పునర్జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన
శాస్త్రం ఇటీవలి వరకూ అంటరాని సబ్జెక్టుగా చూసి దూరం పెట్టేసింది!యెక్కువ శాతం విషయమంతా
మతగ్రంధాలలోనే ఉంది.భారతీయ సనాతన ధర్మం తొలినుంచీ సకల జీవరాశులలోనూ వాటి తత్త్వానికి
జీవాత్మ అనే పదాన్ని వాడుతున్నది.పైగా భగవద్గీతలో "ఆత్మ నాశనము లేనిది" అని
చెప్పి "ప్రాబడిన వస్త్రాల విడిచి నరుడెట్లు క్రొత్తవి తా ధరించు నట్లె జీర్ణ
దేహాల వీడి నూత్న దేహాల ధరించు దేహి" అని చెప్పడం వల్ల పునర్జన్మ అనే భావన హిందూ
ధర్మంలో అంగీకరించబడిందని తెలుస్తుంది!అబ్రహామిక్ మతాలైన జుదాయిజం,క్రైస్తవం,ఇస్లాం
మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించినా వాటిలోని కొన్ని శాఖలు మాత్రం
పునర్జన్మ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి!
"పుట్టినన్ చావు తధ్యమ్ము"అని
తెలిసిన మనిషికి యెంత కాలం బతికినా ఇంకా తనివి తీరకపోవడం వల్లనో యేమో "మరుజన్మ
ఉన్నదో లేదో!ఈ మమత లప్పుడే మవుతాయో?" అని బెంగ కూడా పుట్టి "చావన్ పుట్టుక
తప్పదు" అని ధైర్యం చెప్పుకుని ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా అప్పుడు మరింత
గొప్పగా బతుకుదాం లెమ్మని ఓదార్చుకోవడానికి ఈ అందమైన వూహ అతని బెంగ తీరుస్తుంది కాబోలు!హిందూ
ధర్మంలో కర్మ-జన్మ-సంసారచక్రం అనే భావన అవైదిక శ్రమణ సాంప్రదాయం నుంచి వచ్చిందని
Patrick Olivelle అనే ఇండాలజిస్ట్ సూత్రీకరించాడు.దక్షిణాపధంలోని ద్రవిడ సంస్కృతి నుంచి
వైదిక సంస్కృతి ఈ పునర్జన్మ సిధ్ధాంతాన్ని స్వీకరించడం మరొక సంభావ్యత!మరికొందరి విశ్లేషణ
ప్రకారం ఈ పునర్జన్మ సిధ్ధాంతం యొక్క అసలు ప్రతిపాదన బౌధ్ధమతంలోనిది!నిజమే కావచ్చు,ప్రాచీన
కాలపు ధార్మికసాహిత్యంలో పునర్జన్మ ప్రస్తావనలు ప్రముఖంగా లేకపోవడానికీ బుధ్ధుని తర్వాతికాలం
నుంచి మొదలైన పౌరాణికసాహిత్యం నుంచే ఈ పునర్జన్మ భావన విస్తృతంగా ఉండటానికీ అదే కారణం
అయి ఉండాలి!
క్రీ.పూ570 నుంచి క్రీ.పూ495 మధ్యన జీవించిన
పైధాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలని సమర్ధించాడు.క్రీ,పూ428 నుంచి క్రీ.పూ348
మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లాటో తన రచనల్లో పునర్జన్మలకి సంబంధించిన ఉదాహరణల్ని
కూడా ఉల్లేఖించాడు.అయితే తదనతర కాలంలో క్రైస్తవం తన ప్రధాన సిధ్ధాంతమైన "మారుమనస్సు
పొందిన నరుడు భగవంతునిచే ఆశీర్వదించబడి సరాసరి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు"
అన్న సూత్రీకరణతో పొసగనందున ఈ భావనని తదనంతర కాలంలో వ్యతిరేకించింది!కానీ వారిలో కొన్ని
శాఖల వారు ఇప్పటికీ పునర్జన్మను ప్రస్తావిస్తున్నారు.అసలు శిలువ వేయబడి మరణించినాడని
నిర్ధారించిన దైవపుత్రుదు జీసస్ రెండు రోజుల తర్వాత పునరుత్ధానం ద్వారా పైకి లేవడం
కూడా ఒక రకంగా పునర్జన్మయే కదా!అర్వాచీన కాలంలో క్రీ.శ19వ శతాబ్దానికి చెందిన
Schopenhauer లాంటి అమెరికన్ మేధావులు భారతీయ సంస్కృతి వల్ల్ల ప్రభావితులై ప్రతిపాదించగా
Henry David Thoreau,Walt Whitman,Ralph Waldo Emerson లాంటివారు సమర్ధించగా క్రైస్తవ
మతం కూడా Francis Bowen ద్వారా ప్రవేశపెట్టబడి Christian Metempsychosis పేరుతో నూతన
కాలపు క్రైస్తవంలో పునర్జన్మ సిధ్ధాంతం ఆమోదించబడటం మొదలైంది!
ఆధునిక శాస్తవేత్తలలో పునర్జన్మల గురించి
శాస్త్రీయంగా పరిశోధించినది ఒకే ఒక వ్యక్తి - Dr. Ian Stevenson!అక్టోబర్ 31,1918లో
పుట్టిన ఈ కెనడియన్ అమరికాలో సైకియాట్రిస్టుగా ప్రఖ్యాతుడై 2007 ఫిబ్రవరి 8న చనిపోయాడు.ఇతను
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా కి సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యాభయ్యేళ్ళు
పని చేసినా,1957 నుంచి 1967 వరకూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసినా
అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లనే!పునర్జన్మ సిధ్ధాంతానికి
సంబంధించిన ఆలోచనలు,జ్ఞాపకాలు,పుట్టుమచ్చలు,ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ
నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే సూత్రీకరణల్ని ఇతను ఆధారాలు చూపించి నిరూపించాడు.నలభయ్యేళ్ళకి
పైన ప్రపంచమంతా కాలికి బలపం గట్టుకుని కలయదిరిగి యెక్కడెక్కడ పునర్జన్మకి సంబంధించిన
విషయం వెలుగులోకి వచ్చినా వాటినన్నిట్నీ శాస్త్రీయమైన పధ్ధతిలో అవి నమ్మదగ్గవే అని
నిర్ధారించుకుని గ్రంధస్థం చేశాడు.
ఇతను సైన్సు అంటే యేమిటో తెలియని నిరక్షర
కుక్షీ కాదు,శాస్త్రీయ పరిశోధనలు యెలా జరపాలో తెలియని మూర్ఖుడూ కాదు.ఇతను చేసినది కేవలం
రికార్డు చెయ్యటం మాత్రమే,కానీ చాలా ఖచ్చితంగా చేశాడు - అదీ శాస్త్రీయమైన పధ్ధతిలో!ఇతని
పరిశోధన ప్రధానంగా పారాసైకాలజీకి సంబంధించిన విషయాలతో మొదలైంది.చాలాకాలం క్రితం నుంచీ
చాలామంది శాస్త్రజ్ఞులకి గందరగోళంగా అనిపించి అటుకేసి వెళ్ళకుండా ఉన్నవైపుకి ఇతను ధైర్యంగా
వెళ్ళాడు.అప్పటికే కొందరు వ్యక్తులు హిప్నటిక్ ట్రాన్సులో ఉన్నప్పుడు హఠాత్తుగా గతజన్మ
జ్ఞాపకాల్ని చెప్పడం జరుగుతున్నది,కానీ ఇతను వాటికి విశ్వసనీయత ఉండదు గనక భౌతికపరమైన
ఆధారాల కోసం ప్రయత్నించాడు.అంటే హిప్నటిక్ ట్రాన్సులోకి తీసుకెళ్ళి గతజన్మ వివరాల్ని
చెప్పించడం కాకుండా గతజన్మ గురించి చెప్తున్న వాళ్ళు పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నవాటిని
రికార్డ్ చెయ్యటం,వీళ్ళకి గానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి గానీ ఆ గతజన్మ అని చెప్పబడుతున్న
వ్యక్తుల గురించి తెలిసే అవకాశం ఉందేమో వెతకటం,ఇక్కడి వ్యక్తుల గురించి యేమీ చెప్పకుండా
రెండో చోట వివరాల్ని సేకరించి రెంటినీ పోల్చటం - పూర్తి శాస్త్రీయమీన పధ్ధతిలోనే పని
చేశాడు."Either he [Dr. Stevenson] is making a colossal mistake. Or he will
be known as the Galileo of the 20th century." Journal of Nervous and
Mental Disease అనే సైంటిఫిక్ జర్నలులో Dr Harold Lief వ్యాఖ్యానించాడు!
పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకోవటం వల్ల
మూఢనమ్మకాలు పెరుగుతాయని భావించి వీటి గురించి నిరాసక్తంగా ఉన్న హేతువాదులైన శాస్త్రజ్ఞులు
గానీ క్రైస్తవ మత విశ్వాసాలకి విరుధ్ధమనుకున్న వారు గానీ ఇతని కృషిని తిరస్కరించలేక
పోయారు.ఇతను వైజ్ఞానిక ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని వెక్కిరించడం గానీ ఇతను తిరోగమనవాది
అని పేర్లు పెట్టడం గానీ యెవరికీ సాధ్యపడ లేదు!ఎలా జరుగుతున్నదో తెలియడం లేదు గాబట్టి
పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకుంటే మూఢనమ్మకాలు పెరుగుతాయనే వాదన కాంతిని గురుంచి
పరిశోధనలు జరుగుతున్నప్పుడు చేసి ఉంటే ఎలెక్టిక్ బల్బ్ అనేది ఉనికిలోకి వచ్చి ఉండేది
కాదు. కాబట్టి పునర్జన్మలను
గురించి మనం పట్టించుకోక తప్పదు.పునర్జన్మలు ఉన్నాయని చెప్పడానికి వస్తుగతమైన సాక్ష్యాలు
కనిపిస్తున్నప్పుడు అది ఎలా జరుగుతున్నదో తేల్చి చెప్పడమే సైన్సు యొక్క లక్ష్యం అయినప్పుడు
నిర్లక్ష్యం చెయ్యడం దేనికి?
ఇప్పటి వరకు మనకు తెలిసిన జ్ఞానం యొక్క
పరిధికి లోపల ఉన్నవి అర్ధం కావదం కూడా నిన్నటి రోజున జరిగిన శాస్త్రీయమైన పరిశోధనల
తర్వాత పెరిగిన జ్ఞానవిస్తృతి వల్లనే అయినప్పుడు పునర్జన్మల గురించి అసలు తెలుసుకోవడానికే
అంత సంకోచించడం దేనికి? అది
సైన్సును మతపరమైన కోణం నుంచి చూడటం అనే పొరపాటు అవగాహన వల్ల జరుగుతున్నదని అనుకుంటున్నాను
నేను. అబ్రహామిక మతాలను అనుసరించేవారిలో కొందరు సైన్సుని ద్వేషిస్తారు,సైంటిస్టులను చంపేశారు,తిరుగు లేని సాక్ష్యాలు దొరికిన
తర్వాత కూడా తమ మతగ్రంధాలలో
చెప్పిన కొన్ని విషయాలను అసత్యం అని ఒప్పుకోరు.అదే
వైదిక ధర్మానుయాయులు సైన్సుని ఏనాడూ ద్వేషించలేదు,సైంటిస్టులని
చంపలేదు,భౌతిక సాక్ష్యాలు ఉన్న
వైజ్ఞానిక సత్యాలను తిరస్కరించలేదు.
ప్రస్తుతం హేతువాదులు అశాస్త్రీయం అని విమర్శిస్తున్న పురాణకధలు కల్పితాలు అని చాలామంది హిందువులకి తెలుసు.అందరికీ అన్నీ తెలియాలనీ తెలిసి తీరాలనే నియమం లేదు.తమ జీవనం గడవటానికి అవసరమైనంత ధనం సంపాదించి కుంటుంబాన్ని పోషించుకుంటే చాలునని అనుకుంటే దానికి పనికొచ్చేది మాత్రమే తెలుసుకుంటాడు.కాదు, నువ్వు గుమాస్తాగిరీతో సరిపెట్టుకోవటానికి వీల్లేదు, వేదసారం మొత్తం తెలుసుకోవాల్సిందే అని మెడ మీద కత్తి పెట్టి చెప్పటం ధర్మం కాదు.కాబట్టి ఆధ్యాత్మిక వికేంద్రీకరణను పాటిస్తున్న హిందువులలో జ్ఞానానికి సంబంధించిన అంతరువులు ఉంటాయి.
ప్రస్తుతం మనం నివసిస్తున్న భారతాదెశానికి బయట పుట్టిన అబ్రహామిక మతాలలోనూ భారతదేశంలో పుట్టిన జైనం, బౌద్ధం వంటి వైదిక మతాలలోనూ శ్రీవైష్ణవం,వీరశైవం వంటి వైదిక సంప్రదాయంలోనివే అయిన మతశాఖలలోనూ ఆయా మతస్థాపకులకు విధేయత పాటించడం తప్పనిసరి.వాటన్నిటిలోనూ తర్కానికి నిలవని సంగతులు ఉన్నప్పటికీ మతస్థాపకులూ మతప్రచారకులూ చెప్పారు గాబట్టి నమ్మితీరాలనే నిబంధనలూ ఉన్నాయి, ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి కూడా ఉంది.వ్యక్తిగత స్థాయిలో వాటిని సమర్ధించను గానీ వ్యతిరేకించడం కూడా చెయ్యను.ఆయా మతాలకు చెందిన వాళ్ళు వైదిక ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం ధర్మరక్షణ కోసం ప్రతిదాడి చెయ్యడం తప్ప వాటిపట్ల ద్వేషం లేదు నాకు.జ్ఞానంలో అంతరువులు ఉంటాయని ఒప్పుకున్నప్పుడు వారి జ్ఞానానికి తగ్గ అంతరువులో వారు ఉన్నారని సరిపెట్టుకోవడం తప్ప వారిని ద్ధరుంచాలనేది పేరాశయే అవుతుంది.కానీ, ప్రతి హిందువూ శాస్త్రీయత లేని ఆధ్యాత్మికత వ్యర్ధం అనేది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.
వైదిక ధర్మం యొక్క మూలసారం అయిన కర్మయోగం యొక్క ప్రభావం లేని యూదు, క్రైస్తవ, ఇస్లాం,లూసిఫరియన్ అనే నాలుగు అబ్రహామిక మతాల యొక్క మూలగ్రంధాలు ఒక జీవికి ఒక జన్మయే ఉంటుందని చెప్తాయి.మానవుడు కాని ఇతర జీవులకు అసలు ఆత్మ గానీ భాగవత సంబంధం గానీ లేదని చెప్తాయి.ఉన్నది ఒక్కటే జన్మ కాబట్టి ఈ జన్మలో తమ దేవుణ్ణి నమ్ముకుంటే మరణాంతరం శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుందనీ తమ దేవుణ్ణి నమ్మనివారికి శాశ్వత నరక ప్రాప్తి కలుగుతుందనీ చెప్తాయి.ఆయా మత విశ్వాసాల మధ్య పెరిగిన శాస్త్రజులు కూడా ఆ పరిధికి మించి ఆలోచించకపోవటం సహజమే.Stevenson నమోదు చేసిన వివరాల లోని "ఒక మనిషికి మరణం తర్వాత శాశ్వత స్వర్గం లేక శాశ్వత నరకం గాక తిరిగి భూమి మీదనే మరొక జన్మ ప్రాప్తించడం" అనే దృగ్విషయం అబ్రహామిక మతభావనలను శాస్త్రీయమైనవి అని భావించేవారికి అశాస్త్రీయమైనది అనిపించడం కూడా సహజమే!అదే వైదిక ధర్మం యొక్క మూలసారం అయిన కర్మయోగం యొక్క ప్రభావం ఉన్న బౌద్ధం, జైనం వంటి మతాల యొక్క మూలగ్రంధాలు పునర్జన్మలను అంగీకరించడమే గాక తమ ధార్మిక సాహిత్యంలో హిందూ ధార్మిక సాహిత్యం కన్న కొంత ఎక్కువ ప్రాముఖ్యతను కూడా ఇచ్చాయి.
