Wednesday, 14 August 2019

నన్ను తరింపజేసే తారకమంత్రం నావైపుకి నడిచి వచ్చిన విధం ఎంత అద్భుతం!


నిన్న గాక మొన్న కన్ను తెరిచిన ప్రతి బొడ్డూడని పసికూనకీ "వేదాల్లో అది లేదు వేదాల్లో ఇది లేదు, ఉంటే చూపించు!" అని నిలదియ్యటం అలవాటైపోయింది. ఎక్కడ బడితే అక్కడ "వేదాలలో మూర్తి పూజ గురించి దేవాలయాల గురించి అసలు ప్రస్తావన ఉందా?" అని నిలదీస్తున్న వాళ్ళకి వేదంతో ప్రత్యక్ష సంబంధం ఉందా? ఎవరైనా దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి కదా! నేను బల్లగుద్ది చెప్పగలను అలా వాదించేవాళ్ళకి వేదం గురించిన ప్రత్యక్ష జ్ఞానం లేదు. అలాంటివాళ్ళు తరచు ఉటంకిస్తున్న యజుర్వేదపు ఇంగ్లీషు అనువాదం కూడా హిందూద్వేషులు చేసిన తప్పుడు అనువాదం!
నాకూ వేదం గురించిన ప్రత్యక్ష జ్ఞానం లేదు, కానీ ఎక్కడ వెతికితే అధికారికమైన సమాచారం దొరుకుతుందో తెలుసుకోగలను, పైన ఎదటివాళ్ళని నోరు మూయించటానికి పనికొచ్చే ముక్కల్ని మాత్రం ఎత్త్తి రాయడం కాకుండా పూర్వాపరాలు చూడటం, నాకు దొరికినది సత్యమా కాదా అని పాఠాంతరాలతో సరిపోల్చి చూడటం లాంటివి కూడా నాకు తెలుసు. వేదసాహిత్యం గురించి నాకు కొంత తెలుసు - అసలు నాకు తెలియని దాన్ని గురించి రాసి అభాసుపాలయ్యే మనిషిని కాను నేను.
వేదంలో ఏది ఉంది ఏది లేదు అని చెప్పటానికి కూడా సంస్కృతం క్షుణ్ణంగా నేర్వాలి, పైన నిరుక్తం తెలియాలి.పాణినీయం వేదం దగ్గిర పనిచెయ్యదు, వేదంలో ఉన్న శాస్త్రాలలోని ఓక భాగమైన నిరుక్తం ప్రకారమే నాలుగు వేదాలకి అర్ధం చెప్పాలి - ఇది చాలా ముఖ్యమైన విషయం.ఇంతకన్న ముఖ్యమైన విషయం ఏ ఒక్క వేదమంత్రానికీ పాఠాంతరాలు ఉండవు, అంటే వెర్షన్లు ఉండవు.సూటిగా చెప్పాలంటే నీకలా అర్ధమైతే నాకిలా అర్ధమైంది అని కూడా అనరాదు. వేదపఠనం కూడా తెలియాలి.ఎందుకంటే వేదమంత్రాల్ని ప్రింటులో ఉన్నది ఉన్నట్టు చదివితే కుదరదు - హ్రస్వాక్షరాన్ని దీర్ఘాక్షరం కింద చదివినా దీర్ఘాక్షరాన్ని హ్రస్వాక్షరం కింద చదివినా అర్ధంలో చాలా తేడా వస్తుంది. ఇంతకీ ఈ హేతువాద నాస్తికవాద హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులు ఎత్తి చూపించిన నాలుగు ముక్కలేనా వేదం అంటే!ఇంకేమీ లేదా?
వేదం మూర్తిపూజని సమర్ధించలేదా - హవ్వ!
ద్వే వావ బ్రహ్మనో రూపే, మూర్తం చైవామూర్తం చ
dve vāva brahmaṇo rūpe, mūrtaṃ caivāmūrtaṃ ca
(బృహదారణ్యకోపనిషత్తు - 2.3.1)
- God (Brahman) has two modes, formless (niraakaara, asambhuta) as well as form (saakaara, sambhuta).
