Wednesday, 6 July 2022

ప్రశాంతమైన నిద్ర కోసం ఆనందవల్లిని ఆశ్రయించాలి!

 

కృష్ణ యజుర్వేదం యొక్క ఆవిర్భావం వెనుక ఒక కధ ప్రచారంలో ఉంది.యాజ్ఞవల్క్యుడికి గురువుతో సంవాదం ఏర్పడింది.వివాదం ముదిరి గురువైన వైశంపాయనుడు ఆగ్రహం పట్టలేక తన వద్ద నేర్చిన విద్యని తిరిగి ఇచ్చేసి పొమ్మన్నాడట. అప్పుడు యాజ్ఞవల్క్యుడు వాంతి చేసుకున్న నల్లని యజుర్వేదపు ముద్దని వైశంపాయనుడి ఇతర శిష్యులు తిత్తిరి పక్షుల వలె మారిపోయి తినేశారట.సర్వులకూ సత్యాసత్యాలను నిర్ధారించడానికి శాస్త్రీయమైన తర్కాన్ని ఇచ్చిన వైదిక సాహిత్యంలో ఇలాంటి తార్కికత లేని కధనాలను ఇరికించటం చిరాకు పుట్టిస్తుంది నాకు.అసత్యాలను మనం ఆమోదించాల్సిన అవసరం లేదు కానీ గత కాలపు వారు ఆమోదించిన కధనాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కద.

అలా యాజ్ఞవల్క్యుడి నుంచి ఉద్భవించిన జ్ఞానమైన కృష్ణ యజుర్వేదానికి ఇతర పండితులు చేర్చిన అనుబంధ సాహిత్యంలో  తైత్తిరీయం అనే ఉపనిషత్తు చాలా ముఖ్యమైనది.బహుశః పదలాలిత్యమూ రసమాధుర్యమూ ఎక్కువ కావడం వల్ల కాబోలు వీటిని శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని సంబోధిస్తారు!

మొదటిది శిక్షావల్లి - విద్య,అధ్యయనం,జ్ఞానసముపార్జన,బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైన గుణగణాల వంటి విషయాలను గురించి చెప్తుంది.
రెండవది ఆనందవల్లి,దీనినే బ్రహ్మానందవల్లి అని కూడా అంటారు - బ్రహ్మము,ఆనందము అనే విషయాలను గురించి  చెప్తుంది.
ఇందులోని మొదటి అనువాకం బ్రహ్మమును తెలుసుకున్న వారికే అధికమైన ఆనందం స్థిరమై నిలుస్తుందని ప్రతిపాదించి దానిని వ్యాఖ్యాన సహితం నిరూపణను తర్వాత వచ్చే అనువాకాలలో ఇస్తుంది.
ఇందులోని మొదటి అయిదు అనువాకాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించిన జ్ఞానం ఉంటుంది.
ఇందులోని ఆరవ అనువాకం ఆనందమయ కోశాన్ని చేరడానికి జ్ఞానం అవసరమని విశ్లేషించి చెప్తుంది.
ఇందులోని ఏడు మొదలు తొమ్మిదవ అనువాకం వరకు సృష్టి యొక్క తత్వాన్ని గురించి చెప్తాయి.
మంత్రార్ధ విశేషం:
01.బ్రహ్మవిదాప్నోతి పరం,తదేషాభ్యుక్తా,సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ,యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్:బ్రహ్మమును తెలుసుకోగలిగిన వారు మాత్రమే అధికమైన ఆనందాన్ని పొందుతారు.ఇందును గురించి సృష్టికర్త ఇలా చెప్తున్నాడు.బ్రహ్మమునైన నేను జ్ఞానము వలన ధారణకు  మాత్రమే గోచరించు ఆనంతుడను.అంతరిక్షమున సైతం నేను పరోక్షవాసినై ఉన్నానని ఎవరు గ్రహిస్తారు?వారే జ్ఞానులు!
