Saturday, 19 April 2014

భాజపా లాంటి తెలివి తక్కువ పార్టీకి అప్రహతిహతమయిన అధికారం అవసరమా?

ఒకానొకప్పుడు అంటే రాజుల కాలం నాడు ఉరిశిక్ష పడిన ఒక ఖైదీని ఆఖరి కోరిక యేమిటని అడిగితే మా అమ్మని చూడాలని ఉందని అడిగాట్ట. పాపం సెంటిమెంటుతో కదిలిపోయి వాళ్ళమ్మని తీస్కొచ్చి యెదురుగా నిలబెడితే లాగి ఒక్కటిచ్చుకున్నాట్ట చెంప ఛెళ్ళుమనేట్టు.యెందుకని అడిగితే "తోటకూర నాడే నువ్వు నన్నిలా కొట్టి ఉంటే ఈ రోజు నాకీ దిక్కుమాలిన చావు తప్పేది గదే?!" అని అఘోరించాట్ట.


ప్రస్తుతం తెదేపా-భాజపా పొత్తు పరిస్థితి కూడా అలాగే ఉంది.కొద్ది రోజుల క్రితమే వేరొకరి బ్లాగులో నేను కామెంటు వేశాను, యేమని?


ఇంతవరకూ ఇదివరకటి సమైక్య రాష్ట్రంలో అసలు చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యమే లేని భాజపా -  విభజన లో కేవలం ప్రతిపక్ష పార్టీగా గందరగోళం చెయ్యడం తప్ప ఫలితాన్ని యే విధంగానూ శాసించకుండా, కనీసం ఆంధ్ర ప్రాంతానికి జేపీ ప్లాన్ ని చంకనేసుకుని గోల చెయ్యటం తప్ప నికరమయిన లాభాన్ని కూడా చూపించలేకపోయినా -  తన బలాన్ని తను అతిగా వూహించుకునీ తప్పనిసరిగా అధికారంలోకి రావలసిన నాచబా వీక్నేసుని అడ్దం పెట్టుకునీ అన్ని స్థానాలకి పోటీ చేసి యేం ఉధ్ధరిస్తాననుకుంటుందో? ఆనాడు తెరాసా వాపుని చూసి  బలుపనుకుని నలభయ్ ఇచ్చి మట్టానికి మునిగి తీరుబడిగా అక్కడ కూడా మేమే పోటీ చేసుంటే అధికారంలోకి వచ్చేవాళ్ళమేమో అని భోరుమన్నప్పటి పరిస్థితే మళ్ళె యెదురయితే ఇక తెలుగుదేశం గతి శ్రీమతే రామానుజాయ నమహ!

సరిగ్గా ఇవ్వాళ అదే జరుగుతున్నది, మరోసారి తెలుగుదేశానికి మిత్రపక్షమే సుంతీ చెయ్యబోతున్నది.యెంత ఘోరం!

అసలు భాజపా యే రకమయిన తెలివితో విభజన వల్ల  ఈ రెండు ప్రాంతాల్లో తనకి మైలేజీ విరగబడుతుందని అనుకుంటున్నది?విభజన ప్రకటన బహిరంగంగా జరిగినప్పటి నుంచీ భాజపా యెన్ని తెలివి తక్కువ పనులు చేసిందో తెలుసా?కాంగ్రెసు ఇవ్వదు యెన్నికల తర్వాత మేము వచ్చాక ఇస్తాం అనే మాట పదే పదే పబ్లీకున కూసి కాంగ్రెసుకి ఆ ఇచ్చే ఛాన్సు భాజపా కి యెందుకు దక్కనివ్వటం యెన్నికలకు ముందు మనమే ఇచ్చేస్తే పోలా అనే అలోచన రేపెట్టి కాంగ్రెసు తన యూపీయే-3 అనే మాస్టర్ ప్లాన్ లో తెలంగాణా ఇవ్వటం కూడా ఒక అంశంగా చేర్చుకునేలా చేసింది.