హేతువాద నాస్తికవాద హైందవేతర మహనీయగుణ మార్తాండతేజులు యజుర్వేదం 32 అంటున్నది "న తస్య ప్రతిమా అస్తి" - దాని గురించి ఒక చిన్న సంగతి చెప్తే సరిపోతుంది.అక్కడ సరైన అనువాదం చూస్తే ఆ ఒక్క ప్రతిమలో మాత్రమే నేను లేను, విశ్వంలోని ప్రతి వస్తువులోనూ ఉన్నాను అనే అర్ధం.దానికి హిందూద్వేషులు "చూశారా!దేవుడు తనే ప్రతిమలో ఉండనని చెప్తున్నాడు" అని హడావిడి చేస్తున్నారు - ఇసక తక్కెడ పేడ తక్కెడ, అంతే. ప్రస్తుతం యజుర్వేదం 40.9 గురించి కొంత విస్తరించి చెబుతాను.ఇక్కడ ఒక తమాషా కనిపిస్తుంది, కొంచెం శ్రద్ధ చూపించండి!ఈ 40వ అధ్యాయాన్ని వాజసనేయ సంహిత అనీ శుక్ల యజుర్వేదం అనీ రెండు పేర్లతో పిలుస్తారు. దీనినే ఈశోపనిషత్ అని కూడా అంటారు - ఈశావాస్యోపనిషత్తు కాదండోయ్, అది వేరు!
अन्धं तमः प्रविशन्ति ये ऽसम्भूतिम् उपासते
ततो भूय इव ते तमो सम्भूत्याम् रताः
andhaṁ tamaḥ praviśanti ye 'sambhūtim upāsate
tato bhūya iva te tamo ya u sambhūtyām ratāḥ
(Madhandiya recension)

अन्धं तमः प्रविशन्ति ये ऽविद्याम् उपासते
ततो भूय इव ते तमो विद्यायाम् रताः
andhaṁ tamaḥ praviśanti ye 'vidyām upāsate
tato bhūya iva te tamo ya u vidyāyām ratāḥ
(Kanva recension)
recension అనేది తత్సమ తద్భవ సంస్కృత సంప్రదాయం ప్రకారం తెలుగులో శాఖ అవుతుంది.ఈ రెండు శాఖల వారూ ఒక దానిలో "విద్య-అవిద్య" ఒక దానిలో "సంభూతి-అసంభూతి" అని రెండు పాఠాంతరాలను చూపిస్తున్న దానికి మంత్రం సంఖ్య 40.9 అని ఒకటే ఉంటుంది - ఎందుకని?ఇవి ఒకే సత్యానికి "బింబ-ప్రతిబింబ" రూపాలు గనక! ఏది బింబం ఏది ప్రతిబింబం అనేది చెప్పటం కూడా కష్టమే.

మొదట విద్య-అవిద్య గురించిన మంత్రానికి అర్ధం చూస్తే ఇలా ఉంటుంది:
"They who worship Avidya alone fall into blind darkness ; and they who worship Vidya alone fall into even greater darkness."ఇందులో ఉన్న కిరికిరి ఏమిటో చూశారుగా - "అవిద్య"ను మాత్రమే ఉపాసిస్తే మామూలు చీకటి అయితే "విద్య"ను మాత్రమే ఉపాసిస్తే గాఢమైన చీకటి అవుతుందట!ఇక్కడ అవిద్య అంటే వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం లాంటి లౌకిక విద్యలు, విద్య అంటే దైవం గురించి చెప్పే బ్రహ్మవిద్య అని అర్ధం చేసుకోవాలి.
ఇప్పుడు అసంభూతి-సంభూతి గురించిన మంత్రానికి అర్ధం చూస్తే ఇలా ఉంటుంది:
"Into blinding darkness pass they who are devoted to the unmanifest, and into still greater darkness, as it were, they who delight in the manifest" ఇక్కడా అదే కిరికిరి ఉన్నది చూశారుగా - "అసంభూతి"ని మాత్రమే ఉపాసిస్తే మామూలు చీకటి అయితే "సంభూతి"ని మాత్రమే ఉపాసిస్తే గాఢమైన చీకటి అవుతుందట.