02.సో2శ్నుతే సర్వాన్ కామాన్ ధ్సహ బ్రహ్మణా వివశ్చితేతి,తస్మాద్వా ఏతస్మాతాద్మన ఆకాశ స్సంభూతః, ఆకాశాద్వాయుః,వాయోరగ్నిః, అగ్నే రాపః, అధ్యః పృధివీ, పృధివ్యా ఓషధయః, ఓషధీభ్యో2న్నం, అన్నాత్పురుషః, స వా ఏష పురుషో2న్నరసమయః:ఎవరు ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తారో వారు బ్రహ్మమునైన నన్ను వశ్యుణ్ణి చేసుకుని నాకు వశులై తమ కోరికలను నెరవేర్చుకుంటారు.అలా ఆత్మ అంతరిక్షం నుండి ప్రభవిస్తుంది.ఆకాశం నుంచి వాయువు పుడుతుంది.వాయువు నుంచి అగ్ని పుడుతుంది.అగ్ని నుంచి జలం పుడుతుంది.దానినుంచి పృధ్వి పుడుతుంది.పృధ్వి నుంచి ఓషదులు పుడతాయి.ఓషధుల నుంచి అన్నం పుడుతుంది.అన్నం వల్లనే పురుషులకు దేహాలు ఏర్పడతాయి.
03.తస్యేద మేవ శిరః, అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అందువల్ల పురుషతత్వం గల జీవులు అన్నరసమయమై ఉంటాయి.బ్రహ్మమునైన నేను పురుషతత్వం గల జీవులకు శిరస్సునై ఉన్నాను.ఆ పక్షికి నేను కుడి రెక్కను,ఆ పక్షికి నేను ఎడమ రెక్కను.ఆ పక్షికి నేను ఆత్మను.ఇదియే ఆ పక్షికి తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
04.అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే,యాః కాశ్చ పృధివీం శ్రితాః,అధో అన్నేనైవ జీవంతి,అధైనదపి యన్త్యన్తతః,అన్నంహి భూతానాం జ్యేష్ఠం,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే:జీవులు,ప్రజలు - ఒకరని కాదు పృధ్విపైన గల సమస్తమూ అన్నం వల్లనే పుడుతుంది.అన్నం వల్ల పుట్టిన జీవులు మళ్ళీ అన్నం చేతనే పెరుగుతాయి.చివరికి మళ్ళీ అన్నమే అవుతాయి.జీవుల కన్న ముందరే అన్నం పుడుతుంది.అందువల్లనే అన్నిటికీ ఔషధం అవుతుంది.
05.సర్వం వై తే2న్నమాప్నువంతి,యే2న్నం బ్రహ్మోపాసతే,అన్నంహి భూతానాం జ్యేష్ఠం,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే,అన్నాద్ భూతాని జాయంతే,జాతాన్యన్నేన వర్ధంతే,అద్య తేత్తిచ భూతాని,తస్మాదన్నం తదుచ్యత ఇతి:అన్నమే నేనని ఎవరు తెలుసుకుంటే వారికి అన్నం పుష్కలమై లభిస్తుంది.జీవుల కన్న ముందరే అన్నం పుడుతుంది.అందువల్లనే అన్నం అన్నిటికీ ఔషధం అవుతుంది.భూతాళి సమస్తం అన్నం నుంచే పుడుతున్నాయి.అలా పుట్టిన జాతులన్నీ అన్నం వల్లనే పెరుగుతున్నాయి.మొదట తను భూతాళి చేత స్వీకరించబడి తర్వాత భూతాళిని తను స్వీకరించేది గనకనే దాన్ని అన్నం అని పిలుస్తారు.
06.తస్మాద్వా ఏతస్మా దన్నరసమయాత్,అన్యోన్తర ఆత్మా ప్రాణమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇది గాక,అన్నరసాలకు అంతరాన ప్రాణమయమైన ఆత్మ ఉంటుంది.ఈ ప్రాణం చేరిక వల్ల ఆ అన్నం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
07.తస్య ప్రాణ ఏవ శిరః,వ్యానో దక్షిణ పక్షః,అపాన ఉత్తరః పక్షః,ఆకాశ ఆత్మా,పృధివీ పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అన్న స్వరూపమైన ఆ పక్షికి ప్రాణమే శిరస్సు.వ్యానము కుడి రెక్క.అపానము ఎడమ రెక్క.అంతరిక్షమే ఆత్మకు దేహం.అన్న స్వరూపమైన ఆ పక్షికి పృధ్వియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
08.ప్రాణం దేవా అనుప్రాణంతి,మనుష్యాః పశవశ్చ యే,ప్రాణోహి భూతానా మాయుః,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే,సర్వమేవ త ఆయుర్యంతి, యే ప్రాణం బ్రహ్మోపాసతే,ప్రాణోహి భూతానా మాయుః,తస్మాత్ సర్వౌషధ ముచ్యత ఇతి:ప్రాణవాయువు ద్వారానే దేవతలు దేహధారులై జీవిస్తారు.మానవులే కాదు పశువులు సైతం ఇలానే జీవిస్తాయి.ఈ ప్రాణమే జీవులను చైతన్యవంతం చేస్తుంది.అందువల్లనే ప్రాణం అన్నిటికీ ఔషధం అయ్యింది.ప్రాణమే నేనని ఎవరు తెలుసుకుంటే వారికి ఆయుష్షు పుష్కలమై లభిస్తుంది.ఈ ప్రాణమే జీవులను చైతన్యవంతం చేస్తుంది.అందువల్లనే ప్రాణం అన్నిటికీ ఔషధం అవుతుంది.