ఇచ్చేది మేమే అని చెప్పుకున్నప్పుడు వీలున్నంత వరకూ యెన్నికల లోపు తెలంగాణా ఇవ్వాలనే కాంగ్రెసు యూపీయే-3 మార్కు ప్లాన్లకి మెడ మీద తలకాయ ఉన్న యే రాజకీయ నాయకుడయినా అది యెలాగయినా జరగనివ్వకుండా ఉందటానికి దారులు వెతుకుతాడు, వ్యూహాలు పన్నుతాడు, పరిస్థితిని తనకు అనుకూలంగా తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు.అదీ గత యెన్నికల్లో కాంగ్రెసు అవినీతి గురించి అంత గత్తర చేసినా యూపీయే-2 యేర్పడకుండా అడ్డుకోలేకపోయిందిగా! ఇప్పుడు ముందుగానే ప్రధాన మంత్రి అబ్యర్ధిని ప్రకటించి పులిజూదానికి తెగబడినప్పుడు యెంత తెలివిగా ఉండాలి?ఉందామరి?

అప్పుడు తొలిసారి బహిరంగంగా పాత్రికేయుల ముందు ప్రకటించిన పిగ్గీ రాజా నుంచీ ఇప్పటి రాం రాం రమేష్ వరకూ కచరా విలీనం ఒప్పందాన్నిమేమడక్కుండా తనంత తనే ప్రతిపాదించాడనీ దాని వల్ల వచ్చే ప్రయోజనం కోసమే తెలంగాణా ఇచ్చామనే అర్ధంలో వాగుతున్నప్పుడు అందులో వీళ్ళకి తమకి పనికి వచ్చే యే ఆయుధమూ కనబడలేదా?ఇలాంటి కొనుగోలు అమ్మకం ఒప్పందాల్ని మేము సమర్ధించం అనే వాదన యెంతా హుందాగా ఉండేది. పరిస్థితిని తమ కనుకూలంగా మార్చుకోవడానికి విలీనం అనే వికృతమయిన వ్యవహారాన్ని తెలివిగా ఉపయోగించుకోలేని పార్టీ యొక్క రాజకీయ పరిణితి యెంత?

తెరాసా కాంగ్రెసులో విలీనం అవడానికి ప్రతిఫలంగా కాంగ్రెసు తెలంగాణాని ఇవ్వడ మంటే రేపటి రోజున తెలంగాణాలో తాను ఆశించే ప్రయోజనానికి తన ప్రధాన వైరి వేరే పార్టీతో ముందే సీట్లని పంచేసుకోవడం కాదా? మరో పార్టీ సాయం లేకుండా మూడింట రెండువంతుల మెజార్టీ కోసం తను ఆడే ప్రమాదకరమయిన పులిజూదంలో ప్రతి సీటూ విలువైనదే అయిన పరిస్థితిలో ఉండి కూడా విలీనం ఒప్పందం ద్వారా తన ప్రధాన వైరి మరో పార్టీతో కలిసి తన నుంచి కొన్ని సీట్లని లాగేసుకుంటుంటే మెదడులో సరుకున్న యే రాజకీయ పార్టీ అయినా తన శత్రువుకు లాభం కలిగించే తెలివి తక్కువ పనులు చేస్తుందా?భాజపా చేసింది.

వచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుని కూడా తెరాసా తో బేరాలాడుకుని యూపీయే-3 ప్లానుతో ఉన్న కాంగ్రెసు తెగబడి అంత బహిరంగంగా తమని వెధవాయల్ని చేస్తూ తమని కూడా కాంగ్రెసు వ్యూహానికి అనుకూలంగా నడిపించుకుంటుంటే తెలివి తక్కువగా వైరి పక్షానికి సాయం చేసి ఇప్పుడు మిత్రపక్షమయిన తేలుగు దేశంతో డబుల్ గేం ఆడటానికి తయారయింది.యెందుకో తెలుసా? ఒక వేళ భాజపాకి యేక పార్టీగా అధికారం సుస్థిరం కావడానికి కావలసిన మాజిక్ నంబర్ రాకపోతే మోడీ కున్న రా.స్వ.సే ముద్రని బూచిగా చూపించి ప్రధాని పదవికి బాబు పోటీ పడతాడేమోనని. కాదా?

