేద్యమైన ఏర్పాటు చేశారు - తల్చుకుంటే ఇప్పటికీ ఆ తెలివితేటలకి ఆశ్చర్యం వేస్తుంది!మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు వచ్చి కూర్చునే లాగ మాకూ వాళ్ళకీ టైం స్టాంపులు ఏర్పాటు చేశారు - లేటుగా వెళ్ళినా క్షమించేవాడు గానీ ముందు వెళ్తే మాత్రం అగ్గిరాముడైపోయి వెనక్కి తరిమేసేవాడు!చెప్పాల్సిన అసలు సోది అయిపోయాక "మీరు వెళ్ళండమ్మా!" అని వాళ్ళని పంపించేసి మాకు కొసరు సుత్తి వేసేవాడు - ఆ ముగ్గురూ తర్వాత మేము బయటకొచ్చాక కూడా మాకు కనపడనంత దూరం వెళ్ళగలిగేటంత వరకు!చూసీ చూసీ నేనే ఆయన మీద గొప్ప జోకు వేశాను "సబ్జెక్టు యెటూ ఆయన చదువుకునే రోజుల్నించీ బుర్రలోనే ఉంటుంది గాబట్టి ప్రిపేరవనక్కరలేదు గానీ ప్రతి రోజూ మీరు వెళ్ళండమ్మా తర్వాత మనకి వెయ్యాల్సిన సుత్తి గురించే ఎక్కువ ప్రిపేరవుతున్నాడేమో!మనమిచ్చే డబ్బులో మూడొంతులు ఆ క్రియేటివిటీకే ఇవ్వొచ్చు!" అని - మావాళ్ళంతా నవ్వలేక చచ్చారు:-)

     ఒకసారి ట్యూషను వదిలాక అందరం నడుచుకుంటూ వస్తుంటే ప్రసాదు హఠాత్తుగా నావైపు తిరిగి "ఇవ్వాళ నీ మూలాన నాకు పెద్ద ఇన్సల్టు జరిగిపోయింది మాస్టారి చేతుల్లో!" అన్నాడు.మొదట నాకు అర్ధం కాలేదు,తర్వాత అతని నవ్వుమొహం చూసి రిలీఫ్ ఫీలయ్యి నేనూ నవ్వుమొహం పెట్టాను.ఎటూ జోకెయ్యాలని మొదలుపెట్టాడు గదా,తనే చెప్తాడ్లే అని గుచ్చి గుచ్చి అడగలేదు.అతను చెప్పిన విషయం ఏమిటంటే మమ్మల్ని ప్రశ్నలు అడగటంలో సారు ఒక పద్ధతి ఫాలో అవుతున్నాడు.వరసగా ఇద్దరు ముగ్గురు జవాబు చెప్పలేక తెల్లమొహాలు వేస్తుంటే విసుగు పుట్టి నన్ను అడుగుతున్నాడు.అదే మొదట నన్ను అడిగి నేను చెప్పలేకపోతే మాత్రం ఇంకెవ్వర్నీ అడగటం లేదు - "హరిబాబే చెప్పలేకపోయాడు, వీళ్ళేం చెబుతారులే?" అనో యేమో తనే జవాబు చెప్పేస్తున్నాడు!అప్పటివరకు నేనూ పట్టించుకోలేదు గానీ తను చెప్పాక నాకూ కొన్ని సీన్లు గుర్తొచ్చి నిజమే అనిపించింది.ఇంతకీ అతనికి జరిగిన అవమానం యేంటంటే ఆ రోజు నేను తెలియదన్నది తనని అడిగితే చెబుదామని యమా వుషారుగా యెదురు చూస్తుంటే సారు అలవాటు చొప్పున తనే జవాబు చెప్పేశాడు!

     సారు నాకిచ్చిన ఈ స్పెషల్ ట్రీట్మెంటుని వాళ్ళూ అబ్సర్వ్ చేసినట్టున్నారు, అమ్మాయిలు ఆఖర్లో ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.డిగ్రీ మూడేళ్ళూ అయిపోయాక కాలేజినుంచి కూడా బైటకి వచ్చేసే ముందు మూర్తిగారు అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు.వెంకటేష్ సంతకాల పుస్తకం ఇవ్వడానికి సిగ్గు పడుతుంటే నేను తీసుకుని ఇచ్చాను.వాళ్లు అది నాదే అనుకుని Dear haribabu అని రాశారు.వేణు ఎవరెవరికి యేమేమి రాశారో చూడాలనే దురద కొద్దీ అందరివీ లాక్కుని చూసి "అందరికీ మామూలుగా రాసి హరిబాబుకి మాత్రం డియర్ హరిబాబు అని రాశారు!ఏంటి సంగతి?" అని సగం ఈర్ష్యా సగం మెప్పూ కలిపేసి అడుగుతుంటే నేను నవ్వి వూరుకున్నాను, చిన్నప్పట్నంచీ ఆడసిరి ఎక్కువే నాకు!

     అలా మొదటి సంవత్సరం డే స్కాలర్ లైఫ్ గడిపాక ముందుగానే జాగ్రత్తపడి వెళ్ళటంతో రెండవ్ సంవత్సరంలో హాస్టలర్ని అయిపోయాను.మా హాస్టలు అసలు పేరు రాఘవేంద్ర అనుకుంటాను,కానీ కొత్తది కావటంతో న్యూ హాస్టల్ అనేవాళ్ళుమెయిన్ కాలేజి బిల్డింగుకి ఎడంవైపున మూడోది,పక్కనే ఉన్న రెండో దానిపేరు గోగినేని హాస్టల్ అనేది గుర్తుంది గానీ మొదటి దానిపేరు గుర్తు లేదు - అసలు ఈమాత్రం గుర్తుండటమే గొప్ప!కట్టిన తీరూ వార్డెన్లు వాటిని నడిపిన తీరూ సెల్యులర్ జైలుని గుర్తు చేస్తూ ఉండేవి.గుణదల వైపునుంచి వస్తుంటే చర్చికి దగ్గిర ఒక హాస్టల్ ఉండేది.అదొక్కటీ మామూలు పద్ధతిలో స్కేలుబద్దలానే కట్టారు - ఇటువైపున ఉన్న ఈ మూడింటినే గుండ్రంగా ఎందుకు కట్టారో!

