Sunday, 19 June 2022

మూర్తిపూజ కన్న శ్రీవిద్య ఎందుకు విశిష్టమైనది?

హిందువులకి ఉన్న ఒకే ఒక విజ్ఞాన సర్వస్వం వేదం.వేదం మూర్తిపూజని సమర్ధించడం లేదు.మూర్తిపూజని పిచ్చికింద మార్చిన జియ్యర్ స్వామి వంటివారు వేదం మూర్తిపూజని సమర్ధించిందని అంటూ విగ్రహాలను తయారు చేస్తున్న తంత్రశాస్త్రమూ ఆలయనిర్మాణం గురించి చెప్తున్న వాస్తుశాస్త్రమూ పూజావిధానాలను నిర్దేశిస్తున్న ఆగమాలూ వేదశాస్త్రాలే కదా అని మనల్ని నిలదీస్తారు.

సామాన్య హిందువులకి తెలియనిది వైదిక సాహిత్యంలో సంహిత భాగం మాత్రమే సృష్టికర్త స్వయాన ఋషులకు గోచరం చేసిన సత్యాల సంకలనం.అలా చూస్తే ఋగ్వేద సంహిత,సామవేద సంహిత,యజుర్వేద సంహిత,అధర్వణవేద సంహిత మాత్రమే పరమ ప్రమాణం.ఇతరమైన అరణ్యక,బ్రాహ్మణ,ఉపనిషత్తుల లోని సంహితా పాఠంతో విభేదించని విషయం మాత్రమే ప్రమాణం అవుతుంది.వేదం వ్యతిరేకించలేదు అన్న ఒక చిన్న వెసులుబాటును మాత్రం తీసుకుని ప్రస్తుతం మనం చేస్తున్న మూర్తిపూజను తీర్చిదిద్దారు.కానీ, వేదం వ్యక్తిగత స్థాయిలో చెయ్యమని చెప్పిన శ్రీవిద్యనీ సామాజిక స్థాయిలో చెయ్యమని చెప్పిన యజ్ఞాన్నీ ఎందుకు పక్కకి తోసేశారు?

ప్రాచీన కాలపు వైదిక సాహిత్యం భక్తిని గురించి చెప్పలేదు,శ్రధ్ధను  మాత్రమే నొక్కి చెప్పింది.శ్రద్ధ అనేది సర్వ జీవులకీ సహజాతమై ఉంటుంది.జీవుడు తనకు తను ధారణలో నిలుపుకున్న ఒక లక్ష్యానికి అంకితం కావడాన్ని శ్రద్ధ అంటారు.విద్య పూర్తైన ఒక బ్రహ్మచారి తన తల్లిదండ్రులను పోషిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ జీవించడం సైతం అతని వరకు అత్యున్నతమైన లక్ష్యమే అవుతుంది.అలా లక్ష్యం ఏర్పడిన మరుక్షణం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమించేది ఆ లక్ష్యం పట్ల అతనికి ఉన్న శ్రద్ధ కూడా ధారణలోకి ప్రవేశిస్తుంది.

మూర్తిపూజ లోని దోషం తెలియాలంటే శ్రీరాముడి ఉదాహరణని తీసుకోవాలి.శ్రీరాముడికి మనం కట్టిన, కడుతున్న, కట్టబోతున్న ఆలయాలలోని ప్రతిమకీ మనం ఉన్న మహాయుగానికి మూడు మహాయుగాల వెనకటి త్రేతాయుగపు శ్రీరాముడికీ ఏమి సంబంధం ఉంది?ఒకే శ్రీరాముడు ఒక్కో ఆలయంలో ఒక్కోలా ఎందుకు కనిపిస్తున్నాడు!ఒకడే అయిన శ్రీరాముడు అన్ని ఆలయాలలోనూ ఒకేలా ఎందుకు కనిపించడం లేదు? ఇవన్నీ శ్రీరాముడి జీవించి ఉన్నప్పుడు తీసుకున్న నకళ్ళు కాదు,ఆదికావ్యం నుంచి తీసుకున్న వర్ణనలకి శిల్పులు తమ పాండిత్యంతో ఏర్పరచిన వూహారూపాలు మాత్రమే కదా!