యెక్కడో చెన్నైలో కూర్చుని పత్రికల ద్వారా మాత్రమే పరిస్థితిని తెలుసుకున్న నాకు తెలిసిన మాత్రం కూడా చంద్రబాబుకి తన గురించి తనకి తెలియడం లేదు -  భాజపాతో పొత్తు గురించి ఆలోచించి గందరగోళంలో పడకుండా తన బలం తను చూపిస్తే రేపటి రోజున మోడీతో ప్రధాని పదవికే పోటీ పదే అవకాశం ఉందని. విభజన ప్రకటనకి చాలా కాలం ముందు నుంచే పాదయాత్రల పేరుతో రాష్ట్రమంతా చెడతిరిగి యేం చూశాడు?చూసి యేం తెలుసుకున్నాడు?ప్రజల్లో తనకి పూర్తి సపోర్టు లేదనుకున్నాడా?ఆంధ్రాలో భాజపాతో పొత్తు తనకి అవసరమా?విభజనలో రాయలాంధ్రకి అన్యాయం జరగడం వల్ల ప్రజల్లో భాజపాకి వ్యతిరేకతే యెక్కువగా ఉంది కదా!అది కూడా తెలియలేదా?

తెలంగాణాలో మాత్రం యేమంత గొప్పగా ఉంది పరిస్థితి? ప్రతిపక్షంలో కూర్చుని కాంగ్రెసు ఇస్తుంటే తెరాసా పుచ్చుకుంటుంటే చూస్తూ కూర్చున్నందుకే తెలంగాణాలో భాజపా పట్ల హవా విరగబడుతుందా?ఒక దశలో రాయలాంధ్రకి అన్యాయం జరుగుతుందని,బిల్లులో లోపాలు ఉన్నాయని అద్వానీ గారు కూడా ఇప్పుడు బిల్లుని వ్యతిరేకిద్దాం, మనం వచ్చాక సరయిన పధ్ధతిలో ఇద్దాం అనే రకంగా ఆలోచించలేదా?ఆ వాదన మీద కూడా గట్టిగా నిలబడకుండా కాంగ్రెసు యెక్కడ మేము ఇద్దామనుకుంటే భాజపా అడ్డం కొట్టేసింది అని ప్రచారం చేసుకుంటుందో అనే భయంతో మళ్ళీ పిల్లిమొగ్గ వెయ్యటం అబధ్ధమా?అసలు కాంగ్రెసు వ్యూహమే భాజపాని గందరగోళంలోకి నెట్టెయ్యడం అయినప్పుడు ఆ గందరగోళానికి గురై పిల్లిమొగ్గలేసిన పార్టీ తెలంగాణాలో మాత్రం యేం వూడబొడుస్తుందనుకున్నాడు చంద్రబాబు?ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెసు తెరాసా రెండూ భాజపా బిల్లుని అడ్డుకోవాలని చూసింది అంటుంటే గట్టిగా కాదని చెప్పలేని దిక్కుమాలిన స్థితిలోకి తనంతట తనే నడిచి వెళ్ళిన పార్టీతో అంటకాగినందు వల్ల కొత్తగా తనకి వొచ్చే లాభ మేంటి?

తెలుగు దేశం ఈ రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగిన సొంత బలమున్న పార్టీ. యే పార్టీ కయినా క్షేత్ర స్థాయిలో జండాలు మోసి బానర్లు పట్టుకు తిరిగే మామూలు కార్యకర్తలు యే అబ్యర్ధికి మనస్పూర్తిగా పని చేస్తే ఆ అబ్యర్ధికే విజయావకాశాలు యెక్కువగా ఉంటాయి. అది మర్చిపోయి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే ఈ పొత్తుల వల్ల తెదేపాకి నష్టమే తప్ప లాభం లేదు - రెండు ప్రాంతాల్లోనూ!