పునర్జన్మల మీద పరిశోధన చెయ్యడానికి ఉన్న
మొదటి అవరోధం ఒక జన్మ యొక్క జ్ఞాపకాలు మరు జన్మకు ఎలా సంక్రమిస్తున్నాయనేది భౌతికపరమైన
సాక్ష్యాలు లేని అమూర్తమైన విషయం కావడం, అవునా?నిజానికి ఇప్పుడు మనం ఉన్న దాన్ని వ్యక్తం
అని అనడం వల్ల వ్యక్తమాన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దృగ్విషయానికీ భౌతికపరమైన అస్తిత్వం
ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి.ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ
జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ రూపం ఉంది - అవి మెదడులో నిక్షిప్తం అయ్యేది వస్తుగతమైన
రూపంలోనే!మనం ఈరోజున మన చుట్టు ఉన్న ప్రపంచాన్ని గుర్తు పట్టడానికి ముందు ఏం జరుగుతున్నది?పసితనంలో
ఒక ముఖం పదే పదే మనకు కనిపిస్తున్నప్పుడు "అమ్మ!" అనే పదాన్ని వింటూ ఉండడం
వల్ల ఆ ముఖానికి సంబంధించిన సమాచారం మెదడులో ఒక చోట ఒక ప్రత్యేకమైన అమరికను నమోదు చేసి
దానికి "అమ్మ" అనే పదాన్ని సూచికలా తగిలిస్తుందని నాడీశాస్త్రం విశ్లేషించి
చెప్తున్నది.న్యూరాలజీ అనే సైన్సు ఇప్పటికీ ప్రాధమిక దశలోనే ఉంది కాబట్టి ఆలోచనలకూ
అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ ఉన్న భౌతిక
రూపాన్ని కంటితో చూడటం కుదిరే పని కాదు.
భవిష్యత్తులో అయితే చూడగలిగే అవకాశం ఉంది.దానికి న్యూరాలజీ అనే శాఖ చాలా ముందుకు వెళ్ళాలి.ప్రస్తుతానికి న్యూరాలజీ అనేది న్యూరో ఫిజిక్స్, న్యూరో కెమిస్ట్రీ, న్యూరో సైకాలజీ అనే శాఖల కింద విడిపోయి ఎదుగుతున్నది. పునర్జన్మలకి సంబంధించిన దృగ్విషయాల్ని ఆయా శాఖల పరిజానం వెలుగులో పరిశీలిస్తే కొంత మేరకు గందరగోళం తగ్గి ఒక స్పష్తమైన వగాహన కుదిరే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నేను అప్పటికి కాంతి అనే శక్తి ఫోటాన్లు అనే యూనిట్ల గుంపులా ప్రయాణిస్తుందని తెలిసిన దాన్ని బట్టి ప్రాణం అనే శక్తి బయాన్లు అనే యూనిట్ల గుంపులా ప్రయాణిస్తుందని వూహించాను.ఈ వూహ ఇప్పటికీ కొత్తదే, ఇతరులు ఎవరూ ఇలా ఆలోచించడం లేదు.ఇప్పటికీ శాస్త్రజ్ఞులు సైతం ఇలాంటి వూహల్ని చెయ్యడం లేదు.నాకు వచ్చిన వూహ చెత్తది మాత్రం కాదు.అది అర్ధం కావాలంటే అప్పుడు నేను ప్రాణశక్తిని పోల్చిన కాంతిశక్తిని గురించి ఇప్పుడు సైన్సు ఏం చెప్తుందనేది తెలియాలి.
ఒకానొకప్పుడు, క్రైస్తవం పుట్టుకతో మొదలై
దాదాపు భారతేతర ప్రాచీన నాగరికతలను మటుమాయం చేసిన ఆ వెయ్యేళ్ళ అంధతమస్సు అంతరించి తొలి
వైజ్ణానిక ఉషస్సులు పొటమరించిన 17వ శతాబ్దపు మలి సంధ్య నాడు ఐజాక్ న్యూటన్ తన
OPTICKS:OR, A TREATISE OF THE REFLEXIONS,REFRACTIONS,INFLEXIONS AND COLOURS OF
THE LIGHT అన్న పరిశోధనాత్మక వ్యాసంలో కాంతిని
particle అని చెప్తున్న సమయానికే Christiaan Huygens తన Traité de la
Lumière/Traetise on Light (1690) అన్న అన్న పరిశోధనాత్మక వ్యాసంలో కాంతిని wave అని
చెప్తున్నాడు.
"కోడి ముందా?గుడ్డు ముందా!"
అనే ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరూ జవాబు చెప్పలేదు.అది సరదా ప్రశ్న అనుకున్న వాళ్ళు అసలు
పరిశోధనకి దిగలేదు.అది గంభీరమైన ప్రశ్న అనుకున్న వాళ్ళు పరిశోధించారు గానీ ఒక జవాబు
దొరక లేదు."కాంతి తరంగమా?లేక పదార్ధమా!" అనేది కూడా అలాంటి చిక్కునే ఎదుర్కొంటున్నది.అయితే
గియితే 1801ల నాడు Thomas Young చేసిన రెండు చీలికల ప్రయోగాన్ని కాంతి యొక్క తరంగ స్వభావాన్ని
నిర్ధారించడం కోసమే చేశాడు గానీ ఫలితంలో కనిపిస్తున్న ఒక ద్వైదీభావం కొత్త వింతల్ని
పుట్టించింది.మొదటి రోజుల్లో కాంతి తరంగమే తప్ప పదార్ధం కాదు అని టాపు లేపేసిన ప్రయోగం
కాస్తా తర్వాత జరిగిన అతి ముఖ్యమైన Photoelectric effect అనే కోణం నుంచి చూస్తే టెంకి
జెల్ల తినేసి మళ్ళీ "కాంతి తరంగమా?లేక పదార్ధమా!" అని తేల్చుకోలేని స్థితి
దాపరించింది వైజ్ఞానిక లోకానికి.ఈ అహమహమిక మకతికా తికమకను తొలగించడానికి quantom
theory/గుళికా సిద్ధాంతం ఆవిర్భవించింది.
ఇంతకీ, ప్రయోగం చాలా ఖచ్చితమైనదని అందరు
శాస్త్రజ్ఞులూ ఒపుకుంటూనే మొదట అది కాంతి తరంగం అని సాక్ష్యం చూపించేసినదని బల్ల గుద్ది
చెప్పేసిన చాలా కాలం తర్వాత ప్లేటు ఫిరాయించేసి కాంతి కిరణాలు తలిదండ్రులు తమను గమనిస్తున్నారని
తెలిసినప్పుడు ఒకలానూ తలిదండ్రులు తమని గమనించట్లేదని తెలిసినప్పుడు ఒకలానూ ప్రవర్తించే
అల్లరి పిల్లలను తలపిస్తున్నాయని ఎందుకు మాట మార్చేశారు?
