Thursday, 12 September 2019

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి పడాల రామారావు గారి కధనం ఏమి చెబుతున్నది?

1956 నుంచీ పడాల రామారావు గారు స్వాతంత్య్ర వీరుల చరిత్ర మొత్తాన్ని ఒక చోటకి చేర్చాలని అనుకుని 1990 నాటికి ఒక రూపం తీసుకు వచ్చి ఉపోద్ఘాతంలో "విప్లవ మహాయుగం" అని పేరు పెట్టుకున్నప్పటికీ కవర్ మీద "భారత స్వాతంత్య్ర సాయుధ సమర చరిత్ర 1757 - 1947" అని ఉన్న పుస్తకంలో నరసింహా రెడ్డి 17వ వాడిగా వస్తాడు.మన రాజులంటేనే అవగుణాల పుట్టలని అక్కసు వెళ్ళగక్కే కమ్యునిష్టు సహజ ధోరణికి విరుద్ధమైన శైలిని కనబరచారు పడాల రామారావు గారు.అయితే, లేని గొప్పల్ని కూడా కల్పించి చెప్పే భాజపా హిందూత్వ శైలిని కూడా ప్రదర్శించలేదు - జరిగిన సంఘటనలను మార్చకుండానూ ఇంతదాన్ని అంత చేసి ఉత్ప్రేక్షల్ని వాడకుండానూ తులనాత్మకతను చక్కగా పోషించారు!మొదట ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆయన రాసినది రాసినట్టు ఎత్తి రాస్తాను. చివరలో నా విశ్లేషణ ఉంటుంది.
రాయలేలిన కాలంలో రతనాల సీమగా ప్రసిద్ధి పొంది బ్రిటిషు దొరల హయాంలో రాళ్ళసీమగా మారిన ఆంధ్రదేశపు రాయల సీమను స్వాతంత్య్ర సమరాంగణంలోని మొదటిపేజీలో నిలబెట్టిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సాహసోపేతమైన పోరాటాన్ని తలుచుకున్న చాలు - రోమాంచితం కాని భారతీయుడే ఉండడు!
తల వంచని వీరుడిగా నరసింహా రెడ్డిని నేటికీ రాయలసీమలోని పల్లెపట్టులన్నీ "అడుగో, వచ్చెరా నరసింహా రెడ్డి!ఇడుగో, వెళ్ళెరా నరసింహా రెడ్డి!" అని ఆనాటి అతని వేగాన్ని స్మరించుకుంటూ పదాలు పాడుతూ ఉంటాయి.(నిజమే, ఇతని వేగం ఉప్పెన లాంటిదే - July 1846న మొదలై February 1847న అంతమై పోయింది, కానీ ఇతను ఇంగ్లీషువాళ్ళ గుండెల్లో పుట్టించిన దడ తుఫాను భీబత్సమే!)
1850కి పూర్వం రేనాడు సంస్థానానికి పరువం గల ప్రభువు నరసింహా రెడ్డి.ఇతని పూర్వీకులు కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలలోని 66 గ్రామాలను పరిపాలించారు.నరసింహారెడ్డి తాత చెంచుమళ్ళ జయరామి రెడ్డి, తండ్రి పెద్ది రెడ్డి.
జయరామిరెడ్డి కడప జిల్లాలోని ఉప్పులూరు సంస్థానానికి ప్రభువు.నరసింహారెడ్డి రూపనగుడి గ్రామంలో పుట్టినా పెరిగింది గొల్లదుర్తి, ఉయ్యాలవాడ  ప్రాంతాల్లో - స్థిరపడింది ఉయ్యాలవాడ గ్రామంలో, అందుకే ఈయన్ని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని పిలిచేవారు!
వర్తక నెపంతో తెలుగుదేశంలో అడుగుపెట్టిన ఇంగ్లీషు దొరలు రాజ్యదాహం పెరిగి 1800 ప్రాంతంలో జయరామి రెడ్డి సంస్థానాన్నిబలవంతంగా లాక్కొని పింఛను రూపంలో నెలకు 11 రూపాయల పదణాల ఎనిమిది పైసలు భిక్షగానికి పారేసినట్టు ఇవ్వసాగారు.ఆయన అనంతరం వారసుడైన నరసింహా రెడ్డికి ఆ పింఛను ముడుతుండేది.యీ ముష్టి డబ్బును కూడా ఇచ్చుట నిలిపేసినట్టు 1845లో ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వును జారీ చేసింది.ఆ సంగతి నరసింహా రెడ్డికి తెలీదు.ఈ పింఛను డబ్బుకై కోయిలకుంట్లలో ఉన్న తాసీల్దారు వద్దకు తన మనిషిని పంపాడు.