అయిందేదో అయిపోయింది, పొత్తుల్ని వీలున్నంత తొందరగా తన కార్యకర్తల మనోభావాలకి అనుకూలంగా ముగించుకుని ముందు జరగాల్సిన దానికి సిధ్ధం కావడం చంద్రబాబు తక్షణ కర్తవ్యం. లేదంటే 2009 నాటి భంగపాటు మళ్ళీ యెదురవుతుంది!భాజపా వాళ్లకి కేటాయించిన సీట్లు గెలుస్తారో వోడుతారో వాళ్ళ మానానికి వాళ్ల నొదిలేసి తను పోటీ చేస్తున్న సీట్లలో గట్టిగా పని చేసి మంచి ఫలితాన్ని రాబట్టటంమీద దృష్టిని కేంద్రీకరించాలి చంద్రబాబు. నిన్నటి దాకా కాంగ్రెసులో అఘోరించి విభజనకి సంబంధించి చెయ్యగూడని దిక్కుమాలిన రాజకీయ మంతా చేసి తెల్లారేసరికి తెదేపా లోకి దూకిన వాళ్ళకీ సీట్లిచ్చాడు.అలాంటి చోట్ల మూతి కాలకుండా చూసుకోవాలి అతను. అక్కడ ప్రధాని పదవికి మోడీతో పోటీ పడటం అనే తమాషా వూహని వొదిలేసినా ఈ రెండు రాష్ట్రాల పునర్నిర్మాణంలోఅతని పాత్ర చాలా అవసరం..

దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రంగా ఉండి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రదేశ్ తన ప్రాభవాన్ని కోల్పోయి రెండు చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కొందరి లాగా విడిపోవటం గురించి నేనెప్పుడూ అతిగా ఆందోళన పడలేదు కానీ విడిపోయిన విధం చాలా భయానకంగా ఉంది.జహ్వేరీ లాల్ నెహ్రూ లాగా నేను డ్రీమర్ ని కాదు. నేను వేసే అంచనా లన్నీ వాస్తవాల ప్రాతిపదికగానే ఉంటాయి.ఒక ప్రతిపాదనని మిగతా వారి ముందు పెట్టాలనుకున్నప్పుడు నా రాగద్వేషాలకి తావు లేకుండా చూసుకుంటాను.విభజన బిల్లు పైన యెవరికయినా ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉంటే రాష్ట్ర విద్యుచ్చక్తి కార్యాలయం వారి లేఖని చూడొచ్చు.ప్రభుత్వం లోని ఒక ఉపాంగమయిన ఒక సంస్థ కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి మేధావుల మని డప్పు కొట్టుకుంటున్న సన్నాసులు ఆదరాబాదరాగా వండి వార్చి మన మొహాన కొట్టిన బిల్లుని తిట్టి పోసింది. అక్కడున్నది కాంగ్రెసు పార్టీ కాబట్టి సిగ్గు పడక పోవచ్చు గానీ యెంత దరిద్రమయిన విభజనో కదా ఇది?

ఈ యాభయ్ అరవయ్ యేళ్ళుగా యెంతో కొంత కాదు, చెప్ప్పుకోదగిన స్థాయిలోనే అభివృధ్ధి చెందింది రాష్ట్రం.అయితే ఇప్పుడు యెన్నికలు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్నా యెన్నికల అనంతరం యేర్పడే రెండు రాష్ట్రాలూ మళ్ళీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సి వస్తున్నది.యెందుకంటే ఇరు పక్షాలూ ఒక చోట కూర్చుని న్యాయంగా తమకి యేది కావాలో అన్నీ ముందే తేల్చుకుని పంచుకుని విడి పోవటం లేదు.గీత గియ్యడమే తప్ప వనరుల్ని వేటినీ సామరస్యంగా పంచే బాధ్యత తీసుకోలేదు ఆ బాధ్యత లేని పెద్దమనిషి.పైగా భాజపా విడగొట్టినప్పుడు సంవత్సరాలు పట్టిన దాన్ని మేము నెలల్లోనే పూర్తి చేస్తున్నాం అనే సుత్తి ఒకటి! అసలు విభజన కోసం తను యేమి చేస్తున్నది నెలలయినా పట్టటానికి. అంతా కాలానికీ, దైవానికీ, ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఖర్మానికీ వొదిలేసి పంచాల్సిన వాటి పట్ల యే లెక్కా లేనప్పుడు నెలలయినా యెందుకు, రోజుల్లోనే పూర్తి చెయ్యొచ్చు!