నమ్మట్లేదు కదూ!Anil Ananthaswamy అనే
మేధావి చెప్తున్నది ఇలా ఉంది:18వ శతాబ్దం నాటి Thomas Young మొదలు క్వాంటం ధియరీ మీద
పరిశోధనలు చేస్తున్న శాస్తజుల వరకు ఎందరో ఇదే ప్రయోగాన్ని తమకు అనుకూలమైన మార్పులు
చేసుకుని ఉపయోగించుకున్నారు.కాంతిని ఒక చీలిక నుంచి పంపినప్పుడు ఒక రకమైన అమరికనీ రెండు
చీలికల నుంచి పంపినప్పుడు మరొక రకమైన అమరికనీ చూపించటం వరకు అన్ని చోట్లా అందరికీ ఒకే
ఫలితం వస్తున్నది.రెండు చీలికల నుంచి పంపినప్పటి interference కూడా ఒకేలా ఉంది.1924ల
నాడు Louis de Broglie వంటి వారూ కూడా ఎలెక్ట్రాన్లను పంపించినప్పుడు సైతం ఇదే
interference pattern కనిపిస్తుందని ఒప్పుకున్నారు.
అయితే, తరవాత దశలో మరింత ఖచ్చితత్వం కోసం
కాంతి రేణువుల్ని ఒక్కొక్క సారి ఒక్కొక్కటి చొప్పున పంపినప్పుడు కొన్ని విడతల తర్వాత
కాంతి తరంగం అయినప్పుడు కనిపించాల్సిన interference pattern కనిపిస్తున్నది,ఏమిటీ వింత,
రేణువులు వాటిలో అవి interfere అవుతున్నాయా!ఇదే
వింత అనుకుంటే ఈ వింతను పట్టేద్దామని ఒక detector అనే దాన్ని పెట్టి చూశారు.ఇప్పుడు
interference లేదు,కాంతి యొక్క తరంగ స్వభావం పోయింది!సరే, అనుకుని detector అనే దాన్ని
తీసి చూశారు.ఇప్పుడు interference వచ్చింది,కాంతి యొక్క రేణువు స్వభావం పోయింది!
“It’s not the physical act of
measurement that seems to make the difference, but the act of noticing!” అని అంటున్నది
మనబోటి హిందూమతత్వవాది కాదు, బాబు గోగినేని లాంటి హేతువాద సిద్ధాంతి కాదు - క్వాంటం
ఫిజిక్స్ అనే వైజ్ఞానిక శాఖకు మూలస్తంభం అయిన Werner Heisenberg అనే మహామేధావితో చాలా
కాలం పాటు కలిసి పనిచేసిన Carl von Weizsäcker అనే భౌతిక శాస్త్రవేత్త! ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక అస్తిత్వం
లేనిదాన్ని గుర్తించటానికి ఇష్టపడటం లేదు గానీ కాంతి అలా ప్రవర్తించడం వెనక కాంతికి
కూడా తను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఫలితాన్ని చూపించాలి అనే నియమాలు ఉన్నాయని తెలుసుకుని
తన ముందు ఉన్న సంభావ్యతలలో సరైన దానిని ఎంచుకునే జ్ఞానం ఉంది అని ఒప్పుకోవాలి.
అలా కాక పోతే detector లేనప్పుడు ఒకలా
ప్రయాణించిన కాంతి detector ఉన్నప్పుడు అలా ప్రయాణించకపోవడానికి హేతుబద్ధమైన కారణం
చెప్పాలి.ఇప్పుడు నేను జీవశక్తికి బయాన్ అనే రూపం ఎందుకు ప్రతిపాదించానో అర్ధమై వుండాలి
మీకు.ఒక జీవి పుట్టినది మొదలు గిట్టబోతున్న క్షణం వరకు ఆ జీవి యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ
ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ రూపం ఉంది - అవి మెదడులో
నిక్షిప్తం అయ్యేది వస్తుగతమైన రూపంలోనే!వయస్సు ముదిరి ముదిమి వల్ల గానీ ప్రమాదం వల్ల
గానీ జీవి మరణించినప్పుడు వాటిని తనలో నిక్షిప్తం చేసుకున్న జీవశక్తి ఆ జీవి యొక్క
దేహాన్ని వదిలి విశ్వంలోకి ప్రవేశిస్తుంది.అలా విశ్వంలోకి చేరిన ఆ జీవశక్తి వెనువెంటనే
గానీ సమయ విలంబంతో గానీ ఒక స్త్రీ గర్భంలో అంకురిస్తున్న బీజరూపంలోకి ప్రవేశించినప్పుడు
ఆ జీవశక్తి ప్రాబడిన వస్త్రాలను విడిచి క్రొత్తవి ధరించినట్లు నూత్నదేహధారి అవుతుంది.
ఒక జీవి పుట్టినది మొదలు గిట్టబోతున్న
క్షణం వరకు ఆ జీవి యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ
ఆనందాలకూ విషాదాలకూ వైదిక ఋషులు వాసనాత్రయం అని పేరు పెట్టారు.ఇప్పుడు మనం జీవుల దేహంలో
జరిగే జీవన క్రియల్ని స్థూల పరిచయం చేసుకుంటే గానీ ఇది అర్ధం కాదు. నేను అప్పుడప్పుడు హిందూమతద్వేషుల్లో కొందర్ని
"గొట్టాం!" అని తిడుతున్నాను గానీ శాస్త్రం ప్రకారం మనం కూడా గొట్టాలమే!మనమే
కాదు అన్ని జీవులూ గొట్టాలే - హైడ్రా వంటి సీలెంటిరేట్స్ తప్ప ప్రతి జీవికీ మూతి ఇటువైపునా
ముడ్డి అటువైపునా ఉన్న గొట్టం చుట్టూ ఇతర అవయవాలు అతుక్కుని ఉన్నాయి.ఒక రంధ్రం ఆహారాన్ని
లోపలికి పంపిస్తే ఒక రంధ్రం జీర్ణం కాని మలినాల్ని బయటికి పంపిస్తుంది.ఇదేమీ లెక్కా
డొక్కా లేని యవ్వారం కాదు.తిని కూర్చోవడం కాదు, ప్రతి గొట్టామూ విశ్వంలో ఉన్న సమతౌల్యాన్ని
నిలబెట్టటానికి తన వంతు పని చెయ్యాలి.వీటిని కొనసాగించడం కోసం ప్రతి జీవిలోనూ కొన్ని
వ్యవస్థలు ఉన్నాయి.మొదటిదైన ఆహారాన్ని వినియోగంలోకి తెచ్చేది జీర్ణ వ్యవస్థ.ఆహారాన్ని
దహించి ప్రాణశక్తికి చైతన్యాన్ని కలిగించే ఇంధనాన్ని సమకూర్చే శ్వాసకోశ వ్యవస్థ ఉన్నది.ఆహార
వినియోగం వల్ల ఒకచోట పుట్టిన శక్తిని అన్ని చోట్లకీ పంపించడానికి రక్తప్రసరణ వ్యవస్థ
ఉన్నది.జీవి యొక్క చలనానికి దోహదం చేస్తున్న కండరాల వ్యవస్థ ఉన్నది.వీటికి పైన పూలదండలోని
దారంలా సమాచారం అందించి సమన్వయం చేసే నాడీ వ్యవస్థ ఉన్నది.మెదడు ఈ నాడీ వ్యవస్థ లోని
అతి ముఖ్యమైన ఒక భాగమే కానీ మెదడు ఒకటే నాడీ వ్యవస్థ కాదు.
