Thursday, 29 October 2020

“వసిష్ఠ విశ్వామిత్రుల విరోధవృత్తాంతం మనకు ఋగ్వేదంలో కనబడుతోంది" అనేది నిజమా అబద్ధమా?ఒక బ్రహ్మర్షి గోధనాన్ని హరించాలనుకున్న తామసికుడికి బ్రహ్మర్షి హోదా ఇవ్వడం ధర్మవిరుద్ధం కాదా!

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన "ఆర్ష విజ్ఞాన సర్వస్వము - మొదటి సంపుటము, వేదసంహితలు" అనే పుస్తకం చదువుతున్నాను.ఇందులో ఒక విషయం చదివాక నాకు వేదసంహితలు అపౌరుషేయాలు అనేది అబద్ధమనీ ద్రష్టలు అని పిలువబడుతున్న వారు తమ పాండిత్యంతో తెలుసుకున్న విషయాలనే ఆధిక్యత కోసం తమకు భగవంతుడు స్వయాన చెప్పినట్టు అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారనీ అనిపిస్తున్నది. వేదం మీద సాధికారికత ఉన్న పండితులూ జ్ఞానులూ ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పి తీరాలి.

"ఋక్సంహిత మొదట పది మండలాలుగ విభజింపబడింది.ప్రతి మండలంలోను సూక్త విభాగం ఉన్నది.మొత్తం పది మండలాల్లోను 1017 సూక్తాలు ఉన్నాయి.అవికాక ఎనిమిదవ మండలంలోని పదకొండు వాలఖిల్య సూక్తాలు ఖిల సూక్తాలుగ గుర్తించబడ్డాయి.వాటితో కలిసి 1028 సూక్తాలు సంహితలో ఉన్నాయి.మొత్తం 1028 సూక్తాలలోను 10,552 ఋక్కులు ఉన్నాయి." - వారు చెప్పిన గణాంకాలు ఇక్కడ ఇచ్చాను. లెక్కను మీరు కూడా ఆమోదిస్తున్నారా? వేదాల్ని విభజించడానికి చాలా పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు గానీ సంఖ్య మారదు, ఋక్కులు మారవు, అవునా?

తర్వాత నేను అడగబోయే ప్రశ్నకూ మొదట నేను  చేసిన ప్రతిపాదనకూ చాలా ముఖ్యమైనది కాబట్టి " లెక్కను మీరు కూడా ఆమోదిస్తున్నారా?" అన్న ప్రశ్నకి మీర్తు జవాబు చెప్పి తీరాలి!ఇక్కడ నేను చేస్తున్నది వేదంలోని విషయం గురించి సందేహాలు అడగటం కాదు,ఋగ్వేదసంహితలో భగవంతుడు స్వయాన బోధించాడు అని చెప్పటానికి వీలులేని ఒక అంశం ఉందని అంటున్నాను.వేదంలో అలాంటి అంశం లేనట్లయితే నేను చేస్తున్నది యెంత తీవ్రమైన దోషమో నాకు తెలుసు.నేను ఉందని అనుకుంటున్న దోషం అక్కడ లేదని మీరు నిరూపిస్తే నాకూ సంతోషమే.

కాబట్టి జవాబు చెప్పడం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. వేదపాఠాలను గురించి చెప్పాక క్రమపాఠం పైన పెరిగిన వికృతి పాఠాలను గురించి కూడా చెప్పారు.వాటి ఉపయోగం గురించి చెప్తూ " పదపాఠం సంహితాపాఠం ఏర్పడిన కొద్ది కాలానికి ఏర్పడింది.దీనివల్ల ఋగ్వేదంలో ఏది మూలాంశం?ఏది ప్రక్షిప్తభాగం అనే విషయం మనకు తెలుస్తుంది" అని వారు అంటున్నారు.