పసుపు దేశాధిపతీ గులాబీ దళపతీ జాతీయ పార్టీలతో అంటకాగడం గురించిన భ్రమల్ని వొదులుకోవాలి. అంటకాగడం వల్ల వాళ్ళకి ఉపగ్రహంగా మారడమే తప్ప మనకి లాభమేమీ ఉండదు.కేంద్రంలో అధికారం వెలగబెడుతూ రాష్ట్రాలతో వ్యవహరించడంలో కాంగ్రెసూ భాజపా రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి - నాకేంటి లాభం అని!అలాంటప్పుడు కేంద్రంలో మోడీ ఉన్నా రాహుల్ ఉన్నా మనకేంటి?యేదయినా పోట్లాడి సాధించుకోవడమే అయినప్పుడు మనకి మొహమాటం దేనికి?

ఈ రెండు ప్రాంతాల్లోని మేధావులకీ, ప్రజాస్వామ్య వాదులకీ నేనొకటి సూటిగా చెప్పదల్చుకున్నా - సావధానంగా వినండి.చదువుకున్న వాళ్లం, మిగతా వాళ్ళ అభిప్రాయాల్ని కూడా కొంత మేరకు ప్రభావితం చెయ్యగలిగిన వాళ్ళం మనం విభజన వల్ల కొందరికి అధికార పీఠాన్నిచ్చి వాళ్ళ హవా హవాయీలకి తాళం వెయ్యకుండా సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు వోటు వెయ్యబోయే ముందు ఇతర్లకి చెప్పే ముందు దీన్ని మనసులో ఉంచుకోండి.

యెన్నికల అనంతరం ఈ రెండు ప్రాంతాల్లోనూ యేర్పడాల్సిన రాజకీయ చిత్రపటం ఇలా ఉండాలని నేననుకుంటున్నాను:1.తెలంగాణాలో కేసీఆర్ అధ్వర్యంలో తెరాసా అధికారంలోకి రావాలి. తెలంగాణాలో తెలుగు దేశం ప్రధాన ప్రతి పక్షంగానే ఉండాలి.2.రాయలాంధ్రలో తెలుగు దేశం అధికారంలోకి రావాలి. యెటూ తనతో నువ్వా నేనా అన్నట్టు జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష మవుతుంది సహజంగా.(ఇప్పటి దాకా రహస్యంగా ఉన్న లాలూచీ బహిరంగమై పోయి కేసులన్నీ మాఫీ అయిపోగా తను నా మాతృసంస్థకీ జై అనేస్తే కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్ష మవుతుంది?)3.రెండు శాసనసభల్లోనూ లోక్ సత్తాకి చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి. 4.మల్కజ్ గిరీ నుంచి జేపీ తప్పనిసరిగా యెన్నికల్లో గెలిచి సభలో ఉండాలి 5.ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆ రెండు జాతీయ పార్టీలనీ మోడీ హవా అనీ తెలంగాణా ఇచ్చిందనే తొక్కలో వాదనల్ని పట్టించుకోకుండా పూర్తిగా వూడ్చి పారెయ్యాలి.

భాజపా ఈ రోజున రా.స్వ.సే ని నెత్తిన పెట్టుకు మోస్తున్నది.రేపటి రోజున ఆ కోతి మూక మళ్ళీ రామాలయాన్ని కెలికి యేదయినా చెయ్యరాని దుడుకు పని చేస్తే రెండేళ్ల లోనే ప్రభుత్వం పడిపోయి మధ్యంతరం రావచ్చు.విడి పోయి తొలి అడుగులు వేస్తున్న మన రెండు రాష్ట్రాలకీ కంద్రంలో స్థిరంగా అయిదేళ్ళు ఉండే ప్రభుత్వం కావాలి.అందుకోసం భాజపాకి బదులుగా యూపీయే-3 వచ్చినా ఫరవాలేదని నేననుకుంటున్నాను.