కొందరు వ్యాఖ్యాతలు "సంభూతి-అసంభూతి" మంత్రానికి
Enter into the darkness those(fools) who engage into the activities of destruction(by creating conflict based on ideology, like, race or origin), yet enter into gerater darkness those who enae into (selfish) the lust of material things.
or
Enter into darkness those who renounce the world or disregard this material existence but yet enter into more darkness those who deeply indulge into material lust.
అనే అర్ధాలు చెప్తున్నారు.మొదటి సగం సరళంగా ఉన్నదాన్ని సంక్లిష్టం చేస్తూ ఉంటే రెండవ సగం నేను చెప్పిన అర్ధాన్నే ఇస్తున్నప్ప్పటికీ కొంత అయోమయాన్ని కలగజేస్తున్నది. మొదటి సగంలో ఈ వ్యాఖ్యాత సంభూతి అనే పదానికి ఉన్న అనేకమైన సమానార్ధకాల(synonyms)లో Greed(of material things) అనే పదాన్ని తీసుకున్నారు - అంత దూరం పోవడం దేనికి?
తెలుగులోనూ ఇంగ్లీసులోనూ ఈ సమానార్ధక వ్యతిరేకార్ధక పదాలు ఉన్నాయి.వీటిలో Contextual Priority ఉంటుంది.అదీ గాక వ్యతిరేకార్ధకాల జంటని పోల్చవలసి వచ్చినప్పుడు జంటలోని రెండింటికీ Contextual Priority ఉండాలి. ఉదాహరణకి "విష్ణు" అనే పదానికి చాలా సమానార్ధకాలు ఉన్నాయి.కానీ ప్రధానమైనది వ్యాపించే తత్వం ఒక్కటే - కవులు వేరే అర్ధం చెప్పాలనుకుంటే ముందో వెనకో ప్రత్యేకమైన లీడ్ ఇస్తారు, ఆ లీడ్ లేనప్పుడు వ్యాపించే తత్వం గురించి చెబుతున్నట్టు అర్ధం తీసుకోవాలి.ఆ లెక్కన చూస్తే సంభూతి కానిది అసంభూతి, విద్య కానిది అవిద్య అన్న సంబంధం ప్రకారం ఇవి వ్యతిరేకార్ధక పదాల జంటలు.అయినప్పుడు, Enter into the darkness those(fools) who engage into the activities of destruction(by creating conflict based on ideology, like, race or origin), yet enter into gerater darkness those who enae into (selfish) the lust of material things. అనే భాగంలో అనిపిస్తున్న activities of destruction - lust of material gatherings అనేవాటికి అలాంటి సంబంధం ఉందా?అయితే గియితే activities of destruction - activities of construction అనేవి సరైన జంటలు అవుతాయి.ఆ పదాలకి సమానర్ధకాలనే తీసుకోవడం వల్ల ఆ వ్యాఖ్యాత చెప్పింది తప్పు కాదు గానీ దూరాన్వయం అవుతుంది, అంతే!
ఇక నేను పైన చెప్పినది క్లుప్తమైన విశ్లేషణ గనక కొంత గందరగోళం వస్తుంది కాబట్టి కొంచెం విడమరిచి చెబుతాను.సంభూతి - అసంభూతి అనేవి సృష్టి యొక్క ఉనికి అనే అంశానికి చెందిన రెండు పరస్పర విరుద్ధ తర్వాలు.సంభూతి అంటే visual existence అనగా ఇంద్రీయగ్రాహ్యమైన పాదార్ధిక ప్రపంచమూ అందలి వస్తువులూ ఉంటాయి, అసంభూతి అంటే virtual existence అనగా జ్ఞానముతో మాత్రమే తెలుసుకోదగిన దైవం, కాలం, సృష్టి క్రమం, చతుర్యుగ విభజన వంటి విషయాలు వస్తాయి.నేను చెప్పిన క్లుప్తమైన అర్ధాన్ని "Into blinding darkness pass they who are devoted to the unmanifest, and into still greater darkness, as it were, they who delight in the manifest" అని మక్కీకి మక్కీ తీసుకుంటే ఆ రెండింటిలో ప్రతి ఒకటీ చీకట్లోకి తీసుకు వెళ్తున్నప్పుడు ఏ ఒక్కదాన్ని గురించి కూడా తెలుసుకోవడం అనవసరం అనిపిస్తుంది, అవునా?