వేదశాస్త్రపాండిత్యం ఉన్నవారు కావచ్చ్గు, తంత్రవేత్తలు కావచ్చు,కవులు కావచ్చు - ఇతరులు వారి ధారణలో దర్శించి మనకు చూపిస్తున్న రూపం పట్ల మనం శ్రద్ధ చూపించడమే భక్తి.ఇది దోషం అని తెలుసు కాబట్టే ఇది హద్దులు దాటితే మూఢత్వం పెరిగి దోపిడీకి అవకాశం ఉంటుందని తెలుసు గనకనే తొలినాటి ఆలయాలను ఆధునిక శాస్త్రజులకు సైతం ఎలా నిర్మించారో తెలియనివ్వని స్థాయిలో అత్యున్నతమైన సాంకేతికతని ఉపయోగించి నిర్మించారు.

శ్రీవిద్యలో ఇలాంటి లోపాలు లేవు.యజుర్వేద సంహితలో శ్రీవిద్యని గురించి చెప్పినది సృష్టికర్తయే,మనం ధారణలోకి తీసుకోవడానికి మధ్యవర్తులు ఎవరూ లేరు.శ్రీయంత్రరచనకు ఉన్న నియమాలను బట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉపాసనకి కూర్చుంటే అప్పుడు అక్కడ ఒకే రూపం ఉంటుంది,ఉండాలి,ఉండి తీరాలి.

అయితే, మనం ఆశిస్తున్న ప్రయోజనాన్ని బట్టి అనేకమైన రూపాలలో శ్రీయంత్రం దర్శనం ఇస్తుంది.గణపతి యంత్రం,మహాలక్ష్మి యంత్రం అని చాలా ఉన్నాయి.ప్రస్తుతం నేను ఉపాసిస్తున్న శ్రీ విద్యారణ్య స్వామి పరిష్కరించిన ఖడ్గమాల స్తోత్రం శ్రీయంత్రం మీద ఎలా వ్యాపించింది అనేది అర్ధం అయితే మిగిలిన యంత్రాలను ఎలా నిర్మించారో అర్ధం అవుతుంది.

"త్రిధా చైవ నవధా చైవ చక్ర-సంకేతకం పునః" అన్న సూత్రీకరణ ప్రకారం శ్రీయంత్రంలోని అన్ని అంశాలకూ 3,9 అనే అంకెలతో సంబంధం ఉంటుంది.రెండు రేఖలు ఖండించుకుంటూ ఏర్పడిన 24 సంధినాడులూ మూడు రేఖలు ఖండించుకుంటూ ఏర్పడిన 18 మర్మనాడులూ కలిసి తొమ్మిది త్రికోణాలతో 43 త్రికోణాల అమరికను సాధించడం గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి సైతం కష్టమే! కష్టమే అయినప్పటికీ శాస్త్రాలను ఆధారం చేసుకుని లోపాలు లేని శ్రీయంత్రాన్ని నిర్మించదం సాధ్యమే.

శ్రీచక్రం యొక్క నిర్మాణం గురించి చెప్తున్న ప్రతి ఒక్కరూ కిందకి చూస్తున్న అయిదు త్రికోణాలనీ శక్తికోణాలు అనీ పైకి చూస్తున్న నాలుగు త్రికోణాలనీ శివకోణాలు అనీ చెప్తున్నారు గానీ శ్రీయంత్రానికి కిందా పైనా అంటూ లేదు.మధ్యలో ఉన్న బిందువు నుంచి అని వైపులకీ విస్తరిస్తున్న రూపంలో కిందా పైనా కుడీ ఎడమా ఎలా చెప్పాలి?అయితే, బిందువు నుంచి చూస్తే మొదటి త్రికోణం యొక్క కొస మనవైపుకు చూసేలా ఉపాసన కోసం అద్దం వలె నిలబెట్టినప్పుడు కనిపించే సాపేక్షతను బట్టి అలా చెప్తున్నారు,అంతే!

