ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
హరివాక్యం:
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధ ప్రారంభ పద్యం - భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైన పద్యం. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే ఆరు అద్భుత ప్రయుక్తాలు భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు.
పోతన గారి గురించి మనకి చాలా కల్పిత కధలు ఉన్నాయి.ఆయనొక బీదరైతు అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ కధల్ని బట్టి.కానీ తన తాత తండ్రులైన భీమన సోమనలకు చేర్చిన మంత్రి అనే పదం వాళ్ళు రాజసభలో మంత్రిగా ఉందేవాళ్ళని సూచిస్తున్నది - ఇప్పటి ప్రభుత్వోద్యోగులకి ఉండే ఇలాంటి బిరుదుల్ని ఆ హోదా లేనివాళ్ళు పెట్టుకోకూడదు కదా!ఇతనికి మాత్రం ఆ పొడ గిట్టక స్వతంత్రజీవనం గడిపాడని అనుకోవచ్చు."మనుజేశ్వరాధములు" అనే మాట ఛందస్సు కోసం వాడినట్టు కాక మనస్సులో ఉన్న కసిని బయటపెట్టుకుంటున్నట్టు పద్యం మొత్తం మీద ఖంగున మోగుతుంది!
ఇప్పుడు మనమనుకుంటున్నట్టు ఏదో మారుమూలాన నాలుగైదెకరాల మడక దున్నుకుంటూ బీదరికం అనుభవించే దుర్గతిలో లేడనీ లౌక్యం తెలిసిన పెద్ద రైతు అనీ అనుకోవాలి.అదీగాక,ఆనాడు కూడా కవిత్వం రాయాలంటే తను రాయడానికి తాళపత్రాలు సిద్ధం చేసుకోవడం దగ్గిర్నుంచీ ప్రచారం కోసం ప్రతులు తీయించడం వరకూ ఇవ్వాళ్టి లాగానే చాలా శ్రమా వ్యయమూ కలిసిన వ్యవహారం - అందుకే అప్పుడూ ఇప్పుడూ కవులకీ కళాకారులకీ రాజాశ్రయం తప్పదు!ఇతనికి తగినంత ధనం ఉన్నది గనక రాజాశ్రయం అవసరం లేకపోయింది,అవసరం లేదు గనక తిట్టగలిగాడు!
మధురాధి పతే రఖిలం మధురం అన్నట్టు పోతన గారి కవిత్వంలో రమ్యం కాని భాగం ఏదీ లేదు!ప్రస్తుతానికి భీష్మ పితామహుడు అవతార పరిసమాప్తి ముందు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ స్తుతిస్తూ చెప్పిన పద్యాలను గురించి చెప్పాలనుకుంటున్నాను.గతంలో గరికపాటి వారు "హయరింఖాముఖ,కుప్పించి యెగసిన" పద్యాలను గురించి చెప్పటం విన్నాను.చాలా బాగా చెప్పారు.అయితే,ఇప్పుడు నేను వాటిని చదువుతున్నప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.వాటిని మీతో పంచుకుంటాను.
ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు
హరివాక్యం:
అవతార పురుషులైన శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ తమ కార్యం పూర్తి కాగానే తమ పార్ధివ దేహాల్ని విడిచిపెట్టి నిజస్థానం చేరిన విధంగానే అర్జున శస్త్రాలకి ఖిలమై నీరసించిన ప్రాణజ్యోతిని దేహధర్మానుసారం అప్పుడే పోనివ్వకుండా నిలిపి ఉంచి తను కోరుకున్న సుముహూర్తంలోనే విడువగలిగిన భీష్ముడి నిర్యాణం ఆ ఇద్దరి అవతార పరిసమాప్తికి సమానమైనదే!