దురహంకార పూరితుడైన తాశీల్దారు ఆ మనిషి ముందు నరసింహా రెడ్డిని తూలనాడాడు - "వాడొక దాసరైతే వాడికి నువ్వో దాసరివా?ఆ నరసింహ దాసరినే రమ్మను!" అని.ఆ మాట వినగానే నరసింహా రెడ్డి భగ్గున మండిపోయాడు.అతడి నరనరాలు అవమాన వాక్కులకు ఉద్రిక్తమయ్యాయి.తమ సంస్థానాన్ని లాక్కోవడమే గాక, ఇస్తున్న పింఛను ఆపుచేసింది చాలక, దుర్భాషలకు దిగిన తాశీల్దారుపై ప్రతీకార జ్వాల అతడి శరీరమల్లా అలముకొంది.తాశీల్దారుకు కబురు పంపాడు - "ఆ నరసింహ దాసరి రేపే నిన్ను కలుస్తాడు!" అని.
మరునాడు...
పట్టపగలు!
500 మంది బోయసైనికులను సమకూర్చుకొని తాశీల్దారు కచ్చేరిపై దండయాత్ర చేశాడు.తనను అవమాన పర్చిన తాశీల్దారు తల నరికివేశాడు, ట్రెజరీ కొత్వాల్ శిరస్సును కూడా ఖండించాడు, ట్రెజరీని కొల్లగొట్టి కచ్చేరీకి నిప్పంటించాడు!ఆ విధంగా అతడి క్రోధారుణ జ్వాలలకు తాలుకా కచ్చేరీ ఆఫీసు భస్మీపటలమైపోయింది.అక్కడ తెగిన శిరస్సులను ఉప్పుకుండలలో భద్రపరిచి నాయనప్ప కొండగుహలో దాచిపెట్టాడు.
ఇక చెలరేగింది అలజడి!జిల్లా కేంద్రమైన కడపలో ఉన్న పోలీసులలోనూ కలక్టరులోనూ భయబ్రాంతులు చెలరేగాయి!ఎవరింత సాహసం చేసింది?బుర్రలకు పదును పెట్టారు.గాలినైనా పేనగల గూఢచారులు ఆచూకీ తీయడానికి పడరాని పాట్లు పడ్డారు.ప్రజలు నరసింహా రెడ్డి పక్షాన ఉన్నారు గనక ఏ ఒక్కరి నోటా పల్లెత్తు మాట పెకలి రాలేదు. కానీ నాయనప్ప కొండగుహలో దాచిన ఆ త్రుంచిన శిరస్సులు గల కుండలు వారి కళ్ళబడ్డాయి.ఆ తలల్ని చూడగానే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.అదే సమయంలో గూఢచారుల చెవుల్లో నరసింహా రెడ్డి ఆంతరంగికులైన గోసాయి వెంకన్న, ఒడ్డే ఓబన్నల మాటలు పడ్డాయి.ఇక నరసింహా రెడ్డి కోసం గాలించడం మొదలుపెట్టారు.రెండుసార్లు - ఒకసారి గిద్దలూరులో ఒకసారి ముండ్లపాడులో ముఖాముఖి పోరు జరిగింది,రెండు సార్లూ ఇంగ్లీషువాళ్ళు ఓడిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పారు.
పిమ్మట రాయలసీమ నేలపై లెఫ్టినెంట్ వాట్సన్, కెప్టెన్ నాట్ అనేవాళ్ళ నాయకత్వాన పెద్ద యెత్తున బ్రిటిష్ సైన్యం దిగింది.ఫిరంగి గుండ్లతో వాళ్ళు నరసింహా రెడ్డిపై దాడి చేశారు.తమ కంఠాల్లో కొన ఊపిరున్ననతవరకు మన స్వాతంత్య్ర వీరులు పోరు సల్పారు.కానీ దొరల చేతికి నరసింహా రెడ్డి చిక్కలేదు.దొరలు పోరాడుతూనే ఉన్నారు, నరసింహా రెడ్డి అదృశ్యమై పోయాడు!
ఎక్కడికి?
నల్లమల అడవుల్లోకి!
ఈ అడవుల్లోకీ ప్రవేశించారు తెల్లదొరలు.
ఏడీ?ఎక్కడ నరసింహా రెడ్డి!
అదిగో!ఎర్రమల అడవుల్లో తిరుగుతున్నాడు.
