Wednesday, 3 April 2019

అప్పుని ఎవరు పుట్టిస్తున్నారు?అప్పుని ఎలా పెంచుతున్నారు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా ఉపయోగించుకుంటున్నారు?అప్పుని లేకుండా చెయ్యలేరా!

          చాలా కాలం క్రితం రిజర్వ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ చెప్తున్న ఒకరు "నువ్వు పది రూపాయలు తీసుకెళ్ళి రిజర్వ బ్యాంకు దగ్గిరకెళ్ళి ఇది నాకక్కర్లేదు అంటే దానికి సమానమైన బంగారం నీకు ఇస్తుంది,ఎందుకంటే, ఆ పది రూపాయల్ని ముద్రించేటప్పుడు తన దగ్గిర ఉన్న బంగారం నిల్వల్నే డబ్బుగా మార్చి మనకి అందిస్తుంది కాబట్టి" అని చెప్పారు.అప్పుడు అది నిజమేనని నమ్మాను కానీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తుంది - రిజర్వ్ బ్యాంక్ అనేది మెజీషియన్ శూన్యం నుంచి కుందేలుని సృష్టించినట్టు ప్రభుత్వం ద్వారా రాబోయే సంవత్సరపు ఎదుగుదలని లెక్కలోకి తీసుకుని  కరెన్సీని ముద్రించి దాన్ని మనకి అప్పుగా ఇవ్వడానికి దుకాణం పెట్టుకుని కూర్చున్న వ్యాపార సంస్థయే తప్ప మనకి సౌకర్యాల్ని అమర్చి పెట్టే ధార్మిక సంస్థ కాదు!

          ఎందుకంటే, ఒక రూపాయి నోటు జీతం రూపంలో గానీ లాభం రూపంలో గానీ వడ్డీ  రూపంలో గానీ నీ చేతికి వస్తున్నదంటేనే అది రిజర్వ్ బ్యాంక్ నీకు అప్పుగా ఇచ్చినట్టు,నువ్వేదయినా వస్తువుని ఎవరి దగ్గిరయినా కొంటే తిరిగి రిజర్వ్ బ్యాంకుకి తీసుకున్న అప్పుని చెల్లించేసినట్టు. నమ్మకం లేదా? అయితే, ఈ కరెన్సీని ముద్రించటానికి ముందూ తర్వాతా ఇంగ్లీషువాళ్ళు మన దేశంలో వ్యాపారం చేసిన పద్ధతిని చూడండి ఒకసారి!

          ఇంగ్లీషువాళ్ళు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ముస్లిముల ఆక్రమణకీ దీనికీ తేడా ఏమిటి అనే విషయంలో మన దేశపు పండితులు "హిందూ రాజులు ఒకరితో ఒకరు కలహించుకుంటూ విలాసాలలో మునిగి తేలుతుంటే దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు!వాళ్ళు ఐకమత్యంగా ఉండి ఉంటే మన దేశం పరాధీనం అయ్యి ఉండేది కాదు కదా!" అనే సొల్లు చెప్తారు.కానీ, అప్పటి హిందూ ముసల్మాన్ ప్రభువులది వ్యాపారంలో ఇంగ్లీషువాళ్లు అనుసరించిన వ్యూహం అర్ధం కాని అమాయకత్వం! ముస్లిములలో కూడా మాలిక్ ఇబ్రహీం, తానీషా వంటి సద్వర్తనులు ఉన్నారనేది మర్చిపోకూడదు.అదీగాక, నేను అమాయకత్వం అనే పదం వాడాను కాబట్టి వాళ్లు అజ్ఞానులని జాలిపడుతున్నట్టు కూడా కాదు.ఎందుకంటే, ఇప్పటికీ ప్రపంచ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ చాలామంది ఆర్ధికవేత్తలకే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోని దుర్మార్గం అర్ధం కావడం లేదు, అర్ధం అయినవాళ్ళకి కూడా దీనినుంచి బయటపడే పరిష్కారం తెలియడం లేదు! మరి, కొత్తగా కనిపిస్తున్న అత్యంత ఆకర్షణీయమైన పద్ధతిలోని దేహం ఇక్కడ ఉంటే ప్రాణం మాత్రం సప్తసముద్రాల కవతలి చిలకలో ఉన్నట్టు అనిపించే అసలు కీలకం అర్ధం కావడం ఎలా సాధ్యం?

