Monday, 21 June 2021

శ్రీ విద్యారణ్య స్వామి చేత పరిష్కరించబడిన అపురూపమైన ఖడ్గమాల స్తోత్రపాఠం - సద్యః ప్రసాదిని అయిన శ్రీవిద్య!

శ్రీవిద్యని ఉపాసించడం చాలా కష్టమనీ సామాన్యులు చెయ్యలేరనీ అనుకున్నాను నేను.కానీ, నండూరి శ్రీనివాసాచార్యుల వారు Nanduri Srinivas - Spiritual Talks  పేరున నడుపుతున్న వీడియో చానలు దగ్గిర "పుస్తకాల్లో దొరకని శక్తివంతమైన ఖడ్గమాల","ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం" అన్న రెండు వీడియోలు చూశాక చాలా సంతోషం అనిపించింది.

అప్పటికే నేను కమలాలయ స్తోత్రం,పంచాయుధ స్తోత్రం,పతంజలి కృత నటేశ నవకం లాంటివాటిని ప్రతి రోజూ చదువుతున్నాను.వెంటనే "ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం" వీడియో దగ్గిర ఇచ్చిన PDF నుంచి తీసుకుని నిత్యానుష్ఠానం మొదలు పెట్టాను.అప్పటికప్పుడు శ్రీచక్రం తయారు చేసుకోలేక ఒక కాగితం మీద పేర్లని ఎక్కించుకుని చదువుతూ జపం చేశానే తప్ప శ్రీచక్రం బొమ్మ మీద చుక్కని చూస్తూ చేసే జపం చెయ్యలేదు నేను.

అయితే, "దీనిని సాధన చెయ్యడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే మీ శరీరంలోనూ మనస్సులోనూ జీవితంలోనూ కలిగే మార్పులు మీకే తెలుస్తాయి!" అని నండూరి శ్రీనివాసాచార్యుల వారు చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం - మొదటి మార్పు నన్ను చూస్తున్న వాళ్ళకి వయస్సు తగ్గినట్టు అనిపించడం,రెండవ మార్పు ప్రభుత్వం కరోనాకు ఒకే ఒక పరిష్కారం అంటూ పెట్టిన లాక్ డౌన్ అస్సలు నచ్చక పిచ్చెక్కిపోతున్న స్థితినుంచి కొంచెం సహనంతో కూడిన ఆశావహ దృక్పధం వైపుకు మనస్సు ప్రయాణించడం!

అలా గుణాత్మకమైన ఫలితం కనిపించిన తర్వాత స్వయాన శ్రీచక్రం గీసుకుని సాధన చేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందని అంతర్జాల షట్పదిని శోధించి గణితపరమైన సులభశైలిని సాధించి చిత్రపటం గీసుకున్నాను. వీడియో చెయ్యాలని అనుకున్న తర్వాత మొదట్లో చాలా అడ్డంకులు వచ్చాయి.తప్పులు లేని శ్రీచక్రం గియ్యడం ఎంత కష్తమో మీకు తెలుసా!అంతర్జాల షట్పదిని శోధించి త్రికోణాలు గియ్యడానికి ఒకటీ పద్మదళాలూ చతురస్రాలూ గియ్యడానికి ఒకటీ మంచి ట్యుటోరియల్ వీడియోలు వెతికి పట్టుకుని దాదాపు పది వరకూ A4 పేజీలు చిత్తు కింద తీసేశాక చక్కటి బొమ్మ వచ్చింది.దానిని స్కాన్ తీసి బయటి చతురస్రం వరకు కత్తిరించి వీడియో ఫ్రేముల మాదిరి అమర్చాను. ఒక మొబైల్ యాప్ మీద వీడియో గురించి పని చేస్తుండగా హఠాత్తుగా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ యాప్ లోపలికి వెళ్ళి చూస్తే ఫైలు మాయం!ఒక్క సారి కాదు, నాలుగైదు సార్లు  జరిగింది.ఆఖరికి ఫైల్ సైజు సమస్య అని తెలుసుకుని ఆడియో ఒక్కటీ 6 నిమిషాల 45 సెకండ్లకి తగ్గించి బొమ్మలకి బదులు తెర మీద పేర్లని ఇంగ్లీషు లిపిలో కనబడేటట్టు చేసి పబ్లిష్ చేశాను.బొమ్మల్ని ఫ్రేములకి ఎక్కించి మరో వీడియో చేసినప్పుడు మీకు చెప్తాను.ప్రస్తుతనికి నా గొంతు వింటూ అక్కడ స్క్రీన్ మీద అక్షరాల్ని చూడటమే.ఇక్కడ నేను చేసింది చాలా చిన్న పని - నండూరి శ్రీనివాసాచార్యుల వారి పద్ధతిని అనుసరించి ఒక్కొక్క పేరుని పలికేటప్పుడు శ్రీచక్రం మీద చుక్కని ఎక్కడ ఉంచాలో చూపిస్తూ చదివి వినిపించాను, అంతే!