     వార్డెను జాన్ ఫాదరు సెంటర్లో ఉన్న ఫౌంటీన్ దగ్గిర నిలబడి ఆరు బేట్రీల టార్చిలైటు వెలిగించి ఎటు తిప్పితే అటు మూడో అంతస్థులోకి కూడా  ఫోకస్ సర్కిల్ కనపడేది - వాటినలా కట్టింది కూడా అందుకే కాబోలు!ఎంట్రీ దగ్గిర ఒకవైపున వార్డెన్ కూర్చునే రూమూ మరొకవైపున  ఆఫీస్ రూమూ ఉంటాయి.లీవులు కావల్సినవాళ్ళు పొద్దున్న 7:00 గంటల లోపే ఇవ్వాలి.వాటిని అటెండెన్స్ నోట్ చేసే కాలెజి స్టాఫ్ దగ్గిరకి చేర్చేవాళ్ళు.మళ్ళీ రాత్రికి అటెండెన్సు వార్డెనుకి పంపించేవాళ్ళు,లీవ్ తీసుకోకుండా ఆబ్సెంట్ మార్క్ పడితే వార్డెను పిలిచి రీజన్ అడిగే వ్యవహారం కూడా నడిచేది.మా రవివర్మ గాడు పూల లుంగీని మోకాళ్ళ దగ్గిర ఒక చేత్తో ఎత్తి పట్టుకుని మరో చేత్తో లీవ్ లెటర్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళినా ఒక్కసారీ లీవ్ తెచ్చుకోవటంలో ఫెయిల్ కాలేదు!మొహం వేళ్ళాడేసుకుని వెళ్ళినా నిజమైన నీరసాలకి కూడా నేను చాలాసార్లు లీవ్ తెచ్చుకోవడంలో ఫెయిలయ్యాను - ఏం ట్రిక్కు ప్లే చేస్తున్నావురా అంటే చెప్పనే లేదు వెధవ!పైగా వాదేమన్నా దూరపు స్నేహితుడు కూడ అకాదు.హాస్టలో చేరిన వారం రోహుల్లోనే నేనూ అజయ్,శ్రీనుగాడూ వీడూ కలిసి మా పేర్ల మొదటి అక్షరాల్ని కలిపి RASH అని పెట్టుకుని ఎక్కద వెతికినా మా నలుగుర్లో ఏ ఒక్కణ్ణీ విడిగా చూడటం కష్టం అన్నంతగా కలిసి తిరిగేవాళ్ళం!

     ఎడారిలో ఒయాసిస్సులా శంకరాభరణం సినిమాలో ఆండాళ్ళు జోకులా లంచి టైము మాత్రం చాలా సరదాగా ఉండేది.ఆఫీసు రూములో ఉన్న మ్యూజిక్ సిస్టం ఒక్క దీనికోసమే - మంచి మంచి రికార్డులు ఉండేవి.అప్పుడప్పుడు మా సీనియర్  ఒకతను అమితాబ్ పాడిన పాటలు పాదేవాడు - హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉండేది,కాకపోతే మీసం తియ్యలేదు!నేనూ అప్పట్లో కొంతకాలం అమితాబ్ హెయిర్ స్టయిల్ మెయింటెయిన్ చేశాను గానీ శ్రీనుగాడు వేసిన "హరిగాడు ముందునుంచికన్న వెనకనుంచి చూస్తేనే అమితాబ్ అనిపిస్తున్నాడు!" అనే డ్యామెజింగ్ కామెంటుకి కాలగూడని చోట సురసుర కాలిపోయి తెల్లారెసరికల్లా పక్కపాపిడికి తిరిగిపోయాను!ఈ సంగీతఝరిలో ఒక చిన్న బిట్టు మాత్రం తేడాగా ఉండి ఇప్పటికీ నవు తెప్పిస్తుంది - ఒక ఇంగ్లీషు ఆల్బం, పేరు siron అనుకుంటాను, సాహిత్యం ఏమీ లేకుండా అమ్మాయి మూలుగులూ కేకలూ ఏడుపూ కలిసిన DRUM BEAT అది!ఏసుపాదం అని అక్కద వాచ్‌మెన్/గేట్‌కీపర్/ప్యూన్ పనిచేసే అతను దానికి "దెబ్బ మ్యూజిక్" అని పేరు పెట్టాడు.అతను ఆ పేరు పెట్టకముందునుంచీ వింటున్నప్పుడల్లా మాకూ అలాగే అనిపించి తెగ నవ్వొస్తూ ఉండేది.

     రాత్రి భోజనం తర్వాత వెంఠనే పదకెయ్యడానికి వీల్లేదు - స్టడీ అవర్ ఉంటుంది.ఈ టైములో కాపలాకి ఏకంగా ఒక లెక్చరర్నే బుక్ చేశారు - పేరు గుర్తు లేదు గానీ శుభోదయం సినిమాలో చంద్రమోహనికి ట్రైనింగు ఇచ్చే సీనియర్ సన్యాసి వేషం వేసినాయన. అన్ని బ్లాకులకీ ఒకరేనో లేదా బ్లాకుకి ఒకర్ని తీసుకున్నారో తెలియదు గానీ మాకు మాత్రం ఈయనే కనపడేవారు.ఒకసారి వెంకటేష్ నా రూముకొచ్చి డవుట్లు అడిగితే చెబుతున్నాను.రెండు నిమిషాలు గడిచాయో లేదో ఆయన గుమ్మం దగిర ప్రత్యక్షమయ్యాడు.అప్పటికే డౌట్లు తీరడంతో వాడూ వెనక్కి తిరిగాడు,మేమూ అదే చెప్పాము,ఓకే అనేసి వెళిపోయారు.

     ఈ వెంకటేషు బాగానే చదువుతాడు గానీ టెన్షన్ చాలా ఎక్కువ - ఎగ్జాంస్ టైములో అయితే నా రూముకి వచ్చేసి"హరిబాబూ!తల మెడనుంచి వూడొచ్చేసేలా ఉంది!" అని తలని నా చేతుల్లో పెట్టేవాడు, మెడనుంచి తీసి కాదులెండి!నేను కూడా ఆ తలని చేతుల్తో కొబ్బరికాయలా పట్టుకుని "నీ తలకొచ్చిన ముప్ప్పేమీ లేదు!కంగారు పడకు,నువ్వు బాగానే చదువుతున్నావు.ఎగ్జాం బాగానే రాస్తావు." అని హిప్నటిక్ సెషన్ పెట్టేవాణ్ణి.దాంతో తనకి టెన్షన్ తగ్గి "హమ్మయ్య!ఇప్పుడు కొంచెం తలనెప్పి తగ్గింది,ధాంక్స్ హరిబాబూ!" అని హుషారు తెచ్చుకుని తన రూముకి పోయేవాడు.