09.తస్యేష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్,అన్యోన్తర ఆత్మా మనోమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,ప్రాణమునకు అంతరాన మనోమయమైన ఆత్మ ఉంటుంది.ఈ మనస్సు చేరిక వల్ల ఆ ప్రాణం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
10.తస్య యజురేవ శిరః,ఋగ్దక్షిణః పక్షః,సామోత్తరః పక్షః,ఆదేశ ఆత్మా,అధర్వాంగిరసః పుఛ్చం ప్రతిష్ఠా,తదప్యేష శ్లోకో భవతి:మనః స్వరూపమైన ఆ పక్షికి యజుర్వేదం శిరస్సు,ఋగ్వేదం కుడి రెక్క,సామవేదం ఎడమ రెక్క.మనః స్వరూపమైన ఆ పక్షికి గురుపరంపరానుసారం కొనసాగుతున్న వేదజ్ఞానసారమే ఆత్మ.ఆ విహరించే పక్షికి అధర్వాంగ శృతియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
11.యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ,ఆనందం బ్రహ్మణో విద్వాన్,న బిభేతి కదాచనేతి:మనస్సు చేత చేరుకోలేని నన్ను వాక్కు చేత చెప్పలేని ఆనంద స్వరూపమైన నన్ను ఎవరు కనుక్కోగలరు?వారే జ్ఞానులు!ఆనంద స్వరూపుడనైన నన్ను తెలుసుకున్న విద్వాంసులు దేనికీ ఎవ్వరికీ ఎప్పటికి భయపడరు,ఇది సత్యం!
12.తస్యైష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాన్మనోమయాత్,అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,మనస్సునకు అంతరాన విజ్ఞానమయమైన ఆత్మ ఉంటుంది.ఈ విజ్ఞానం చేరిక వల్ల ఆ మనస్సు పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
13.తస్య శ్రధ్ధైవ శిరః,ఋతం దక్షిణః పక్షః,సత్య ముత్తరః పక్షః,యోగ ఆత్మా,మహః పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి శ్రధ్ధయే శిరస్సు, నీతి కుడి రెక్క,సత్యం ఎడమ రెక్క.జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి వేదశాస్త్రానుసారం కొనసాగుతున్న యోగసాధనయే ఆత్మ.జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి మహత్వ పూర్ణమైన బుద్ధియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
14.విజ్ఞానం యజ్ఞన్తనుతే,కర్మాణి తనుతే2పిచ,విజ్ఞానం దేవా స్సర్వే,బ్రహ్మ జ్యేష్ఠ ముపాసతే,విజ్ఞానం బ్రహ్మ చేద్వేద, తస్మాత్ ఛే2న్న ప్రమాధ్యతి:విజ్ఞానం యజ్ఞకర్మలను నిర్వర్తిస్తుంది.అదే కామ్యకర్మలను కూడా చేస్తుంది.దేవతలు అందరూ ఆదినుంచీ కొనసాగుతున్న నన్ను జ్ఞానస్వరూపుడిగానే ఉపాసిస్తున్నారు.ఎవరు నన్ను జ్ఞానంతో శోధించి తెలుసుకుని నన్ను జ్ఞానస్వరూపుడిగా చూస్తారో వారికి నైతిక ప్రమాద భయం ఎలా సంభవిస్తుంది?
