అది ఎక్కడవరకు వెళ్ళిందంటే Quora తెలుగు విభాగం జ్యోతిషం గురించి ఒక వేదిక ఏర్పాటు చేస్తే అక్కడ సైతం జాతకంలో మాకు మోక్షప్రాప్తి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు.అందుకు నిర్వాహకులు "ఈ భూమి మీద వుండగానే ఆత్మానందాన్ని అనుభవించడమే మోక్షం. సరగున పాదములకు (పాద పద్మములకు) స్వాంతమను సరోజమును సమర్పణము చేయడమే మోక్షమంటే. జాతకాలు చూసి మోక్ష నిర్ణయం చేయలేము. నీ మనస్సాక్షికి మించిన జాతకం మరొకటి లేదు. జాతకం లో మోక్షం వస్తుందని వుందని మోక్షం కోసం ప్రయత్నం చేయడం అవివేకం" అని చాలా చక్కటి జవాబు ఇచ్చారు.ప్రశ్న ఎప్పుడూ మంచిదే,వేసినవారిని వెక్కిరించడం మంచిది కాదు గానీ,కల్లగురువులు మోక్షం గురించి వూదరగొట్టడం వల్లనే ఆ ప్రశ్న వచ్చింది,కదా!
"ఈ భూమి మీద వుండగానే ఆత్మానందాన్ని అనుభవించడమే మోక్షం" - చాలా బాగా చెప్పారు.గురువులు సైతం మోక్షాన్ని ఇవ్వలేరు.ఎవరికి వారు చేరుకోవాల్సిన మానసిక స్థితి అది.సద్గురువులు సైతం మోక్షం గురించి చెప్పడం,దానికోసం ప్రయత్నించడానికి మిమ్మల్ని సంసిధ్ధుల్ని చెయ్యడం మాత్రమే చెయ్యగలరు.మానవులు మొదట ఐశ్వర్యం కోసం ప్రయత్నించాలి.ఐశ్వర్యం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించాలి.ఇక చాలు అనిపించినప్పుడు మాత్రమే మోక్షం కోసం ప్రయత్నించాలి.మీరు అనుభవిస్తున్న ఆనందం గురించి ఇక చాలు అని ఇతర్లు మీకు చెప్పకూడదు,ఇతర్లకి మీరు చెప్పకూడదు.
మోక్షం మీద ఆసక్తి కలగడం అనేది షడ్రసోపేతమైన విందు భోజనం చేశాక భుక్తాయాసం వల్ల నిద్ర ముంచుకు రావడం లాంటిది.ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్ప నిద్ర పొమ్మని సలహా ఇవ్వకూడదు కదా!అది తెలియని కొందరు మేము చెప్పినట్టు వింటే మోక్షం వస్తుందని అబధ్ధాలు చెప్తున్న కల్లగురువులని నమ్మి మోసపోతున్నారు.
ఐశ్వర్యం కావాలంటే కల్లగురువుల కాళ్ళకి మొక్కటం వాళ్ళ సొల్లుకబుర్లు విని స్తోత్రాలు చదవటం పూజలు చెయ్యటం మాని వ్యవసాయం చెయ్యాలి,ఉద్యోగం చెయ్యాలి,వ్యాపారం చెయ్యాలి,ప్రతి రూపాయినీ తెలివైన పధ్ధతిలో ఖర్చు పెట్టాలి.తెలివైన వాడు సరైనచోట మదుపు చేసిన ప్రతి రూపాయీ తక్కువలో తక్కువ వంద రూపాయల్ని తెచ్చి ఒళ్ళో పడేస్తుంది.
గృహస్థులకి ఐశ్వర్యం మాత్రమే అవసరం,మోక్షం అనవసరం.మోక్షం కోసం గృహస్థులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
జై శ్రీ రాం!