ఆ అడవుల్లోకీ ప్రవేశించారు తెల్లదొరలు.
కడకు నరసింహా రెడ్డి తెల్ల దొరల కళ్ళల్లో దుమ్ముకొట్టి బనగానపల్లె వద్ద జగన్నాధ పురం కొండమీద ప్రత్యక్షమయ్యాడు!దినాలు, వారాలు, నెలలు గడిచి పోతున్నాయి.ఎట్టకేలకు వారికి నారసింహా రెడ్డి వంటమనిషి దొరికింది.ఆమెకు లంచమిచ్చి బుట్టలో వేసుకున్నారు.నరసింహా రెడ్డి చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నాయి - రెడ్డికి ఈ గమనిక లేదు.ఒకనాడు వంటమనిషి నరసింహా రెడ్డిని బాగా తాగించింది.ఆ మత్తులో అతడుండగా తుపాకిలోని తూటాలను తీసి దాచేసింది!అట్లా నరసింహా రెడ్డి నిస్సహాయుడై పోయాడు.అదే అస్మయాన్ని అదను చేసుకొని దొరలు కొండను చుట్టుముట్టి నరసింహా రెడ్డిని తమ కబంధ హస్తాలతో నొక్కి వేశారు.
అతన్ని కోయిలకుంట్లకు తెచ్చి జుర్రేరుగట్టుపై ఉరికొయ్యలు నాటి ఉరి తీసేశారు.రాయలసీమ వీరకుమారు డట్లా అస్తమించిపోయాడు!మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలనా నివేదికలో కోయిలకుంటలో ఉరికొయ్యకు వ్రేలాదదీసిన ఆతది శిరస్సును 30 యేళ్ళు, అంటే 1877 వరకు అట్లానే ఉంచినట్లు చెప్పబడింది.ఆ దారుణ దృశ్యాన్ని గాంచి బ్రిటిషు ప్రభుత్వంపై తిరుగబడటానికి ఎవడూ సాహసించడని దొరల భ్రమ!ఈస్టిండియా కంపెనీ పరిపాలనా నివేదికలలో కూడా ఒక నగ్నసత్యాన్ని బయట పెట్టారు - నరసింహా రెడ్డి సాగించిన పోరాటం సామాన్యమైనది కాదని. ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారత స్వతంత్య్ర సమరేతిహాసంలో తన రక్తాన్ని ధారవోసి తెలుగు యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ఎవ్వరికీ తీసిపోరని ప్రపంచానికి చాటిచెప్పి ఆరాధనీయుడయ్యాడు.
ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడిన ప్రతి ఒక్కరికీ దేశభక్తిని అంటగట్టటం కూడా చరిత్రకు అన్యాయం చెయ్యడమేనని నా అభిప్రాయం!చరిత్రను రాసేటప్పుడూ చరిత్రను వ్యాఖ్యానించేటప్పుడూ తమ ఎజెండాను చొప్పించడం వల్లనే కమ్యూనిష్టులు ఇవ్వాళ తిట్లు తింటున్నప్పుడు కమ్యునిష్టులు చేసిన తప్పు మనం కూడా చెయ్యడం సరైనదేనా?చరిత్రను రాసేటప్పుడు మన అభిమాన దురభిమానాలనూ రాగద్వేషాల్నీ  కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.అయితే, వ్యాఖ్యానం అనేది ఆ చరిత్రను మనం ఎలా అర్ధం చేసుకుంటున్నామో చెప్పేది కాబట్టి అందులో రాగద్వేషాలు వస్తాయి, రావాలి కూడాను.ముస్లిం పాలకులు మన దేవాలయాలను కూలగొట్టటం అనేది తీసుకుంటే చదువుతున్న హిందువుకి వ్యాఖ్యానాలు చెప్పకపోయినా ఖచ్చితంగా బాధ కలుగుతుంది!అయితే సిరాజుద్దౌలా, మాలిక్ ఇబ్రహీం, తానీషా వంటివారిని కూడా మర్చిపోయేలా బాబర్, షాజహాన్, ఔరంగజేబుల్ని మాత్రమే భూతద్దంలో పెట్టి చూపిస్తూ మొత్తం ముస్లిం సమూహాన్నే ద్వేషించేలా హిందువుల్ని తయారు చెయ్యటం తప్పా కాదా!
