Wednesday, 18 September 2019

ఒక చంద్రుడూ ఒక తారా శృంగారం చేస్తే పుట్టిన బుధుడనే గుండ్రని గోళం శుక్రుడికీ చంద్రుడికీ కూడా కొడుకెట్లా అయ్యాడు చెప్మా!

మహాభారతం మరియు ఇతర పౌరాణిక కధలు 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలనీ చంద్రుని భార్యలనీ చెబుతాయి.ఇక్కడ కదులుతున్న చంద్రగ్రహాన్ని పురుషతత్వంతోనూ స్థిరమై ఉండి వేటినైతే చలిస్తున్న చంద్రగ్రహం స్పృశిస్తుందో వాటిని స్త్రీతత్వంతోనూ పోల్చారు.అయితే, యజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత(Taittiriya Samhita II.3.5.1) ప్రజాపతికి ముప్పైముగ్గురు కుమార్తెలని పేర్కొంటున్నది.ఇక్కడ కూడా చంద్రుడు వీరిలో రోహిణిని ఎక్కువ ప్రేమించాడని చెప్పటం వల్ల ఈ కధలో కూడా చెప్పదల్చుకున్న ప్రధాన విషయం ఒకటే అని తెలుస్తున్నది - కానీ 27 కాస్తా 33 ఎట్లా అయ్యింది?ఉన్న 27 నక్షత్రరాశులకీ చంద్రగమనానికీ చాంద్రమాసాలకీ లెక్క సరిపోతుంటే వీటిని నక్షత్రరాశులని అనుకుంటే కాలానికి సంబంధించిన అన్ని లెక్కల్నీ తిరగరాయాలి! పోనీ, వైదిక సాహిత్యంలో ఉద్ఘాటించిన 8 మంది వసువులూ 11 మంది రుద్రులూ 12 మంది ఆదిత్యులూ ఇద్దరు అశ్వినీ దేవతలూ అయిన 33 అనుకుంటే సరిపోతుందా!వసువులూ రుద్రులూ భూమికీ ప్రకృతికీ సంబంధించినవాళ్ళు - ఖగోళ గణితానికి చంద్రుడి భార్యలుగా అంటుకట్టటం కుదరదే?ఇంకొక వైపున ఋగ్వేదం(VII.86.1;X.88.13) సూర్యుడిని కూడా నక్షత్రం అని చెప్పి విశ్వంలో ఉన్న 34 కాంతుల్లో సూర్యుడు అత్యంత ప్రముఖమైన కాంతిస్వరూపం అని చెప్తున్నది.ఇప్పుడు ఈ 34 నుంచి 27 నక్షరాలనూ సూర్యుడినీ చంద్రుడినీ విడదీస్తే మిగిలిన అయిదూ బుధుడు, శుక్రుడు, వరుణుడు/అంగారకుడు, గురుడు, శని అనే గ్రహాలకి లెక్క సరిపోతున్నది!
34లో చంద్రుణ్ణి చలనాధిపతి అనుకుంటే సూర్యుడు కూడా నక్షత్రం అవుతున్నాడు గాబట్టి చంద్రుడికి ముప్పైముగ్గురు భార్యలనే లెక్క కూడా సరిపోతుంది.ఇంతకు ముందరే నేను చంద్రవరుడికీ సూర్యవధువుకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే, జరిగే కళ్యాణ మహోత్సవం కధ చెప్పాను కదా - చదివారా?కధ బాగుంటుంది, చదవండి!ఈ కధలన్నిట్లో చంద్రుణ్ణే ఎందుకు పురుషుణ్ణి చేశారు?సూర్యుడికేం తక్కువ?ఎందుకంటే, అందర్లోకీ చురుకైన వాడు కాబట్టి!ఋగ్వేదం(I.105.10) స్వర్గంలో ఉన్న అయిదు ఎద్దుల్ని గురించి చెప్తున్నది - ఇవి అయిదు గ్రహాలే అయ్యే అవకాశం ఉంది! సూర్యుడికి చెప్తున్న ఏడు గుర్రాలు సూర్యగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం(Mercury), శుక్రగ్రహం(Venus), వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter), శనిగ్రహం(Saturn) అయ్యే అవకాశం కూడా ఉంది!
Jupiter అని పిలవబడే గురుగ్రహం ఒక్కటే క్రమం తప్పని చలనాన్ని నమోదు చేస్తున్నది,మిగిలిన వాటి చలనాల్లో స్థిరత్వం తక్కువ, కాంతివంతమైనది - కాబట్టి cosmic law మీద అధిపత్గ్యం ఉన్న దేవగురువు స్థానం ఇచ్చారు వైదిక సాహిత్యపు ఖగోళ నియమాల్లోనూ పామరులకి విజ్ఞానశాస్త్రాన్ని అందించే పురాణ కధల్లోనూ!