కాబట్టి మన విచక్షణని ఉపయోగించి ఆలోచిస్తే రెంటిలో దేన్నీ తిరస్కరించకుండా సమతౌల్యం పాటించాలి అని తెలుస్తుంది.సంభూతి అంటే కంటికి కనబడే మూర్తి, అసంభూతి అంటే కంటికి కనబడని తత్వం అని గ్రహిస్తే మూర్తిని చూస్తూ తత్వాన్ని గ్రహించడమే మూర్తి పూజలోని అంతరార్ధం అనేది నా తీర్పు. బీజరూపంలో వేదం చెప్పిన సత్యాన్ని మనం మన పాండిత్యాన్ని బట్టి అన్వయించుకోవడానికి పెద్దలు చెప్పిన పద్ధతినే నేను పాటించాను. మీకు ఇంకా అనుమానం ఉంటే గరికిపాటి వారినో లేదా మీకు దగ్గిరలో ఉన్న ఆ స్థాయి పండితుల ముందు నా విశ్లేషణని ఉంచి నేను చెప్పిన అర్ధం సరైనదో కాదో తేల్చుకోవచ్చును. మళ్ళీ మళ్ళీ ఈ వాదనలు చెలరేగకుండా ఉండటానికి వేదానికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం చెబుతున్నాను.ఇంత విస్తారమైన వేదవాజ్మయంలో ఏ ఒక్క మంత్రమూ ఇంకొక మంత్రాన్ని ఖండించదు!అలా ఖండించుతున్నదని ఏవరైనా నిరూపించి ఉంటే ఇప్పటికే వేదం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది!ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేకపోవటం కాదు, ఇకముందు కూడా ఎవ్వరూ వేదంలో ఒక భాగం మరొక భాగాన్ని ఖండిస్తున్నదని నిరూపించలేరు. కాబట్టి వేదం మూర్తిపూజని సమర్ధిస్తున్నదా లేదా అనే విషయంలో హిందువులకి సందేహాలు అనవసరం!
"రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును అను నొక్క వాక్యమైన నెక్కడ వేదములందు గనబడదు", "మూర్తిపూజకు లెల్లరు నజ్ఞానులై యుండి మనుష్య జన్మమును వ్యర్ధం జేసుకొని మరణించిరి" అని దయానంద సరస్వతి అన్నారు అనీ ఆలయాలను గురించి చెప్పే ఆగమాలు వేదంలో భాగం కాదనీ తర్వాత కాలంలో రాసినవి కాబట్టి అవి ప్రామాణికం కాదనీ ఎవరెవరో ఏవేవో మాట్లాడేస్తున్నారు.అసలు 1824లో పుట్టిన దయానంద సరస్వతి తనకన్న ఎన్నో వేల సంవత్సరాల ముందు పుట్టిన ఆది శంకరాచార్యుణ్ణీ రామానుజాచార్యుణ్ణీ వ్యర్ధజీవులై మరణించారని అనడమే తప్పు!దయానంద సరస్వతి జీవితమే వివాదాల మయం - మన మతంలో లోపాలు ఉన్నాయనిపిస్తే సంస్కరించుకోవటం వరకు పరిమితమవ్వాలి గానీ క్రైస్తవాన్నీ ఇస్లామునీ పదే పదే కెలకడం దేనికి?అలా అతిగా విమర్శించి వాళ్ళకి కోపం తెప్పించడం వల్ల చాలాసార్లు విషప్రయోగానికి గురయ్యాడు!