అంటే, ప్రక్షిప్తాలను చేర్చడం అసంభవం అని చెప్తున్నారా, లేక ఇప్పటి 10,552 ఋక్కులలో కొన్ని మూలాంశాలూ కొన్ని ప్రక్షిప్తాలూ ఉన్నాయని ఒప్పుకుంటూ వాటిని తెలుసుకోవచ్చని అంటున్నారా అనేది అర్ధం కావడం లేదు నాకు.మీ అభిప్రాయం ఏమిటి?అంటే, వాళ్ళు చెప్పినది మీకెలా అర్ధమయిందని కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నది - 10,552 ఋక్కులు అన్నీ అపౌరుషేయాలే అని అంటారా కొన్ని ప్రక్షిప్తాలు అని మీరు అంటారా అని.

ఇది నా ప్రతిపాదనకు సంబంధించి పూర్వరంగం మాత్రమే.ఇప్పుడు అసలు ప్రస్తావనలోకి వస్తాను."మంత్రద్రష్టలగు నహర్షులు" అనే తలకట్టు కింద "3.విశ్వామిత్రుడు" అనే ప్రకరణ ఉంది.అక్కడ ఉన్న విషయాన్ని యధాతధం ఇక్కడ చెప్తున్నాను:"ఋక్సంహితలో 46 సూక్తాలను ఇంకా కొన్ని మంత్రాలను దర్శించిన మహనీయుడీతడు.కుశుని మనుమడైన గాధి కుమారుడు విశ్వామిత్రుడు.ఋచీకుని భార్య సత్యవతి ఇతని సోదరి.ఇతడు కాన్యకుబ్జ(కనోజ్) దేశాధిపతి.ఒకప్పుడు వసిష్ఠునితో పంతగించి తపస్సు చేసి మొదట రాజర్షియై తరువాత బ్రహ్మర్షి యైనాడు.(రామా.బాల.51).కౌశికీనదీతీరంలో ఇతడు బ్రహ్మర్షిత్వాన్ని పొందినట్లు భారతం పేర్కొంటున్నది.(భార.వన.87-13).ఇతనికి నూరుమంది కొడుకులున్నట్లు తెలుస్తున్నది.అందులో గాలవుడు,మధుఛ్చందుడు మొ|| వారు ముఖ్యులు.విశ్వామిత్రునికి వసిష్ఠునితో దీర్ఘకాలవైరమున్నట్లు కనబడుతున్నది.ఇతని ప్రేరణ వల్లే కల్మాషపాదుడు వసిష్ఠుని కొడుకులందఱిని చంపాడు.(భార.ఆది.175-41).వసిష్ఠ విశ్వామిత్రుల విరోధవృత్తాంతం మనకు ఋగ్వేదంలో కనబడుతోంది.విశ్వామిత్రుడొకసారి కాన్యకుబ్జదేశంలో ఇంద్రునితో కలిసి సోమపానం చేయగా, అప్పటినుంచి అతడు క్షత్రియుడు కాదని బ్రాహ్మణుడేనని ప్రసిద్ధి ఏర్పడింది.(భార.వన.87-17).అజీగర్తుని కుమారుడైన శునశ్శేపుని(దేవరాతుని), యాగంలో ఆహుతి కాకుండా ఇతడు కాపాడాడు."

చివర ప్రస్తావించిన శునశ్శేపుడి కధలో కూడా నాకు వేదవిరుద్ధమైన అంశాలు చాలా కనిపించాయి. కానీ, ఇప్పుడు నేను పట్టించుకుంటున్నది "ఒకప్పుడు వసిష్ఠునితో పంతగించి తపస్సు చేసి మొదట రాజర్షియై తరువాత బ్రహ్మర్షి యైనాడు.(రామా.బాల.51).విశ్వామిత్రునికి వసిష్ఠునితో దీర్ఘకాలవైరమున్నట్లు కనబడుతున్నది.ఇతని ప్రేరణ వల్లే కల్మాషపాదుడు వసిష్ఠుని కొడుకులందఱిని చంపాడు.(భార.ఆది.175-41).వసిష్ఠ విశ్వామిత్రుల విరోధవృత్తాంతం మనకు ఋగ్వేదంలో కనబడుతోంది." అనే వాటిని మాత్రమే.