అయిదు శక్తి కోణాలలోనూ 1.ఆదిమూలం నుంచి విశ్వసృష్టి యొక్క ఆవిర్భావం(Emanation of the cosmos from its primal source),2.విశ్వం యొక్క శూన్యం నుంచి భూతపంచకం వ్యక్తం కావడం(Projection of creation into the primal void),3.సృష్టించబడిన విశ్వం యొక్క పోషణ మరియు రక్షణ(Preservation of the created universe),4.కల్పాంతాన సృష్టి సమస్తం శివైక్యం పొందడం(Withdrawal of the creative and preservative energies in cosmic dissolutions),5.నశించిన ఒక విశ్వం యొక్క తత్వాలు పునరపి కొనసాగడం (Retention of the withdrawn energy-universe for the next cycle of re-creation) వంటి సృష్టిలోని పంచక్రియలకూ ఆధారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది.

శ్రీయంత్రంలో త్రికోణాలు ఎందుకు ప్రముఖం అయ్యాయనేది తెలియాలంటే సృష్టిలోని "అగ్ని-సూర్య-చంద్ర,సృష్టి-స్థితి-లయ,ఇఛ్చ-జ్ఞాన-క్రియ,సాత్విక-రాజస-తామస,జాగృత-స్వాప్నిక-సుషుప్తి,జ్ఞాత్ర-జ్ఞాన-జ్ఞేయ,ఆత్మ(IndoviDual Self)-అంతరాత్మ(Inner Concious)-పరమాత్మ(Supreme Concious)" వంటి అనేక తత్వాలలో కనిపిస్తున్న త్రిత్వత్వం శ్రీచక్రం మీద మనం చూస్తున్న యోగినులలోనూ చక్రేశ్వరులలోనూ ఇతర నామరూపశక్తులలోనూ ఉన్నాయనేది అర్ధం కావాలి.

01. బీజ మంత్ర నాంది:

మనం చేస్తున్న ఖడ్గమాల ఉపాసన మొదట బిందువు నుంచే మొదలవుతుంది."ఓం, ఐం, హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌః" అనే బీజాక్షరాలను మంద్రస్థాయిలో ఉచ్చారణ చేస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి. ఓంకారం అనేది ఏదో ఒక ధ్వని కాదు - శబ్దబ్రహ్మం!ఓంకారం యొక్క ఉచ్చారణలో రెండు దశలు ఉంటాయి.పెదవులు తెరుచుకుని ఉచ్చరిస్తున్న మొదటి దశ గడిచిన  తర్వత పెదవుల్ని మూసి ఉచ్చరించేటప్పుడు రెండు అద్భుతాలు జరుగుతాయి.ఒకటి స్వరతంత్రుల నుంచి పుట్టిన శబ్దం శరీరం లోపల ప్రతిధ్వనిస్తుంది.ప్రకంపనల వల్ల నైట్రిక్ యాసిడ్ పుడుతుంది.ఒకేసారి టన్నులలోనో కిలోలలోనో పుట్టదు గానీ తరచుగా ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉంటే తేడా తెలుస్తుంది.అతి తక్కువ స్థాయిలో పుట్టినప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చెయ్యడానికి ఆల్కహాల్ పుట్టాలి కద - అలా పుట్టిన ఆల్కహాల్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేసినప్పుడు తయారైన నైట్రోజన్ బేస్డ్ ప్రాడక్టులు కార్బోహైడ్రేట్ మెటబాలిజానికి చాలా అవసరం.అన్నిటికన్న బయోలాజికల్ ఇంటర్నెట్ అనదగిన DNA ఏర్పడేదీ మార్పులకి గురయ్యేదీ ఎడినైన్,సైటోసీన్,గ్వానైన్,ధయమైన్ అనే నత్రజని ఆధారిత లవణాల వల్లనే.ఓంకారానికి మాత్రమే కాదు,అన్ని బీజాక్షరాలకూ ఇదే విషయం వర్తిస్తుంది.