దేహానికి బయట నుంచి మనకు తగిల్తే చర్మాన్ని
కాల్చి పారేస్తున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ మన దేహం లోపల పుట్టి కొన్ని మంచి పనులు
చేస్తుందని ఎంతమందికి తెలుసు?అట్లాగే మనకు నిద్ర అనేది చలనానికి కారణమైన కండరాలు అలిసిపోయినప్పుడు
పుట్టిన ల్యాక్టిక్ యాసిడ్ శాతాన్ని తగ్గించడం కోసం ప్రకృతి జీవులకు చేసిన ఏర్పాటు
అని ఎంతమందికి తెలుసు.బయటి నుంచి తీసుకున్నప్పుడు అవధి లేని మత్తును కలిగించి భ్రమలకు
దాసుల్ని చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న మార్ఫిన్ వంటివే అయిన ఎండార్ఫిన్లు దేహం
లోపల పుట్టినప్పుడే మనకు ఆనందానుభూతులు కలుగుతాయనేది ఎంతమందికి తెలుసు?ఈ ప్రత్యేకమైన
ద్రవాల్ని స్రవించే దేహభాగాల్ని గ్రంధులు అంటారు.జీర్ణ గ్రంధులు జీర్ణ రసాల్ని స్రవిస్తాయి.క్లోమ
గ్రంధి క్లోమ రసాన్ని స్రవిస్తుంది.ఏ రసం ఎక్కడ పని చేయాలో అక్కడికి చేరుకోవడానికి
గ్రంధి నుంచి నాళం ఉన్నవాటిని సనాళ గ్రంధులు అయితే నాళం లేని వాటిని వినాళ గ్రంధులు
అంటారు.వినాళ గ్రంధుల నుంచి స్రవించే వాటిని రక్తం మోసుకుంటూ తిరుగుతుంది.ఆ రసం ఎక్కడ
ఏ పని చెయ్యాలో అక్కడికి రక్తం చేరుకున్నప్పుడు ఆ అవయవంలో ఆ రసం యొక్క స్పర్శ తగిలినప్పుడు
జరగాల్సిన పనులు జరుగుతాయి.ఆ అవయవంలోనే రక్తంలో ఆ రసం యొక్క ఉనికిని తెలుసుకునే ఏర్పాటు
ఉంటుంది.
ఇటువంటి వినాళ గ్రంధులు మానవ దేహంలో ఎనిమిది
ఉన్నాయి.Pineal gland,Hypothalamus,Pituitary gland, Thyroid gland and
Parathyroid, Thymus gland, Adrenals, Pancreas, Ovaries and Testes అనేవి అతి ముఖ్యమైన
వినాళ గరంధులు.ఇవి కాక కాలేయం లాంటి సనాళ గ్రంధులు వినాళ గ్రంధుల పరిధి లోకి కూడా వస్తాయి.
వీటిలో Testes and Overies అనేవి
స్త్రీ పురుషుల లైంగీక్ ద్విరూపకతకు సంబంధించిన దేహధర్మాలను శాసిస్తాయి.estrogen,progesterone
అనేవి స్త్రీల దేహంలో కనబడే సౌకుమార్యాన్నీ ఆకర్షణీయతనీ ఋతుచక్రాన్నీ ప్రభావితం చేస్తాయి.testosterone
అనేది పురుషులకు ఆకర్షణను పెంచే కండరాల ఆకృతినీ మీసాలూ గడ్డాలూ వంటివాటిని పెంచి అంగస్తంభననూ
శుక్లకణవృద్ధినీ శాసిస్తుంది.క్లోమము
Pancreas జీర్ణ వ్యవస్థకు చెందిన ఒక క్లిష్టమైన గ్రంథి.ఆల్ఫా, బీటా, డెల్టా
కణజలాలు ఉన్నాయి. ఆల్ఫా కణాలు గ్లుకగాన్ అనే హార్మోనుని స్రవింపజేస్తాయి. బీటా కణాలు
ఇన్సులిన్ అనే హార్మోనుని స్రవింపజేస్తాయి. డెల్టా కణాలు సొమటోస్టాటినుని స్రవింపజేస్తాయి.adrinal
అనే అధివృక్క గ్రంధులు హృదయస్పందననీ శ్వాసక్రియనీ అదుపు చేస్తాయి.మూత్రపిండాలకు పైన
ఉంటుంది.హఠాత్ సంఘటనలకి మన ప్రతిస్పందనని ప్రభావితం చేస్తాయి గనక వీటిని fight or
flight గ్రంధులు అని కూడా అంటారు.Thymus ఆనెది తెల్ల రక్త కణాల్ని తయారు చేస్తూ రోగ
నిరోధక శక్తిని ఉద్దీపింప జేస్తుంది.చిన్నప్పుడు దీని అవసరం ఏక్కువై ఉండి యుక్త వయస్సు
వచ్చేసరికి దీని ప్రాధాన్యత తగ్గి క్షీణించి పోతుంది.Thyroid,paarthyraid అనే అవటు
గ్రంధులు గొంతు భాగం వద్ద ముందుకు పొడుచుకు వచ్చి కనబడుతాయి.సీతాకోక చిలుక ఆకారంలో
ఉన్న ఇది అతి పెద్ద వినాళ గ్రంధి.అవటు గ్రంధి అయోడిన్ కలిగిన ధైరాక్సిన్ అనే హార్మోన్
స్రవిస్తుంది.ఇది సాధారణ జీవక్రియా వేగాన్ని నియంత్రిస్తుంది.థైరాయిడ్ గ్రంథి నుంచి
విడుదలయ్యే హార్మోన్లు ప్రతికణం పైనా ప్రభావం చూపిస్తాయి.
ఇక, Pituitary,Hypothalamus,Pineal గ్రంధులు
మెదడు యొక్క ముడతల మధ్యన ఇరుక్కుని మెదడుకు అంటుకుపోయి ఉండి శరీరం యొక్క అన్ని సనాళ, వినాళ
గ్రంధులను నియంత్రిస్తూ ఉంటాయి.Pituitary అని అంటున్న పియూష గ్రంధి అనేది ఎడినోహైపోఫైసిస్,
న్యూరోహైపోఫైసిస్ అనే రెండు తమ్మెల కలయిక వల్ల ఏర్పడుతుంది.పరిమాణంలో అన్నిటికన్న చిన్నది
గానీ ఇతర గ్రంధులను కూడా శాసిస్తున్న దీని ప్రాధాన్యతను బట్టి ఆ జీవి యొక్క ప్రవర్తన
దీని పని తీరు వల్లనే ప్రభావితం అవుతుంది.Hypothalamus తను మిగిలిన శరీరాన్ని నియంత్రించదు
గానీ మొత్తం వినాళ గ్రంధుల వ్యవస్థను మెదడుకు అనుసంధానిస్తుంది.
వీటన్నిటికి పైన ఉన్న Pineal అనేది చాలా
కీలకమైన వినాళ గ్రంధి. ఇప్పటివరకు
ఎంత ప్రయత్నించినప్పటికీ ఆధునిక పాదార్ధ విజ్ఞాన శాస్త్రం తెలుసుకోలేని అత్యంత గహనమైన
విషయాలలో ఈ అవ్యక్త వినాళ గ్రంధి ఎలా పని చేస్తుంది అనేది కూడా ఒకటి.దాదాపు అందరు శాస్త్రజ్ఞులూ
ఇది Melatonin అనే హార్మోనును స్రవిస్తుందనీ దివారాత్రాల చక్రానికి జీవుల్ని అనుసంధానం
చేసి రాత్రి సమయానికి నిద్రించేలా పగటి సమయానికి మేల్కొనేలా చేస్తుందనీ తప్ప ఎక్కువ
చెప్పడం లేదు.అందుకే ప్రాచీన భారతీయ విజ్ఞానులు దీనిని అవ్యక్త గ్రంధి అన్నారు కాబోలు!
