Thursday, 5 November 2020

వేదం విగ్రహారాధనని సమర్ధించిందా వ్యతిరేకించిందా? రాముడూ కృష్ణుడూ మనుషులా దేవుళ్ళా!

ఇటీవల చాగంటి వెంకట్ గారు కొన్ని విషయాలను గురించి కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ సందర్భవశాత్తు మూర్తిపూజ గురించీ కృష్ణుడి గురించీ కొన్ని యధాలాప వ్యాఖ్యలు చేశారు.వాటికి ధర్మమార్గం భాస్కర రాజు గారు కొంత బాధపడి కొంత నొచ్చుకుని కొన్ని వీడియోలు చేశారు.చాగంటి వెంకట్ గారి మీద కొంచెం వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేశారు. వేదం విగ్రహారాధనని సమర్ధించిందా వ్యతిరేకించిందా, రాముడూ కృష్ణుడూ మనుషులా దేవుళ్ళా అనే గొడవలు ఇప్పటివి కావు. చాలా కాలం నుంచీ విగ్రహారాధకులు శంకరాచార్యుల వార్నీ, మూర్త్యార్చన ద్వేషులు దయానంద సరస్వతి గార్నీ తమ చర్చల్లోకి లాక్కొచ్చి వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేలా బజార్న పడి తన్నుకునేలా చేస్తున్నారు.గొడవలు మాత్రం వాళ్ళూ వీళ్ళూ లాగేకొద్దీ తెగుతూ తెంచేకొద్దీ అతుక్కుంటూ జీడిపాకంలా సాగుతూ వస్తున్నాయి.గొడవలు వస్తే సర్దుబాటు చేసేవరకు నిద్రపట్టని స్వభావం ఉన్న నేను వీటిని పట్టించుకుని పరిష్కారం కోసం కొంత పరిశోధన చేశాను.వారినీ వీరినీ సమర్ధనకి తీసుకోవడం ఎందుకు, అసలు వేదంలో ఏముందని వెతికి చూశాను.దాని ఫలితాన్నే ఇప్పుడు మీకు చెప్తున్నాను.

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know".అంటే,మానవుడు తెలుసుకోగలిగిన, తెలుసుకోవలసిన, తెలుసుకోదగిన జ్ఞానం అని అర్ధం!వేదం ఒక మతగ్రంధం కానే కాదు, సార్వకాలిక సత్యాల సమాహారమైన విజ్ఞానసర్వస్వం.వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే Branch of Study అని అర్ధం.వేదములు నాలుగు - 01.ఋగ్వేదం,02.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు,03.సామవేదం,04.అధర్వ వేదం. ఇక వేదాంగములు ఆరు - 05.శిక్ష,అంటే Phonetics,06.కల్పం,అంటే Study of Rituals,07.వ్యాకరణం,అంటే Grammer,08.నిరుక్తం,అంటే Etymology,09.ఛందం,అంటే Prosody,10.జ్యోతిషం,అంటే Astronomy. ఇవి కాక ఉపాంగములు నాలుగు - 11.మీమాంస, 12.న్యాయశాస్త్రం, 13.పురాణములు, 14.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తీసుకుంటే - 15.ఆయుర్వేదం,అంటే Medical Science:ఇది ఋగ్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,16.అర్ధశాస్త్రం,అంటే Economic Science:ఇది అధర్వవేదం నుంచి పెరిగిన శాస్త్రం,17.ధనుర్వేదం,అంటే Military Science:ఇది యజుర్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,18.గాంధర్వవేదం,అంటే Musical Science:ఇది సామవేదం నుంచి పెరిగిన శాస్త్రం.

వీటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను.

వైదిక సూత్రాల ప్రకారం మానవుడు ఎప్పటి వరకు తన జీవిత లక్ష్యమును నిశ్చయించుకొనడో అప్పటి వరకు అతని జీవిత కాలం వ్యర్ధం.ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మానవుడు ప్రతి క్షణం లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి.నిరంతరం లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూనే ఉండాలి.

సనాతన ధర్మం ప్రతి నైష్ఠికుడికీ చెప్పేది మరణానంతరం పొందబోయే స్వర్గనరకాదులను గురించి కాదు.జీవంతో ఉన్న ఇప్పుడే ఇక్కడే భగవంతుణ్ణి చూసి, విని, స్పర్శించి, ఆనందించి అతనిలో ఐక్యం కావడం గురించి నొక్కి చెప్తుంది!సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి.పిదప పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించాలి!అప్పుడు, మరణ సమయానికి  పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే మరొకజన్మ లేని మోక్షస్థితినీ అందుకుంటాడు.మోక్షం అంటే చనిపోయాక ఆత్మ ఇక్కడినుంచి ఇంకెక్కడికో వెళ్ళటం కాదు.మన చుట్టు పరివేష్ఠించి వుండి నిరంతరం మన శరీర ధాతువులకు జననాన్నీ పోషణనీ మృత్యువునీ కలిగిస్తున్న విశ్వంలోని యే అవ్యక్తుడైన భగవంతుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో జన్మమృత్యుజరారుజల సర్పిలం నుండి విడివడి తిరిగి వ్యక్తావ్యక్త స్థితుల కతీతమైన అనంతాత్మలో విలీనమైపోవటం.ఇంతకుమించి మోక్షం గురించీ హిందూమతం గురించీ ఎవరు ఏమి చెప్పినప్పటికీ అది అబద్ధమే అవుతుంది!