02. అంగన్యాస తిధినిత్య స్తుతి:

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "నమఃత్రిపురసుందరి!" అంటూ శ్రీమాతను ఆహ్వానిస్తూ ప్రతి అర్చనకీ సామాన్యం అయిన "హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి" అనే అంగన్యాస దేవతా నామాలను మంద్రస్థాయిలో గానం చేస్తూ ఆ బిందువు చుట్టు ఆవరించుకుని ఉన్న త్రికోణం మీద ఒక చతురస్రం ఉన్నట్టు వూహించుకుని కుడివైపు పైనుంచి మొదలుపెట్టి సవ్యదిశలో ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క మూలనీ కేటాయిస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి.తర్వాత బిందువుకు పైన దృష్టిని కేంద్రీకరించి "నేత్రదేవి" అనే అంగన్యాస దేవతా శక్తినీ బిందువుకు కింద దృష్టిని కేంద్రీకరించి "అస్త్రదేవి" అనే అంగన్యాస దేవతా శక్తినీ మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

దీని తర్వాత "కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని; మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే; నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, విచిత్రే" అన్న 15 మంది తిధినిత్యా దేవతా శక్తుల్నీ మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.బిందువు చుట్టు ఆవరించుకుని ఉన్న త్రికోణం మీద కిందకి చూస్తున్న కొసనుంచి మొదలుపెట్టి అపసవ్యదిశలో ఒక్కొక్క భుజం పైన అయిదేసి దేవతలకు గల అయిదేసి స్థానాల మీద దృష్టిని కేంద్రీకరించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు "శ్రీవిద్యే!" అని మంద్రస్థాయిలో గానం చెయ్యాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

03. ఆచార్య పరంపర ప్రశస్తి:

అసలు శ్రీచక్రం యొక్క నవావరణల సాధనలోకి వెళ్ళబోయే ముందు "దక్షిణామూర్తిమయి, నారాయణమయి, బ్రహ్మమయి, సనకమయి, సనందనమయి, సనాతనమయి, సనత్కుమారమయి, సనత్సుజాతమయి; వశిష్టమయి, శక్తిమయి, పరాశరమయి, కృష్ణద్వైపాయనమయి, పైలమయి, వైశంపాయనమయి, జైమినిమయి, సుమంతుమయి, శ్రీశుకమయి; గౌడపాదమయి, గోవిందమయి, శ్రీవిద్యాశంకరమయి, పద్మపాదమయి, హస్తామలకమయి, త్రోటకమయి, సురేశ్వరమయి, శ్రీవిద్యారణ్యమయి; పరమేష్టిగురు శ్రీదక్షిణామూర్తిమయి, పరమగురు శ్రీ కృష్ణద్వైపాయనమయి, స్వగురు శ్రీ విద్యారణ్యమయి" అనే శ్రీవిద్యను ఉపాసించి తరించి మనకు పరిచయం చేసి తరింపజేసిన ఆచార్య పరంపరను స్మరించుకోవాలి.

04. నవవిధ ప్రాకార పరిక్రమ:

బిందువు నుంచి సాగి విస్తరించిన శ్రీయంత్రాన్ని ఉపాసిస్తూ పరిధి నుంచి బిందువు వైపుకి వెళ్తున్నప్పుడు 1.భూపుర వలయం,2.షోడశ పద్మ వలయం,3.అష్టదళ పద్మ వలయం,4.చతుర్దశార త్రికోణ వలయం,5.బహిర్దశార త్రికోణ వలయం,6.అంతర్దశార త్రికోణ వలయం,7,అష్టార త్రికోణ వలయం,8.ఏక త్రికోణ పీఠం,9.సహస్రదళపద్మ బిందురూపం అనే దశలను అధిగమిస్తూ వెళ్ళాలి.

05 ప్రధమం త్రైలోక్యమోహనం:.