భూపురాలకు అక్కడ నండూరి శ్రీనివాసాచార్యుల వారు చూపించిన రేఖలు ఇక్కడ నేను చూపించిన రేఖల కన్న భిన్నమైనవి కావడం వల్ల ఆయన చెప్పినది అర్ధం కాక స్వతంత్రించి కొన్ని మార్పులు చేశాను.మూడు భూపురాలకు సంబంధించిన పేర్లకు చూపించాల్సిన చుక్కలను ఒకే రేఖ మీద చూపిస్తూ చుక్కలు ఉండాల్సిన చోట్లను మరొక ఖడ్గమాల స్తోత్రపు వీడియోను చూసి అనుసరించాను.

చివరి చక్రంలోని అన్ని పేర్లనీ నండూరి శ్రీనివాసాచార్యుల వారు కేంద్రం వద్ద ఉన్న బిందువు మీద చూపిస్తే నేను అక్కడ ఉన్న ఆరు పేర్లకీ బిందువు చుట్టూ షట్కోణం వచ్చేటట్టు చుక్కల్ని చూపించి బీజాక్షరాలను మాత్రం శ్రీచక్ర యంత్రంలోని కేంద్రం వద్ద ఉన్న బిందువుతో అనుసంధానించాను.

శ్రీవిద్యలో మనం ఇక్కడ వేస్తున్నది మొదటి అడుగు మాత్రమే!చివరి అడుగు వరకు వెళ్ళగలగటం మనబోటివాళ్ళకి సాధ్యం కాదు.మొదటి దశలో చెవులకి వినబడుతున్న పేరుకీ కళ్ళకి కనబడుతున్న చుక్కకీ లంకె పెట్టుకోవాలి.రెండవ దశలో కళ్ళు మూసుకుని చెవులకి వినబడుతున్న పేరుకి శ్రీచక్రం మీద చుక్కని ఎక్కడ చూడాలో నేర్చుకోవాలి.మూడవ దశలో స్తోత్రపాఠం కంఠగతం అయ్యాక ఎప్పుడు కుదిరితే అప్పుడు మనస్సులోనే శ్రీచక్రాన్ని చూస్తూ ఖడ్గమాల స్తోత్రంలోని ఒక్కొక్క పేరుని చదువుతూ చుక్కని ఎక్కడ ఉంచాలో గుర్తించడం సాధించాలి.

ఇంతవరకు మొదటి అడుగులోని మూడు దశలు పూర్తయితాయి.తర్వాతి దశలకు వెళ్ళడానికి గురుశుశ్రూష చెయ్యాల్సి వస్తుంది.ఎందుకంటే, ఆయా దశలను గడిచేటప్పుడు ఆయా దేవతలను గురించి రూపలక్షణప్రభావ సమేతం అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది.అవన్నీ తంత్రశాస్త్రంలో ఉంటాయి.తంత్రశాస్త్రం గురుముఖత నేర్వనప్పుడు అగమ్యగోచరం అవుతుంది, ఒక్కొక్కప్పుడు దుష్ఫలితాలు కూడా వస్తాయి.

మనవి ప్రపంచాధిపత్యం లాంటి పెద్ద కోరికలు కానప్పుడు అంత దూరం వెళ్ళటం దేనికి?కోరికలు చిన్నవే గదాని అడగనిదే ఎవరూ ఇవ్వరు కాబట్టి ఇలా ఖడ్గమాల చదువుతూ అడిగితే వెంటనే నెరవేరుతాయి.అయితే, కొన్ని కోరికల్ని ఎన్నిసార్లు అడిగినప్పటికీ నెరవేర్చనప్పుడు నిరాశ పడకూడదు.అడిగినదే తడవు అన్నీ ఇచ్చేది కూడా మంచి అమ్మ కాదు.మనకి ఏది మంచిదో ఎంత చాలునో మనకన్న తనకే ఎక్కువ తెలుసు కాబట్టి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది, ఎలా ఇవ్వాలో అలానే ఇస్తుంది శ్రీమాత.

స్వస్తి!

వినతి:విద్యారణ్యుల వారు పరిష్కరించిన ఖడ్గమాల స్తోత్రం గురించి ఎక్కువ వివరాలు నండూరి శ్రీనివాసాచార్యులు గారి వీడియో చానల్ వద్ద ఉన్నాయి.

అవి ఇవి:

1). https://www.youtube.com/watch?v=x1PZ0gNzMfwt=1s

పుస్తకాల్లో దొరకని శక్తివంతమైన ఖడ్గమాల | Authentic Khadgamala unavailable in books - ఇందులో పరిచయం ఉంటుంది.

2). https://www.youtube.com/watch?v=NGgs4k4o3Ek

ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Word to Word meaning of Khadgamala - ఇందులో వ్యాఖ్యానం ఉంటుంది.

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...