     అలా అమ్మాయిలు లేకపోవటం తప్పించి అన్ని రకాల సరదాలూ ఉండేవి.సాయంకాలం కాలేజి వదలగానే ట్రిమ్ముగా తయారై బెంజి కంపెనీ రోడ్డులో అలా అలా స్టెల్లా కాలేజి వరకూ వెళ్ళి వెనక్కి వచ్చేవాళ్ళం,ఒకోసారి బెంజి కంపెనీ రింగురోడ్డు వరకూ వెళ్ళేవాళ్ళం - అప్పుడు కనపడిన అమ్మాయిలే మాకు గిట్టుబాటు!ఆదివారం మాకు సినిమా వారం.మ్యాట్నీకి తప్ప ఇంకే సినిమాకీ వెళ్ళే వీలు లేదు.అందుకని ముందుగా అమితాబ్ సినిమాలు ఏవన్నా ఉంటే వెళ్ళేవాళ్ళం.ఒకసారి చాలా రోజుల పాటు అమితాబ్ సినిమాలు ఏవీ దొరక్క ది గ్రేట్ గాంబ్లర్ కూడా చూశాం - అది అట్టర్ ఫ్లాపయిందనీ పరమ బోరనీ తెలిసి కూడా!

     విధి బలీయం!అనుల్లంఘనీయం!మా మిత్ర చతుష్తయం విడిపోయింది!మొదట అజయ్ సరదాగా బీసెంటు రోడ్డుకు వెళ్ళి పాత ప్రేయసి చంకలో పిల్లాణ్ణి ఎత్తుకుని కనబడేసరికి బిక్కమొహం వేసుకుని తిరిగొచ్చాడు.వాలకం కనిపెట్టి అడిగితే ఏడుపుకి పిసరంత తక్కువ ధోరణిలో మొత్తం ప్రేమచరిత్ర చెప్పాడు.మనోడు ఇంటరులోనే భీబత్సమైన ప్రేమకధ సృష్టించేశాడు!రంగు చూస్తే బాబూ మోహన్ దిగదుడుపే!కానీ మాంచి చలాకీ గుర్రం - కళ్ళు చాలా బ్రైట్!దానికి తోడు ట్యూషను మాస్టారు ఏదన్నా పనుంటే వీణ్ణి క్లాసు తీసుకోమని చెప్పి వెళ్ళేటంత తెలివైనవాడు.ఈ హీరోయిజానికి తోడు ఆ అమ్మాయి వైట్ డ్రస్ వేసినప్పుడల్లా "టినోపాల్!" అని ఏడిపించే వాడు.మెల్లగా ఆ అమ్మాయి కూడా "బొగ్గుమసి!" అని పగ తీర్చుకునే వరసలో ఇద్దరికీ పూలబాణాలు గుచ్చుకున్నాయి.మామూలు తిరుగుళ్ళ ఎంజాయిమెంటు అయ్యాక ఒకరోజు బస్సెక్కేశారు - సినిమాకి అనుకునేరు, లేచిపోవడానికి!ట్రాజెడీ ఏంటంటే, వాళ్ళ అన్నయ్య కూడా అదే బస్సులో ఎక్కి వీళ్ళ వాలకం కనిపెట్టి చెల్లెల్ని ఇంటికి తీసుకుపోయాడు!తాడూ బొంగరం లేని ఏజిలో అంతమాత్రమే పెద్ద సాహసం అనుకుంటే వీడు తెల్లారాక సరాసరి వాళ్ళింటికే వెళ్ళాట్ట - అయితే వాళ్ళ నాన్న ఇంటిబయటీరుగు మీదే కూర్చోబెట్టి గొంతు పెంచి అరిచి తిట్టలేదు గానీ "నీ వయసెంత?నీ ఉద్యోగం ఏంటి?ఏం పెట్టి బతికించుదామని బయల్దేరావు?మీవాళ్లకి చెప్పావా?ఎక్కడికి తీసుకెళ్దామనుకున్నావు?" లాంటి వీడు జవాబు చెప్పలేని ప్రశ్నలతో భయపెట్టి వెనక్కి తిరగ్గొట్టేశాడు.ఆ అమ్మాయి ఇప్పుడు చంకలో పిల్లాణ్ణి యెత్తుకుని కనపడేసరికి తట్టుకోలేకపోయాడు,  పాపం!

     అక్కడికీ నేను చెప్పాల్సినదంతా చెప్పాను గానీ వాడు అప్పటికే కృతనిశ్చయుడై ఉండటంతో నా వాదనలనన్నిట్నీ కొట్టిపారేశాడు,ఇదంతా ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ తీసుకుని నాకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడు - రవిగాడూ శీనుగాడూ నన్ను గుచ్చి గుచ్చి అడగటం, మాట తప్పలేని బలహీఅంత వల్ల నాకు తెలియదనటం, వాళ్లు నమ్మక నన్ను అనుమానంగా చూట్టం అన్నీ ఒక నాలుగు రోజుల్లో అయిపోయాయి. రవిగాడి విషయం మరీ విచిత్రం!SFI,AISF రాజకీయాల అల్లరికి విసిగిపోయి అల్లరి బ్యాచ్చిని తన్న్ తగిలేసే లిస్టులో ఆ పార్టీలలో లేకపోయినా రవిగాడి పేరు కూడా ఎక్కింది!"బుద్ధి చెప్పుతారా?టీసీ తీసుకుంటారా?" అని ఫాదర్లు అడిగిన ప్రశ్నకి పోలీసు డిపార్ట్‌మెంటులో పై స్థాయివాళ్ళకి సహజమైన ఎగోతో టీసీతో సహా రవిగాణ్ణి వాళ్ళ వూరుకి తీసుకుపోయారు!బృందంలో కొందరు పోతే మిగిలినవాళ్ళు ఇంకా దగ్గిరవుతారన్న మామూలు విషయం,కానీ శీనుగాడు నాకు దూరమై కొత్త స్నేహితుల్ని సంపాయించేసుకున్నాడు!నేనూ చేసేది లేక కొత్త పరిచయాలు చేసుకున్నాను.అందరూ కలిసి పెద్ద బృందమే తయారైంది.