ఇతని జననం కూడా విశిష్టమైనదే - శివపత్ని అయిన గంగ ఇతని కోసం మానవదేహం దాల్చి శంతనపత్ని కావలసి వచ్చింది!ఇతను తొలిసారి తన తండ్రికి దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో కనిపిస్తాడు.అక్కడ సంవత్సరం చెప్పినట్టు చూడలేదు నేను,కానీ పూర్తి యవ్వనంలో ఉన్నట్టూ చెప్పలేదు, మరీ పసిబాలుడిలా ఉన్నట్టుగానూ చెప్పలేదు - కాబట్టి ఉజ్జాయింపు అంచనా వేశాను.శ్రీకృష్ణుడి జనన కధనం ప్రకారం తను బొడ్డు తాడు తెంచుకుని పుట్టలేదు - మొదట పన్నెండేళ్ళ బాలుడిలా కనబడి నేను మీకు పుత్రుడినౌతున్నానని చెప్పి మరుక్షణం దేవకి ఒడిలో శిశువులా చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు. బౌద్ధమతానికి ప్రారంభకర్త అయిన గౌతమ బుద్ధుడు కాక విష్ణువు అవతారమైన సుగత బుద్ధుడు పెంపుడు తండ్రి ముందు కనబడినప్పటి వయస్సు పన్నెండేళ్ళు అని చాలా స్పష్టంగా ఉంటుంది!
అసలు రహస్యం ఏమిటో తెలియడం లేదు గానీ బాల వటువుగా బలిని సందర్శించే వామన మూర్తి కూడా దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో ఉండటమూ కపిలముని తన తల్లికి జ్ఞానబోధ చేసినప్పటి వయస్సు కూడా ఇదే స్నిగ్ధయవ్వనం కావడమూ నేను గమనించాను.అన్నింటి మధ్యన బలమైన కారణం ఉంటే పెద్దలు చెప్పాలి - అది నా ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన విషయమే!బహుశా వేదాధ్యయనం మొదలుపెట్టడానికి నిర్దేశించిన వయస్సు కావచ్చునని నేను వూహిస్తున్నాను.
అలా జనన మరణ విశేషాలు రెండింటిలో వాసుదేవసముడైన శ్రీ భీష్మ పరంధాముడు కట్టెదుట నిల్చిన శ్రీ కృష్ణ పరంధాముణ్ణి చూసి ధన్యుడై సాటి మానవులు తరించడం కోసం కొన్ని దివ్యమణుల్ని వెదజల్లుతున్నాడు!
1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.
హరివాక్యం:
గుఱ్ఱాల్నీ,వాటి కాలి గిట్టల్నీ,వాటినుంచి రేగిన ధూళిని కూడా వర్ణించాలా?అవేం అందమైన అమ్మాయిల కళ్ళా,చెంపలా,పెదవులా,వక్షోజాలా,నడుమా,పిరుదులా,తొడలా,పాదాలా - అబ్బో!ఆనాటి ప్రబంధ కవుల నుంచీ ఈనాటి సినిమా కవుల వరకూ పోల్చని పోలిక లేదు.అయినా తనివి తీరడం లేదు.ఈయనేమిటండీ,గుర్రాల మీదా వాటి కాలిగిట్టల మీదా వాటినుంచి పైకి లేస్తున్న దుమ్ము మీదా ఇంత అందమైన పద్యం చెప్పాడు!
కుసింత వెరైటీ కోసం చెప్పాడా!కాదండి!ఆ గుర్రాల్ని పొగడాల్సిందే!వాటి అదృష్టమే అదృష్టం!ఏ క్షణాన సారధిత్వానికి ఒప్పుకున్నాడో ఆ క్షణం నుంచీ వాటికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో చూడండి!మేత పెట్టటం,నీళ్ళు తాపించడం,ఒళ్ళు కడిగి శుభ్రం చేయడం,మెత్తని శయ్యలు అమర్చడం,వాత్సల్యంతో ఒళ్ళంతా నిమురుతూ కబుర్లు చెప్పడం - యశోదానందులకి చేశాడా దేవకీ వసుదేవులకి చేశాడా రుక్మిణీ సత్యభామలకి చేశాడా ఇవన్నీ!