మొదట వీటిలో నాకు హేతువిరుద్ధం,సత్యదూరం అనిపించినవిషయాలు ఇవి.బ్రహ్మర్షిత్వం అనేది ఒక వ్యక్తికి తారణ మీద దృష్టి ఉండి సాధన చేస్తూ ఉన్నప్పుడు సాధించే ఒక దశ లేక స్థాయి అయితే విశ్వామిత్రుడు వసిష్ఠుడి మీద పంతంతో "వసిష్ఠుడేనా బ్రహ్మర్షి?నేనూ బ్రహ్మర్షిని కావాలి!" అనుకుని బ్రహ్మర్షిత్వం కోసం బయల్దేరడం ఏంటి?కధలో బ్రహ్మర్షిత్వం కోసం విశ్వామిత్రుడు చేసిన పనులను గమనిస్తే కధని కల్పించినవాళ్ళూ చెప్పినవాళ్ళూ రాసినవాళ్ళూ చదువుతున్నవాళ్ళూ అదేదో పదవిలానో ఉద్యోగంలానో పీఠంలానో ఉంటుందని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది నాకు.

నిజానికి చాలా కాలం క్రితం సుదాస పాంచాలుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆజన్మవైరం పూని పాతికేళ్ళ పాటు విసిగించిన పదిమంది శత్రువుల్ని ఒక్కడై ఎదుర్కుని గెల్చిన దాసరాజ్ఞేయ యుద్ధం గురించి  పరిశోధన చేసినప్పుడు వసిష్ఠ విశ్వామిత్రుల గురించి కూడా నాకు  తెలిసింది.ఋగ్వేదం ఏడవ మండలం యుద్ధం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది.సుదాసునికి ఒకరి తర్వాత ఒకరుగా పౌరోహిత్యం వహించి దాశరాజ్ఞ యుద్ధంలో కీలకపాత్రని పొషించిన వశిష్ఠ విశ్వామిత్రులు స్వయంగా చెప్పుకున్న సూక్తాలకు తోడు ఇతర వైదిక ఋషులు చెప్పిన సూక్తాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి.అన్నింటిలోనూ ప్రధాన విషయాలలో వైరుధ్యం లేదు గానీ కొన్ని చిన్న చిన్న  విషయాలకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క  విధంగా చెప్పడం వల్ల పాఠాంతరాలు కనబడుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.అన్నింటినీ ఒకచోటికి చేర్చి పండితులు ఏకసూత్రతని సాధించాల్సిన అవసరం ఉంది.

వశిష్ఠుడు,విశ్వామిత్రుడు - ఇద్దరూ సుదాసుడికి పౌరోహిత్యం చేశారు,అంతిమ విజయం తర్వాత ఇద్దరూ సుదాసుడి మీద ప్రసంసలు కురిపించారు.అయితే,ఇద్దరూ కలిసి ఒకే సమయంలో సుదాసుడికి పౌరోహిత్యం చెయ్యలేదు.అనేకమైన అపారమైన పౌరాణిక సాహిత్యంలో వీరిద్దరీకీ మధ్యన జరిగిన కలహాల కధలు ఎంతో విస్తారమై ఉన్నాయి.తను రాజైనప్పటికీ వశిష్ఠుడికి బ్రహ్మర్షిత్వం వల్ల రాజులకి మించి జరుగుతున్న గౌరవ మర్యాదలని చూసి ఈర్ష్యపడి తను కూడా బ్రహ్మర్షియై వశిష్ఠుడి కన్న అధిక స్థాయిలో గౌరవ మర్యాదలను పొందాలనుకున్నాడనీ ఒకానొక  సందర్భంలో ఒక రాక్షసుడిని ప్రోత్సహించి వశిష్ఠుడి నూరుగురు కుమారుల్నీ హత్య చేయించాడనీ చాలా కధలు ప్రచారంలోకి వచ్చాయి.వాటి ప్రభావం వల్ల కాబోలు మొదట విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడుగా ఉండి అతన్ని తొలగించి వశిష్ఠుణ్ణి తీసుకోవడంతో విశ్వామిత్రుడు పగబట్టి మిగిలిన రాజుల్ని రెచ్చగొట్టి దాశరాజ్ఞ యుద్ధానికి బీజం వేశాడని చాలామంది చరిత్రకారులు విశ్లేషణలు చేస్తున్నారు.కానీ నాకు మాత్రం అలా అనుకోవడానికి ఆధారాలు కనబడటం లేదు. మన పౌరాణిక సాహిత్యం నుంచి తొలగించాల్సిన వాటిలో వశిష్ఠ విశ్వామిత్రుల వైరం కూడా ఒకటి.