ఈ అయిదు అంశాల్లో మొదటి రెండూ నా బుధ్ధికి పొడిచిన అద్భుతమయిన ఆలోచన లేమీ కాదు. వాస్తవం వాటికి అనుకూలంగానే ఉంది. కాకపోతే తేడా రాకుండా చూసుకోవాలని చెప్తున్నా, అంతే. ఇతర బ్లాగుల్లో నా కామెంట్లనీ నేను రాసిన కొన్ని పోష్టుల్నీ చూసిన యెవరికయినా నా కాంగ్రెస్ ద్వేషం, గులాబీ దళపతి పైని నా అక్కసూ తెలిసే ఉంటుంది.అయినా సరే పరిస్థితిని బట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తుకీ ఆ అమరిక మాత్రమే మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు!

10 comments:

  1. భాజపాకే కాదు, ఏ పార్టీకి కూడ అప్రహతిహతమయిన అధికారం ఇవ్వకూడదు. UPA2 అప్రతిహతంగా అధికారంలోకి వచ్చి ఏం వెలగబెట్టిందో చూసాం కదా!

    నా దృష్టిలో తెలంగాణాలో కాంగ్రెస్, సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే మంచిది.
    అలా కాకుండా తెలంగాణాలో తెరాస, సీమాంధ్రలో YSRCP అధికారంలోకి వస్తే ప్రాంతీయ ద్వేషాలు పెరిగిపోతాయి. హైదరాబాదు కాశ్మీర్‌లా తయారవుతుంది.

    ReplyDelete
    Replies
    1. నా పాయింటు మీ కర్ధం కాలేదు. కాంగ్రెసు అక్కడ అధికారం లోకి వచ్చే పరిస్థితి లేదు కదా!అందుకే ప్రాక్తికల్ గా అలా అంచనా వేశాను.తెరాసా ని అధికారంలో ఉంచి వాళ్ళు చూస్తూ ఉండగానే పోలవరం పూర్తి చేసుకోవాలి. అదీ సంగతి.

      Delete
    2. మీకోపం తెరాస మీదయితే ప్రతీకారం మాత్రం గిరిజనులపైనా, భేష్!

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. @jai

      గిరిజనుల మీద మాకేం కోపం ఉంటుందండి?వాళ్ళని బలవంతంగా గెంటెయ్యము కదా!మానవత్వం అంతా మీ దగ్గీరే ఉందా?సాటి వారి కష్టాన్ని గమనించని హృదయం లేని క్రూరులమా మేము?

      వాళ్ళు యే మాత్రం ఇబ్బంది పడకుండా వాళ్లని సంతోషంగా ఉంచే పధ్ధతి లోనే సాధించుకుంటాం. యే ప్రాజెక్ట్ కయినా నిర్వాసితుల సమస్య లేకుండా ఉందా? అందరూ యెలా పరిష్కరించుకుంటున్నారో మేమూ అలాగే పరిష్కరించుకుంటాం. అన్ని రకాల అనుమతుల్నీ ఖచ్చితమయిన ఆధారాల్ని సమకూర్చటం ద్వారానే తెచ్చుకుంటున్నాం కానీ మీకు లాగా విలీనం ఒప్పందం లాంటి వికారమయిన పధ్ధతుల్తో బల్ల కింద చేతులు పెట్టి తెచ్చుకోవడం లేదుగా?కేంద్ర జలసంఘం అనుమతి నిచ్చింది.ప్రణాళికా సంఘం కూడా పెట్టుబడులకి మార్గం సుగమం చేసింది.బచావత్ నుంచి మొదలుకుని మిగతా నదీ జలాల ఒప్పందాల్ని వేటినీ ఉల్లంఘించటం లేదు.ఇప్పుడు జాతీయ హోదా కూడా వచ్చింది.మరి మేమెందుకు పోలవరాన్ని ఆపెయ్యాలి?

      పార్లమేంటులో ప్రకటన జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయి, మేము అధికారం లోకి వచ్చాక పోలవరాన్ని కట్టనివ్వం అంటున్నాడు అతను.రాజ్యాంగబధ్ధంగా యెన్నికల్లో నిలబడి గెలిచి ముఖ్యమంత్రి పదవిని కోరుకునే వ్యక్తి అదే రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టబధ్ధమయిన పనుల్ని అడ్డుకుంటానని అంటున్నాడు. రాజ్యాంగాన్ని ధిక్కరించాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి రాజ్యాంగ బధ్ధమయిన పదవులకి అర్హుడేనా?