పెద్దలు ఏమిటో చెప్తారు, కొందరు దేవతలూ ఋషులూ శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తున్నాడని తెలియగానే కోతులై పుట్టారనీ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని తెలియగానే గోపికలై పుట్టారని.ఈ లింకులు కలిపే పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి బొటనవేలికి గాయం చేసినవాడు రామాయణ కావ్యంలోని వాలి అనేవరకు వెళ్ళింది! వాలి పగ తీర్చుకోవటం కోసం వరం పొంది మళ్ళీ పుట్టటం అంటే వాణ్ణి చంపటం అన్యాయం అంటున్నట్టు కాదూ!మూడు కాలాలనీ ముడి వేసి చూడగలిగిన వాడూ యోగశక్తితోనే తనువు చాలించగలిగినవాడూ గాంధారి శాపాన్ని మన్నించడం కోసం ఒక మిషని కల్పించుకోవడానికి మామూలు బోయవాడు చాలడా?రామాయణ కాలం నాటి వాలి మళ్ళీ జన్మ యెత్తి రావాలా!పౌరాణికులు ఇలాంటి అతి చేష్టల్ని తగ్గించుకోవాలి.ఇంతకీ అంతటి మేధావులు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని తెలిసి ఆడుకోవడంతోనే సరిపెట్టుకున్నారు గానీ ఈ గుర్రాలై పుట్టాలని ఎవరూ అనుకోలేదేమిటో - ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారు?
ఇలాంటివి అదృష్టంతో రావండి!అర్హత ఉండాలి.మానవజాతిలో అపుడప్పుడూ కొందరు జాతవేదులు ప్రభవిస్తారు - కాలానికి అవసరమై పుట్టిన ముహూర్తం వల్లనో, పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్లనో,మిత్రబాంధవ సంపర్కం వల్లనో కొందరికి ప్రత్యేకించి గురువులెవరూ లేకపోయినా తమ జన్మకారణం తెలుస్తుంది.ఆ జాతవేదులనే ఈ అశ్వాల రూపంలో భావించితే అర్ధం అద్భుతః అనిపిస్తుంది - దైవకార్యం నెరవేర్చే జాతవేదులకి కూడా భగవంతుడు ఇవే సేవల్ని చేస్తాడు!మహాకవి పోతన ఇక్కడ స్మరిస్తున్నది అలాంటి జాతవేదులనే!
1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో - ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.
1-222-క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
భావము:
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.
1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
"నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు" మని క్రీడి మరలఁ దిగువఁ;
1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.
హరివాక్యం:
ఈ జంట పద్యాలలోని సీస పద్యపు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విచిత్రమైన వైరుధ్యం ఉంది.వీటన్నిటికీ తేటగీతి చివరి రెండు పాదాల్లో జవాబు దొరుకుతుంది!మొదటి పాదంలోని వైరుధ్యం:భూమి మీద ఎక్కడో కురుక్షేత్రం అనేచోట మెరిసిన ఈయన కుండలాల తళుకులు ప్రపంచం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తాయి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగుంది గనక దాన్నే ఖాయం చేద్దాం.అదేమిటంటే, లలితాసాహస్రంలో కనత్కనకతాటంకయుగళే అని ఉంటుంది.ఈయనా ఆవిడా ఒకరే అని అనుకుంటే అది విచిత్రం అనిపించదు.
రెండవ పాదంలోని వైరుధ్యం:పధ్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండాన్ని ఉదరంలో మోస్తున్నవాడు తన ఉదరంలో ఉన్న ఈ విశ్వంలోకి రావడమే ఒక వింత, మళ్ళీ ఇక్కడున్న ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి దూకితే తనతో సహా తన ఉదరంలో ఉన్న ఈ విశ్వం కదిలిపోవాలి గదా - చిన్న అదురుతో ఆగిపోయిందేమిటి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగానే ఉంది కానీ నేను మరో వైపు నుంచి చూద్దామనుకుంటున్నాను.
మనం ఉన్న విశ్వం యొక్క పరిమాణం ఎంత?తెలియదు!కానీ కొలవడానికి తీసుకున్న కొలత మన దేహమే,అవునా?మన దేహం తప్పించి మిగిలిన వాటిని మనకన్న ఎంత పెద్దది, మనకన్న ఎంత చిన్నది అని సాపేక్షంగా కొలుస్తున్నాం.అయితే, అనంతకోటి విశ్వాలలో అన్నీ ఇదే పరిమాణంలో ఉండాల్సిన పని లేదు - మరొక విశ్వం మన బొటనవేలి పరిమాణంలోనే ఉండవచ్చు!ఆ చిన్న పరిమాణంలో ఉన్న విశ్వం కూడా మన విశ్వంలో ఉన్న ఆన్నింటినీ కలిగి ఉండవచ్చు.ఇలా ఉన్న విశ్వాల అమరికలో మనం ఉన్న విశ్వంలో భగవానుడు దూకినది ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి గాబట్టి మిగిలిన విశ్వం కదలదు.కానీ ఆయన ఉదరంలో ఉన్నవి మొత్తంగా కదులుతాయి గాబట్టి ఆ విశ్వాల లోపల ఉన్నవాళ్ళకి ఈ కదలిక తెలియదు.