          రాను రాను రాజు గారి గుర్రం గాదిదై గుడ్డు కూడా పెట్టిందన్నట్టు ఈ దేశంలో అడుగుపెటిన మొదటి రోజుల్లో దుబాసీల దగ్గిర్నుంచి రాజుల ఉంపుడుగత్తెల వరకు ప్రతి అడ్డగాడిదకీ వంగి వంగి దణ్ణాలు పెట్టిన East India Company ఆ కాస్త అనుమతులూ దొరికాక వాళ్ళకీ వీళ్ళకీ కలహాలు రేపెట్టి వాళ్ళు చేసుకునే యుద్ధాల్లో ఇరు పక్షాలకీ అప్పులిచ్చి రెండు రాజ్యాల్నీ తన పీట కిందకి తెచ్చుకునే పాత ట్రిక్కునే ఇక్కడా ఉపయోగించి మోనాపలీ తెచ్చుకున్న 1765 నుంచీ మరో రూపాన్ని చూపించటం మొదలుపెట్టింది. యుద్ధరుణం వసూలు పేరుతో పన్నుల్లో వాటా తీసుకునేది, ఇందులోనుంచి మూడోవంతు పక్కకి తీసి దాంతో ముడిసరుకుల్ని కొనుక్కునేది,ఈ ముడిసరుకులని ఉపయోగించుకుని లండనులో తయారు చేసిన వస్తువుల్ని మనకీ ఇతర్లకీ అమ్మేది - ఈ రకం పనులు మనం చెయ్యటం అటుంచి దగ్గరివాడు చేస్తున్నాడని తెలిస్తే మొహాన ఉమ్మేస్తాం, అట్లాంటిది కొన్ని తరాల పాటు ఘనకార్యం లాగ చేశారు, ఎంత సిగ్గు లేని మంద!


          వాళ్ళు సాధించామని చెప్పుకుంటున్న పారిశ్రామిక విప్లవం ఒక బూటకం - ఆవిరి యంత్రాల్నీ రైలింజన్లనీ తయారు చేసింది వాళ్ళే గానీ దానికి పెట్టుబడి ఎక్కడిది?మన డబ్బే!ఒక్క ఇంగ్లాండు మాత్రమే కాదు, ఇవ్వాళ వైభవోపేతమై విర్రవీగుతున్న అన్ని యూరోపియన్ దేశాలూ మన దగ్గిర్నుంచి కొల్లగొట్టుకుపోయిన సొమ్ముని మూలధనం చేసుకుని బలిసినవే - వాళ్ళ సొంత చరిత్రనే అబద్ధాలతో నింపి భ్రష్టు పట్టించుకున్న సిగ్గు లేని మందకి వలస దేశాల చరిత్రల్ని అబద్ధాలతో నింపి భ్రష్టు పట్టించటం ఒక లెక్కా!

          పన్నులు వసూలు చేసేది ఒకడూ సరుకులు కొనుక్కునేది ఇంకొకడూ కావడంతో పత్తి రైతులూ నేతపనివాళ్ళూ ఈ మాయని కనిపెట్టలేకపోయారు.మరి, అంతకుముందు ఇక్కడ ఉన్న మన వ్యాపారస్థులు తమ మార్కెట్ చేజారిపోతూ ఉండటాన్ని ఎందుకు గమనించలేకపోయారు?బహుశః ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుని ఉంటారు - మంచి ఆకర్షణీయమైన లాభసాటి వ్యవహారం కదా!

          మొత్తం ఈ పద్ధతి ఎలా ఉండేదంటే, అదివరకు చచ్చినట్టు వాళ్ళ దగ్గిరున్న 10 బంగారు/వెండి నాణేలు ఇచ్చి కొనుక్కునే ముడిసరుకుల్ని అప్పటినుంచి పన్నుల కింద 30 నాణేల్ని కిట్టించుకుని వాటినుంచి 10 నాణేలతో ముడిసరుకుల్ని కొనుక్కుని తీసుకెళ్ళి లండనులో తయారు చేసిన వస్తువుల్ని 50 బంగారు/వెండి నాణేలకి అమ్మేవాళ్ళు. వీళ్ళని మన దేశపు కమ్యునిష్టు, కాంగ్రెస్, ముస్లిం, క్రైస్తవ చరిత్రకారులు "అబ్బెబ్బే!ఎంతో కొంత దోచుకున్నప్పటికిన్నీ మనకి ఇంగ్లీషు నేర్పిస్తిరి, మంచి చదువులు చెప్పిస్తిరి, పంట్లాములు తొడగటం చూపిస్తిరి, డబ్బంటే ఏమిటో తెలియని మన మొహాలకి డబ్బు సంపాదించటం నేర్పిస్తిరి - హత్తెరికీ, వాళ్ళు గనక రాకపోయుంటే మనం ఇప్పటికీ అనాగరికంగా ఉండిపోయేవాళ్ళమిస్మీ!" అని పొగడలేక ఛస్తున్నారు.

