Thursday, 26 July 2018

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవిశ్వాస తీర్మానం పెట్టి ఏమి సాధించాడు?భారత ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానం నుంచి ఏమి సాధించాడు!`

     బ్రహ్మాస్త్రంలా శత్రువులని భయపెడుతుందనుకున్న అవిశ్వాస తీర్మానం మోదీ అంకెల గారడీ నుంచి పుట్టిన మొండిధైర్యంతో కూడిన అప్రస్తుత ప్రసంగం లాంటి వెకిలి హాస్యం ముందు తుస్సుమనడంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందనడంలో ఆశ్చర్యం లేదు!మాటి మాటికీ చెప్పడం నాకే బోరుగా ఉంది గానీ 2014లో ఎన్నికల సమయంలో భాజపా చేసిన వెన్నుపోటు ఉరించి తెలిసి ఆఖరి నిమిషాల్లో జాగ్రత్తపడి  చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని అనుభవించి కూడా భాజపాని అతిగా నమ్మి మితిమీరి అంటకాగడమే చంద్రబాబు చేసిన మొదటి తప్పు - ఆ తప్పు చెయ్యదంలో ఉన్న పొరపాతు అవగాహనయే తప్పు వెంట తప్పుగ ఐన్ని తప్పుల్ని చేయిస్తున్నది! 

     ఈయన మిత్రపక్షం హోదాలో తన పార్టీ నుంచి నలుగుర్ని కేంద్రంలో మంత్రులుగా నిలబెట్టి ఏమి సాధించాడో కేసీయార్ అవేమీ చెయ్యకుండానె సాధించాడు - ఇది నేను అంటున్నది కాదు,ఇవ్వాళ రెండు రాష్ట్ర్రాల్లోనూ కనీసం పేపరు చదవగలిగీన్ పాటి చదువుకున్న ప్రతివాడూ అనుకుంటున్న విషయం! 

     అవిశ్వాసం అనేదాన్ని సభలో ప్రవేశపెట్టటానికి కావలసిన 50 లెక్కని మాత్రమే పట్టించుకుని చర్చలో జరిగే ప్రసంగాల ద్వారా అంధ్రాకి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పి దానికి కారణం సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమేనన్న సంగతిని జనం మెదళ్ళలోకి యెక్కించాలనుకున్నాడు నలభయ్యేళ్ళ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైంత్రి - కానీ ఏమైంది?జనంలోకి వెళ్ళింది మాత్రం 1. రాహుల్ మోదీని కావిలించుకోవటం,2. మోదీ ఇబ్బంది పడటం,3. సినీతారని మించి రాహుల్ కన్ను కొట్టటం,4. మోదీ వేళ్ళు ఆడిస్తూ చేసిన బపూను చేష్టలతో కలిసిన లపూటు ప్రసంగం అవిశ్వాసం అనే గంభీరమైన ప్రక్రియని నవ్వులాట కింద తీసిపారెయ్యటం తప్ప ఆంధ్రాకి అనుకూలమైనది ఏదీ జరగలేదు!

     ఈ చిల్లర మల్లర విషయాలతో తెదెపా వ్యూహాత్మకంగా చేసిన ప్రసంగాలు సోదిలో లేకుండా పోవడంతో సీరియస్ వ్యక్తులు పట్టించుకున్న విషయాలు ఏవీ చద్రబాబుకి అనుకూలమైనవి కావు - 1.హోదా కన్న ప్యాకేజీయే నయమన్న ముఖ్యమంత్రి యొక్క అధికారిక ప్రకటన, 2.హోదా కోసం అడుగుతున్నవాళ్లని రాష్ట్రద్రోహులుగా చిత్రిస్తూ తెదెపా మంత్రులూ ఇతర పార్టీవర్గాలూ చేసిన ఆర్భాటం, 3.వైకాపా మాయలో పడవద్దన్న భాజపా స్టేట్మెంట్ల తర్వాతనే తెదెపా హోదా కోసం గోదాలో దిగడం, 4.హోదా/ప్యాకేజీ ఒక్కటే కాక విభజన బిల్లుకి సంబంధించిన అన్ని విషయాలలోనూ భాజపా అన్యాయం చెయ్యడాన్ని ఎండగట్టలేకపోవటం అనేవి తెదెపా సమర్ధించుకోలేని విషయాలు.