మూడవ పాదంలోని వైరుధ్యం:చక్రం గిరగిరా తిప్పేస్తూ కోపంతో భీష్ముడి మీదకి ఉరుకుతుంటే పైనున్న ఊత్తరీయం జారిపోయిందట!ఇందులో విచిత్రం ఏముంది అనిపించవచ్చు అధాట్న చూడగానే!కానీ, అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక్కడ ఒక అనౌచిత్యం ఉంది. యుద్ధరంగంలో రధికుడితో పాటు సారధి కూడా కవచాలూ శిరస్త్రాణాలతో కూడిన దుస్తులు ధరించాలి కదా - కొంచెం వేగంగా కదిలితేనే జారిపోయే పచ్చని పటము ఇక్కడ తొడగటం ఉచితమా!
సినిమా రాముళ్ళని చూసీ చూసీ మాయపొర కమ్మకుండా బుర్ర చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన ఉషశ్రీ గారిని ఒక ప్రశ్న అడిగారు, "వయసొచ్చిన ప్రతి మగాడికీ గడ్డాలూ మీసాలూ పెరగటం సహజం కదా!అదీ ఒకసారి క్షురకర్మ మొదలెట్టాక మధ్యలో ఆపేస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి కదా!మరి,పధ్నాలుగేళ్ళు అడివిలో గడిపినా రామలక్ష్మణుల మొహాలు నున్నగా ఉన్నాయేమిటీ?" అని.ఉషశ్రీ గారు సినిమా వాళ్ళ మీద కాస్త విసుక్కుని నందిగ్రామం దగ్గిర భరతుణ్ణి కలిశాక తల మీదా ముఖం మీదా చంకల్లోనూ పెరిగిన వెంట్రుకల్ని తీసేసి తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడుక్కుని అయోధ్యానగర ప్రవేశం చేసినట్టు వాల్మీకం నుంచే శ్లోకాలు ఉదహరించి చెప్పారు.
మనం చూస్తున్న దేవుళ్ళ పటాలన్నీ రవివర్మ లాంటి చిత్రకారులు గీసినవి.వాళ్ళకి ఆ మొహాల్లో పవిత్రత కనపడ్డానికి పసితనాన్ని సూచించే మీసాలు లేని మొహం గుర్తు అని ఒక మూఢనమ్మకం ఏర్పడిపోయింది.ఆ మూఢనమ్మకాల్నే సినిమా వాళ్ళూ కొనసాగించారు,తమ సొంత మానసిక రోగాల్ని కూడా వాటికి కలిపారు.యన్.టి. రామారావు చూడండి, రావణుడి వేషంలో కైలాసం వెళ్ళినా దుర్యోధనుడి వేషంలో సభకి వెళ్ళినా భుజం మీద గద ఉండాల్సిందే!సైకాలజీలో మనకి ఇష్టమైన వస్తువుల్ని ప్రతి చోటుకీ దేహానికి అతికించుకున్నట్టు వెంట తీసుకుపోవడాన్ని ఫెటిషిజం అంటారు.
అసలు దుర్యోధనుడు అలా గదని మోసుకుంటూ తిరగనూ లేదు.అసలు కృష్ణుడు కవచ శిరస్త్రాణాలు తొడక్కుండా యుద్ధరంగంలోకి వెళ్ళనూ లేడు.అయితే, పోతన గారు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినంతవరకు ఆయనకున్న భక్త్యావేశంతో ఒక రూపానికి అతుక్కుపోయాడు.అది అసహజమే గానీ రాసిన పోతన గారు భక్తుడు,చూస్తున్న భీష్ముడు భక్తుడు,చదువుతున్న మనమూ భక్తులమే - ఒక దణ్ణం పెట్టుకుని వదిలెయ్యడమే!