      మీ తెలంగాణా కల వయస్సు యాభయ్యేళ్ళే అయితే 1940ల నుంచి మేము పోలవరం కోసం కలలు కంటున్నాం.ఉభయ గొదావరి, విశాఖ, కృష్నా జిల్లాల్లో 7.20 లక్షల యెకరాలకు సాగునీరు అందిస్తుంది.తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షల యెకరాలు లాభ పడతాయి.విశాఖ జిల్లాకు పారిశ్రామిక అవసరాల్నీ తీరుస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న గౌతమ బుఢ్ధుడు నిరంకుశుడా?అందర్నీ ఒప్పించి అందరి అనుమతుల్నీ తీసుకుని చేసే పనులు కూడా మీకిష్టం లేదు గాబట్టి ఆపెయ్యాలా?

      మీరన్న దోచుకోవటం, దాచుకోవటం, తరలించుకుపోవటం తెల్సిన వాళ్ళమే అయితే ఇప్పుడు విడిపోతున్న రెండు భాగాల్లో రాయలాంధ్ర మిగులు లోనూ తెలంగాణా తరుగు లోనూ ఉండి ఉండేది. మాకు ఇస్తున్న పాకేజీలు కూడా ఇంత చండాలంగా విభజిస్తున్నందుకు ముఖం చెల్లక విదిలించినవే తప్ప మేము వాటి గురించి కూడా యెక్కువగా అంగలార్చటం లేదు. మీ కలని యెంతో అపూర్వంగా చూసుకుని నెరవేర్చుకున్న మీరు పోలవరం అనే మా కలను చెదరగొట్టకుండా ఉంటే చాలు. విడిపోయి కలిసుందామని అంటున్న మీరు మాకేదయినా సహృదయంతో ఇవ్వదల్చుకుంటే అది పోలవరానికి అడ్డం రాకుండా ఉండటమే!

      "మాకు రావలసింది మేము తీసుకుంటుంటే కొందరు బాధ పడితే మాత్రం మాకేంటి?" అన్న మీరు మీకు యేమాత్రం లాభం లేదు గాబట్టి గిరిజనుల మీద జాలి ఒలక బోస్తున్నారు. ఇంగ్లీషులోనూ తెలుగు లోనూ "నువ్వు తెలంగాణాని సపోర్టు చేస్తున్నావా, అయితేనే నువ్వు చెప్పేది వింటాను, లేదంటే నేనసలు పట్టించుకోను", అన్న తమరే ప్రజాసామ్యబధ్ధంగా చర్చించడం గురించి సుభాషితాలు చెప్తారు.అటువంటి వాటికి నేనెన్ని సార్లు భేష్ భేష్ అనాలి?

      Delete
  2. విశ్లేషణ బాగున్నది. వాస్తవాలకు దగ్గరగా వున్నది. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి

    ReplyDelete
    Replies
    1. అభినందనకు కృతజ్ఞతలు!

      Delete
  3. ఈ రోజు ఉన్న పరిస్థితులు ... మీ అంచనాలు ఒకసారి పరిశీలించండి ... సరదాకి అయినా పరిశీలించండి విశ్లేషణ చేసుకోండి !!

    ReplyDelete
    Replies
    1. అవును,అప్పటినుంచీ ఉన్న లుకలుకలు పెద్దవై ఇద్దరికీ సొంతంగా వ్యాపించటమే ముఖ్యమైపోయి ఈ రెండు పార్టీల మైత్రి చెడిపోనున్నదని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికి నాకైతే దానివల్ల్ల ఆంధ్రలో భాజపాకి మరినత్ నష్తమొ,తెదెపాకి మరింత లాభమూ కలుగుతందని అనిపిస్తున్నది.మరి భాజాపా వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఏమీ వర్క్ చెయ్యకుండానే ఆ నిర్ణయానికి వస్తున్నారా?దానిమీద కొంచెం గట్టిగా ఆలోచిస్తే గానీ కరెక్టుగా అంచనా కట్టలేం,చూస్తా!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...