మిగిలిన పురాణకదల్ని పట్టించుకోకుండా దాశరాజ్ఞ యుద్ధం గురించిన ఋగ్వేద సూక్తాలను మాత్రం పట్టించుకుంటే నాకు కనబడిన విషయాలు ఇలా ఉన్నాయి.గెలుపు తర్వాత విశ్వామిత్రుడు చెప్పిన సూక్తంలో పూర్వ పురోహితుడు సాధించలేని దానిని తను సాధించినందుకు గర్వం వ్యక్తం చేశాడు.అందువల్ల యుద్ధం మొదలయ్యేటప్పటికి గానీ తొలిదశలో గానీ వశిష్ఠుడు సుదాసుని పక్కన ఉండి తర్వాత వశిష్ఠుడు దూరమై విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడయ్యాడనేది నా అభిప్రాయం.అదే సూక్తంలో విశ్వామిత్రుడే వశిష్ఠుడు కూడ సుదాసుణ్ణి ప్రశంసించినట్టు ప్రస్తావించడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతమైన శత్రుత్వం లేదనే భావించాలి.వ్యతిరేకత గనక ఉంటే ఏదో ఒక నిందావాచకం అక్కడ ఉండి ఉండేది.ఎందుకంటే, వైదిక సాహిత్యంలోని ఋషీ కూడా వ్యక్తిగతమైన రాగద్వేషాలని దాచుకోవాలని ప్రయత్నించలేదు, కపట నాటకాలను ప్రదర్శించలేదు.సుదాసుడికి పౌరోహిత్యం వహించని కాలంలో విశ్వామిత్రుడు గానీ వశిష్ఠుడు గానీ అటువైపున ఉన్న రాజులకి పౌరోహిత్యం వహించిన దాఖలాలు కూడా కనపడటం లేదు.