విశ్వానికి కేవలం భౌతిక అస్తిత్వం మాత్రమే
ఉందని భావించని ఆధ్యాత్మిక ప్రపంచం దీనిని మానవ దేహంలోనే ఉన్న శివుడి త్రినేత్రంతో
సమానమైన అనంత శక్తి ప్రదాత అంటున్నారు.ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక వేత్తలు అందరూ
దీని గురించి ఒకేలా చెప్తున్నారు. 1500వ
శతాబ్ది కాలం నాటి Rene Descartes అన్న పేరు గల ఫ్రెంచ్ వేదాంతి అవ్యక్త గ్రంధిని
The seat of the Soul అని వర్ణించాడు.
ప్రాచీన కాలపు ఈజిప్షియన్ సంస్కృతికి సంబంధించిన
పౌరాణిక సాహిత్యంలోని Horus అనే దేవతామూర్తికి కూడా మూడవ కన్ను ఉంటుంది.దానిని కూడా
అవ్యక్త గ్రంధికి సూచన కింద వర్ణిస్తారు.ప్రాచీన భారతీయ యోగశాస్త్రం మానవ దేహంలోని
చక్రాలను వర్ణిస్తూ చెప్పిన ఆజ్ఞాచక్రం గురించి
clarity, concentration, imagination, intuition, spiritual perception, universal connection అనేవాటిని శాసిస్తుందని చెప్పినవి అవ్యక్త గ్రంధికి కూడా వర్తిస్తున్నాయి.
The morphological and functional
characteristics of the pineal gland అన్న తలకట్టుతో 2019 నాటి ఒక పరిశోధన సైతం
pineal bodyని photo-neuro-endocrine transducer అని వర్ణించింది.ప్రతి పరిశోధనా పత్రం
తన ముఖ్యమైన పరిశోధన గురించి ప్రధానమైన వివరాలే గాక కొన్ని ఇతర విషయాలను సైతం ప్రస్తావించే సంప్రదాయం
చొప్పున “A forensic study published by Kurtulus Dereli et al. in 2018, analyzed
the role of the pineal gland in suicide victims. The secretory activity of
melatonin was quantified and proved to be low in patients that have committed
suicide” అని వ్యాఖ్యానించింది.చివరన “It offers information on circadian and
seasonal rhytms, thus connecting the outside world with the internal
physiological and biochemical needs. Its role is embedded deep in complex
neurological, endocrinological and psychiatric conditions and processes” అని ముక్తాయింపు
ఇచ్చింది.అవ్యక్త వినాళ గ్రంధికి సంబంధించిన సమాచారం అన్ని మతశాఖలకు సంబంధించిన ప్రాచీన
ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ అన్ని ఆధునిక పదార్ధ విజ్ఞాన శాస్త్రపు సూత్రీకరణలలోనూ ఒకలానే
కనబడుతున్నది.
ఉండటానికి అన్ని జీవుల్లోనూ ఉంటుంది గానీ
అది పూర్తి చైతన్య స్థితిలో ఉండదు అనేది అర్ధం పర్ధం లేని మూఢనమ్మకం మాత్రం కాదు.సుప్తావస్థలో
ఉన్నప్పుడే మన దేహాన్నీ మనస్సునీ ఇంత ప్రభావితం చేస్తున్న అవ్యక్త గ్రంధిని గనక మనం
చైతన్యవంతం చేసి మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే విశ్వం నుంచి మనకు అవసరమైన ఆరోగ్యం,సంపద,
నాయకత్వం, అధికారం, వైభవం వంటివి కోరుకున్న వెంటనే ప్రాప్తిస్తాయి.అయితే, దీనిని చైతన్య
పరచటానికి ఉన్న ఓకే ఒక ప్రక్రియ యోగశాస్త్రంలో ఉంది.పద్మాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం వంటివి
నేర్పించడం అసలైన యోగసాధనకు సాధకుణ్ణి సిద్ధం చేసే ప్రాధమికమైన తంతు మాత్రమే.అసలైన
యోగశాస్త్రం మనస్సుని కేంద్రీకరించడం గురించి చెప్తుంది.చాలామంది యోగం సిద్ధించడం అంటే
ఆలోచన లేని స్థితి అనుకుంటారు.కానీ అది చాలా తప్పు.జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క మేదడూ
ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది, చెయ్యాలి కూడా.ఆలోచన లేకపోవడం అంటే బాల్చీ తన్నెయ్యడం
కింద లెక్క వేసుకోవాల్సిందే!
అందుకే, యోగశాస్త్రం "ఆలోచన అంటే
ఏమిటి?అది ఎలా పుడుతుంది?ఒక లక్ష్యం అనేది ఉన్నదని తెలిసి కూడా మనస్సు లక్ష్యానికి
దూరం చేసే ఆలోచనల్ని ఎందుకు చేస్తుంది?లక్ష్యాన్ని చేరుకోవటానికి వ్యతిరేకమైన చెడు
ఆలోచనల్ని అణిచి వెయ్యటం ఎట్లా?" అనే ప్రశ్నలకు సతార్కికమైన విశ్లేషణతో జవాబులు
చెప్తుంది.యోగసాధన త్వరిత ఫలితం ఇవ్వాలంటే గురుముఖతః నేర్చుకుని శాస్త్రం ప్రకారం వెళ్ళాలి
తప్ప అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా చదివేసి స్వయంపాకం చేస్తే అసలు వ్రతమే చెడుతుంది,
ఇక ఫలితం ఎలా వచ్చి ఛస్తుంది?
ఆధునిక వైద్యశాస్త్రంలో పీనియల్ గ్రంధిని
గురించి తెలుసుకున్న కొత్త విషయాలతో Chronomedicine అనే ఒక కొత్త శాఖను ప్రారంభించారు.
ముగ్గురు researchers కలిసి clock proetein అనేదాన్ని కనుక్కుని 2017 నాటి
Physiology and Medicine విభాగం క్రింద నోబెల్ బహుమతిని అందుకున్నారు.ఇలాంటి చెదురు
మదురు ఆవిష్కరణలు చెయ్యడం తప్ప ఆధునిక వైద్యశాస్త్రం అవ్యక్త గ్రంధిని గురించి ఎక్కువ
చెప్పడం లేదు.అయితే, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవారికి ప్రాచీన కాలం నుంచీ అవ్యక్త
గ్రంధిని శాసించడం అనేది ఒక లక్ష్యం అయినట్టు ఈజిప్షియన్, రోమన్, చైనీస్ తదితర ప్రాచీన
సంస్కృతులను గురించి పరిశోధన చేసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.ఈజిప్షియన్లు దీనిని
Eye of Horus అని పిలిచారు.నిజానికి ఆధునికులు పెట్టిన pineal gland అనేది ఫ్రెంచ్
భాషకు సంబంధించినది - వారికి అది pinecone ఆకారంలో కనపడి అలా పెట్టారు.
దాదాపు అన్ని సంస్కృతులలోనూ ఒకే విషయాలు
చెప్పడం వల్లనూ అవి భారతీయ యోగశాస్త్రం చెప్తున్న విషయాలతో సరిపోలుతూ ఉండటం వల్లనూ
దీనికి సంబంధించిన జ్ఞానాన్ని వృద్ధి చేసినది వైదిక ఋషులే అని నమ్ముతున్నాను నేను.ప్రాచీన
భారతీయ వైజ్ఞానిక శాస్త్రాలలో ఆయుర్వేదం శరీరాన్ని నియంత్రించడం గురించి చెప్తుంది,
యోగశాస్త్రం మనస్సును నియంత్రించడం గురించి చెప్తుంది.మనస్సును నియంత్రించడం అంటే అవ్యక్త
గ్రంధిని నియంత్రించడమే కదా!
