Tuesday, 18 March 2025

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు.వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది.చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి యేడుపు కూడా కలిస్తే తట్టుకోగలమా?అన్ని జీవరాసులకీ మొదటి యేడుపు ఆకలి వల్ల వొస్తుంది.రెండో యేడుపు వొంటికి దెబ్బ తగిల్తే వస్తుంది.మూడో యేడుపు మనసుకి కష్టం కలిగితే వొస్తుంది.ఈ మూడో యేడుపులో మళ్ళీ రకాలు ఉన్నాయి అష్టసిధ్ధులకి చతుఃషష్ఠి ఉపసిధ్ధుల లాగ. మనసుకి కష్టం కలగడానికి అనేకమైన కారణాలు ఉంటాయి.ఘంటసాల గారు ఆల్రెడీ ఆరున్నొక్క శ్రుతిలో "అనుకున్నామని జరగవు అన్నీ,అనుకోలేదని ఆగవు కొన్ని" అని యేడ్చేశారు గాబట్టి మరోసారి మిమ్మల్ని విసిగించను,సారీ!

మనసూ ఆత్మా మనిషికి లాగే మిగిలిన జంతువులకి కూడా ఉంటాయి గానీ ద్యాముడు కొంచెం పార్షియాలిటీ చూపించడం వల్ల మనిషిలో రెండూ ఎక్కువ పనిచేస్తున్నాయి.అందువల్ల మనిషికి కొత్త రకం యేడుపులు మూడు తగులుకున్నాయి. మూడు యేడుపులలోనూ పూలదండలోని దారంలా ఏకసూత్రం అనిపించే పోలికలూ పూలదండలోని పువ్వులలా వైవిధ్యం అనిపించే జ్వాలికలూ ఉన్నాయి.

"మా పక్కింటివాడికి కారుంది,నాకు లేదు!" అని తెలిసినప్పుడు మొదటి స్థాయి యేడుపు వొస్తుంది.అప్పుడు మొదలై కడుపు మాడ్చుకునో అప్పులు ఇరగదీసో కారు కొన్నాక మొదటి స్థాయి యేడుపు ఆగుతుంది.

"బోడి కారు, నాకే కాదు - మా పక్కింటివాడికీ ఉంది!" అని తెలిసినప్పుడు రెండవ స్థాయి యేడుపు వొస్తుంది.అప్పుడు మొదలై తినీ తినక ఇంట్లో అందరికీ పిచ్చెక్కించి పక్క ఇంటికన్న పెద్ద ఇల్లు కట్టాక రెండవ స్థాయి యేడుపు ఆగుతుంది.

"ఇంత పెద్ద ఇల్లు నాకు మాత్రమే ఉంది,మా పక్కింటివాడు ఇంతకన్న పెద్ద ఇల్లు కట్టలేడు!" అని తెలిసినప్పుడు రెండవ స్థాయి యేడుపు ఆగుతుంది.అప్పుడు పక్కింటివాడు నామీద ఈర్ష్యతో రగిలిపోతున్నాడనే మూడో స్థాయి యేడుపు వస్తుంది.

కొన్ని రోజుల తర్వాత "మా పక్కింటివాడు డెభ్భయ్యేళ్ళు వచ్చినా గుండ్రాయిలా ఉన్నాడు,నలభై నుంచే నాకు రక్తపోటుతగులుకుంది!" అని తెలిసినప్పుడు మూడో స్థాయి యేడుపు మొదటి స్థాయి యేడుపు కింద మారుతుంది.

ఆకలి, నెప్పి లాంటి మిగిలిన అన్ని యేడుపులూ వాటంతటవి పోతాయి గానీ మూడు యేడుపులూ ఇష్టం కొద్దీ తగిలించుకుంటున్నవి గాబట్టి వాటంతట పోవు.అలా యేడుస్తున్నప్పుడు గోకుడుసుఖం లాంటి హాయి తగిలి మనసుకి బావుంటుంది గాబట్టి వదిలించుకోవడం కూడా కష్టమే.

తగులుకుంటే వదలించుకోవడం కుదరనప్పుడు పరిష్కారం యేంటి?అసలు తగలనివ్వకపోవడమే.యేడుస్తుంటే బావుంటుందంటావు,బావున్నదాన్ని వదలటం దేనికి అని అనుకుంటున్నారు కదూ - ఇదో కొత్త యేడుపు,ఖర్మ!

అందరూ ఆనందం గురించి చెప్తుంటే నాకు యేడుపు గురించి చెప్పాలనిపించడం ఏంటో - మీరు మనసార యేడ్వనీరు నన్ను!నన్నిలా యేడ్వనిండు.నన్ను చూసి యేడవకండి మీరు.

జై శ్రీ రామ్!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...