15.శరీరే పాంపనో హిత్వా సర్వాన్ కామాన్ త్సమశ్నుత ఇతి,తస్యేష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్,అన్యోంతర ఆత్మా ఆనందమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:అలాంటి జ్ఞానులు తమకు ప్రమాదం తెచ్చిపెట్టే దుష్టభావననలను శరీరం నుంచి బహిష్కరించి తమకు హితమైన వాటితోనే శరీరాన్ని పోషించి తమ కోరికలను తీర్చుకుని ఆనందిస్తారు.ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,విజ్ఞానమునకునకు అంతరాన ఆనందమయమైన ఆత్మ ఉంటుంది.ఈ ఆనందం చేరిక వల్ల ఆ విజ్ఞానం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
16.తస్య ప్రియమేవ శిరః,మోదో దక్షిణః పక్షః,ప్రమోద ఉత్తరః పక్షః, ఆనంద ఆత్మా,బ్రహ్మ పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:ఆనంద స్వరూపమైన ఆ పక్షికి ఇష్టమే శిరస్సు,సంతోషమే కుడి రెక్క,ఉత్సాహమే ఎడమ రెక్క.ఆనంద స్వరూపమైన ఆ పక్షికి జ్ఞానచైతన్యం వల్ల కలుగుతున్న ఆనందమే ఆత్మ.ఆనంద స్వరూపమైన ఆ పక్షికి బ్రహ్మమునైన నేను తోకలా స్థిరత్వాన్ని ఇస్తున్నాను.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
17.అసన్నేవ స భవతి, అసద్ బ్రహ్మేతి వేదచేత్,అస్తి బ్రహ్మేది చేద్వేద, సంతమే నంతతో విదురితి,తస్యైష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య:ఏ మనుష్యుడు బ్రహ్మమునైన నా ఉనికిని తిరస్కరిస్తాడో అతని ఉనికి కూడా లేనట్లే,ఇది నిష్ఠుర సత్యం.ఏ మనుష్యుడు బ్రహ్మమునైన నా ఉనికిని సత్యం అని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే అతని ఉనికి సత్యం అవుతుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.
18.అధాతో అనుప్రశ్నాః ఉతా విద్వా నముం లోకం ప్రేత్య,కశ్చన గఛ్చతీ,ఆహో విద్వా నముం లోకం ప్రేత్య,కశ్చిత్సమశ్నుతా - ఉ,సో2కామయత,బహుస్యాం ప్రజాయేయేతి,స తపో2తప్యత:ఇప్పుడు అనేకమైన ప్రశ్నలు వస్తాయి - "ప్రాణోత్క్రమణ తర్వాత బ్రహ్మమును తెలుసుకోలేని వారు ఏమౌతారు?ప్రాణోత్క్రమణ తర్వాత బ్రహ్మమును తెలుసుకున్న వారు ఏమౌతారు?సృష్టికర్త ఏమి ఆశించాడు?సృష్టికర్త ఏమి శాసించాడు?నేను ఎక్కడికి వెళ్తాను?నేను మళ్ళీ ఎలా జన్మిస్తాను?" అనే సందేహాలతో తపిస్తారు.
19.స తపస్తప్త్వా,ఇదం సర్వ మసృజత,యదిదం కింశ్చ,తత్ సృష్ట్వా,తదేవాను ప్రావిశత్:బ్రహ్మమునైన నేను సైతం అలా తపించడం వల్లనే ఇది ఇలా సృజించబడిందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.అలా నేను సృజించాను,అలా నేను దీనిలోనికి ప్రవేశించాను.
20.తదను ప్రవిశ్య - సఛ్చత్యఛ్చా భవత్,నిరుక్తం శ్చానిరుక్తం శ్చ,నిలయనం శ్చానిలయనం శ్చ,విజ్ఞానం శ్చావిజ్ఞానం శ్చ,సత్యం శ్చానృతం శ్చ సత్యమభవత్,యదిదం కింశ్చ,తత్సత్య మిత్యాచక్షతే - తదప్యేష శ్లోకో భవతి:అలా ప్రవేశించిన తర్వాత - వ్యక్తుడనూ అవ్యక్తమునూ అయ్యాను,నిర్వచనీయమునూ అనిర్వచనీయమునూ అయ్యాను,ఆశ్రయం పొందినదీ ఆశ్రయం పొందనిదీ అయ్యాను,విజ్ఞానమునూ అజ్ఞానమునూ అయ్యాను.సత్యమునూ అసత్యమునూ కూడా నేనే అయ్యాను,ఏదైతే ఉన్నదో దానిని సత్యమే అనాలి.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
21.అసద్వా ఇదమగ్ర ఆసీత్,తతో వై సదజాయత,తదాత్మానం స్వయ మకురుత,తస్మాత్ తత్సుకృత ముఛ్చతి,యద్వై తత్సుకృతం రసో వై సః,రసం హ్యేవాయం లబ్ధ్వా2నందీ భవతి:ఆదిలో దీనికి ఉనికి లేదు.నేను సృజించిన తర్వాతనే ఇది ఉనికిలోకి వచ్చింది.బ్రహ్మమునైన నేను నానుండియే నన్ను సృజించుకున్నాను,అందువల్లనే నన్ను స్వయంభువు అంటారు.స్వయంకృతుడను గనకనే బ్రహ్మమునైన నేను ఆనంద స్వరూపుడ నయ్యాను.