నాల్గవ పాదంలోని వైరుధ్యం:"బాబ్బాబు!నా పరువు తియ్యకు, వెనక్కిరా" అని బతిమిలాడుకోవడంలో వైరుధ్యం ఏముంది అని మీకు సందేహం రావచ్చు!కానీ కృష్ణుడు అంత ఆవేశం ఎందుకు తెచ్చుకున్నాడు?అర్జునుడు ఆపకపోతే నిజంగానే భీష్ముణ్ణి చంపేసేవాడేనా?లేదు,ఆ సంరంభం ఆర్జునుడికి చురుకు పుట్టించి భీష్ముడి కధని ముగించడానికి చేసిన నటన!అర్జునుడు తాతగారి మీద మమకారంతో యుద్ధంలో చూపించాల్సిన ధాటి చూపించకపోవడం వల్లనే కదా ఇంత గొడవ జరిగినది - ఒకసారి విషాదం అనుభవించి గీతాసారం విన్నాక మళ్ళీ బెంగ పుట్టుకు రావటం అసహజం కాదూ!నేను గతంలో చెప్పి ఉన్నాను,ఇవ్వాళ చూస్తున్న లక్ష శ్లోక విస్తారమైన భారతం అంతా వ్యాస విరచితం కాదు,అందరూ తలా ఒక చెయ్యి వేసి పెంచి ఇంత పెద్దది చేశారని - దానికి ఇది సాక్ష్యం!
అసలు వ్యాసుడు రాసినవి 4000 అయితే శిష్యులు 6000 రాసినవి కలిపిన మొదటి రూపం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటారు.ఈ మధ్యనే ఆ మూలకధని మాత్రమే తీసుకుని జయం పేరుతోనే ఒకరు నవల వ్రాసినట్టు చదివాను.
అయితే,చేర్పుల వల్లనే ఆ కావ్యం మోనాలిసా నవ్వులా ధర్మతత్వజ్ఞులకు ధార్మిక గ్రంధంలా ఆధ్యాత్మిక వేత్తలకు మోక్షసాధనంలా కనబడుతూ అనితర సాధ్యమైన విశిష్టతని దక్కించుకున్నది!గీతకి ఇవ్వాళ ఉన్న విశ్వవ్యాప్తమైన ప్రాచుర్యం అక్కడ అమరిపోవడం వల్లనే కదా!కిం కర్తవ్యతా విమూఢుడైన ప్రతివాడూ తనని తను విషాద యోగంలో ఉన్న అర్జునుడితో పోల్చుకోవడమూ గీతాబోధ సమస్తమూ తనకే జరుగుతున్నట్టు భావించడమూ గీతని ఆ కధనుంచి విడదీస్తే జరగదు!మూలకధకీ నేటి కధకీ మార్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడం వరకు మంచిదే గానీ ప్రస్తుతం మనకి తెలిసిన కధని మర్చిపోవడం అనవసరం - మర్చిపోలేం కూడా!
1-225-క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
భావము:
తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.
1-226-ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు
భావము:
మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు..
1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థిం
తు శుద్ధుండనై."
భావము:
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."
హరివాక్యం:
ఇక్కడ పోతన గారు హైందవద్వేషులు సదా విమర్శించే హైందవధర్మంలోని మూర్త్యారాధన మరియు బహుళ దేవతా ప్రశస్తి అనే రెండు ముఖ్యమైన విషయాలకీ తిరుగులేని సమర్ధన ఇచ్చేస్తున్నాడు!ఇక్కడే కాదు, సనాతన ధార్మికులు సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉన్న విశిష్టత ఏమిటంటే సాహిత్యానికి సంబంధించిన రమ్యత,గాఢత కూడా ఉండి గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. విదేశీయులూ వేరే మతస్థులు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులు కావడానికి వాటిలోని వస్తుగతమైన తార్కికతతో పాటు శైలిపరమైన సౌందర్యం కూడా ఒక కారణమే!