    ఇప్పటికీ RASH అనే మాట ఎక్కడ కనపడ్డా మనసు బాధగా మూలుగుతుంది గానీ అప్పట్లో అంత బాధ అనిపించలేదు - కొత్త పరిచయాలు,కొత్త సినిమాలు,కొత్త జోకులు కలవటంతో మళ్ళీ హుషారెక్కిపోయాను!వార్డెన్ పర్మిషన్ తీసుకుని ఒక రాత్రిపూట కొండపల్లికి పాదయాత్ర కూడా చేశాం - మా సీనియర్ అమితాబ్ పాటలు పాడటం,"కామ నామము కామ నామము కమ్మనైనది కామనామము" దగ్గిర్నుంచి మొదలుపెట్టి ఎవడికి తోచిన లొల్లాయి పాటలు వాడు పాడటం లాంటి హుషారుతో కొండపల్లి వరకు నడిచినా కాళ్ళు నెప్పులనిపించలేదు!వెళ్ళేటప్పటికే తెల్లారిపోవడం వల్లనో ఏమో వచ్చేటప్పుడు మాత్రం వాహనాలు పట్టుకుని వచ్చినట్టు గుర్తు.

     ఈ మధ్యలోనే హాస్టలు నుంచి కాలేజి బిల్డింగుకి వెళ్ళేటప్పుడూ రాత్రి భోజనం అయ్యాక స్టడీ అవరుకి  టైము ఉంటే సిమెంటు బెంచీల మీద కూర్చున్నప్పుడూ మాధవికీ నాకూ మధ్యన జరిగిన చిన్నప్పటి రొమాన్సు కధలు కధలుగా చెప్పి బులపాటం తీర్చుకున్నాను.ఒకసారి ఆవేశం వొచ్చి "పెద్దయ్యాక తనకి నేనంటే ఇష్టం లేకపోతే వొదిలేస్తాను గానీ లేదంటే భూమ్యాకాశాలు తలకిందులయినా తననే పెళ్ళీ చేసుకుని తీరతాను!" అని శపధం కూడా చేసేశాను.అయితే, కొద్ది రోజుల్లోనే మాధవి కన్న అందమైన ఆడపిల్ల ఉండటానికి వీల్లేదనే నా మూఢనమ్మకాన్ని బద్దలు చేస్తూ ఒక మెరుపుతీగ కనపడనే కనపడింది! నిర్మలా కాన్వెంటులో స్టెల్లా కాలేజి అమ్మాయిలు ఫ్యాన్సీ ఫీట్ పెట్టారని తెలియడంతో ఎడారిలో ఒయాసిస్సు తగిలినంత హుషారు వచ్చింది జనాలకి!

          ఆదివారం అనుకుంటాను,టిఫిన్ అవగానే ట్రిమ్ముగా తయారై అందరూ నిర్మలా కాన్వెంటు దారి పట్తారు బ్యాచ్చిలు బ్యాచ్చిలుగా!మా బ్యాచ్చిలో అయిదుగురం ఉన్నాం.ఎలాగూ అంకె కలిసింది గదా అని పంచ పాండవుల పేర్లు కూడా మాకు తగిలించేసుకున్నాం.గగారిన్ అమ్మాయిల విషయంలో కొంచెం సంసారపక్షం గనక ధర్మరాజు పొజిషన్ ఇచ్చేశాం.బాలసుబ్రమణ్యం పొYYఇగా లావుగా ఉంటాడు గనక భీముడి పొజిషన్ ఇచ్చేశాం, మాట తీరు కూడా దురుసుగానే ఉంటుంది లెండి! నేను సరే పాండవమధ్యముడు అర్జునుణ్ణి అని ఖాయం చేసేశారు!శ్రీనుగాడు పొడుగ్గా సన్నగా గొడుగూచలా ఉన్నా ముఖం బాగానే ఉంటుంది గనక నకులుడి ప్లేసు దక్కింది వాడికి. సహదేవుడి క్యారెక్టరు ఎవరికిచ్చామో తెలియదు,బహుశా నా పక్క రూమతను అయ్యుంటాడు. దారిలోనే లయోలా కాలేజి-స్టెల్లా కాలేజి-నిర్మలా కాన్వెంటు త్రయం మీద ఒక జోకేశాను - "ఫాదర్ల ముందుచూపుని మెచ్చుకోవాల్రా!లయోలా కాలేజిలో చదివిన అబ్బాయీ స్టెల్లా కాలేజిలో చదివిన అమ్మాయీ పెళ్ళి చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని నిర్మలా కాన్వెంటులో చదివించుకోవచ్చు!ఫ్యామిలీలూ జనరేషన్లూ వీళ్ళ గ్రిప్పులోనుంచి బయటికి పోకుండా భలే ఏర్పాటు చేసుకున్నారు" అని.ఇప్పుడు మీకు నవ్వొచ్చిందో లేదో తెలియదు గానీ అప్పుడు మాత్రం  బాంబులాగే పేలింది - మా ముందు వెళ్తున్న బ్యాచ్చి వెనక్కి తిరిగి చూసి నవ్వడమే సాక్ష్యం!

     లోపలికి వెళ్ళీ వెళ్ళగానే అప్రకటిత కర్ఫ్యూ నిబంధనల మాదిరి విషయం తెలిసిపోయింది - బజ్జీల స్టాలు దగ్గిర ఒక అద్బుత సౌందర్యరాశి ఉందని!అలాగని అందరూ ఒకేసారి అక్కడ గుమిగూడితే పెద్దలు విషయం గ్రహించి కలగజేసుకుని అందర్నీ తరిమికొడతారనే లోకజ్ఞానమూ ఫోకస్ తెచ్చుకోవడం కోసం  చెయ్యగూడని వెధవపనులు చేస్తే పోటీదారుల నుంచే వ్యతిరేకత రావొచ్చుననే పొలిటికల్ పరిజ్ఞానమూ ఉంది కాబట్టి ఎవరి జాగర్తలో వాళ్లు ఉండి ఒక నాలుగైదు స్టాల్సుకి వెళ్ళడం,బోరు కొట్టినప్పుడు వెంఠనే ఇక్కడికి రావడం,ఓ నాలుగు బజ్జీలు తినడం,ఆ కాసేపూ తనని చూసుకోవడం,మళ్ళీ ఇంకో నాలుగు స్టాళ్ళకి వెళ్ళడం అనే వ్యూహాత్మక ప్రణాళికాబద్ధమైన పద్ధతిని ఎంచుకున్నారు.