22.కో హ్యవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్,ఏష హ్యేవానంద యాతి:సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు మానవులు సైతం స్వయంకృత సృష్టికర్తలు అవుతారు.అంతరిక్షంలోని ఆకాశానికి ఆనందాన్ని ఇచ్చే లక్షణం లేనప్పుడు ఎవరు మాత్రం ప్రాణవాయువును అటువైపుకు కదిలిస్తారు?ఆనందాన్ని ఇచ్చేది బ్రహ్మమునైన నేను గనక నేను ఉన్నట్లే కద!
23.యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్ఠాం విందతే, అధ సో అభయం గతో భవతి:ఎప్పుడు అవ్యక్తమునూ అనిర్వచనీయమునూ శాశ్వతుడనూ అయిన నన్ను తమ ధారణ లోనికి ఆహ్వానించుకుంటారో వారికి దేని గురించి గానీ ఎవరి గురించి గానీ ఎప్పటికి గానీ భయం అనేది లేదు,ఇది నిశ్చయం.
24.యదా హ్యేవైష ఏతస్మిన్నుదర మంతరం కురుతే, అధ తస్య భయం భవతి,తత్వేవ భయం విదుషో2మన్వానస్య - తదప్యేష శ్లోకో భవతి:  ఎప్పుడు ఈ ఆనందకరమైన మార్గం నుంచి పక్కకి జరిగితే అప్పుడు వారికి భయం మొదలవుతుంది.తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులకు భయం తప్పదు,ఇది నిశ్చయమే!దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
25.భీషాస్మా ద్వాతః పవతే,భీషోదేతి సూర్యః,భీషాస్మా దగ్నిశ్చేంద్రశ్చ,మృత్యుర్ ధావతి పంచమ ఇతి:ఆ భయం వల్లనే గాలి వీస్తున్నది.ఆ భయం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు.ఆ భయం వల్లనే ఇంద్రాగ్నులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.ఐదవదైన మృత్యువు సైతం ఆ భయం వల్లనే జీవులను కబళిస్తున్నది.
26.సైషానందస్య మీమాంసా భవతి,యువా స్యాత్సాధు యువాధ్యాయకః - ఆశిష్ఠో దృటిష్ఠో బలిష్ఠః తస్యేయం పృధివీ సర్వా సర్వా విత్తస్య పూర్ణా స్యాత్,స ఏకో మానుష ఆనందః:కూలంకష పరిశీలన చేసి ఆనందం గురించి ఇలా సూత్రీకరించవచ్చు - విద్యావంతుడైన ఒక మంచి కుర్రాడు గనక దృఢ శరీరం గలవాడైతే  భూమి సమస్తమూ అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది.ఇది ఒక మానవపురుషతత్వం యొక్క ఆనందానికి కొలత. 