వేదం మీద మంచి పట్టు ఉండటం వరకు మెచ్చుకోవచ్చు గానీ నాకు నచ్చిందే వేదంలో ఉంది,నేను చెప్పిందే నమ్మాలి, నాకు నచ్చని పనులు చేసిన వాళ్ళు వ్యర్ధజీవులు అనే మంకుపట్టు ఉన్న మనిషి సర్వజనామోదయోగ్యుడు కాలేడు.తమ తమ పాండిత్యాలను బట్టి ఒకే విషయం గురించి ఒక్కో గురువూ ఒక్కోలా చెబుతున్నప్పుడు మనం దేన్ని పాటించడం సులభసాధ్యమో దాన్ని పాటించితే చాలు - నీకు నచ్చిన దాన్ని నెత్తిన పెట్టుకుని నీకు నచ్చని వాట్ని కాళ్ళతో తొక్కడం అనే అతి చెయ్యొద్దు, అది మూర్ఖత్వం అవుతుంది.. సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడే అంత పొడుగు భగవద్గీతని నిలబెట్టి క్లాసు పీకిన తర్వాత కూడా "నోరు నెప్పెట్టేలా వాగాను,నేను చెప్పినట్టే చెయ్యి - నా కష్టం వృధా చెయ్యకు!" అని రుబాబు చెయ్యకుండా "నేను చెప్పానని చెయ్యవద్దు, నీకు నువ్వు శాస్త్రప్రమాణం తర్కించి చూసుకుని నచ్చితేనే పాటించు!" అని స్వేఛ్చ ఇస్తుంటే ఈ దయానంద సరస్వతి ఎవరండీ తనకి నచ్చని మూర్తిపూజ చేస్తున్నందుకు ఇతరుల్ని వ్యర్ధజీవులని అనటానికి?ఆ-గమం అనే పదవ్యుత్పత్తిలోనే "వేదం నుంచి దిగి వచ్చినది" అని కనబడుతుంటే ఆగమాలు వేదాలోనివి కావనడం తెలివి తక్కువ మాట.
అయితే, సనాతన ధర్మం మనిషికి తన అసలు లక్ష్యాన్ని చేరుకోవడానికి చెప్పిన అనేకానేకమైన విధులలో ఒకటి మాత్రమే కాబట్టి విగ్రహారాధనకి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం, కాలహరణం తప్ప ప్రయోజనం లేని వాదప్రతివాదాలు చెయ్యడం ఇక చాలిస్తే మనకే మంచిది. సనాతన ధర్మం మనిషికి పెట్టిన లక్ష్యం దేవుణ్ణి చూడడం కాదు దేవుడై పోవడం!దేవుణ్ణి చూడడమే కష్టమైపోయి ప్రతిమలను చెక్కుకుని వాటిని ప్రేమిస్తూ ఉంటే ఇంక దేవుడై పోవడం ఎట్లా అని విసుక్కోవద్దు, సనాతన ధర్మం దానికొక సులభ సాధ్యమైన తరుణోపాయం చెప్పింది.ఒక మనిషి తరించడానికి ఒక మంత్రం చాలు - ఒక మూర్తిని ప్రధానం అనుకుని ఆ మూర్తిని గురించి లక్ష్యలక్షణసమన్వితమైన ఒక మంత్రాన్ని తీసుకుని ఆ ఒక్కదానినే మొత్తం జీవితంలోని సమస్తమైన దశలకీ దిశలకీ వైభవాలకీ వైరాగ్యానికీ ఆలంబన చేసుకుంటూ ఉపాసిస్తే జీవన్ముక్తి తధ్యము సుమతీ!
