Wednesday, 19 February 2014

శ్రీకారం చుట్టుకుంది బ్లాగు పుస్తకం

1.
సీ || శ్రీ అని అనగానె శ్రవణము రంజిల్లు!
       పలికేది తెలుగైన పరమ హాయి 

       చెవులను సోకి ఆ శ్రీకారమే రంజి

       లును గదా! అటుపైన లయను నింపు

       కొన్న పద్యమదైతె కండచక్కెర నందు

       లో కలిపిన యటు లుండును గద!

       కొంత ఛందస్సు బిగింపు ఉండీ స్వేచ్చ

       చాల యెక్కువై పస గల కవుల

తే ||   కిష్టమౌ సీస పద్యమే ఐన పాలు 

       కలిపిన సత్వము గల్గు, నింక 
       రమ్య శైలితో క్షేమకరమగు భావ
       ములను చెప్పి పంచామృత మిత్తు మీకు.
(16/06/1996)
2.
సీ ||   నిన్నటి కాల మనాగరికము కాదు,
       నేటి కాలము నవీనమ్ము కాదు,

       రేపటి దూహించ రానిదియున్ గాదు,

       అంతయు నిటులనే యుండు నండి!

       ఆశలు, మోహముల్, బాంధవ్యములు గల

       మనబోటి సామాన్య మానవుల్, మ

       రి ధనాశాపరులు, ధూర్తులు, పదవీ లాల

       సులు, గోముఖ వ్యాఘ్రములు మరింక

తే ||   చెప్పనేల - అందరు సహచరులుగా బ

       తక వలసినదే కాలమేదైన గాని!
       మంచి చెడులు కాలాల యందు లేవు,
       మనము బతికేటి పధ్ధతే మనకు రక్ష!
(14/07/1993)
3.
సీ || లెక్కకు మిక్కిలి యైనను  కొద్ది తే
     డా సైత ముండని రాజకీయ

     పార్టీలు గల జాతి, పటుతరమౌ స్వార్ధ

     మున జను ల్విడిపోయి మలిన పడ్డ

     జాతి, కలహముల కాపురమై పరు

     లకు రాజ్య మిచ్చియు లేశమైన

     సిగ్గు నేర్వని జాతి, శిష్ట జనుల రక్ష

     జేయు సంకల్పము లేని దేబె

తే || ప్రభువులను భరించెడు జాతి - క్రమ వినాశ

     నానికి గురియై, తేజము నీరసించి
     శత్రువులకు నవ్వు గొల్పును - చవటలు తెగ
     పెరిగి దొంగల దోపిడి వెల్లువౌను.
(05/05/1993)
4.
సీ || తొలినాటి భోగాల తుంపర్లకే సంబ
     ర పడుతు యెగిరెగిరి పడతారు -

     కాలమట్లు గడిచి కమ్ముకు వచ్చెడి

     తమ పాప ముప్పెనై తమనె ముంచు

     ముందరి కాలపు ముచ్చటన్ కనలేరు

     దొంగలు, మాఫియా దొరలు, లంచ

     గొండ్లాదిగా గల ఘాతుక జను లతి

     శయముచే కండ్లు మసకలు గమ్మి!

తే || తగిలెనా మాడదిరిపోవు దెబ్బ, అపుడు

     తెల్సి ఒదిగి పోవుదు - రపుడున్ తప్పు నెరుంగ
     కుండ రెచ్చెపోయెడు వార్కి కుక్కచావు
     సిధ్ధమై ఉంది; లేదిందు సర్దుబాటు.
(27/12/1993)
5.
సీ || అరె! జాతిభేదము లణగార్చుకో వదే
     ల? మతము లన్నియు లోకశాంతి

     గోరుచు ప్రవచించగా వినవేంటి? భూ

     గోళ మంతటి నగ్నిగోళ సదృ

     శంగ  చేస్తావేంటి? సాటి మనిషి శతృ

     వైన కధేమిటి? వైరభావ

     ము తొలుతే పెంచుకు మాజాతి గొప్పద

     ని ముసుగుల్ తొడిగేటి నీచుడ, చిరు

తే || భేదములను సహించుము, బుధ్ధి పైత్య

     మేల? దైవమే మావాడు మే మధిక త
     రుల మనంటూను యెగిరెగిరి పడతావు -
     నిన్ను మించువా డొస్తేను నీ గతేంటి?
(03/08/1993)
6.
సీ || సంపెంగ పువ్వుకు అందమేల? మధుర
     మౌ చక్కెరకు పరిమళము లేల?