     మొదట్లో నేను అంత హుషారు చూపించలేదు.దానికి కారణాలు నేను అప్పటికే మాధవికి అంకితమైపోవడమూ గుమిగూడిన జనం దడి కట్టేసి తను సరిగ్గా కనపడకపోవడమూ అమ్మాయిలకి లైనెయ్యడం కూడా మన గొప్ప తెలిసేలా స్టైలుగా ఉండాలి గానీ సొల్లు కార్చుకున్నట్టు ఉండకూడదనే నిర్లక్ష్యమూ లాంటి మామూలువే!మొదటి రెండు విజిట్లలోనూ నేను బజ్జీలు ముట్టుకోలేదు.ఇప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకోవడం అలవాటైంది గానీ అప్పట్లో కొంచెం చిరాగ్గానూ కొంచెం కేర్‌లెస్ గానూ ఉన్నప్పుడు వివేకానందుడి పోజులో చేతులు కట్టుకు నిలబడేవాణ్ణి. వాళ్ళు బజ్జీలు తింటుంటే నేను చేతులు కట్టుకు నిలబడ్డం తేడాగా ఉంటుందనిపించి మూడోసారి నేనూ తినడానికి నిశ్చయించుకున్నాను.అప్పటి నా బజ్జీల భయానికి చాలా సాహసోపేతమైన నిర్ణయమే అది - బజ్జీలు కాదు కారప్పూస కూడా ఇష్టపడని నేను బజ్జీలు తినడమా!అయితే, వాళ్ళు వాటిని కోసి ఆ చీలికలో ఉల్లిపాయలు వేసి నిమ్మరసం పిండడంతో నేను భయపడినంత ప్రమాదం ఏమీ జరగలేదు.ఒకసారి అలవాటు పడ్డాక అవేవీ లేకుండా కూడా తినగలుగుతున్నాను ఇప్పుడు.ఈ పునరపి విహారపు సరదాల్లో ఒకసారి బజ్జీలు తినడం అయిపోయాక నా అలవాటు చొప్పున చేతులు కట్టుకుని నిలబడినప్పుడు తనే నాకు అతి దగ్గిరగా వొచ్చి నా ముఖంలో ముఖం పెట్టి నవ్వే అద్భుతమైన సన్నివేశాన్ని మహత్తరమైన సంవిధానంతో నడిపించుకోగలిగాను!

     అక్కడున్న బోర్డు మీద vegetables అనే మాటని ఎవడో చిలిపి కుర్రాడు మొదటి నాలుగు అక్షరాల్ని చెరిపి tables చేశాడు.దాంతో ఇక్కడ tables మాత్రమే ఉన్నాయి అనే అర్ధం వస్తున్నది.మామూలుగా అయితే బోర్డు మా వైపుకి ఉండి వాళ్ళు వెనకవైపున ఉన్నారు గాబట్టి చూసే అవకాశం లేదు.ఎవరో దాని గురించి చెప్పి జోకులేస్తుంటే సరి చెయ్యడానికి వచ్చింది.అప్పుడు జనం తక్కువగానే ఉన్నారు.వాళ్ళు వంటకోసం ఏర్పాటు చేసుకున్న బల్లలకి మధ్యన ఉన్న ఖాళీ నుంచి బైటికొచ్చి చాక్‌పీస్ పట్టుకుని ఇటువైపుకి రావడంలోని ఉద్దేశం తెలుస్తూనే ఉంది.ఆ నడక చాలా హుందాగా ఉంది.బెరుకుతనం,కరుకుతనం,ముదురుతనం,చురుకుతనం,బిడియం,అణకువ లాంటివి చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం వల్ల అలవాటయ్యేవి గాబట్టి నడకలో తెలుస్తాయి.తను ఆ కొన్ని అడుగులు వేస్తూ ఉండగానే నాకు లైటు  వెలిగింది - "That word itself is very strange!If you remove "v" from it,still it is a meaningful word - "eg(g->implied)etables!";if you remove "e", still it will be "getables!";if you remove "g",still it is a meaningful word - "e(a)tables!";if you remove "e",still it will become "tables!";if you remove "t" from it,still it gives you "ables!";if you remove "a" from it,it will "bles(s)!" you;if you further take "b" from it,It will be "les(s)!";if you take "l",It will be "(y)es" and if you take "e" out,still  it will be a long "(his)s!"" అనే పంచ్ డైలాగుని నట్లు కొట్టకుండా తడబడకుండా సాగదియ్యకుండా గుక్క తిప్పుకోకుండా తనని ఇంప్రెస్ చెయ్యగలనో లేదో అని టెన్షన్ పడకుండా ప్రధమ పరిచయంలో ఇనకులతిలకుడైన శ్రీరాముడితో వాగ్విదాంవరుడైన మారుతి మాట్లాడినంత నిగ్రహంతో వొదిలాను!దాని ఫలితమే తను ముఖంలోకి కాదు కళ్లలోకే చూసి నవ్వడం. నేనూ నవ్వాను, దరహాసానికి దరహాసమే సమాధానపు సుమహారం కదా!