          అయితే, మనవాళ్ళకి చమ్మగానే ఉన్న ఈ దోపిడీ గురించి తెలుసుకున్న sheridon లాంటివాళ్ళు తిట్టే తిట్లకి తట్టుకోలేక 1836లో బ్రిటిష్ ప్రభుత్వం/ఇంగ్లాండు రాణీ East India Companyని రద్దు చేసి British Raj పేరుతో భారతదేశాన్ని తనే పరిపాలించటం మొదలుపెట్టింది - దీని ప్రకారం భారతీయ వ్యాపారులు తమ సరుకుల్ని తామే ఇతర దేశాల్లో అమ్ముకునే వీలు కుదిరింది."హమ్మయ్య!పీడ విరగడైంది - వాళ్ళు కొట్టేస్తున్న లాభం ఇక మనదే!అది మనదే!" అని చంకలెగరెయ్యకండి, ఇక్కడే వాళ్ళు పాత దోపిడీకే కొత్త ట్విస్టు ఇచ్చారు!British Crown కొన్ని ప్రత్యేకమైన చట్టాలను చేసి ఇప్పుడు మనం వాడుతున్న పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టింది.భారతీయ వ్యాపారులు, ఒక్క భారతీయులనే కాదు, అన్ని వలస దేశాల వారూ,  తమ సరుకుల్ని ఎగుమతి చెయ్యడానికీ ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికీ లండను ప్రభుత్వం ముద్రించే పేపరు కరెన్సీని మాత్రమే వాడాలి - వాటిని తమ దగ్గిరున్న వెండి బంగారు నాణేలతో కొనుక్కోవాలి!

          అద్గదీ సంగతి!మనవాళ్ళు బీరువాల్లో పెరుగుతున్న నోట్లకట్టల్ని చూసుకుని మైమరిచిపోతుంటే ఈ సమస్తమైన క్రయవిక్రయాలకి సంబంధించిన వాస్తవ మూలధనం లండను నగరానికి చేరుతున్నది!మన దేశంలోని వనరుల్ని ఉపయోగించుకుని మన దేశపు కష్టజీవుల స్వేదం నుంచి పుట్టిన వస్తువుల్ని మన దేశపు వ్యాపారులే ప్రపంచమంతటా తిరిగి అమ్మి సంపాదించిన సంపద మన దేశం లోపల కనపడకపోవటం వల్లనే ఇప్పటి బ్రిటిష్ దేశపు స్థూల జాతీయ ఉత్పత్తికి 17 రెట్ల సంపదని అందించిన భారతదేశం కేవలం ఒక్క దశాబ్దం తర్వాత అప్పుల్లో ఉందని నమ్మాల్సి వచ్చింది!

          దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర తిలక్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ,  వల్లభాయ్ పటేల్, మహమ్మదాలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్యా, మాన్యశ్రీ అంబేద్కర్ - అందరూ మేధావులే, అయినా కీలకం కనిపెట్టలేకపోయారు.అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటంటే,ఇంగ్లీషువాళ్ళు బిగించిన దోపిడీ చట్రాన్ని ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు - ఏమిటీ ఘోరం!

          అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు  ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా!ఆ రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి  తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.

          కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్ వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ ఆ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం చెప్పరు - అసలు ఆ ప్రస్తావననే దాటవేస్తారు.అది  తర్వాత పోష్టులో చెప్తాను.ఒకరకంగా ఈ పోష్టులో నేను చెప్పిన విషయాల్ని జీర్ణించుకోవటం కష్టమే!


(this is the third part of a series on macro economy!)

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...