అవ్యక్త గ్రంధిని మనం నియంత్రించడానికి
ప్రయత్నించే ముందు అవ్యక్త గ్రంధి మనస్సును ఎలా నియంత్రిస్తుందో తెలుసుకోవాలి.మన శరీరంలో
కుండలిని నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలలో ఆజ్ఞా చక్రం యొక్క స్థానం కూడా అవ్యక్త
గ్రంధికి సమీపంలో ఉంటుంది. అవ్యక్త గ్రంధి చైతన్యవంతం అయిన మనిషి ఆలోచనలలో స్పష్టత(clarity)
ఉంటుంది, లక్ష్యం పట్ల ఏకాగ్రత(concentration) పెరుగుతుంది, ఆశావహమైన వూహాత్మక శక్తి(imagination)
విస్తృతం అవుతుంది, ఇంద్రియాతీతజ్ఞానగ్రాహ్యత(intution) అనుభవంలోకి వస్తుంది,ఆధ్యాత్మిక
దృష్టి(spiritual perception) మెరుగు పడుతుంది, విశ్వలయను పట్టుకుని విశ్వంతో సరైన
తీరున అనుసంధానం(universal connection) ఏర్పరచుకోగలిగి ఇతరులకు అసాధ్యం అనిపించే దుష్కరమైన
కార్యాలను సైతం అత్యంత లాఘవమైన తీరున సుసాధ్యం చేస్తాడు.Tesla,
Einstein, Heisenberg, Shrodinger వంటివారికి వేదవిజ్ఞానం గురించి తెలుసు.
Leonardo Da Vinci యొక్క సృజనాత్మకత వెనుక ఉన్నది వేదవిద్యను అనుసరించి అవ్యక్త గ్రంధిని
చైతన్యవంతం చెయ్యగలిగిన యోగశాస్త్రమే!
అవ్యక్త గ్రంధిని మన అధీనంలోకి తెచ్చుకోవడానికి నిశ్చల ధ్యానం, దీపదర్శనం, మంత్రపఠనం అనేవి అత్యుత్తమమైన సాధనాలు.అవ్యక్త గ్రంధిని చైతన్యవంతం చేసుకోవడానికి
మన శరీరం ఒక్కటే పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, మన చుట్టు ఉన్న వాతావరణంలోని అతి సూక్ష్మమైన స్థాయిలోని కాలుష్యం
కూడా అవ్యక్తగ్రంధిని బలహీనం చేస్తుంది.ప్రస్తుతం మనం అనుసరిస్తున్న యాంత్రిక నాగరికత
విడుదల చేస్తున్న flouride అనే antioxidant అవ్యక్త గ్రంధిని సుప్తంగా కూడా ఉండనివ్వక
బలహీన పరచడం వల్లనే ప్రజల్లో మానసిక రుగ్మతలు అంతకంతకు పెరుగుతున్నాయి.ఇదే కాదు, కోక్
కలుపుతున్న పానీయాలలో వాడుతున్న ఆర్సెనిక్ అవ్యక్త గ్రంధికి ఫ్లోరైడ్ కన్న పదింతలు
హాని చేస్తుంది.చెవులు బద్దలయ్యే ధ్వనులు గాక శ్రావ్యమైన సంగీతం వినడం అవ్యక్త గ్రంధిని
చైతన్యం చేస్తుంది.అమృతం అనేది యోగసాధన ఫలవంతమై మానసిక శక్తులు మన స్వాధీనంలోకి వచ్చిన
అనుభూతి కలిగినప్పుడు అవ్యక్త గ్రంధి స్రవించిన seratonin, melatonin వంటి ఎంజైములు
కలిసిన జీవద్రవ్యమే!
ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది, ఫలానా
పని చేస్తే పాపం వస్తుంది అంటే తూనా బొడ్డని వెక్కిరించే హేతువాదులు సైతం ఫలానా పని
చేస్తే లాభం వస్తుంది, ఫలానా పని చేస్తే నష్టం వస్తుంది అని చెప్తే వెక్కిరించరు -
కనీసం మనం లాభం వస్తుందని చెప్పిన పనిని చేసి చూసి నష్టం వస్తే నిలదీస్తారు, కదా!ఎందుకని?పాప
పుణ్యాలకు మనం వాటిని నమ్మడంతో సంబంధం లేని భౌతిక అస్తిత్వం లేదు. లాభ నష్టాలకు మనం
వాటిని నమ్మడంతో సంబంధం లేని భౌతిక అస్తిత్వం ఉన్నది.కొందరు ఇప్పుడు తమను పట్టి పీడిస్తున్న
దరిద్రం గత జన్మలో చేసిన పాపానికి దేవుడు వేసిన శిక్ష అని సరిపెట్టుకుని అసలు ఆ దరిద్రాన్ని
మూలం ఏమిటో తెలుసుకుని వదిలించుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యని అజ్ఞానంతో బతికేస్తున్నారు.తమ
గత జన్మ గురించి ఎలా తెలిసింది వారికి?కొందరు ఇప్పుడు తమకు కోరుకున్నదే తడవు దక్కుతున్న
వైభవాలకి గత జన్మలో చేసిన పుణ్యాలకి దేవుడు ఇచ్చిన వరం అని విర్రవీగుతూ అసలు ఆ వైభవాలకి
మూలం ఏమిటో తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యని అజ్ఞానంతో బతికేస్తున్నారు.తమ
గత జన్మ గురించి ఎలా తెలిసింది వారికి? జ్యోతిషం
వంటి గణితశాస్త్ర పునాది ఉన్న వైదిక శాస్త్రాలను తమ పొట్ట కూటి కోసం వక్రీకరించుతున్న
దురాశాపరులు చెప్పిన అభూతకల్పనలే తప్ప అవి బుద్ధిజీవులు నమ్మాల్సిన విషయాలు కావు.
అంత మాత్రం చేత అవ్యక్త గ్రంధి ప్రస్తుత
జన్మ యొక్క దేహాన్ని విశ్వలయతో అనుసంధానించడానికీ గత జన్మ యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ
ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ ఇప్పటి జన్మకు అందిస్తుందనదానికీ
సంబంధించిన సమస్త విషయాలనీ నిరాధారం అని త్రోసి పుచ్చడం సరి కాదు.Ian Stevenson నమోదు
చేసిన అతి ముఖ్యమైన 20 మంది గురించిన వివరాలు అసత్యాలు కావు.వాటిలో అత్యంత ప్రముఖమైన
స్వర్ణలత యొక్క అనుభవం బయటి ప్రపంచానికి తెలిసినది 1960ల నాడు.అప్పటికి స్వర్ణలతకు
పదమూడేళ్ళ వయసు.మొదటిసారి ఆమెను విచారించిన తర్వాత తొమ్మిదేళ్ళ పాటు మోసం అనిపించడానికి
ఆస్కారం ఉన్న అవకాశాలను గురించి పరిశోధన చేశాకనే 1969ల నాడు ఆమెను పూర్వజన్మకు సంబంధించిన
కుటుంబ సభ్యుల ముందు నిలబెట్టారు.స్వర్ణలత మహిళ కావడంతో గత జన్మకు సంబంధించిన కుటుంబ
సభ్యులు రాకపోకలని కొనసాగించడం వల్ల ఆమె ఒక్కరికే ఆ జ్ఞాపకాలు తర్వాత కూడా కొనసాగాయి
గానీ ఇతరులకు చిన్న వయస్సులో బయతపడిన గతజన్మస్మృతులు యుక్తవయస్సుకు వచ్చేసరికి తగ్గిపోయి
ఇప్పటి జన్మకు సంబంధించిన పరిస్థితులకు అలవాటు పడిపోయారు.కాబట్టి పునర్జన్మ అనేదానిని
అశాస్త్రీయం అని కొట్టి పారెయ్యడం, హేతువాదులను వెక్కిరించడానికి పనికొచ్చే మహత్యం
కింద పొగిడేసి రచ్చరచ్చ చెయ్యడం - రెండూ తప్పే!