     అప్పుడు అంతకు మించి ఏమీ జరగలేదు.ఎందుకంటే, ఇటు చూస్తూ అటు రాయలేదు గాబట్టి రాయాల్సిన మాట రాసేసి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోయింది.ఆ డ్రస్సులోనూ ఆ ముఖంలోనూ తను బాబీ సినిమాలో "మై శాయర్ తో నహీ" పాట వచ్చేటప్పటి డింపుల్ కపాడియా కనపడింది నాకు.ఆ పేరునే ఖాయం చేసేశాను,మావాళ్ళకి వార్ డిక్లరేషన్ ఇచ్చేశాను - అప్పటివరకు నేను వాళ్లకోసం బజ్జీల స్టాలుకి వెళ్తే ఇప్పటినుంచి వాళ్లు నాకోసం వస్తున్నారు.మొదట్లోనే ఈ సీను పడితే బాగుందేది, తొందర్లోనే లంచ్‌టైమ్ తోసుకొచ్చేసింది.మైండు ఎంత హుషారుగా ఉన్నా తిండి లేకుండా ఉండలేం గదా.అదీగాక అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టినట్టు బజ్జీల్ని వాయలు వాయలుగా లాగించలేదు నేను, నాకూ ఆకలిగానే ఉంది.తీరా లంచి చేసి వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది.ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయి వాళ్ళు కూడా అన్నీ క్లోజు చేసి ఖాళీగా కూర్చుని కనిపించారు.ఇపుడు పోయి బజ్జీలు అడగటం వెధవ్వేషాల కిందకే వస్తుంది!నీరసమొచ్చి కొంచం దూరంలో ఉన్న బల్లల మీద కూర్చుని లాంగ్‌షాట్ జూమ్‌లెన్స్ వాడుతున్నాను.మాకు ఎదురు బల్ల మీద అమితాబ్ పాటలు పాడే  మా సీనియర్ కనపడ్డాడు.మాకు అర్ధమైపోయి అడగలేదు గానీ తను అడిగేశాడు "మీలో ఆ అమ్మాయికి లైనేస్తున్నది ఎవరు?" అని.మావాళ్ళు నన్ను చూపించారు. "ఐతే నేను ఆశ వదిలేసుకోవడం బెటర్!" అని కొంచెం ఆగి "నేను పెద్దవాణ్ణి!అన్న భార్య వదినవుతుందనుకుని వదిలెయ్యరాదూ!" అన్నాడు.ఇటువైపునుంచి "తమ్ముడి భార్య కూతురనుకుని మీరే వదిలెయ్యరాదూ!" అనే రిటార్టు వెళ్ళడంతో ఇక మాట్లాడలేదు. కానీ మనం అటుకేసి చూసినప్పుడల్లా పక్కన ఇంకోడు మన్ని చూసి కుళ్ళుకుంటున్నాడనే ఫీలింగుతో వాతావరణం ఇబ్బందిగా మారింది.విసుగు పుట్టి వచ్చేశాం.

     ఒక కుర్రాడు ఒక చోటికి వెళ్లాడు,ఒక అమ్మాయి కనపడింది,ఒక జోకేశాడు,అమ్మాయి ఇంప్రెస్ అయ్యింది,వివరాలు తెలుసుకోకుండా వచ్చేశాడు,పేరు కూడా తెలియదు గాబట్టి మళ్ళీ కలవడం అసంభవం అనేటట్టు జరిగిన ఈ కధ ఇక్కడితో ఆగిపోవాల్సిందే!కానీ ఫ్రాన్సిస్ కిషోర్ ద్వారా ఆ అమ్మాయి పేరు "నమ్రతా బాబ్జీ!" అని తెలియడంతో ముందుకు ఎళ్ళడానికి హుషారు పుట్టింది.   

     ఫ్రాన్సిస్ కిషోరు చెల్లెలు స్టెల్లా కాలేజి హాస్టల్లో ఉంది చదువుకుంటున్నది.వీడు అప్పుడప్పుడూ వెళ్ళి చూడటమూ మాకు తెలుసు.ఎక్కువ వివరాలు తెలియలేదు.హాస్టల్లోనే ఉంటున్నదనీ తెలుగమ్మాయి కాదనీ చెప్పినట్టు గుర్తు.అప్పట్లో ఈ వివరాల మీద దృష్టి పెట్టలేదు,తెలుగమ్మాయి కాకపోతేనేం అంతర్జాతీయ భాష ఇంగ్లీషు ఉందిగా - ఎలా మరోసారి చూడాలన్నదే సమస్య!అసలంటూ మరోసారి ఎదురుపడినప్పుదు తన రెస్పాన్సు బాగుంటే ముందుకెళ్ళేటప్పుడు ఎన్ని వివరాలు తెలుసుంటే అంత మంచిది కానీ అసలు తనకి ఇంట్రెస్టు లేదని తెలిస్తే ఆ వివరాలన్నీ ఎందుకు పనికొస్తాయి?అప్పటికి నేను టీనేజిలోనే ఉన్నాను గానీ ఒక చిన్న జోకుకే మురిసి ముక్కలై అమ్మాయిలు వచ్చి ఒళ్ళో వాలతారనే ఎడాలిసెంట్ ఫాంటసీలు నాకు లేవు. ఈ మితిమీరిన ప్రాక్టికాలిటీయే ఈ కధని అర్ధాంతరంగా ముగించేసిందని ఇప్పుడు అనిపిస్తుంది!

     ఇంతకీ తనని చూడటం యెట్లా?మనల్ని హాస్టలుకి పోనివ్వరు!పొద్దున్నే స్టెల్లా కాలేజి మెయిన్ గేటు దగ్గిర బీటు వేద్దామా అంటే డే స్కాలర్ అమ్మాయిల్ని లోపలికి పంపిస్తారు గానీ హాస్టల్ అమ్మాయిల్ని బయటికి రానివ్వరు గదా!ఆదివారం చర్చికి క్రిస్టియన్ అమ్మాయిలు తప్పకుండా వస్తారు, తను క్రిస్టియన్ కాకపోయినా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో రావచ్చు కదా!అప్పటికే నేను అరివీరభయంకరనాస్తికుణ్ణి అయినప్పటికీ రెండు ఆదివారాలు చర్చికి వెళ్ళాను.చర్చి దగ్గిరే, ఆ చర్చి పక్కనుంచి వెళ్తేనే నిర్మలాకాన్వెంటు వస్తుంది.