ఏం చెప్తున్నాం అన్నదానితోపాటు ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే - అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టేస్తే పిల్లాడు అల్లాడిపోతాడు!ఎంతటి పండితుడికైనా నిర్గుణ పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యమే - అసలు ఆ పదాన్ని పరిచయం చేసినవారికే దాని పూర్తి అర్ధం తెలియదు పాపం!నేనయితే నిర్గుణోపాసనని తిరస్కరిస్తాను కూడా.ఎందుకంటే,జ్ఞానం కోసం జ్ఞానం,కళ కోసం కళ వంటి పనికిమాలిన లక్ష్యాలు పెట్టుకుంటే ఇహానికీ పరానికీ పనికిరాకుండా పోతాం.మన దేహాలు తయారైన పృధివ్యాపస్తేజోవాయురాకాశాల మూలతత్వం మహదహంకారం - అది కూడా భగవత్స్వరూపమే!మనల్ని మోహానికి గురి చేసి పతనం చేస్తున్నదని అనుకుంటున్న మాయ కూడా భగవంతుడి కన్న వేరు కాదు, అవునా?మరి, రూపధారులమైన మనం భావనామరూప సంకీర్తనం చెయ్యడానికి భయపడటం గానీ సంకోచపడటం గానీ అవసరమా?"మేం విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాం!" అని అంటున్నవాళ్ళే అలవాటులో పొరపాటుగా కాకుండా బరితెగించి విగ్రహారాధన చేసేస్తూ ఉంటే హిందువులు సిగ్గుపడటం దేనికి?అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి మూర్తిపూజ అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకి చేసే అభిషేకాదులు మాత్రమే కాదు, అక్కడినుంచి మొదలుపెట్టి దృశ్యమాన ప్రపంచంలోని అన్ని రూపాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి ఎదగాలి!
హిందూమతప్రచారకులు ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి,ఆసక్తిని కలిగంచడం కోసం హాస్యప్రసంగాలు చెయ్యడం మంచిదే గానీ హాస్యం అపహాస్యం స్థాయికి దిగజారకూడదు.గరికిపాటి నరసింహారావు లాంటి అనుభవజ్ఞులు కూడా ఒక్కోసారి ఆవేశం వల్లనో అనాలోచితంగానో చెప్పకూడని విషయాలు చెబుతున్నారు,అనకూడని మాటలు అంటున్నారు.ఈ మధ్యనే వారు గణేశ్ నిమజ్జం పేరుతో వ్యాపారమూ పోటీ ఎక్కువయ్యాయనీ అవన్నీ అక్కర్లేదనీ వాటిలో భక్తి ఉండదనీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఒంటరిగా చేసే పూజల్లోనే భక్తి ఉంటుందనీ మాట్లాడారు - అది నాకు నచ్చలేదు.ఒంటరి పూజని పెద్దలు అప్పటికే సర్వం త్యజించిన యోగులకి ప్రాణోత్క్రమణ సమీపించిందని తెలిసినప్పుడు మనిషి కనిపిస్తే చాలు "నాకు నెప్పిగా ఉందిరో!వైద్యం చెయించరో!నన్ను బతికించరో!" అని వ్యామోహం పెరక్కుండా ఉండటానికి చెప్పారు.గృహస్థు అయిన ప్రతి ఒక్కరికీ తన పాటికి తను వైదిక విధుల ప్రకారం బతకడంతో పాటు ధర్మప్రచారం కూడా ఒక ముఖ్యమైన విధి.
సత్యనారాయణవ్రతం కుటుంబసభ్యులు మాత్రమే చేసుకోవాలని చెప్పారా?అసలు ఆలయాలు ఉన్నదే సామూహిక ప్రార్ధన కోసం - అలాంటప్పుడు ఈయన అవన్నీ అక్కర్లేదు,మీ ఇంట్లో మీరు పూజలు చేసుకుంటే చాలు అంటారేమిటి!ఈయనే ఇలా చెప్తున్నప్పుడు ప్రబోధానంద లాంటివాళ్ళని మనం తట్టుకోగలమా?ప్రపంచ స్థాయిలోనే ఏకం కావలసిన సమయంలో హిందువులు ఒంటరిపక్షులు కాకూడదు - తస్మాత్ జాగ్రత్త!
కలిసి ఉంటే కలదు సుఖం!కలిసి నడిస్తే కలదు జయం!కలిసి బతికితే కలదు వైభవం!!