నక్షత్రాలకీ గ్రహాలకీ వైదిక ఋషులతో సంబంధం ఉంటుందనే విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, Big Dipper అని ఇతర్లు పిలిచే సప్తర్షి మండలం లోని ఋషుల  గురించి తెల్సుకుంటే చాలు అన్ని సందేహాలూ తీరుతాయి.వ్యక్తులుగా నక్షత్రాలతో సంబంధం స్పష్టం కాకపోయినా కొన్ని ఋషిగణాలకి సామూహికంగా నక్షత్రాలతో ఉన్న సంబంధం వల్ల ఆయా ఋషిగణాలకు సంబంధించిన వ్యక్తులకి కూడా ఆయా నక్షత్రాలతో సంబధం ఉన్నట్టే లెక్క.ఆ విధంగా చూస్తే బృహస్పతి అంగిరస గోత్రీకుడు కాగా మిగిలిన ముగ్గురూ భృగు గోత్రీకులు. సప్తర్షులను ఎలుగుబంటిని గుర్తు చేస్తూ Rukshas/ఋక్షజులు అని కూడా అంటారు!బృహస్పతిని గురుడు అని మనం పిలుస్తూ ఇతర్లు Jupiter అని గుర్తించితే శుక్రతారని Venus అని ఇతర్లు గుర్తించారు.చూశారా, ఇప్పటికి దేవతల రాజగురువు బృహస్పతి అయితే శుక్రుడు రాక్షస గురువు ఎందుకయ్యాడో తెలుస్తున్నది! గబుక్కున తెలియకపొతే నేను చెప్తాను చదివి తెలుసుకోండి.ఫలిత జ్యోతిషంలో గురుగ్రహం జాతకుల జీవితాల మీద ధనాత్మక ప్రభావం చూపిస్తే శుక్రగ్రహం ఋణాత్మక ప్రభావం చూపిస్తుంది - ఒక మనిషి తన జీవితకాలంలోనే వైభవాన్ని చూస్తున్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టూ దరిద్రాన్ని అనుభవిస్తున్నపుడు నరకంలో ఉన్నట్టూ భావిస్తాడు కదా!
గురుగ్రహం ఒకసారి కక్ష్యని పూర్తి చెయ్యడానికి 12 సంవత్సరాలు పడుతుందనే విషయాన్ని బట్టియే 5X12=60 సంవత్సరాల కాలచక్రాన్ని ప్రతిపాదించారు.చైనీయుల 60 సంవత్సరాలకీ 28 నక్షత్రాల క్యాలెండరుకీ వైదిక సాహిత్యంలోని ఖగోళ శాస్త్రమే పునాది.ఇది బాబిలోనియన్ ఖగోళశాస్త్రంలో కనిపించని ప్రత్యేకత - కాబట్టి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకు గ్రహాల గురించి తెలియదనటం అశాస్త్రీయం.సంప్రదాయ హిందూ ఖగోళశాస్త్రంలో ప్రతి నక్షత్రానికీ/గ్రహానికీ ఒక ఋషిపరంపర అనుసంధానించబడినట్టే ఒక ప్రధానదైవతం కూడా అనుసంధానించబడి ఉంటుంది!Jupiterకి వైదిక సాహిత్యంలో అత్యంత శక్తివంతుడైన ఇంద్రుణ్ణి అధిపతిగా చెప్పారు.ఇది రోమన్లు కూడా జూపిటర్ వర్షాలు కురిపించే దేవుడని చెప్తున్నదానితో సరిపోతుంది. అయితే, ప్రాచీనులు గ్రహాలను దేవతల పేర్లతో సూచించారు తప్ప రెంటికీ అభేదం చెప్పలేదు.
వైదిక దేవతలని గ్రహాలకి మాత్రమే పరిమితం చెయ్యకూడదు, అట్లాగే గ్రీకో రోమన్ దేవతలకి గ్రహాల్తో సంబంధం ఉందని అనుకోకూడదు.ఇవన్నీ కొన్ని వివరాలు కలుస్తూ కొన్ని వివరాలు వేరౌతూ ఉన్న జ్ఞాన శకలాలు - పొలికలను చూసి అన్నీ ఒకటే అనుకోవడమూ తప్పే, తేడాలను చూసి అసలు సంబంధం లేదనుకోవడమూ తప్పే!మన ప్రాచీనులు నక్షత్రాల చుట్టూ అల్లిన పురాణ కధలకు అర్ధం మన పూర్వ ఋషులకు మాత్రమే సాధ్యమైన అద్భుతం - వీటికి చెప్పాల్సిన హేతుబంద్ధమైన వ్యాఖ్యానం కోసం వీటికి సంబంధం లేని చోట్ల వెదకడం వల్లనే కొన్ని కధలు అర్ధం లేనివి గానూ కొన్ని కధలు అసభ్యమైనవి గానూ అనిపిస్తున్నాయి!