     మొదటిసారి వెళ్ళినప్పుడు లోపల బెంచీలు ఫుల్ అయ్యేసరికి డోర్ దగ్గిరే ఆగిపోయాం.నాతో పాటు వచ్చినవాళ్ళందరూ వెయ్యటంతో నేనూ మోకాటితండా వేశాను.కానీ కొంచెం సేపయ్యాక కొంతమంది నిలుచునే ఉండటం చూసి లేచి నుంచున్నాను.రెండో ఆదివారం కూడా డోర్ దగ్గిరే ఆగిపోయాం, అసలు మోకాటితండా వెయ్యలేదు.కుర్రాళ్ళు కామిడీలు చెయ్యటానికి చర్చినీ వాద్ల్లేదు.అమ్మాయిలు బాయ్టికి రావడం మొదలవగానే దోసిట్లో ఒక కర్చీఫుని పరిచేసి "అమ్మా!ఒక బాల్‌పెన్ను ఉంటే దానం చెయ్యండమ్మా!" అని అరవటమూ "వూర్కే సరదాగానే,బైటికి వెళ్ళగానే ఇచ్చేస్తాం!" అని మెల్లగా గొణుగుతూనూ హడావిడి చేసేవాళ్ళు - ఇందులో యేం క్రియేటివిటీ ఉందని అడిగితే ఫ్రాన్సిస్ క్రియేటివిటీయా పాడా దురద అన్నాడుఈ కాలక్షేపాల మధ్యన ఎంత నిశితమైన చూపుతో వెతికినా తన జాడ మాత్రం లేదు.నాస్తికత్వం లాంటి గంభీరమైన నమ్మకాన్ని కూడా వదులుకుని రెండు వారాలు చర్చికి వెళ్ళినా ఫలితం కనబడకపోవటంతో ఇక మూడో వారం నుంచీ వెళ్ళడం మానుకున్నాను.ఒకసారి హెర్బేరియం షీట్ల మీద అంటించుకోవడానికి మొక్కల కోసం వెతుకుతూ దాదాపు చర్చి వరకూ వెళ్ళాను ఇంకో ఇద్దరితో కలిసి.అదీ ఆదివారమే,టైము కూడా దాదాపు ప్రార్ధనలు అయ్యాక చర్చినుంచి బైటికి వచ్చే,టైమే.మావాళ్ళలో ఒకడు వెళ్దామా అన్నాడు గానీ పనిగట్టుకుని రెండు వారాలు తిరిగినా కనిపించనిది ఇప్పుడు హఠాత్తుగా వెళ్తే కనిపిస్తుందని గ్యారెంటీ ఏమిటనిపించింది - వెళ్ళలేదు.


     నా నీరసపు ప్రాక్టికాలిటీని బట్టి ఇది కూడా శుభం బోర్డు వెయ్యాల్సిన సన్నివేశమే,కానీ  ఒకానొక శుభోదయాన చిత్రమైన సన్నివేశంలో మా శీనుగాడికి కనపడింది!ఇదివరకు జరిగిన హైకింగ్ లాంటి సైక్లింగ్ ప్రోగ్రాము పెట్టుకున్నారు - నా ఖర్మ కొద్దీ ఆ రాత్రి నాకు జ్వరం తగిలింది!జ్వరం అంటే మరీ ఘోరమైనది కాదు,మొదట హుషారు కొద్దీ బైల్దేరినా వాళ్లు మళ్ళీ మళ్ళీ వొద్దనడంతో వెనక్కి తగ్గాను.అయితే, మరుసటి ఉదయానికల్లా శీనుగాడు రావడం రావడమే "ఒరేయి హరిగా, నీ బాబీ కనబడిందిరా!" అని అరుచుకుంటూ వస్తుంటే కవులు వర్ణించిన గుండె గొంతుకలోకి వచ్చి కొట్లాడటం అనే వర్ణన యెట్లా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది!వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు రోడ్దు మీద ఎదురు వచ్చిందంట!అసలైన ట్రాజెడీ యేంటంటే, వీడు ఆ యాంగ్జైటీలో ఒళ్ళు మర్చిపోయి  "ఒరేయి,హరిగాడి బాబీరా!" అని అరిచేశాడంట, ఆ అమ్మాయి గిరుక్కున వెనక్కి తిరిగి వీణ్ణి చూసి నవ్విందంట!

     ఇంక నా పరిస్థితి చూడాలి!మొదటి నిశ్చయం "హరిగాడి బాబీ అనే మాటలకి అర్ధం తెలియకుండా అలా నవ్వదు కదా - అంటే తెలుగమ్మాయే!" అని.రెండో నిశ్చయం "తెలుగమ్మాయి అయినా కాకపోయినా హరి,బాబీ అనే రెండు మాటల్ని బట్టి అలా రియాక్టయిందంటే ఆ రెండు మాటలకీ మధ్య ఉన్న సంబంధం తెలిసే ఉండాలి! నా పేరు హరిబాబు అనీ నేను తనకి బాబీ అని పేరు పెట్టుకున్నాననీ తెలియకుండా ఆ నవ్వు సాధ్యం కాదు!" అనేది.

     నా బుద్ధి చురుగ్గా ఉండిఉంటే మొదటిసారి ఫ్రాన్సిస్ కిషోరు ద్వారా తన పేరు తెలిసినప్పుడు రావాల్సిన అనుమానాలన్నీ ఇప్పుడు దాడి చేశాయి."అసలు ఫ్రాన్సిస్ కిషోరుకి వాళ్ళ్ అచెల్లెలు తన పేరు ఎలా చెప్పింది?ఆ రోజు వీడు మాతో రాలేదు.వీడు ఆ ఫ్యాన్సీ ఫీట్ గురించీ బజ్జీల స్టాలు గురించీ అక్కడున్న డింపుల్ కపాడియా లాంటి అందమైన అమ్మాయి గురించీ ప్రస్తావించకుండా తనంతట తను చెప్పే అవకాశం తక్కువ!అలాంటి ఆరాలు తీస్తే ఏ చెల్లెలయినా నీకెందుకురా అంటుందే తప్ప అడిగిన వెంటనే చెప్ప్పెయ్యదు. వీడు నాకోసం కాదులే హరిబాబని మావాడొకడు లైనేద్దామనుకుంటున్నాడని చెప్పినా ఇంకో ఆమ్మాయి వివరాలు ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోకుండా చెప్పేస్తుందా/అసలు కిషోరు వాళ్ళ చెల్లెలుకి తనతో ముందే పరిచయం ఉంటే తెలుగమ్మాయా కాదా అనే కన్‌ఫ్యూజన్ అసలు ఉండేది కాదు. గదా!అసలు నేను అప్పుడే ఫ్రాన్సిస్ కిషోరుని తన పేరు నీకెట్లా తెలిసిందని ఆరా తీస్తే చర్చికి వెళ్ళకుండానే .డైరెక్ట్ కాంటాక్ట్ దొరికేది.ఇప్పటికి కధ చాలా దూరం ముందుకెళ్ళి ఉండేది - ఎంత టైమ్ వేస్ట్ చేశాను?" - మయసభలో దుర్యోధనుడి మోనోలాగులా చాలానే ఆలోచించి ఉంటాను, ఇది ఇప్పటికి గుర్తున్న అబ్రిడ్జిడ్ వెర్షన్!ఔరా, నిస్సీ, కటకటా లాంటి మాటలు వాడితే నిజంగా అలాగే ఉండేది.