     రాగాలు పలికించు రాణివీణకు అలం

     కారము లేల? చక్కని కళలకు

     రంగు హంగులును ఆడంబరము లవి యే

     ల? కవిగాళ్లకు డబ్బుల పెరపెరలు

     యేల? నీతికి నిల్చి వేటుకు భయపడు

     టేల? ప్రజాసేవ చేయటాన్కి

తే || పదవు లేల? ఉపాయము గలవాని

     కాపద భయమేలా? ధర్మ కార్య నిర్వ
     హణకు పిలుపు లేల? ఘన మహాత్ములార
     ఆచరణ లేని ఉత్త సిధ్ధాంత మేల?
(27/08/1996)
7.
సీ || పోయెన్ కుసుమ కోమలోజ్వల సౌరభ
     ములు భూమిపై నుండి - మూక పెరిగి,

     ఇరుకుతనము పెరిగి,మురికియును, మరి

     కిలుము జిడ్డు ముదిరి, కర్బన ద్వ

     యామ్లజని విషపదార్ధమై , కరగని

     ధూళులు నీటి యందమితమై పె

     రుగుచు ధరణి పెద్ద రొచ్చుగుంటై పోయె!

     మనుషుల ఆంతర్యములును సరిగ

తే || లేవు - పరధనాసక్తియు, లోభము, మర

     సూయలున్ మస్తుగా మనసులకు పట్టి
     వేసెను, మనిషి నుండి వివేకము తొల
     గంగ - ముక్కులు బద్దలౌ కంపు మిగిలె!
(27/08/1996)
8.
సీ|| ఇచట ఈ నేలపై విరిసి గుబాళించు
    పువ్వులన్నియు ఒకటై పరిమళములు

    గాలిలోన కలిశాక మరి వాటిని విడ

    దీయలే నట్లుగా -  తల్లి గర్భ

    మున నుండి జనియించి మనుగడ కీ నేల

    నే యెన్నుకొన్నట్టి దేశ పౌరు

    లందరున్ సోదరులంతగ కలిసి పోయి

    తమ తమ వృత్తులు తగు విధంగ

తే|| చేసుకొంటు - సహాయముల్ చేసుకొంటు

    ఒకరి పనుల కింకొకరు చేదోడుగా ని
    లుస్తు - సంపదల్ పెంచుకొంటు మరి పంచు
    కొంటు బతకండి హాయిగా కక్షలొదిలి.
(15/03/1994)
9.
సీ|| నీతిగల మనిషి నడతలో తీరైన
    సౌందర్య ముండును, స్నేహపాత్ర

    మౌ ఈ నడత గల మనుషులచే యేర్ప

    డు కుటుంబము ప్రేమకు నెలవౌను!

    ఇట్టి కుటుంబాలు నిండిన దేశము

    లో సుఖశాంతులు లాతియౌను.

    అన్ని దేశము లిటుల సుఖాలు రుచి చూసి

    కలహాల నష్టము గణన చేసు

తే|| కుంటె అప్పుడు యుధ్ధాల కాంక్ష తగ్గి

    సమతకున్ పెద్ద పీట వేస్తారు - జనులు
    ఆయుధ బలగమును చూసి గాక యెగురు
    శాంతి పావురమును చూసి సంతసింత్రు!
(06/05/1994)
10.
సీ|| మేలు జరుగుగాక మేదినిపై గల
    సకల జనులకు - స్వస్తి భవతు!

    రక్షించబడు గాక రమణులు,వృధ్ధులున్,

    శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

    కలియుగాక సఫలకర్ములై దేశదే

    శాల పౌరజనులు - స్వస్తి భవతు!

    నశియించి పోవలె నీచులున్, దుర్మతుల్

    శాంతమార్గముననె - స్వస్తి భవతు!

తే|| చెలుల కిష్టులౌ మగలార స్వస్తి భవతు!

    చదువు చెప్పు గురువులార స్వస్తి భవతు!
    సమత పెంచు నాయకులార స్వస్తి భవతు!
    సేద్య మొనరించు సైరికా స్వస్తి భవతు!!
(04/06/1996)

2 comments:

  1. Babu Haribabu nee daggara intha poetic skills unnayani naku ippati varaku teliyadu. Ippatidaka yemi chestunnavu. We have to commend your skills. Excllent Haribabu

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...