ఇక్కడ సనాతన ధర్మం పెట్టిన మెలిక ఏమిటంటే, మొత్తం మానవ జాతికి ఒకే ఒక మంత్రాన్ని చెప్పలేదు - అనేక మూర్తులను చూపించి అనేక మంత్రాలను వినిపించి ప్రతి మనిషినీ వీటిలో నీకు ఇష్టమైన దాన్ని తీసుకోమని బహుళత్వాన్ని ప్రతిపాదించింది. అతిధి మర్యాదలో రెండు రకాల సంప్రదాయాలు ఉన్నాయి - ఆకలితో ఉన్నవాడికీ, బలహీనుడికీ, రోగికీ మనమే వాళ్ళ తరపున ఆలోచించి వాళ్ళకి ఒకే ఒక బలవర్ధకమైన ఆహారాన్ని పరిమిత స్థాయిలో ఇవ్వడం ఒకటి కాగా గృహస్థులు అభ్యాగతులకీ విందులలోనూ అనేక రకాల పిండివంటల్ని వడ్డించటం రెండవది. సనాతన ధర్మం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడాన్ని లక్ష్యం చేసుకున్నది గనక బహుళత్వానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషి తనకు తగిన మంత్రాన్ని ఎంచుకోవడం అనేది మూడు రకాల దారుల్లో జరుగుతుంది. ఒకటి, కుటుంబ వాతావరణాన్ని బట్టి తల్లిదండ్రులనుంచి వినటం. రెండు, తను విన్నవాటిలో రుచి కుదరక వెతుక్కుని సాధించటం. మూడవది, తన వెతుకుడుతో సంబంధం లేకుండా తారణమంత్రం సాధకుణ్ణే వెతుక్కుంటూ రావటం!
మూడవది ఈమధ్యనే నాకు అనుభవంలోకి వచ్చింది. "శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్" దగ్గిర నుంచి "శ్రీ కృష్ణా!యదుభూషణా!" వరకు చాలా పద్యాలు నాకు కంఠగతమే!ఇంట్లోవాళ్ళు ఉన్నదే ఇలాంటివి భరించడానికి గాబట్టి సిగ్గు లేకుండా పాడుతూనే ఉంటాను బయటి వాళ్ళెవరూ లేనప్పుడు. మధ్యలో ఒకసారి "హింస పెడుతున్నానేమో - ఎందుకొచ్చిన గోల, అడిగితే పోలా?" అని ఎలా ఉందని మా అమ్మాయిని కెలికితే "బాగానే ఉందిలే - పాడుకో!" అని భరోసా ఇచ్చి "నేను వినట్లే!" అని బాపు మార్కు రిటార్టు కూడా ఇచ్చి నన్ను అచ్చోసిన ఆంబోతులా వొదిలేసింది.కానీ, ఏది పాడుతున్నా మనస్సు లీనం కాక కొన్ని సార్లు పాడాక అసంతృప్తి వినిపించేది.నాకోసం నేను రాసుకున్న "నీ ప్రేమ నాకు భవరాగబంధమోక్షణం","హర హర గంగే" లాంటివి కూడా సంతృప్తిని ఇవ్వలేదు. అలాంటి స్థితిలో ఆధ్యాత్మిక విషయాల కొసం వెతుకుతుంటే "ఢమరుక ధ్వనిలాంటి శ్లోకాలతో శివుణ్ణి మెప్పించిన భక్తుడు" అనే వీడియో కనపడింది.అక్కడ ఆయన చిదంబరం ఆలయ విశేషాలకి సంబంధించిన వ్యాఘ్రపాదుడు, పతంజలి అనే ఇద్దరు భక్తుల్ని గురించి చెబుతూ నటేశ నవకం మొదటి చరణాన్ని చూపించారు, పాడి వినిపించారు.అంతే!అది చదువుతుంటేనే మనస్సు పులకించిపోయింది.ఒక ఆశ్చర్యం యేమిటంటే అంతకు కొన్ని రోజుల ముందు "పరంతప, భవంహర, పరంపర, చిరంతన, నిరంతర" లాంటి పదాల్ని తీసుకుని ఒక సీస పద్యం తేటగీతితో సహా పూర్తి చేసి వాడుకుందామని అనుకున్నాను - మాత్రా ఛందస్సు కాబట్టి వేరే పదాలు కలపకుండానే ఇక్కడిలాగే రెండు పద్యాల్నీ పూర్తి చెయ్యొచ్చు.మనస్సులో అనుకోవటమే తప్ప పని మొదలుపెట్టలేదు. ఇప్పుడిది కనపడగానే, "ఓరి బడుద్ధాయా!నువ్వు కొత్తగా మొదలు పెట్టడం దేనికి?పతంజలి ఇదివరకే రాసేశాడు. మళ్ళీ నీ పాండిత్యం దేనికి? దాన్ని వాడుకో చాలు!" అని శివుడు టెంకిజెల్ల కొట్టి చెప్పినట్టు భలే ఆనందం వేసింది!