     ఒక అందమైన కుర్రాడు తెలివైన పంచ్ విసిరితే నవ్విన మొదటి నవ్వులో లేని ప్రత్యేకత నా పేరూ తన పేరూ కలిసిన ప్రస్తావనకి శ్రీనుగాడి మీదకి విసిరిన రెండో నవ్వులో ఉందని తెలిసింది గానీ నాలోనే ఉన్న ప్రాక్టికాలిటీలో తలపండిన భీష్మాచార్యుడూ శంకాలమారి శకుని మామా నిద్ర లేచారు - "వారనా వీరనా అమ్మాయిల మనోభావములు మనము తెలుసుకోగలిగినవి కావు.ఆ దారిన వెళ్ళవలెనన్న ఫ్రాన్సిస్ కిషోరు మీద మితిమీరి ఆధారపడవలెను!వాడు శ్రీనుగాడి వల్ల పరిచయమైన దూరపు స్నేహితుడు, ఇతరుల ప్రేమకు మధ్యవర్తిత్వము నెరపవలెనన్న గొప్ప సాహసము కావలెను.అది వాడికి ఉన్నదా?రేపటి రోజున పెద్దలకు నచ్చక కలహములూ అపహరణములూ వంటివాటికి తెగబడునప్పుడు నిలబడగల దమ్ము వాడికి లేనట్టు తోచుచున్నది.మొదటి నవ్వుకు పిదప చేసిన యత్నములు వ్యర్ధములైనట్లు మరల నిప్పుడు చేయునవియునూ వ్యర్ధములు కావని గ్యారెంటీ యేమున్నది?ఇంత కాలము గడిచిన పిదప ఇప్పుడు కధ మొదలెట్టవలెనన్న కిషోరు మీద పెత్తనము చేయుటయో కిషోరును బుజ్జగించుటయో చేయవలెను,అది నా స్వాబిమానమునకు సరిపడదే!ఇప్పటికినీ రాజమార్గము కాక డొంకదారియే కనబడుచున్నది గనక వెనుకకు తగ్గుటయే ఉత్తమము" అనుకుని ఆగిపోయాను- ఈ ప్రాక్టికాలిటీ కన్న మాధవి మీద నాకున్న సిన్సియారిటీయే నేను వెనక్కి తగ్గడానికి అసలు కారణం అని చెప్పక తప్పదు.


కొసమెరుపు:ఈ మధ్యనే ఒకరొజు మాధవి "నీకు నేను తప్ప ఇంకే అమ్మాయీ నచ్చలేదా?చదువుకునే రోజుల్లో ఎవరికీ లైనెయ్యలేదా!" అని గుచ్చిగుచ్చి అడిగి కధంతా చెప్పాక "తన అదృష్టం బాగుండి నిన్ను తప్పించుకు పోయింది!దురదృష్టం వల్ల నేను ఇరుక్కుపోయాను!" అని నవ్వింది - ఔరా, ఎంత క్రూరత్వం!

10 comments:

  1. హాహా!! ఈ వాక్యం ప్రతి మహిళకి మాతౄవాక్యం అనుకుంటా.. ఏది ఏమైనా పొరిగింటిపుల్లకూర రుచి అన్నది ఎలా మగవాల్లకి వర్తిస్తుందో, మీరు చెప్పిన ఈ క్రింది వాక్యం మహిళామణులందరికి వర్తిస్తుందెమో సార్ :)

    "తన అదృష్టం బాగుండి నిన్ను తప్పించుకు పోయింది!దురదృష్టం వల్ల నేను ఇరుక్కుపోయాను!" అని నవ్వింది..

    ReplyDelete
  2. ఔరా ఏమి ప్రాక్టికాలిటీ హరి బాబు గారు.. మీకు మల్లే ఎక్కువగా ఆలోచించే అనుకుంటా నేను కూడా ఎప్పుడూ ముందుకు వెళ్ళలేకపోయాను. పోనీలెడి... అదీ ఒకందుకు మంచిదే... హాయిగా బ్లాగులు రాసుకుంటూ, చదువుకుంటూ ఆనందంగా ఉన్నాం అనుకుంటా.. లేకపోతే ఏమయ్యేదో దేవుడికే ఎరుక...

    ReplyDelete

  3. ఇదేదో బోల్డన్ని కబుర్లకు పోటీ గా పోతోందే :)

    రెండిట్నీ కలిపి జిలేబీయం చేయాల్సిందే యిక :)


    అదురహో

    మనుషుల్లో పడ్డేరు ! అదే పెద్ద విషయం


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిజమే,
      ఎందుకో తెలియదు గానీ కొద్ది రోజుల్నుంచి రొమాంటిక్ మూడ్ ఎగదన్నుకొస్తందిలే!
      ఆ బాబీ అంత కసక్కుమనే పిల్ల దొరికితే మళ్ళీ లైనెయ్యాలన్నత హుషారుగుంది!
      ఎందుకో?

      Delete
  4. Pls watch this video

    Introduction to Dharampal Works

    https://www.youtube.com/watch?v=B27IBNotwpE&t=1400s

    Claude Alvares shares the crucial work of Dharmpal in Indian History. He shares his personal story of encountering Dharmpal's work while doing his PhD.d in Netherlands and explains how this chance encounter turned his view about Indian sciences. He speaks about lone journey that Dhrampal had taken, without any institutional support, to extricate research papers, journals, and books from archives of Britain. It took him almost twenty-five years to bring out true picture of 18th and 19th century India as depicted by British themselves.

    ReplyDelete
  5. గురూజీ సూపర్

    ReplyDelete
  6. సోగ్గాడే చిన్ని నాయన!
    ఒక్క పిట్టనైన కొట్టలేదు
    సోగ్గాడు! సోగ్గాడు!!





    కవిత
    నాటి బ్యూటీ
    బెంజి సెంటర్, బెజవాడ

    ReplyDelete
    Replies
    1. బోల్తా కొట్టింది బుల్‌బుల్!
      పిట్టో? విషపట్టో?
      నా పని ఫట్టో!







      ఏ పిట్టలో ఏ గుట్టుందో
      ఎవరికి తెలుసు?
      -----తప్పించ్గుకున్న 'మినగాడు:-)

      Delete
    2. @Anonymous23 June 2018 at 17:44
      కవిత
      నాటి బ్యూటీ
      బెంజి సెంటర్, బెజవాడ

      hari.S.babu
      నమ్మాలా!
      సాక్ష్యమేంటి?
      నేనసలె అనుమాన పిశాచాన్ను.
      నాతో అగలగొట్టించుకున్న
      ఆనామకుల వెక్కిరింతయేమో అని అనుమానంగా ఉంది.
      నాటి నేటి హీరో!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...