లక్ష్యాన్ని నిర్దేశించడమే కాదు, లక్ష్యం మీద శ్రద్ధ ఉంచడానికి పూర్వఋషులు అందరూ నేర్చుకుని పాటించగలిగిన కొన్ని తేలికైన పద్ధతులు చెప్పారు.విచిత్రం ఏమిటంటే, మూర్త్యార్చన మిగిలిన అన్నిటికన్న తేలికైనది.కేవలం అజ్ఞానం వల్లనే అందరూ అంత సరళమైన పద్ధతిని ఇంత సంక్లిష్టం చేసుకుని గొడవలు పడుతూ కాలం గడిపేస్తున్నారు.బృహదారణ్యకోపనిషత్తు(02.03.01) "ద్వే వావ బ్రహ్మనో రూపే మూర్తంచై వామూర్తం " అని చెప్తున్నది.ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక వాక్యం యొక్క అర్ధం ఇంగ్లీషులో చెప్తాను.God has two modes – formless that is niraakaara and formfull that is saakaara.

దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసి చలనానికి కారణమైన యాంత్రిక శక్తులు రెండు - స్థితిశక్తి, గతిశక్తి.వాటికి సంకల్పం ఉండదు - ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని దైవశక్తికి సంకల్పం ఉంటుంది.వ్యక్తావ్యక్త స్థితుల కతీతమైన ఈ అనంతాత్మను ఒక సగం వైష్ణవులు ప్రియమారగ కొలిచే బృందావన రాసలీలా విహారి శ్రీకృష్ణ పరంధాముడూ ఒక సగం శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తన నాయకమణి చిదంబర నటేశ్వరుడూ ఆవరించుకుని ఉంటారు.

వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే, దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అవి అసంపూర్ణసమతాస్థితిలో ఉంటాయి.అసంపూర్ణసమతాస్థితిని thermodynamics పరిభాషలో steady state అంటారు.కొందరు దీనిని incomplete equlibriuam అని కూడా అంటారు.అవ్యక్తం వ్యక్తం కంటె భిన్నమై సత్వరజస్తమస్సులు సమనిష్పత్తిలో పరుచుకుని ఉండి నిరంతరం సంపూర్ణసమతాస్థితిని ప్రదర్శిస్తూ ఉంటుంది.సంపూర్ణసమతాస్థితిని thermodynamics పరిభాషలో complete equlibriuam అని అంటారు.అవ్యక్తం వ్యక్తమయ్యేది equlibriuam చెదరడం వల్ల - అది చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే అనేది పూర్వఋషుల ప్రాక్కల్పన!

సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న జలం వేడెక్కినప్పుడు వాయురూపం దాల్చడమూ చల్లబడినప్పుడు ఘనరూపం దాల్చడమూ ఎంత సహజమో అవ్యక్తం,వ్యక్తం అనేవి సృష్టికర్తకు అంత సహజమై ఉంటాయి.అవ్యక్తం గురించి మనకే కాదు మన పూర్వఋషులకు కూడా ఎక్కువ తెలియదు.కానీ, వ్యక్తంలోని హేతుబద్ధతను చూసి అదే హేతుబద్ధతను బట్టి అవ్యక్తం గురించి కొన్ని ప్రాక్కల్పనలను చేశారు, అంతే!

అలా అవ్యక్తంలోని equlibriuam చెదరడం వల్ల ప్రకంపన మొదలై ఆదిప్రణవనాదం ఉద్భవించగానే దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ఆవిర్భవిస్తాయి.వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్రఅంటేఅది మాత్రమే అయి ఉన్నదిఅని అర్ధం. తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు. తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ప్రభవిస్తుంది.తొలుదొల్త ఆకాశం ప్రభవిస్తుంది.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి మూడవదైన అగ్ని ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి నాల్గవదైన జలం ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి ఐదవదైన పృధ్వి ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలూ విశ్వధాతువులైన కృష్ణబిలాలూ అరుణతారలూ పాలపుంతలూ గ్రహతారకలూ మొదలైన పదార్ధతత్వాలు అన్నీ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి.

అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి శ్రీకృష్ణ పరంధాముడి చేత ఉంచబడిన బీజం అయిన అవిద్యాయుత అహంకారం అనే మాయ వల్ల ప్రతి ఒక్కరికీ తనలోకి చూసుకున్నప్పుడు "ఇది నేను!" అనీ ఇతరాల్ని చూసినప్పుడు "ఇది నాది!ఇది నాది కాదు!" అనీ అనిపిస్తుంది. అయితే, ఇన్నిన్ని వైవిధ్యాలతో కూడిన ఇంతటి సంక్లిష్టమైన సృష్టివిలాసం జరిగినప్పటికీ ఒక తన్మాత్ర కలవకపోతే వ్యక్తమాన ప్రపంచం వ్యక్తం అయిన తొలిక్షణంలో ఎలా ఉందో అలాగే నిశ్చలమై ఉండిపోతుంది - అదే కాల తన్మాత్ర!వ్యక్తమాన ప్రపంచంలోని అన్ని పదార్ధతత్వాలూ కాలం విషయమై - 1). ఒక్క పదార్ధతత్వమూ ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేదు,2). రెండు పదార్ధతత్వాలూ ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండలేవు అన్న రెండు నియమాలను పాటించి తీరాలి. కాలోహి దురతిక్రమం అని పెద్దలు అన్నది అందుకే!