నిజానికి దాశరాజ్ఞేయం గురించి విశ్వామిత్రుడు చెప్పుకున్న సూక్తంలో విశ్వామిత్రుడు వసిష్ఠుడి పట్ల వైరం ప్రకటించ లేదు.మొదట వశిష్ఠుడు సుదాసునికి పౌరోహిత్యపుమంత్రిత్వం అందిస్తూ ఉండేవాడనీ విశ్వామిత్రుడు సుదాసునికి దగ్గరైన తర్వాత మంత్రిత్వం నుంచి తప్పుకున్నాడనీ చెప్పాను కదా, అది ఎట్లా జరిగిందో తెలుసా?మొదట వశిష్ఠుడు కూడా అనార్య సంస్కృతులను ద్వేషిస్తూ ఉండేవాడు - దాశరాజ్ఞయుద్ధం మొదలు అయ్యే సమయంలో. కొందరు చారిత్రకుల పరిశోధనాత్మకవిశ్లేషణ ప్రకారం విశ్వామిత్రుడు ఇప్పటి యూరోప్(హరివర్షం!) ప్రాంతం నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.అతను వశిష్టుడి సహాయం కోరితే ఆశ్రయం ఇచ్చాడు.క్రమేణ వశిష్ఠుడు అనార్యుల పట్ల ద్వేషాన్ని తగ్గించుకుని వారి సంస్కృతులని అధయ్యనం చెయ్యడం మొదలుపెట్టాడు.(Rigveda7.86 [2-7]) ప్రకారం అనార్య దేవతామూర్తులను ఆర్యధర్మానికి దగ్గర చేశాడు.అతను ప్రయత్నాలలో ఉండటం వల్ల మంత్రిత్వానికి దూరమైనప్పుడు విశ్వామిత్రుడు బాధ్యతలను స్వీకరించాడు.అంటే, ఇటువైపు విశ్వామిత్రుడు military exponentగా వాళ్ళని ఓడించి నాశనం చేస్తుంటే అటువైపు వశిష్ఠుడు cultural ambassadorగా వాళ్ళ సంస్కృతిని అధ్యయనం చేస్తూ తర్వాత కాలపు భారతీయ సమాజం పాటించిన జీవధారకు అవసరమైన రెండు పరస్పర విరుద్ధమైన భావధారలను వృద్ధి చేసి సుదాసుని విజయం తర్వాత వీటిని సమన్వయించి కొత్త సంస్కృతిని సృష్టించారు.

కొత్త సంస్కృతిని పాటించిన రాజూ కొత్త ప్రాంతాలని ఆక్రమించడంలో కేవలం విస్తరించడానికే ప్రయత్నించారు తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యలేదు.క్రీ. 1 శతాబ్దిలో అరేబియా ఖండం వరకు జైత్రయాత్ర చేసి మక్కా గుడిని నిర్మించిన విక్రమార్క మహారాజు గానీ నేటి కంబోడియా ధాయిలాండ్ వంటి ప్రాంతాలకు తరలివెళ్ళి రాజ్యస్థాపన చేసినవారు గానీ సనాతనధర్మాన్ని పరిచయం చెయ్యడమే తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యకపోవడానికి వశిష్ఠ విశ్వామిత్రుల సమిష్ఠి కృషి ఫలితమైన సంస్కారమే కారణం!

నాకు తెలిసి "అగ్నిమీళే పురోహితం" అనే ఋగ్వేదంలోని  మొదటి మంత్రం నుంచి "వనాయ్యం తదశ్వనా కృతం" అనే అధర్వవేదంలోని చివరి మంత్రం వరకు ఒక్క మంత్రమూ ఇంకొక మంత్రంతో విభేదించకూడదు.అలా ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క కాలంలో ద్యోతకం అయినప్పటికీ వాటన్నిటిలో ఏకసూత్రత ఉండటమే "ఇవన్నీ ఒకే జ్ఞానరాశి నుండి వెలువడినాయి" అనిపిస్తూ అపౌరుషేయాలు అనే అర్హతను సాధించుకున్నాయి.మరి, దాసరాజ్ఞేయ యుద్ధం యొక్క అన్ని ప్రస్తావనలనూ పరిశీలించిన నాకు కనపడని వసిష్ఠ విశ్వామిత్రుల వైరం మరొక చోట ఉండటం ఎట్లా సంభవిస్తుంది?

అసలు విశ్వామిత్రుడు వసిష్ఠుడి గోధనాన్ని హరించదానికి ప్రయత్నించి ఓడిపోయి అతని మీద పంతం పట్టి బ్రహ్మర్షిత్వం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేదానికి భౌతిక సాక్ష్యాలు ఉన్నాయా?కొందరు చారిత్రకుల పరిశోధనాత్మకవిశ్లేషణ ప్రకారం విశ్వామిత్రుడు ఇప్పటి యూరోప్(హరివర్షం!) ప్రాంతం నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.అతను వశిష్టుడి సహాయం కోరితే ఆశ్రయం ఇచ్చాడు. మొదట వశిష్ఠుడు కూడా అనార్య సంస్కృతులను ద్వేషిస్తూ ఉండేవాడు - క్రమేణ వశిష్ఠుడు అనార్యుల పట్ల ద్వేషాన్ని తగ్గించుకుని వారి సంస్కృతులని అధయ్యనం చెయ్యడం మొదలుపెట్టాడు.(Rigveda7.86 [2-7]) ప్రకారం అనార్య దేవతామూర్తులను ఆర్యధర్మానికి దగ్గర చేశాడు.