పధ్నాలుగు లోకాల అండకటాహం పైకప్పున ఉన్న శ్రీయంత్రపు త్రిమితీయ రూపమైన మణిద్వీపాన్ని శ్రీమాత యొక్క రాజధాని నగరం అనుకుంటే మూడు వరసల భూపురాలు అగడ్తలతో కూడిన ప్రాకారాలు అవుతాయి.త్రిమితీయ స్థితిలో ఆరు ద్వారాలు ఉంటాయి గానీ మనం ఉపాసిస్తున్న ద్విమితీయ స్థితిలో నాలుగు ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "త్రైలోక్య మోహన చక్రస్వామిని, ప్రకట యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సాధన వల్ల త్రిలోకాలలోని మోహనత్వం మనలో ప్రకటం కావడమూ తద్వార మనం త్రిలోకాలలోనూ మోహనమూర్తిలా ప్రకటం కావడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

మొదటి ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇఛ్చాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.ఆ శక్తితత్వాలని శాసించే మాతృమూర్తులు అష్టసిద్ధులను ప్రసాదించి ఇతరులకు సంతోషం కలిగించే మోహనకరమైన వ్యక్తిత్వాన్ని మీకు ఇస్తారు.

రెండవ ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మాహాలక్ష్మీ" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.ఇక్కడి మాహాలక్ష్మీ నామానికి ముందు కనిపిస్తున్నవి మార్కండేయ పురాణంలోని సప్తశతి యొక్క ఉత్తర చరిత్ర ప్రస్తుతిస్తున్న మహాసరస్వతీ స్వరూపమైన సప్తసతులు.

మూడవ ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసంక్షోభిణి, సర్వావిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

06. ద్వితీయం సర్వాశాపరిపూరకం:

ప్రతి మానవుడికీ తప్పనిసరి అయిన మానసిక అవసరాలను తీర్చే శక్తిస్వరూపాలకు ప్రతిబింబమే శ్రీచక్రం.పరమేశ్వరుడు సృజించిన ప్రకృతిని మనకు అనుకూలం చేసుకుని సుఖభోగాలను అనుభవించడం కోసం సృష్టికర్తయే ప్రసాదించినది శ్రీవిద్య.భూపురాలకు లోపల ఉన్న పదహారు పద్మదళాల వలయమే సర్వాశా పరిపూరక చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వాశాపరిపూరక చక్రస్వామిని,గుప్తయోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల నెరవేరని పక్షంలో అసంతృప్తిని కలిగించే కోరికలు ఫలించడమూ తద్వార మనం నిత్యతృప్తులమై ఉండడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పదహారు పద్మదళాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "కామాకర్షిణి, బుధ్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి" అనే 16 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.భూత పంచకాన్నీ జ్ఞానేంద్రియ పంచకాన్నీ కర్మేంద్రియ పంచకాన్నీ బుద్ధినీ శాసించే మాతృమూర్తులు మనలోని పదహారు అగ్నిస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురేశీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

07. తృతీయం సర్వసంక్షోభణం:

ప్రేయసీప్రియులు గానీ భార్యాభర్తలు గానీ పరస్పర పరిపూర్ణత్వం కోసం సహజీవనం చేస్తున్న జంటలలో సంక్షోభాల్ని సృష్టించడం ఇఛ్చాతత్వం కలిగిన మహిళలు సృష్టిస్తున్న సంక్షోభాల్ని క్రియాతత్వం కలిగిన పురుషులు జ్ఞానతత్వాన్ని పెంచుకుని పరిష్కరించగలిగితే ఇద్దరిలోనూ అనురాగం ఆర్ణవమై దాంపత్యం మదనమనోహరమై జ్వలిస్తుంది.పదహారు పద్మదళాలకు లోపల ఉన్న ఎనిమిది పద్మదళాల వలయమే సర్వ సంక్షోభణ చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసంక్షోభణ చక్రస్వామిని,గుప్తతర యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల స్త్రీపురుషుల మధ్య శతృత్వ భావనలు తగ్గడమూ తద్వార  దంపతుల మధ్య కళ్యాణ భావనలు పెరగడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పదహారు పద్మదళాలకు లోపల ఉన్న ఎనిమిది పద్మదళాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. ఇంద్రియజ్ఞానానికి పై స్థాయిలో పనిచేస్తూ లౌకిక విషయాల పట్ల మానసికపరమైన అనుకూలతనీ వ్యతిరేకతనీ భేదభావననీ ప్రభావితం చేస్తున్న మాతృమూర్తులు మనలోని ఎనిమిది పృధ్వీస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురసుందరీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