సత్యం,ధర్మం,ఇంద్రియనిగ్రహం,క్షమ వంటివాటి గురించి కొంచెం కష్టపడితే మీరూ నేనూ కూడా తెలుసుకోవచ్చు.తప్పులు చేసీ చేసీ, ఓ నాలుగైదు గట్టి దెబ్బలు తిన్నాక, తలమీద కట్టిన బొప్పెల్ని తడుముకుని ఇతర్లకి జాగ్రత్తలు చెప్పొచ్చు.అది పెద్ద కష్టం కాదు.అందులో గొప్ప ప్రజ్ఞ కూడా లేదు.కానీ కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్తున్నది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికీ కాలం గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పిన దానికి మించి ఎవరూ చెప్పలేకపోయారు, చెప్పలేకపోతున్నారు, చెప్పలేరు కూడా!తనలో ఎప్పుడూ అనేకానేకమైన పదార్ధతత్వాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ కదలికల వల్ల అది ప్రభావితం కాదు.నిన్న,నేడు,రేపు అనేవి కాలంలో మనం ఉన్న స్థితిని గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఏర్పరచుకున్న వర్ణనాత్మకమైన పదాలు తప్ప అవి కాలానికి లక్షణాలు కావు.అందుకే కాలాన్ని భగవత్స్వరూపం అనీ భగవంతుణ్ణి కాలస్వరూపుడు అనీ అన్నారు.వైధిక ధర్మం యొక్క ఆధారభూతమైన దైవం శివుడో విష్ణువో దేవియో అగ్నియో వరుణుడో ఇంద్రుడో రాముడో కృష్ణుడో మరొకరో కాదు, ఆదీ అంతూ లేని కాలమే మనకు దైవం అని నేను బల్ల గుద్ది చెప్తున్నాను.దీన్ని కాదనగలిగిన సాహసం ఎంతటి వేదపడితుడూ చెయ్యడని కూడా నమ్ముతున్నాను.

కొందరు హైందవేతర మతప్రచారకులు రాముడినీ, కృష్ణుడినీ తమ మతప్రవక్తలతో పోలుస్తున్నారు - వారి మతాలలో ప్రవక్తలు ఎట్లాగో హిందూమతంలో వీరు అట్లాంటివారని వక్రభాష్యాలు చెప్తున్నారు.కొందరు హైందవధర్మ ప్రచారకులు కూడా రాముడినీ, కృష్ణుడినీ సృష్టికర్తతో పోలుస్తున్నారు - వారి జననం అయోనిజమనీ వారి శరీరం తేజోమయమే తప్ప మనవలె రక్తమాంసనిష్ఠం కాదనీ వక్రభాష్యాలు చెప్తున్నారు.ఇది పెద్ద తప్పు - సనాతనుడైన భగవంతుడికి తప్ప ఇంకెవరికీ వైదిక ధర్మానికి కర్తృత్వం గానీ అధికారం గానీ లేదు,ఇవ్వకూడదు.రాముడూ కృష్ణుడే కాదు శివుడూ విష్ణువూ కూడా తమ యోగసాధన వల్లా ధర్మపాలన వల్లా యోగీశ్వరులై కీర్తించబడుతున్నారు - అంతకు మించి చెప్పడం అతిశయోక్తియే అవుతుంది!

ఆదీ అంతూ లేని కాలం ఒక్కటే శాశ్వతం అయి అవ్యక్తం, వ్యక్తం అనేవి దైవం తనకు తను ఆపాదించుకుని ప్రదర్శిస్తున్న రెండు స్థితులు అయినప్పుడు వాటిని గురించి వేదం ఏమి చెప్తున్నదో చూస్తే మన మొదటి చిక్కుముడి వీడుతుంది. శుక్లయజుర్వేదం మధ్యాంధీన శాఖ లోని 40.09 సంఖ్య వద్ద ఉన్న "అంధం తమః ప్రవిశన్తి యే అసంభూతిం ఉపాసతే, తతో భూయ ఇవ తే తమో సంభూత్యాం రతా" అనే మంత్రం యొక్క అర్ధం "Into the blinding darkness, pass those, who devote in the unmanifest.And into still greater darkness, pass those, who delight in the manifest" అని. అదే యజుర్వేదం కాణ్వ శాఖ లోని 40.09 సంఖ్య వద్ద ఉన్న "అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాం ఉపాసతే, తతో భూయ ఇవ తే తమో విద్యాయాం రతా" అనే మంత్రం యొక్క అర్ధం "Into the blinding darkness, pass those, who devote in the Avidya.And into still greater darkness, pass those, who delight in the Vidyaa" అని.

వేదం మూర్తిపూజని సమర్ధించిందా వ్యతిరేకించిందా అనే విషయం మీద నేను పరిశోధన చేస్తున్నప్పుడు ఒక ఇంగ్లీషు బ్లాగరు వీటిని అందించారు.ఆయన కూడా మూర్తిపూజకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించే సదుద్దేశంతోనే ఆ పోష్టును పెట్టారు.అయితే, మరింత విస్తరించి చెప్పాలని కాబోలు "Enter into the darkness, those fools who engage into the activities of destruction by creating conflict based ideology,like, race and yet into greter darkness those engage into the lust of material things" అంటూ చిత్రమైన గందరగోళంలో పడిపోయారు.