ఉయ్యాలవాడ తిరుగుబాటు వెనక పింఛను ఇవ్వకుండా తనని అవమానించటం తప్ప అతను మొత్తం దేశం గురించి ఆలోచించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?అప్పటికి భారతదేశం అనే వూహయే లేదు కదా!జంబూద్వీపే భరతవర్షే అని చెప్పేది ఆధ్యాత్మికతకు సంబధించిన విషయం.సాంస్కృతికంగా ఒకటి కావచ్చు గానీ రాజకీయ పరిధిలో అనేకమంది రాజులతో కూడిన అప్పటి కాలంలో ఏ ఒక్క ప్రాంతం పట్ల ఇది మాన్ మాతృభూమి అనిపించే స్థాయిలో అందరికీ ఆప్యాయతలు ఉన్నాయి?మనవాళ్ళు తరచు మన హిందూ రాజులు అసలు యుద్ధాలే చెయ్యని ఇతర ప్రాంతాలను ఆక్రమించని శాంతికాముకులు అని చెప్తారు. మళ్ళీ అదే నోటితో ప్రపంచం సరిహద్దుల వరకు విస్తరించిన మహోన్నత మౌర్య సామ్రాజ్యం అని గొప్పలు చెప్తారు - యుద్ధాలు చెయ్యకుండానూ హింస లేకుండానూ ఆ విస్తరణలు జరిగాయా?లేదే!మతం పేరున చెయ్యలేదు, మత మార్పిడులు చెయ్యలేదు,కిరాతకాలు చెయ్యలేదు,ఓడిపోయినవాళ్ళని కూడా మర్యాదగా చూశారు - ఇంతవరకే వాస్తవం.మనవాళ్ళు కూడా యుద్ధాలు చేశారు,ఇతర ప్రాంతాలని ఆక్రమించారు, గెల్చిన చోట మన సంస్కృతిని వ్యాపింపజేశారు - అది సహజమే!ఒక సంస్కృతి వల్ల ప్రభావితమై ఉత్సాహపడి పాండిత్యంలో గానీ వ్యాపారంలో గానీ క్రీడలలో గానీ యుద్ధాలలో గానీ వ్యక్తులు గెలవడం జరిగితే తమను ఆవేశపరచిన అంశాలు గొప్పవని గెలిచినవాళ్ళు అనుకోవడమూ తమను ఆవేశపరచిన అంశాలు చెత్తవని ఓడినవాళ్ళు అనుకోవడమూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జరగుతూనే ఉంటాయి - తమ తమ సంస్కృతుల తరపున పోరాడి విజయం సాధించినవారికి ప్రశంసలు దక్కేదీ తమ తమ సంస్కృతుల తరపున పోరాడి అపజయం పాలైనవారికి ఛీత్కారాలు దక్కేదీ అందుకే!
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒక పాళెగాడు!తనకు అవమానం జరిగిందని తిరగబడ్డాడు!ఒక సంవత్సరం పాటు ఇంగ్లీషువాళ్ళకి నిద్ర పట్టకుండా చేశాడు!వీరుడే, స్వాభిమానియే, క్షాత్రం పోగొట్టుకుని ప్రాణాల కోసం ఆశ పడలేదు - కానీ ఇందులో దేశభక్తి ఎక్కడుంది?"ఇది మన దేశం, దీన్ని ఇంగ్లీషువాళ్ళు ఆక్రమించారుప్రజల్ని దోచుకుంటున్నారుఇంగ్లీషువాళ్ళని మన దేశం నుంచి తరిమికొట్టాలి, ప్రజల్ని ధర్మబద్ధమైన పరిపాలనతో సంతోషపెట్టాలి!" అని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనుకున్నట్టు సాక్ష్యం ఉందా?ఇవ్వాళ ఇంగ్లీషువాళ్ళు దుర్మార్గులని తెలిసింది కాబట్టి వాళ్ళ మీద వ్యక్తిగతమైన కారణాల్తో పోట్లాడినా సువిశాల భారత ప్రజానీకం కోసం పోరాడినట్టు భావించాలా?చరిత్రలో ఒక వ్యక్తి యొక్క స్థానం గురించి అంచనా వేసేటప్పుడు ఉన్న గొప్పల్ని దాచెయ్యటమే కాదు లేని గొప్పల్ని అతికించటం  కూడా తప్పే - నిన్నటి రోజున మొదటి తప్పు చేసినందుకు కమ్యునిష్టుల్ని తిడుతూ ఇప్పటి రోజున మనం చేస్తున్నది ఏమిటి?
చరిత్ర విషయంలో రాగద్వేషాలకు అతీతమైన తులనాత్మకత అసాధ్యమా!