కొందరికి దరిద్రం ప్రాప్తించడానికీ కొందరికి
సంపదలు ప్రాప్తించడానికీ వారి వారి మనస్సులోని ఆలోచనలే కారణం తప్ప గత జన్మ లోని పాపం
ఇప్పుడు మనని పట్టి పీడిస్తున్న దరిద్రానికీ గత జనం లోని పుణ్యం ఇప్పుడు మనం అనుభవిస్తున్న
సిరిసంపదలకీ కారణం కానే కాదు. పునరపి జననం పునరపి మరణం అంటూ సాగుతున్న సర్పిల యాత్రకు
మధ్యన ఈ వాసనా త్రయాన్ని పట్టుకుని అవ్యక్త గ్రంధి ఒక వంతెనలా నిచ్చెనలా ఉపయోగపడుతుంది.నిన్నటి
జన్మ లోని కర్మల వల్ల పూర్వ జన్మ స్మృతులు ఆ వ్యక్తి యొక్క ఇప్పటి వ్యక్తిత్వానికి
ఉత్సాహాన్నీ క్రియాశీలతనూ ఇచ్చేవి అయితే తిరుగు లేని విజయాల్ని అందుకుంటాడు.ఇప్పటి
జన్మలోని తలిదండ్రులూ మిత్రులూ అతని పట్ల ఉన్న ఆదరం చేత సహాయం చేస్తూ ఉంటారు గనక అతని
బతుకు నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది.నిన్నటి జన్మ లోని కర్మల వల్ల పూర్వ జన్మ
స్మృతులు ఆ వ్యక్తి యొక్క ఇప్పటి వ్యక్తిత్వానికి నిరాశనీ నిష్క్రియాశీలతనూ ఇచ్చేవి
అయితే అంతు లేని అపజయాల్ని అందుకుంటాడు.ఇప్పటి జన్మ లోని తలిదండ్రులూ మిత్రులూ అతని
పట్ల ఉన్న ఆదరం చేత సహాయం చేస్తూ ఉన్నప్పటికీ అతని బతుకు పల్లేరు కాయల పరుపు మీద నిద్రలా
సాగిపోతుంది.
అన్నింటిలాగే డబ్బు కూడా కోరుకుంటేనే వస్తుంది.మనకి
డబ్బు కావాలంటే ఇతరులకు అవసరమైన వస్తువునో సౌకర్యాన్నో మనం సృష్టించి ఇతర్లకి అమ్మాలి.మనకి
అవసరమైన వాటిని మనం సంపాదించిన డబ్బుతో కొనుక్కోవాలి.ఇది ఆజీవపర్యంతం జరగాల్సిందే,
ఇరవయ్యేళ్ళ వయస్సులో అమ్మానాన్నలు
ఇచ్చే పాకెట్ మనీతో సంతృప్తి పడిపోతే మనం చదుకోవడమూ అనవసరమే, ఉద్యోగాలూ వ్యాపారాలూ
చెయ్యడమూ అనవసరమే, పెళ్ళి చేసుకోవడమూ అనవసరమే, పిల్లల్ని కనడమూ అనవసరమే - కదా!మనం ఉన్న
దానితో సంతృప్తి పడిపోయి వదిలేస్తున్నదే మన పక్కనే ఇటు పుల్ల అటు తీసి పెట్టని సుకుమారులను
చేరుతున్నది.తేడా అల్లా వారు లేమికి భయపడి డబ్బును గురించి ఆలోచిస్తున్నారు, మనం లేమిని
ఇష్టపడి డబ్బును గురించి ఆలోచించడం లేదు.నిరంతరం డబ్బును గురించి ఆలోచించాలి,కోరుకోవాలి,తపించాలి
- అప్పుడే డబ్బు మనని ఇష్టపడి మన దగ్గిరకి వస్తుంది.
ప్రతి మనిషికీ అప్పుడప్పుడు అనుభవంలోకి
వచ్చే ప్రసూతి వైరాగ్యాన్నీ స్మశాన వైరాగ్యాన్నీ అఖండం, అద్భుతం, అతి పవిత్రం అని పొగిడేసి డబ్బు మీద ఆశని
వదులుకోమని తప్పుడు కబుర్లు చెప్తున్నారు కొందరు ప్రవచన కర్తలు.నిజానికి వింటున్న దద్దమ్మలు
ఆ చెత్త కబుర్లని నమ్మితే వీళ్ళని ఆ సొల్లు వాగడానికి పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారు?మన
పక్కనే ఇటు పుల్ల అటు తీసి పెట్టని సుకుమారులు సైతం రోజుకి మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ
కూదా చాలదని తహతహలాడుతుంటే మనకి మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని రిక్షా తొక్కుకుంటూనో
కూలిపని చేసుకుంటూనో రోజుకి వెయ్యి రూపాయల సంపాదనతో సంతృప్తి పడిపోయి బతకమని చెప్పడం
ఎంత దారుణం?
గత జన్మ నుంచి వచ్చిన వాసనా త్రయం వల్ల
అనే విషయాన్ని మర్చిపోతే కొందరు దారిద్య్రం వల్ల తమలో తాము కృశించి పోవటానికీ కొందరు
ఐశ్వర్య మదం వల్ల ఇతరుల్ని బాధలు పెట్టడానికీ మనస్సే కారణం అయినప్పుడు ఆ మనస్సుని మన
స్వాధీనం లోకి తెచ్చుకోవడం ఎట్లా?సుప్తావస్తలో ఉండి మన మనస్సుని శిక్షణ లేని అశ్వంలా
వదిలేసిన అవ్యక్త గ్రంధిని మనం ఒక గట్టి సంకల్పం చేసుకుని శ్రద్ధ, దీక్ష, ధైర్యం అనే
ఆయుధాల సాయంతో పోరాడి గెలవటం తప్ప మరో దారి లేదు.వేదం ఆధ్యాత్మిక పరమైన మోక్షాన్ని
మాత్రమే కాదు, భౌతికమైన సంపదలను సైతం ప్రతి ఒక్కరికీ ఆశించదగినవి అనే చెప్పింది.
"అసలు మనకు లోపలా బయటా కూడా సృష్టికర్తయే
ఉన్నప్పుడు ఇక్కడ దేన్ని వదిలెయ్యాలి?ఎందుకు వదిలెయ్యాలి?దీన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి?ఎందుకు
వెళ్ళాలి?ఎలా వెళ్ళాలి?" అనే చిన్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేనివాళ్ళు గురువులా!దేన్నీ
వదలకండి - మీకున్న సమస్తమైన కోరికలలో ప్రతి కోరికనీ తీర్చుకునే హక్కు మీకుంది!గతజన్మ
నుంచి చెడు జ్ఞాపకాలు గానీ చెడు ఆలోచన్లు గానీ సంక్రమించాయని తెలిస్తే కంగారు పడకండి,
గతజన్మలో నేను చేసిన పాపాలకి శిక్షగా ఈ జన్మలో
దరిద్రాన్ని భరించాల్సిందే అని నిరాశపడిపోయి ఏడుస్తూ బతకాల్సిన అవసరం లేదు.యోగసాధన
చేత మనస్సును చెడు ఆలోచనల నుంచి మళ్ళించి మంచి ఆలోచనలు చేస్తూ మీరు సుఖపడి ఇతరుల్ని
సుఖపెట్టే అవకాశం ప్రస్తుత జన్మ ఇస్తున్నదనేది వ్యాసపరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న
సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్యపరంపర మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన
నేను చెప్తున్న పరమసత్యం.ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ
అవుతుంది!
సత్యం శివం సుందరం!!!