ఆయన చేసిన పొరపాటునే చాలామంది చేస్తున్నారు.అదేమిటంటే - ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రతి పదానికీ antonyms, synonyms ఉన్నాయి.వీటిలో contextual priority అనేది ఒకటి ఉంటుంది.ఒక పదానికి గానీ రెండు పదాల్ని పోల్చడానికి గానీ synonyms తీసుకునేటప్పుడు అందరూ contextual priorityని పట్టించుకోవడం లేదు.చాలామంది వేదసంహితలకి వేర్వేరు అర్ధాలు చెప్పడానికీ వాటిని పట్టుకుని ఇతర్లు గ్రూపుల కింద విడిపోయి తన్నుకోవడానికీ ఇలాంటి దూరాన్వయాలే కారణం అనేది నా తీర్పు.ఇక్కడ చూడండి, activities of destruction అనేది క్రియని సూచిస్తుంది. సంభూతి, అసంభూతి గానీ విద్య, అవిద్య గానీ క్రియలు కావు, అవి nouns. ఇది చిన్న గందరగోళం అయితే దీనివల్ల activities of destruction అనేది అక్కడున్న నాల్గింటిలో దేనికి వర్తిస్తుందో తెలియని పెద్ద గందరగోళం ఆరడుగుల బుల్లెట్టులా దూసుకొచ్చి మతిపోయింది నాకు.ఇక lust of material gatherings అయితే activities of destructionకి అసలు పొసగనే పొసగదు - అది మరో పెద్ద గందరగోళం.పోష్టు కొసాకి చదివితే ఇంకాస్త గందరగోళంలో పడతానని భయం వేసి అక్కణ్ణించి వచ్చేశాను.క్యూరియాసిటీ కొద్దీ పోష్టు కొసాకి పోయి చూద్దును గదా, ఆయన దారి తప్పి పోయింది గాక ఇంతంత చిన్నచిన్న విషయాల్ని అర్ధం చేసుకోలేని గొర్రెలు హిందూమతంలో ఉండక్కర్లేదు పొమ్మని విసుక్కుంటున్నారు!

ఆయన మొదట చెప్పిన చిట్టి పొట్టి అనువాదం చాలు మనకి విషయం అర్ధం కావడానికి.అసంభూతి అనే పదానికి virtual existennce/conceptual existence అనీ సంభూతి అనే పదానికి visual existence అనీ అర్ధాలు చెప్పుకుంటే చాలు.ఇప్పుడు మన గొడవకి పరిష్కారం దొరికేసింది.ఎలాగంటే,"సంభూతి అనేది కంటికి కనబడే మూర్తి అయి, అసంభూతి అనేది కంటికి కనబడని తత్వం అయితే - మూర్తిని చూస్తూ తత్వాన్ని గ్రహించడమే సర్వులకూ ఉభయతారకమైన మార్గం" అనేది నా తీర్పు.అసలు దోషం మూర్తి పూజ చెయ్యటం కాదు. పరిధిని దాటి “మూర్తియే సమస్తం, మూర్తి లేనిదే పూజ లేదు అనీ “మూర్తియే ఉండకూడదు, మూర్తిని ప్రతిపాదించడమే దోషం – మౌనధ్యానమే ప్రశస్తం అనీ ఎవరికి వారు వితండవాదం చెయ్యటం.మూర్తిపూజకు సంబంధించి వేదం తెలిసిన పెద్దలు కూడా అతి చెయ్యొద్దని చెప్పారు గానీ అసలు చెయ్యొద్దని చెప్పలేదు.అట్లాగే, "అవిద్య అనేది లౌకికశాస్త్రపాండిత్యం అయి, విద్య అనేది బ్రహ్మతత్వజ్ఞానం అయితే - లోకవిద్యలతో అర్ధాన్ని సాధిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మోక్షప్రాప్తి వైపుకు నడవటమే సర్వులకూ ఉభయతారకమైన మార్గం" అనేది నా తీర్పు.

ఒకసారి అర్చామూర్తిని చూసి తత్వం గ్రహించడం సాధించాక ప్రజ్ఞని విశ్వంలోని ప్రతి అంశం యొక్క తత్వాన్ని గ్రహించడానికీ వినియోగించాలి - విష్ణు సాహస్రం "విశ్వం విష్ణుః" అంటూ లలితా సాహస్రం "శ్రీమాతా" అంటూ మొదలైంది అందుకే!జలం అనే తన్మాత్రతో అభిషేకించి, అగ్ని అనే తన్మాత్రతో హారతి ఇచ్చి, వాయుతన్మాత్రకు సంబంధించిన ధూపాన్ని ఆశ్వాసింపజేసి, పృధ్వీతన్మాత్రకు సంబంధించిన పుష్పాలతో పరిషేచన చేసి,ఆకాశ తన్మాత్ర స్వరూపమైన మనస్సును లీనం చేసి మీరు పూజిస్తున్న పాంచభౌతికమైన అర్చామూర్తిలో ఉన్న తత్వమే సృష్టిలోని ప్రతి పాంచభౌతికమైన రూపధారిలోనూ ఉందని మీరు గ్రహించాలి, భావించాలి, బోధించాలి!అలాంటి నిజమైన భక్తి భావన లేనప్పుడు చూపు శివుడి మీదా చిత్తం చెప్పుల మీదా అనే వెక్కిరింతకి మీరు నిలువెత్తు రూపం అవుతారు.