3 comments:

  1. హరి బాబు గారు మీరు చెప్పినది నిజమే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సొంత అవసారాలకే ఉద్యమం చేసినారుతప్ప ఈ విషయం తెలియక భారత ఉద్యమ కారుడు దేశ భక్తుడు ప్రజలు నమ్ముతున్నారు కానీ ఒక విషయం అలా పోరాడబట్టి ప్రజలలో ఒక ఉద్యమము మొదలు అయినది ఇలా చేయడం వలనే ప్రజలలో ఒక స్వాత్య్రాత్ర భారత దేశం కావాలనే పట్టు దళ అప్పుడునుంచే ప్రజలలో మొదలు అయినది

    ReplyDelete
  2. తన వ్యక్తిగత కారణాల వలన పోరాడాడు గానీ ...
    మా‌ చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్ర్యపోరాట వీరుల పేర్లలో ఈ పేరు చూసినట్లు గుర్తు లేదు నాకయితే.

    ఈ పేరుతో రేపు రాబోతున్న సినిమాలో ఇంకా ఎంతగా గ్లోరిఫై చేశారో చూడాలి. సినిమా నిర్మాణం డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి మీరన్న తులనాత్మకత వెనకబెంచిలకు వెళ్ళవచ్చు.

    ReplyDelete
  3. నమస్కారం హరి బాబు గారు
    మనిషికి కడుపు కాలినప్పుడే ఎదుటి వారిపై తిరగ బడుతారు అలగానే నరసింహ రెడ్డి కూడా బ్రిటిష్ అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వక పోతేనే తిరగ పడినాడు తప్ప ప్రజల కోసం దేశం స్వాత్య్రాత్రం కోసం కాదు. ఇప్పుడు వచ్చే ఉద్యమాలు రాజకీయ లబ్ది కోసం తప్ప ప్రజల అవసారాలకు కాదు

    నక్సల్స్ ఉద్యమం పుట్టాక వచ్చినది భూమి పెత్తనపు దారుల మీద కొందరు నాయకులు డబ్బు మదంతో ప్రజలను పాటించక పోతే ఉద్యమాలు ఇప్పుడు సమాజములో నాయకుల మీద ఉద్యమాలు ఉన్నాయి
    స్వస్తి జై హింద్

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...