08. చతుర్ధం సర్వసౌభాగ్యదాయకం:

మానవుడు తన కామనలను తీర్చుకోవడానికి అవసరమైన ఐశ్వర్యాలను ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.ఎనిమిది పద్మదళాలకు లోపల ఉన్న పధ్నాలుగు త్రికోణాల వలయమే సర్వసౌభాగ్యదాయక చక్రం.పధ్నాలుగు త్రికోణాలలో క ఢ వరకు గల పధ్నాలుగు హల్లులూ వ్రాసి ఉండడం కాకతాళీయం కాదు.మానవ దేహంలోని పధ్నాలుగు అతి ముఖ్యమైన నాడులను సూచిస్తాయి అవి.జీవుల దేహాలు పంచభూతాత్మకమైనవి అయితే ఆ భూత పంచకం జీవులు శాసించే పద్ధతిని బట్టి చైతన్యవంతం అవుతాయి.మానవులకు సహజమైన శ్వాసక్రియ 24 నిమిషాలకు 360 సార్లు జరగాలి.దీనిని నాడిక అనే పేరున ప్రమాణం చేశారు.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని,సంప్రదాయ యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల నాడీపరమైన చైతన్యం ఉత్తేజితమై ఐశ్వర్యవంతమైన భావప్రాప్తి సాధకులకు వశం కావడమే ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

ఎనిమిది పద్మదళాలకు లోపల ఉన్న పధ్నాలుగు త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్ధసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరి" అనే 14 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పధ్నాలుగు నాడీస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురవాసినీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

09. పంచమం సర్వార్ధసాధకం:

వాయుచలనాన్ని నియంత్రించి అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల వలయమే సర్వసౌభాగ్యదాయక చక్రం.ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన,సమాన వాయువులు అయిదూ మామూలు శ్వాసక్రియను నియంత్రిస్తే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ వాయువులు కనురెప్పల కదలిక వంటి వాటికి కారణం అవుతాయి.ప్రాణోత్క్రమణ సమయంలో ఆఖరున ధనంజయ వాయువు శరీరం నుంచి బయటికి వెళ్తుంది.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వార్ధసాధక చక్రస్వామిని,కుల యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల విశ్వం నుంచి మనస్సు వైపుకీ మనస్సు నుంచి విశ్వం వైపుకీ జరగాల్సిన ఆదాన ప్రదాన వ్యవస్థ చైతన్యవంతం కావడమే ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పది వాయుస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాశ్రీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

10. షడ్జమం సర్వరక్షాకరం:

రేచకం(purgation),పచకం(digestion),శోషకం(absorption),దాహకం(burning),ప్లవకం(secretion),క్షారకం(acidification),ఉధ్ధారకం(excretion),క్షోభకం(frustration),జృంభకం(assimilation),మహకం(brightening) అనే పది అగ్నులను నియంత్రిస్తూ అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాలకు లోపల ఉన్న పది అంతర్దశార త్రికోణాల వలయమే సర్వరక్షాకసర్వరక్షా చక్రం.ఇక్కడినుంచి సాధకులకు అంతర్ముఖత్వం ప్రారంభమవుతుంది.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వరక్షాకర చక్రస్వామిని,నిగర్భ యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల అగ్నిస్థానాలు సమతుల్యమై క్రమపధ్ధతిలో ప్రజ్వలించడమూ తలపెట్టిన కార్యాలలోని ఆరంభ విఘ్నాలు తొలగి మనస్సులోని వ్యాకులతలు తొలగి శివత్వం పెరగడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పది బహిర్దశార త్రికోణాలకు లోపల ఉన్న పది అంతర్దశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహారే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి,సర్వ ఈప్సితార్ధ ప్రదే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పది అగ్నిస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురమాలినీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

11. సప్తమం సర్వరోగహరం:

ప్రకృతి మనస్సు మీద కలిగించే ద్వంద్వ(duality), శీత(water), వాత(fire), స్వాద(happiness), తప(sorrow), ఇఛ్చ(desire), త్రిగుణతత్వ(consciousness), రాజస(ego), తామస(intellect) ప్రవృత్తులను నియంత్రిస్తూ అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పది అంతర్దశార త్రికోణాలకు లోపల ఉన్న అష్టదశార త్రికోణాల వలయమే సర్వరోగహర చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వరోగహర చక్రస్వామిని,రహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల శారీరక మానసిక దోషాలు పోవడమూ అంతర్ముఖత్వం మరింత పెరిగి దైవసంస్పర్శన సుఖం అనుభూతిలోకి రావడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అంతర్దశార త్రికోణాలకు లోపల ఉన్న అష్టదశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. వీరు లలితాసహస్రనామ సంకలన కర్తలైన అష్టవిధ వాగ్దేవతలు గనక వాక్కును శాసించి రక్షించి శాపానుగ్రహ సమర్ధతను ఇచ్చే వాక్శుధ్ధి వంటి శక్తులను అనుగ్రహిస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాసిధ్ధే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

12. అష్టమం సర్వసిధ్ధిప్రదం:

పశ్యంతి,మధ్యమ,వైఖరి అనే వాగ్భవ శక్తులకూ ఇఛ్చ జ్ఞాన క్రియా సక్తులకూ ఇది కూటమి.రాజస(ego),తామస(intellect) ప్రవృత్తులను నియంత్రిస్తూ సాత్వికతను ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న ఏక త్రికోణ పరివృత వలయమే సర్వసిధ్ధిప్రద చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసిధ్ధిప్రద చక్రస్వామిని అతిరహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల అన్ని రకాల విజయాలనూ అనాయాసమైన పధ్ధతిలో సాధించడమూ తద్వార అన్ని రకాల విషయాలనూ సమదృష్టితో చూడగలగటమూ  ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న త్రికోణం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని" అనే 7 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాంబికే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

13. నవమం సర్వానందమయం:

మణిద్వీపవాసిని యైన త్రిపురసుందరి యొక్క నిజస్థానం ఇది.కేంద్రం వద్ద ఉన్న సహస్రదళపద్మం వంటి బిందువును ఆవరించి ఉన్న వలయమే సర్వానందమయ చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వానందమయ చక్రస్వామిని, పరాపరరహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల పరబ్రహ్మస్వరూపిణితో మమైక్యం కావడమూ తద్వార సృష్టిస్థితిలయాలకు అతీతం కావడమూ  ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న త్రికోణం మధ్యన ఉన్న బిందువు మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "మహామహాకామేశ్వరి, మహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞి, మహారాజరాజేశ్వరి, ప్రతాపభారతి, పరబ్రహ్మస్వరూపిణి" అనే 5 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు "నమస్తే నమస్తే నమః" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో చక్రేశ్వరిని ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

14. శాంతి మంత్ర స్వస్తి:

మనం చేస్తున్న ఖడ్గమాల ఉపాసన చివరకు బిందువు వద్ద ఆగుతుంది."ఓం, సౌః, క్లీం, ఐం, శ్రీం, హ్రీం,ఐం" అనే బీజాక్షరాలను మంద్రస్థాయిలో ఉచ్చారణ చేస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి. పైన విశ్లేషించి చెప్పినది శ్రీ విద్యారణ్య స్వామి వారు పరిష్కరించిన ఖడ్గమాల స్తోత్రం."శ్రీ విద్యారణ్య స్వామి చేత పరిష్కరించబడిన అపురూపమైన ఖడ్గమాల స్తోత్రపాఠం - సద్యః ప్రసాదిని శ్రీవిద్య!" పేరుతో ఒక యానిమేషన్ వీడియో చేసి నాకున్న యూట్యూబ్ చానల్ దగ్గిర పబ్లిష్ చేశాను. ఏ దేవతా నామం వినిపిస్తున్నప్పుడు ఏ మర్మస్తానం దగ్గిర ఆ దేవతని చూడాలో ఒక ఎర్రటి చుక్కని చూపిస్తున్నాను.వీడియో లింక్:https://www.youtube.com/watch?v=L_GvF93dlGY

ఉపాసన ఉదయం పూట చెయ్యదం మంచిది.

జై శ్రీ రాం!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...