మధ్యలో ఒకచోటరాముడూ కృష్ణుడే కాదు శివుడూ విష్ణువూ కూడా తమ యోగసాధన వల్లా ధర్మపాలన వల్లా యోగీశ్వరులై కీర్తించబడుతున్నారుఅని ఉండకపోతే ప్రసంగం ఇక్కడితో ఆపేసి ఉండేవాణ్ణి.అసలు, చాగంటి వెంకట్ గారు మాట అన్నందుకే కదా ధర్మమార్గం భాస్కరరాజు గారికి అంత బాధ కలిగింది - దానికి జవాబు చెప్పకపోతే ప్రసంగం మధ్యలో ఆపేసినట్టు ఉంటుంది, అవునా!

వేదం ఒక మతగ్రంధం కానట్లే వేదం పునాదుల మీద నిలబడిన మన జీవన విధానం మతం ఎప్పటికీ కాదు.మనది సనాతన ధర్మం అనీ మనం సనాతన ధార్మికులం అనీ చెప్పుకోవడం ఉత్తమోత్తమం - హిందూమతం అనే పదాన్ని ఇతరులకు అర్ధం కావడం కోసం మాత్రమే వాడాలి. భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో సహా ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న వాటిని కూడా కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యం అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది. గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చును.

భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ, భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు.అయినప్పటికీ ఏదో ఒక మొదటి తేదీని చెప్పాలని ఉత్సాహపడి చాలామంది ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తారు కూడా.స్వయాన Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1,200BCE నుంచి 1,500BCE మధ్యన అని నిర్ధారించాడు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,000BCE నుంచి 2,500BCE మధ్యన అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6,000BCE నుంచి 10,000BCE మధ్యన అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25,000BCE నుంచి 50,000BCE మధ్యన అని నిర్ధారించాడు. Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.అయితే, వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసిన Prof. Keith గారు మాత్రం "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు.కాబట్టి, ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పినట్టు వేదం సృష్ట్యాది నుంచీ ఉందని అనుకోవాలి.

వేదంలోని ప్రతి సూక్తానికీ ఒక ఋషి ఉంటాడు.అయితే ఋషికి సూక్తం యొక్క రచయిత హోదాని ఇవ్వరు - ద్రష్ట అని అంటారు, తను చేసిన తపస్సు ఫలించి సర్వేశ్వరుడి కృప చేత సత్యాన్ని దర్శించి ఇతర్లకి చెప్పగలిగిన అనువాదకుడు మాత్రమే.ప్రతి సూక్తానికీ మొదట వినియోగ గద్య ఉంటుంది.ఇందులో సూక్తంలోని విషయం దేనికి సంబంధించినది,ద్రష్ట ఎవరు, సూక్తం యొక ఉపయోగం ఏమిటి అనే విషయాలు ఉంటాయి."జపే వినియోగః" అని ఉంటే అవి దైవ స్తుతులు,వాటిని ప్రతి ఒక్కరూ నిత్య పూజలో వాడుకోవచ్చు.శాస్త్ర సంబంధమైన సూక్తులకి వినియోగం వేరుగా ఉంటుంది.వేదంలోని ఏఒక్క మంత్రమూ చెప్పదల్చుకున్న విషయం గురించి విస్తరించి చెప్పదు.బీజ రూపంలో చెబుతుంది.ఒక చెట్టుని పుట్టించగలిగిన విత్తనాల్ని గుప్పెడు అలాగే తినేస్తే విత్తనం యొక్క ప్రయోజనం అంతటితో ముగిసిపోతుంది.కానీ గుప్పెడు విత్తనాల్ని నేలలో నాటి నీటినీ ఆహారాన్నీ ఇచ్చి పోషించితే ఒక్కో విత్తనం పెరిగి పెద్దదై ఎంతోమంది ఆకలిని తీరుస్తుంది.

"సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః" - "సనాతనుని యొక్క ధర్మమును సనాతన ధర్మమని అందురు". ఇది షష్ఠీ తత్పురుష సమాసం - స్థాపిత స్థాపక సంబంధాలను సూచించే సాంకేతిక పదాన్ని బట్టి సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది గనక ఇది సనాతన ధర్మం అయ్యింది!జైనులు మహావీర తీర్ధంకరుని, బౌద్ధులు శాక్యముని గౌతమబుద్ధుని, జొరాష్ట్రియన్లు దార్శనికుడైన జరతూష్ట్రను, యూదులు ప్రధమ ప్రవక్తయైన అబ్రహామును, క్రైస్తవులు దైవపుత్రుడైన జీసస్ క్రీస్తును, మహమ్మదీయులు ఆఖరి ప్రవక్తయైన మహమ్మదును ఆయా మతాలకు మూలపురుషులని నమ్ముతారు.అట్లాగే సనాతన ధర్మాన్ని పాటించే వారు తమది సనాతనుడైన భగవానుడి చేత స్థాపించబడినది తప్ప యే ఒక్క మానవుడూ దీనికి స్థాపకుడు కాదని విశ్వసిస్తారు!

ఇతరులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాల్ని నిజాలని నమ్మి చెప్పటం లేదు,ఎదటివాళ్ళని నమ్మించటం కోసమే ప్రయత్నిస్తూ  అవసరమైతే తాము నమ్ముతున్నట్టు నటిస్తారే తప్ప వాళ్ళు అవి నిజాలని నమ్మడం లేదు!మనం గనక నిజానిజాలు నిర్ధారించుకోకుండా అబద్ధాల్ని నమ్మితే మనకే నష్టం అనేది రెండు మూడు సార్లు అనుభవంలోకి వచ్చాక తప్పకుండా తెలుస్తుంది.అది తెలిశాక మనకి అబద్ధాలు చెప్పినవాళ్ళ నిజస్వరూపం తెలియడం వల్ల మనం వాళ్ళకన్న బలవంతులమైతే నాలుగు తన్ని దూరానికి తరిమి కొట్టడమో వాళ్ళు మనకన్న బలవంతులైతే వాళ్ళనుంచి దూరంగా పారిపోవటమో చేస్తాం, అవునా?ఇతరులు చెప్తున్నవి మనకు హాని చేసే అబద్ధాలని తెలిశాక కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే పిచ్చివాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో! విధమైన వాస్తవిక జ్ఞానం  పుష్కలంగా ఉండటం చేతనే ప్రాచీన భారతీయ సనాతనధార్మికసాహిత్యసృష్టికర్తలు తాము సత్యానికి కట్టుబడి నడిచారు, సత్యవాక్పరిపాలనని అన్నింటికన్న సర్వోత్కృష్టమైన స్థానంలో నిలబెట్టి మనల్ని కూడా సత్యం వైపుకే నడవమని చెబుతున్నారు!

శ్లో. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్,

బ్రూయాత్ సత్య మప్రియం,

ప్రియంచ నానృతం బ్రూయాత్

 - ఏష ధర్మః సనాతనః

(మనుస్మృతి వీ-138)

"సత్యమునే పలుకుము.ప్రియమునే పలుకుము.సత్యమైనను అప్రియము పలుకకుము.ప్రియమైనను అసత్యమును పలుకకుము." - ఇంతకన్న మంచి మాట, అందరికీ నచ్చే చక్కని మాట ఎవరైనా చెప్పగలరా? దీన్ని ఇంతకన్న కొంచెం సాగదీసి చెప్పినా సుత్తిలా ఉండదూ!

కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్తున్నది మాత్రమే చూస్తే అది ఒక్కటే వైదిక సాహిత్యాన్ని ఇతర మత సాహిత్యాల కన్న శాస్త్రీయమైనదని పరిశోధకులు ఒప్పుకోవడానికి ముఖ్యమైన కారణం అయ్యింది!మరొక విచిత్రం ఏమిటంటే, ప్రతి అస్తిత్వమూ కాలంలో మార్పులకు లోను కావటం సహజమనీ కాలంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి మనకు ద్యోతకం అవుతున్నదే జ్ఞానం అని వేదం అనిదంపూర్వమైన రీతిలో స్థాపించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే మానవులకు పరమలక్ష్యం అని నిర్దేశించటం ఒక్కటే సనాతన ధర్మాన్ని ఇతర ధర్మాల కన్న అత్యున్నతమైన స్థాయిలో నిలబెడుతున్నది!

ప్రాచీన భారతీయ ఋషులు చెప్పిన క్లుప్తమైన సృష్టి రచన ఇట్లా వుంటుంది: జగత్తులో కుండలూ బట్టలూ ఇతర వస్తువులూ తయారయ్యే తీరు వేరు,సృష్టి నిర్మాణం జరిగే తీరు వేరు.కుండ తయారు కావాలంటే 1.మట్టి అనే ఉపాదానకారణం, 2.మట్టిని కుండగా రూపొందించటం అనే సమవాయ కారణం, 3.కుండను చేసేవాడు అనే నిమిత్త కారణం అవసరం అవుతాయి.కానీ భగవంతుని వల్ల భగవంతుని చేత భగవంతుని నుండి జరుగుతున్న సృష్టిలో మాత్రం భగవంతుడు ఒక్కడే ఉపాదానకారణం, సమవాయ కారణం, నిమిత్త కారణం అవుతాడు.

అవ్యక్తంలోని శివమనోహరి భర్త చిద్విలాసాన్ని తన పెద్ద పెద్ద కళ్ళని ఇంకాస్త విపార్చి చూస్తుంటే తన సదంచిత ముదంచిత నికుంచిత పదం అలా కదలుతూ ఉండగానే ఆదినర్తన నాయకమణి చేతనున్న ఢమరుకం నుండి ప్రణవనాదం ఇలా మొదలౌతుంది.ఇలా తమోగుణ స్వభావుడైన ఆదినర్తన నాయకమణి చేతనున్న ఢమరుకం నుండి ప్రణవనాదం మొదలు కాగానే అలా రజోగుణ స్వభావుడైన శ్రీకృష్ణ పరంధాముడు అనంత కోటి బ్రహ్మాండాల సృష్టిరచనకు ఉపక్రమిస్తాడు.మహత్వంలో తనకు సాటియైన స్త్రీతత్వం శ్యామలాదేవి శ్రీకృష్ణ పరంధాముడి నుండి వేరుపడి పక్కన నిలుస్తుంది.దాని తర్వాత వీరినుండి అసలైన అక్షరపరబ్రహ్మ కూడా ఉద్భవిస్తాడు.అక్షరపరబ్రహ్మ నుండి ఉద్భవించిన దేవతా సమూహాలే అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడైన సృష్టికర్త గోచరం చేసిన విశ్వరాజ్యాంగసంవిధానం ప్రకారం అనంతకోటి బ్రహ్మాండాలను నియంత్రిస్తున్న దివ్యప్రభుత్వయంత్రాంగం అవుతారు.ఆదినర్తన నాయకమణి చేతనున్న ఢమరుకం నుండి వెలువడుతున్న అనాద్యనంతనిరంతరప్రణవనాదం రవంతసేపు విశ్రమించేవరకు అనేకమైన కొత్త విశ్వాలు పుట్టుతూ అనేకమైన పాత విశ్వాలు గిట్టుతూ ఉంటాయి.