27.తే యే శతం మానుషా ఆనందాః స ఏకో మనుష్యగంధర్వాణా మానందాః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక మానవపురుషతత్వం ఆనందానికి పది రెట్లు మనుష్యగంధర్వతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
28.తే యే శతం మనుష్యగంధర్వాణా మానందాః స యేకో దేవగంధర్వాణా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక మనుష్యగంధర్వతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు దేవగంధర్వతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
29.తే యే శతం దేవగంధర్వాణా మానందాః స యేకః పితృణా శ్చీరలోకలోకానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక దేవగంధర్వతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక పితృలోకవాసుల యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
30.తే యే శతం పితృణా శ్చిరలోకలోకానా మానందాః స యేక ఆజానజానాందేవానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక పితృలోకవాసుల యొక్క ఆనందానికి పది రెట్లు ఒక స్వర్గలోకవాసుల యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
31.తే యే శతం ఆజానజానాందేవానా మానందాః స యేకః కర్మదేవానాం దేవానా మానందః,యే కర్మణా దేవాన పియంతి,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక స్వర్గలోకవాసుల యొక్క ఆనందానికి పది రెట్లు ఒక కర్మదేవతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.త్యాగధనులైన మానవులు స్వర్గం చేరితే వారిని కర్మదేవతలు అని పిలుస్తారు.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
32.తే యే శతం కర్మదేవానాం దేవానా మానందాః స యేకో దేవానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక కర్మదేవతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక దేవతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
33.తే యే శతం దేవానా మానందాః స యేక ఇంద్రస్యా2నందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక దేవతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక ఇంద్రతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
34.తే యే శతం ఇంద్రస్యా2నందాః స యేకో బృహస్పతే రానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక ఇంద్రతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక బృహస్పతితత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
35.తే యే శతం బృహస్పతే రానందాః స యేకః ప్రజాపతే రానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక బృహస్పతితత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక ప్రజాపతితత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
36.తే యే శతం ప్రజాపతే రానందాః స యేకో బ్రహ్మణ ఆనందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక ప్రజాపతితత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక బ్రహ్మతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
37.స యశ్చాయం పురుషే యశ్చాసా వాదిత్యే,స యేకః,స య ఏవం విత్, అస్మాల్లోకాత్ ప్రేత్య:ఎవడైతే పురుషతత్వంలో ప్రకాశిస్తున్నాడో అతడే సూర్యతత్వంలోనూ ప్రకాశిస్తున్నాడు.అక్కడ ఉన్నది ఒకటే.అది తెలుసుకోవటమే బ్రహ్మవిద్య.అది తెలిసిన జ్ఞాని లౌకిక బంధనాల నుంచి విముక్తుడు అయినట్లే!
38.ఏత మన్నమయ మాత్మాన ముపసంక్రామతి, ఏతం ప్రాణమయ మాత్మాన ముపసంక్రామతి,ఏతం మనోమయ మాత్మాన ముపసంక్రామతి, ఏతం విజ్ఞానమయ మాత్మాన ముపసంక్రామతి,ఏత మానందమయ మాత్మాన ముపసంక్రామతి - తదప్యేష శ్లోకో భవతి:పురుషతత్వం అన్నానికి సంబంధించి స్వయంతృప్తం అయినప్పుడు ప్రాణానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.పురుషతత్వం మనస్సుకి సంబంధించి స్వయంతృప్తం అయినప్పుడు జ్ఞానానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.అప్పుడు పురుషతత్వం ఆనందానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
39.యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ,ఆనందం బ్రహ్మణో విద్వాన్, న బిభేతి కుతశ్చనేతి:మనస్సు చేత చేరుకోలేని నన్ను వాక్కు చేత చెప్పలేని ఆనంద స్వరూపమైన నన్ను ఎవరు కనుక్కోగలరు?వారే జ్ఞానులు!ఆనంద స్వరూపుడనైన నన్ను తెలుసుకున్న విద్వాంసులు దేనికీ ఎవ్వరికీ ఎప్పటికి భయపడరు,ఇది సత్యం!
40.ఏతం హవావ న తపతి, కిమహం సాధు నాకరవం,కిమహం పాప మకరవ మితి స య ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణుతే,ఉభే హ్యేవైష ఏతే ఆత్మానం స్పృణుతే,య ఏవం వేద, ఇత్యుపనిషత్:ఆ జ్ఞానం ఉన్న పురుషతత్వానికి మంచిపనులు ఎందుకు చెయ్యలేకపోయాననీ పాపకర్మలు ఎందుకు చేశాననీ బాధ పడాల్సిన అగత్యం రాదు.విద్వాంసులు దీనినే ఆత్మ అని గుర్తిస్తారు.నిజానికి జ్ఞాని ఈ రెంటినీ ఆత్మలో నిలుపుకుంటాడు.ఇది వేదం చెప్తున్న సత్యం.ఇదే ఉపనిషత్తు కూడా చెప్తున్నది.

P.S:ఆనందవల్లి యొక్క మాధుర్యం ఎంత గొప్పదంటే దీన్ని మొదటిసారి విన్న నాటి నుంచే అనిపించింది రాత్రి అన్ని పనులూ ముగిశాక చదువుకుంటే బావుంటుందని - ఇప్పుడు ప్రతి రోజూ ప్రశాంతమైన నిద్రని అనుభవిస్తున్నాను.

మీరూ అదే ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.

హరిః ఓం!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...