ఆయన కూడా మొత్తం స్తోత్రం కావాలంటే వెతుక్కోమన్నారు కదాని వెతికితే తెలుగు లిపిలో దొరికింది, రాసుకున్నాను గానీ పాడటం విని నేర్చుకుంటే బాగుంటుందనిపించి మళ్ళీ వెతికితే PatancliKrutha Nataraja Stotram - Shiva Geethanjali - Maalola Kannan & Bhakthavatsalam అనే వీడియో దొరికింది.మొదలుపెట్టినప్పుడు ఉన్న హుషారు తర్వాత తగ్గిపోయింది - వారిది వేద పఠన శైలి, మరీ గాంభీర్యత అధికంగా ఉండి దమ్ము పట్టటం కష్టమై పోయింది. మళ్ళీ వెతకడం మొదలుపెడితే ఆఖరికి Nataraja stotram Natesa navakam by Patanjali Sung by TS Ranganathan దగ్గిర వెతుకులాట ఆగింది - పాడిన విధానం లలితసంగీతంలా ఉండి హాయిగా ఉంది!ఇక్కడున్న అదనపు సౌకర్యం ఏమిటంటే, ప్రతిపదార్ధం చెబుతున్న ఒక లింకును కూడా ఇచ్చారు.మంత్రం ఫలించాలంటే అర్ధం తెలియాలి. అర్ధం తెలియకుండా ఉపాసించే మంత్రం లొల్లాయిపాట కన్న ఎక్కువ కాదు.
సరే, ఇక్కడ మనకి కావలసిన రెండు పనులూ జరిగాయి - పాడుకోదగిన శైలి దొరికంది, వాడుకోదగిన అర్ధం తెలిసింది.ఇంక సాధన మొదలు పెట్టాను.ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఇదే నా తారణ మంత్రం అనే నమ్మకం మరింత బలపడుతున్నదే తప్ప శ్రద్ధ తగ్గడం లేదు, విసుగు పుట్టడం లేదు, మరొక దానికోసం వెతకాలనిపించడం లేదు! నా తారణ మంత్రం నాకు దొరకడం గురించి ఇంత సుత్తేసి మిమ్మల్ని వూరికే వొదిలెయ్యడానికి మనసొప్పక రికార్డు చేసి వినిపించి శిక్షించాలని అనిపించి అంత పనీ చేసేశాను.మావాళ్ళు నా గొంతుని మెచ్చుకున్నారు గాబట్టి మీరు తిట్టుకోరనే ధైర్యం నాకుంది.స్వోత్కర్షలు నాకు అలవాటు లేనివి గాబట్టి పాడిన పద్ధతిని కూడా ఇతరుల్తో పోల్చుకుని సంతృప్తి పడ్డాను. అయినా సరే మీకు నచ్చకపొతే - I AM SORRY!
మంత్రాలకి చింతకాయలు రాల్తాయా? రాలవు! చింతలు పోతాయా? పోవు గాక పోవు! మరి, సాధన వల్ల ఉపయోగం ఏమిటి? ధైర్యం వస్తుంది! "ఎన్ని కష్టాలు రానీ, ఎన్ని నష్టాలు రానీ - తృటిలో దాటేస్తాను! దేవుడే నాకు తోడు - భయం దేనికి?" అని కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేని మనస్తత్వం వస్తుంది.
ఇతి శుభం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...