విశ్వానికి ఉన్న నిలువు అక్షం విశ్వం యొక్క లోతట్టు అంచును తగిలేచోట ఘనమైన కరణోదక సాగర తరంగాల మీద - ఒకప్పుడు లక్ష్మీసమేతుడై శేషతల్పం పైన శయనించియో, ఒకప్పుడు వైష్ణవజనులతో సభదీరియో నారాయణుడు వసించి ఉంటాడు.తేజసాంశం ఒక్కలాగే ఉన్నప్పటికీ నారాయణుడు అవ్యక్తంలోని శ్రీకృష్ణ పరంధాముడు కాడు - ఆయన యొక్క బింబరూపం, ఓం నమో భగవతే కేశవాయ నమః!క్షీరసాగరంపైన విశ్వాండం యొక్క అక్షం పొడుగునా వ్యాపించి పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉంటుంది.భగవంతుడైన విరాటస్వరూపంలో జరిగిన, జరుగుతున్న, జరగనున్న ప్రపంచమంతా గోచరిస్తుంది.భాషణకూ భూషణకూ ధిషణకూ కట్టుబడక కేవలం ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు.విశ్వానికి ఉన్న నిలువు అక్షం విశ్వం యొక్క పైతట్టు అంచును తగిలేచోట ధవళవర్ణ సంశోభితమైన హిమాద్రిశిఖరశృంగాల మధ్యన - ఒకప్పుడు ధ్యానమగ్నుడుగానో, ఒకప్పుడు పార్వతీసమేతుడై లాస్యతాండవం చేస్తూనో, ఒకప్పుడు ప్రమధగణాలతో కౌలువుదీరియో సాంబశివుడు వసించి ఉంటాడు.తేజసాంశం ఒక్కలాగే ఉన్నప్పటికీ సాంబశివుడు అవ్యక్తంలోని ఆదినర్తన నాయకమణి కాడు - ఆయన యొక్క బింబరూపం, ఓం నమో భగవతే గౌరీశాయ నమః!

వ్యక్తంలో ఉండటం వల్ల వీరు కూడా మాయకు లోబడినవారే.వారి నిరంతర యోగనిష్ఠ కూడా మాయకు బద్ధులు కాకుండా ఉండటానికే! అయితే, అది వారి అశక్తత కాదు - అలాంటి వారిలోనే కాదు, మనలోనూ వ్యాపించి ఉన్న అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు తన వల్ల తన చేత తన నుండి నడుస్తున్న స్వాప్నిక జగత్తులో రెండు విధాలైన వినోదాలను ప్రదర్శిస్తూ ఉంటాడు.ఒకటి - అనునిత్యం ఎదురౌతూనే ఉన్నప్పటికీ మన హేతువుకు అందనిది పరమాత్మ యొక్క మాయావినోదం అనిపిస్తుంది.రెండు - కుతూహలం పెరిగి శోధించి సాధించిన అనంతరం మన జ్ఞానానికి అందినది పరమాత్మ యొక్క లీలావినోదం అనిపిస్తుంది.

పైన చెప్పిన సృష్టిరచనగద్యం ఎక్కువ భాగం పోతన విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం నుంచి తీసుకున్నాను.బ్రహ్మాండపురాణం లాంటివాటినుంచి వైరుధ్యం లేని భాగాల్ని తీసుకుని కలిపాను.పురాణ కధలు అపౌరుషేయాలు కాదు కాబట్టి కొన్ని వైరుధ్యాలు ఉంటాయి."పూరణాత్ పురాణం ఇతి చన్యత్ర" అని చెప్పిన దాని ప్రకారం వేదం బీజరూపంలో చెప్పినదాన్ని విస్తరించి చెప్పడమే పురాణకధల ప్రధానమైన లక్ష్యం. గ్రాడ్యుయేట్ లెవెల్లో చెప్పే పాఠాలు ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పడం లేదు, అయినప్పటికీ డిగ్రీలో చెప్తున్న పాఠాలు ఇంటర్మీడియట్ పాఠాలతో విభేదించడం లేదు కదా!అట్లాగే, వేదవ్యాస విరచితమైన పురాణకధలు వేదంతో విభేదించే అవకాశం లేదు.అయితే, ఇప్పుడు ప్రచారంలో ఉన్న అన్ని పురాణకధలూ వేదవ్యాసవిరచితమైనవి కావు.