     అసలు ఎన్నికలకి ముందరి కేంద్రప్రభుత్వం బిల్లుని అతుకుల బొంతలా తయారుచెయ్యడాన్ని గమనించి కూడా తను సమర్ధించనిదే విభజన సానుకూలం కాదని తెలిసి కూడా విభజనని ఆమోధించిన ఇప్పటి  కేంద్రప్రభుత్వానికి 9వ షెడ్యూల్ కంపెనీల యొక్క ఆస్తుల విభజన నుంచి నీటి ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ వరకు అన్నింటిలోనూ ఉన్న లోపాల్ని సరిచెయ్యాల్సిన బాధ్యత లేదా?ఆంధ్రావాళ్ళు మాకు ద్రోహం చేశారు,అందుకే విడిపోతున్నాము అని విడిపోయినవాళ్లు పరిష్కారాల కోసం వాళ్ళంతట వాళ్ళు రాకపోవటం, చొరవ తీసుకుని పరిష్కరించాల్సిన కేంద్రప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవదం - ఈ రెండే కద ఆంధ్రప్రదేశ్ సమస్యలతో కునారిల్లడానికి కారణం!

     రాష్ట్రానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే పరిష్కారం కావల్సిన ముఖ్యమైన ఈ సమస్య పరిష్కారం కాకపోవటానికి తెదెపాకి భాజపాతో ఉన్న మొహమాటమే కారణం కదా!తెగదెంపులు చేసుకున్నాక కూడా పనికిమాలిన విషయాల మీద దృష్టిపెట్టి దారి తప్పకుండా దీన్ని ముందుకు తెస్తే భాజపా ఖచ్చితంగా ఇరుకున పడేది!

     యెన్ని కేసులున్నాయో, యెంత దోచుకున్నాడో, యెప్పటికి రుజువులు దొరుకుతాయో, యెప్పటికి శిక్ష పడుతుందో తెలియదు గానీ 2014లో జగన్ గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవమే,ఇప్పటికీ అతను ధీమాగానే ఉన్నాడు, 2019లో కూడా అతని బలం అతనికి ఉంటుంది,పవన్ కళ్యాణ్ మొదట్లో సామరస్యం చూపించినా ఇప్పుడు శత్రుపక్షంలో చేరిపోయాడు, ప్రజల్లో చంద్రబాబు పనితీరు పట్ల పెదవి విరుపులే తప్ప కనీసపు స్థాయి ప్రశంసలు కూడా లేవు - ఇన్ని స్వయంకృతమైన ప్రతికూలతలతో 2019లో తెదెపా ఎంతమేరకు వ్జయం సాధిస్తుందో వూహించి చెప్పడం కష్టమే!

     చంద్రబాబు తీసుకుంటున్న వరస తప్పుడు నిర్ణయాలను చూస్తుంటే తెదెపా ప్రమాదం అంచున ఉన్నట్టే లెఖ్ఖ - నాయకత్వం మార్పు గురించి ఆలోచించుదామంటే చిన్నబాబు పిచ్చిమాలోకంలా తయారయ్యాడు!అతని తెలివితక్కువ వాగుడు చూసి ఒకతను "బహుశా, తనని వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు మీద పగ తీర్చుకోవటానికి NTR ఇతన్ని ఆవహించి ఆట్లా మాట్లాడించుతున్నాడేమో!" అని గొప్ప జోకేశాడు - అది జోకు కాక నిజమే కావచ్చు.మొత్తం దృశ్యాన్ని చూస్తే ఎన్నికల తర్వాత జగన్ యెకాయెకి ముఖ్యమంత్రి అయిపోవడం జరగకపోవచ్చు గానీ తెదెపా బలహీనపడి భాజపాతో ఢీ కొట్టటానికి గానీ బేరమాడటానికి గానీ వీల్లేని పరిస్థితి యెదురు కావచ్చు - చంద్రబాబు ఒక్కడే కాదు, పార్టీలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టు ప్రయత్నం చేస్తే తప్ప తెదెపా 2019 ఎన్నికల తర్వాత అయిదేళ్ళ పాటు నిలదొక్కుకోవటం కష్టం.

      అవిశ్వాస తీర్మానం విషయంలో కేవలం ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకోకుండా తను స్వయంగా ఢిల్లీ వెళ్ళి అందరు ప్రతిపక్ష నేతలతో మాట్లాడి వీలయితే ప్రభుత్వాన్ని పడగొట్టటం లేదంటే భాజపాకి సభలో విశ్వాసం నిరూపించుకోవడం కష్టం అనిపించేలా ఒత్తిడి పెడితే పరిస్థితి చంద్రబాబుకి అనుకూలం అయ్యేది - ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల లోపు మళ్ళీ ఇలాంటి డ్రామాల కోసం చూడకుండా ప్రభుత్వం మరియు తెదెపాల పనితీరును మెరుగు పరుచుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది.

     అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబు పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ ఇక తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చినప్పటినుంచీ మొదలుపెట్టి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ చేసిన ప్రసంగం వరకు దానికి స్పందించిన మోదీ ప్రవర్తనని గమనించితే మొత్తం ప్రపంచం మీద తనకన్న నీచుడైన రాజకీయవేత్త ఉండడు అని తనకు తనే రుజువు చేసుకున్నాడు!

     అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉద్దేశం ఆంధ్రాకి కేంద్రప్రభుత్వమే ఉద్దేశపూర్వకమైన అన్యాయం చేస్తున్నదనే తీవ్రమైన ఆరోపణతో - మోదీ ప్రధాని హోదాలో చేసిన ప్రసంగం మొత్తాన్ని ఎంత సునిశితంగా గమనించినా ముఖకవళికల్లో గానీ జవాబు చెప్పటానికి ఎంచుకున్న పదజాలంలో గానీ చెబుతున్న విసయాన్ని మరింత స్పష్టం చేసే ఆంగికాభినయంలో గానీ దానికి సంబంధించిన గంభీరత యెక్కదైనా ఉందా?వీలున్నంతవరకు అవిశ్వాసం ముప్పుని తప్పించుకోవాలని తెరచాటు ఎత్తులన్నీ వేసి ఇక తప్పించుకోవడం కుదరదని తెలిశాక నెగ్గడానికి కావలసిన లెక్కల్ని సరిచూసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టగలగడమే ఒక అద్భుతం అన్నట్టు కలరు పులిమి మాట్లాడినవాడు ఏ లెక్కల ప్రకారం నిజాయితీ పరుడు అవుతాడు?

     విభజన బిల్లులో ఉటంకించిన ప్రత్యేక హోదాకి అప్పటికి ఇస్తున్న రాష్ట్రాలకి సంబంధించిన సాంకేతిక వివరాల్లో తేడా వుండొచ్చు,కానీ 14వ ఆర్ధికసంఘం సిఫార్సు చేసింది కదా!ఆంధ్రావాళ్ళు అడిగినప్పుడల్లా "ముందు ముందు వాటికీ ఎత్తేస్తాం!కాబట్టి వాటితో లింకు పెట్టి అడగొద్దు" qని చెప్పి వాటికి సహాయం ఆపకుండా కొనసాగిస్తూ ఆంధ్రాకి మాత్రం మొండిచెయ్యి చూపిస్తూ కాలం గడపటం కూడా పొరపాటున జరిగిందని సర్దుకుపోవాలా?అసలు ఆంధ్రావాళ్ళు అడుగుతున్నది మోదీ సొంత ముల్లెయా?కాదే!వేరే రాష్ట్రాలకి చేసే సహాయం అయినా ఆంధ్రాకి చేసే సహాయం అయినా ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చినదే కదా - ఆంధ్రావాళ్లు పన్నులు కట్టటం లేదా?ఆంధ్రా నుంచి ఆదాయం రావడం లేదా?బుద్ధిగా పన్నులు కట్టి ఆదాయం మొత్తం మీకు పంపించి తిరిగి మాకు ఇమ్మన్నప్పుడు ఏడుస్తున్నారే, అసలు కేంద్రానికి వెళ్లే పన్నులన్నీ ఆపేసి మా ఆదాయం మేమే వాడుకుంటే మీరు పీకగలిగింది ఏంటి?సభా కార్యక్రమాల వీడియో సాక్షిగా 3:18 / 3:34 దగ్గిర నుంచి మోదీ చేసిన అభినయమూ ముఖకవళికలూ ఆంధ్రావాళ్ళని నవ్వుచ్చుక్కొట్టినట్టు లేవూ!


ఆంధ్రావాళ్ళని నవ్వుచ్చుక్కొట్టిన మోదీని ఓటుచ్చుక్కొట్టాలి - ఆంధాలో భాజపాకి అట్టు తిరగెయ్యాలి!

1 comment:

  1. Dear Sir,

    Am really confused by your analysis , please don't read English news papers and come to the conclusions , rather you can read sakshi and imagine just opposite to what has written in that

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...