 హిందూ పురాణాలు గ్రహాలకీ దేవతలకీ కలిపిన సంబంధం ఇట్లా ఉంటుంది:Vishnu - Mercury, Brhspati - Jupiter - indra, Skanda(Son of Shiva) - Mars, Sukra - Venus, Yama - Saturn, అంటే ఒక కధలో Mercury యొక్క చలనాన్ని గానీ విశేషాన్ని గానీ స్వభావాన్ని గానీ సూచిస్తూ ఉండే పాత్రలో విష్ణువుని ప్రవేశపెట్టి కధ నడిపిస్తారు. భృగువులు దైత్యులకీ అంగిరసులు దివ్యులకీ గురుత్వం వహించి నడిపిస్తారని ఇదివరకు చెప్పాను కదా, వీళ్ళిద్దరికీ మొదట్లో ఒకరినొకరు గెలవాలనే స్థాయిలో విరోధం ఉండేది కాదు."తారా శశాంకం", "శశాంక విజయం" అనే శృంగార కలహం జరిగాక దేవదానవుల మధ్యన పరస్పరారోహణావరోహణ పర్వం మొదలయ్యింది!చంద్రుడు, బృహస్పతి, తార - ముగ్గురూ దేవతలే!వాళ్ళ మధ్య జరిగినది నిషిద్ధ శృంగారం!ఇప్పటి పొలిటీషియన్ల మాదిరి శుక్రుడు చంద్రుడి పక్షం వహించడంతో అది కాస్తా దేవతలకీ దానవులకీ పీటముడి అయి కూర్చుంది!
పాతవీ కొత్తవీ కలుపుకుని ఒక పదహారు వెర్షన్లు ఉంటాయేమో ఈ కధకి. విశృంఖలత్వాన్ని విమర్శించే నీతిఖద వెర్షన్ ఉంది, తారని తిరుగుబాటు తత్వానికి ప్రతీకను చేసిన ఫెమినిస్టు వెర్షన్ ఉంది, ముసలి బృహస్పతీ పడుచు తారా అంటూ బాల్యవివాహ వెర్షన్ కూడా ఉంది, ఆధునిక కాలపు హిందూద్వేషులకి కావ్యరచనాశక్తి ఉండి ఉంటే హిండూ గిబ్రమామిక్ కిచిడీ వెర్షన్ కూడా వచ్చి ఉండేది!ఇంతకీ మూలకధ చాలా చిన్నది - బృహస్పతి(Jupiter) యొక్క భార్య(the star)ను సోముడు(moon) ఎత్తుకెళ్ళి దాచేశాడు, రాక్షస గురువైన శుక్రుడు(Venus) చంద్రుడి పక్షం వహిస్తే దేవతల్లో ముఖ్యుడైన రుద్రుడు/స్కందుడు(Mars) గురుడి పక్షం వహించారు.తారకి బుధుడు(Mercury) అనే కొడుకు పుట్టాడు.అసలు పుట్టడం చంద్రుడికే అయినప్పటికీ ఈ బుధుడికి గురుడూ చంద్రుడూ కూడా తండ్రులే అయ్యారు. ఆకాశంలో The Jupiter, The Moon, The Venus, The Mars, The Mercury, The Stars ఎప్పుడెప్పుడు ఎలాగెలాగ కనిపిస్తాయో చూస్తే అసలు చిక్కుముడి విడిపోతుంది, చూద్దామా!Jupiter అత్యంత స్థిరమై నభోమండలాన్నీ నక్షత్రలోకాన్నీ/తారాసమూహాన్నీ పరిపాలించే స్వర్గదైవతం!కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ చంద్రుడు ప్రకాశించడం వల్ల నక్షత్రాలు కాంతి తగ్గి మసకబారిపోతున్నాయి - అంటే చంద్రుడు తారను తీసుకెళ్ళి దాచేశాడు.Venus ఎప్పుడూ సూర్యుడికి దగ్గిరగానే ఉంటూ ఉదయసంధ్యలోనూ సాయంసంధ్యలోనూ మాత్రమే కనిపిస్తుంది - అంటే శుక్రుడు దేవతల్లో చంద్రుడి పక్షానికి రావడం.Mars రాత్రుళ్ళు మాత్రమే కనిపించడం అంటే గురుడి పక్షాన చేరడం.Mars కాంతిలో venus కన్న కొంచెం తగ్గి ఉండి చంద్రగ్రహానికీ శుక్రగ్రహానికీ దగ్గిర్లో తచ్చాడుతూ ఉంటుంది!
ముప్పాళ రంగనాయకమ్మలా "అబ్బెబ్బే, ఇది కాదు జరిగింది. అసలు చరిత్రలో జరిగిన కధ వేరే ఉంది!హరిబాబు మార్చి రాశాడు/బ్రాహ్మణులు తప్పు చెప్తున్నారు" అని అనదల్చుకున్నవాళ్ళు ఆ బృహస్పతీ, చంద్రుడూ, తారా ఏ ప్రాంతంలో ఏ కాలంలో పుట్టారో శాసనాలు గానీ అవశేషాలు గానీ చూపించి కార్బన్ డేటింగుల్నీ డీయన్యే టెస్టుల్నీ ఉపయోగించుకుని  నిరూపించాల్సి ఉంటుంది - అంత దమ్మెవరికి ఉంది?

2 comments:

  1. చాలా వివరణాత్మకంగా ఉన్నదండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...