వైదిక ధర్మానికి విరుద్ధమైన విషయాలను వైదిక ధర్మానికి అనుకూలం అని భ్రమింపజేస్తున్న పురాణకధలు చాలానే వున్నాయి.మచ్చుకు ఒకటి చెప్తాను.పరశురాముడు 21 సార్లు సమస్త భూమండలాన్ని చుట్టి నిక్షత్రం చెయ్యడం నిజమేనా?పరశురాముడు అనే శ్రీమహావిష్ణువు యొక్క అవతారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ప్రతి అవతారమూ ఇతరులకు నిర్జించ శక్యం కాని ఒక రజోగుణ ప్రధానమైన దుష్టశక్తి ఆవిర్భవించి సృష్టిలోని సమతౌల్యాన్ని భగ్నం చేస్తున్నప్పుడు, దానిని సమయించి శాంతిని స్థాపించే లక్ష్యంతో ఆవిర్భవిస్తుంది.కానీ, పరశురాముడి యొక్క అవతార ప్రయోజనం గురించి అటువంటి స్పష్టత లేదు.

రామాయణంలో శ్రీరాముడు శివధనుర్బంగం చేశాక "ఇద్దరు రాములు ఉండటం కుదరదు!" అంటూ ప్రవేశించి వైష్ణవ ధనుస్సును రాముడికి అప్పగించి వెళ్ళిపోతాడు.మరి, 21 సార్లు సమస్త భూమండలాన్ని చుట్టి నిక్షత్రం చెయ్యడం అంతకు ముందరే జరిగి ఉంటే శ్రీరాముడి తండ్రి అయిన దశరధుడూ సీతాదేవి తండ్రి అయిన జనకుడూ సుక్షత్రియులు ఎట్లా అవుతారు?ఇక, భారతకధలో పరశురాముడి పాత్ర చాలా సార్లు వస్తుంది.భీష్ముడికి గురువు ఆయనే.అంబ భీష్ముడి మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళింది పరశురాముడి దగ్గరికే.శ్రీ కృష్ణుడు హస్తినాపురం వచ్చి సంధి ప్రతిపాదన చేసినప్పుడు దుర్యోధనుడికి హితవు చెప్పినవారిలో పరశురాములవారు కూడా ఉన్నారు.మరి, నిక్షత్రం చెయ్యడం అప్పటికే జరిగి ఉంటే కురు వంశీయులు సుక్షత్రియులు ఎట్లా అవుతారు?

దేవీ భాగవతంలో చెప్పబడిన మూలకధలోని పరశురాముడు చాలా శాంతమూర్తి.తండ్రియైన జమదగ్ని క్షణికమైన చిత్తచాంచల్యంతో తన నిత్యార్చనకు అంతరాయం కల్గించిన తల్లి రేణుకాదేవిని చంపమని ఆజ్ఞాపించినప్పుడు అన్నలు తిరస్కరిస్తారు, కానీ పరశురాముడు తండ్రి ఆజ్ఞను తల దాలుస్తాడు.తండ్రి కొడుకు యొక్క వినయానికి సంతోషించి వరం కోరుకోమంటాడు.అప్పుడు తల్లినీ అన్నలనూ బ్రతికించమని అడిగి కధను సుఖాంతం చేస్తాడు.అక్కడి వరకు చూస్తే శాక్తేయంలోని ఛిన్నమస్తాదేవి అవతరించడానికి సహాయం చెయ్యడం తప్ప అందులో స్వతస్సిద్ధమైన అవతార ప్రయోజనం లేదు.

మిగిలిన అన్ని అవతార మూర్తులూ కేవలం దుష్టులను మాత్రమే సంహరించారు, కానీ నిక్షత్రం కధలోని పరశురాముడు మాత్రం ఒక్క కార్తవీర్యుడు చేసిన తప్పుకి మొత్తం రాజకులాన్ని వధించాడు.ఇది సమవర్తియైన సృష్టికర్త స్వభావానికీ అనువర్తియైన అవతార ప్రయోజనానికీ విరుద్ధమైన చర్య అవుతుంది.అన్నిటికన్న వింతైన ఒక విశేషం తెలిసింది నాకు నిన్ననే - పోయిన వస్తువులు దొరకాలంటే కార్తవీర్యార్జునుడి మంత్రం చదువుకోమంటారు.అటువంటి ధర్మాత్ముడు జమదగ్ని పట్ల అన్ని క్రూరమైన పనులు ఎందుకు చేస్తాడు? పురాణమిత్యేవ నసాధుసర్వం అన్న మహాకవి ఆధునికుడు కాడు, ప్రాచీనుడే - ఆలోచించండి!

ప్రస్తుతం హిందూమతంలో ఉన్న అనేక దురాచారాలకు మూలమైన కల్పిత విప్రాధిక్యతను సమర్ధించడం తప్ప పరశురాముడి రాజవంశ నిర్మూలన కధకు ఎటువంటి వైదిక ధర్మ సంబంధమైన ఆధ్యాత్మిక ప్రయోజనమూ లేదు.కాబట్టి, పౌరాణిక సాహిత్యం మీద వ్యామోహం పెంచుకుని వైదిక ధర్మం యొక్క మౌలికజీవనవిధానం నుంచి దూరం జరగడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు.దానివల్ల విలువైన సమయం చేజారి పోవడమే గాక తారణకు దూరమవుతామనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

ఎవరి తారణ వారిదే, తారణకు సర్వులూ అర్హులే అనేది సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రం అనేది చతుర్యుగపర్యంతం ఉన్న ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న పరమ సత్యం! ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది! ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...