Monday, 11 July 2016

చెరిగిపోని చరిత్రలో కరిగిపోని కన్నీటిచుక్క - పేరిందేవి!

పేరిందేవి!

విభుని కూడనైన కూడకయే విధవ యయ్యె!!
తనవారి రాజ్యకాంక్షకు తన మాంగల్యమే బలియయ్యె!!!

వయసుకు చిన్నదైనా ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు.
పినతండ్రిని వరుసతో పిల్చి మరీ తిట్టింది,
చీరెసారె లివ్వాల్సిన చేతితోనే ముండకోకనూ ఇవ్వమని!
సిగ్గుపడి మొగం దించుకుని నిలుచుండేటట్లు చేసింది?! 

"నువు విధవ్వి, దీపాలార్పడమే తెల్సు నీకు!
దీపమెట్టేవేళ బిడ్డలు గల తల్లులు నిన్ను తలవరు - నన్ను తలుస్తారు,
నా ఉసురు తగిలి నీపేర్న నాల్గుమణుగుల నల్లపూసలు తెగుతాయి చూడు!"మన్న
బాలికావధువు శాపానికి నల్ల నాగులేరు గజగజలాడింది!
"నాయుడూ నీమూతికి మీసముంటే నా ముంజేతికి మీసముంది"
అన్న నాయకురాలు నాగమ్మ కూడా బిత్తరపోయంది,
సిగ్గుపడి సంధి కొడంబడింది -  
చిన్నారి పేరిందేవి ధాటిగల మాటలకు జడిసి!

అనపోతు చావువార్త విన్న బాలచంద్రునికి వెర్రిపుట్టి
సంధి చెడింది,నాల్గుమణుగుల నల్లపూసలు తెగినవి,
నల్ల నాగులేటి నీరెర్రబారింది!
    
కళ్ళుమూసుకుని తలిస్తే చాలు
కాటికి కాళ్ళు చాపుకున్నవాడికయినా కండల్ని పొంగించగలిగిన వీరాధివీరులు
తమను తామే చంపుకున్న తీరును చూసి భూతరాట్కంబమొకటే పకపక నవ్వింది!

నాపసాని ఏడుగడియల మంత్రిత్వం ఇంత చేసింది!
ఆపలేని బ్రహ్మనాయుని మంత్రాంగం యాడబోయింది?
నాయుడూ నాగాంబా సన్నాసులై బిలముల జొచ్చినారు.
కోటపేటలు అన్నీ మంటిగలిసి,,
అన్నదమ్ములు కూడ మింటికరిగి
రాజొక్కడు ఒంటిగ మిగిలినాడు!

అంతేరా, నాయనా!
ఆది జంగమదేవర ఢమరుకం మోగించినాక
నువ్వెంత?నీ తెలివెంత?నీ హజమెంత?
నీ వైభవాల మైకం,నీ స్థగిణీల మాంగల్యం,నీ కోటపేటల గట్టిదనం -
ఏదీ మిగలదు,అంతా భస్మమే!!

శివోహం!శివోహం!శివోహం!

2 comments:

  1. ఆలును బిడ్డ లేడ్వ నృపు లాలములో కడతేరక .....

    ReplyDelete
  2. శివోహం!శివోహం!శివోహం!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...