ఇంతకీ, అతని కధలోని ముఖ్యమైన సన్నివేశంలో విశ్వామిత్రుడు చేసిన ఘనకార్యం ఏంటి?వసిష్ఠుడి గోధనాన్ని హరించడానికి ప్రయత్నించడం!కధలోని మొదటి సన్నివేశంలోనే ఇంతటి అధర్మకార్యం చేసినవాడు అసలు ఋషిత్వానికే అర్హుడు కాడు, బ్రహ్మర్షిత్వం ఎట్లా సిద్ధించింది?పోనీ, స్పర్ధయా వర్ధతే విద్యయా అని సరిపెట్టుకోవాలని చూస్తే "ఇతని ప్రేరణ వల్లే కల్మాషపాదుడు వసిష్ఠుని కొడుకులందఱిని చంపాడు.(భార.ఆది.175-41)." అన్న వాస్తవం కళ్ళముందు కనబడి భయం వేస్తుంది.ఎందుకంటే, అతని లక్ష్యమైన బ్రహ్మర్షిత్వానికీ వసిష్ఠుడి కొడుకుల్ని చంపటానికీ ఏమిటి సంబంధం?పొరపాట్లు మానవసహజం అనుకునే నరాల బలహీనత కూడా కాదే ఇది,ద్వేషంతో తను చెడింది గాక కల్మాషపాదుడి చేత కూడా పాపం చేయించటం!

పోనీ, తప్పులు చేసి సరిదిద్దుకోవటం దైవత్వానికి దగ్గర చేస్తుంది అనుకోవటానికి అతడికి బ్రహ్మర్షిత్వం సిద్ధించేలోపు అతని నుంచి కనీసం వసిష్ఠుడి కొడుకుల్ని చంపించిననదుకు పశ్చాత్తాపం వెలిబుచ్చిన దాఖలాలు కూడా లేవు - నేను చదివినంత మేరకు మాత్రం లేదు,నేను చదవని చోట ఉంటే మంచిదే!ఉంటే మాత్రం,అది మనస్పూర్తిగా చేసిందని ఒప్పుకోగలమా?

కానీ, ఒక బ్రహ్మర్షి గోధనాన్ని ఆశించి భంగపడి పంతం పట్టటమూ బ్రహ్మర్షి కొడుకుల్ని రాక్షసుడి చేత చపించడమూ లాంటి అధర్మ కార్యాలు చేసినప్పటికీ ఒక వ్యక్తి గాయత్రీ మంత్రద్రష్ట అయ్యి బ్రహ్మర్షి కావచ్చును అనేది అబ్రహామిక మతాలలోని దేవుడు దయ చూపిస్తే గొర్రెల కాపరి కూడా మొదట ప్రవక్త కావచ్చును తర్వాత దేవుడు కూడా కావచ్చును అన్నట్టు అనిపిస్తుంది తప్ప మానవుడు వేద ప్రతిపాదితమైన ధర్మపాలన ద్వారానే భగవంతుణ్ణి చేరుకోగలడు అనే సత్యానికి ఇది సాక్ష్యం అనిపించడం లేదు.

నా బాధ ఇది - అసలు "మంత్రం" అనే పదానికి వేదం ప్రకారమే స్పష్టమైన నిర్వచనం ఉండి దేన్ని మంత్రం అనాలి, దేన్ని మనరం అనకూడదు అనేదానికి కూడా స్పష్టమైన నిర్దేశనలూ నిషేధాలూ ఉన్నప్పుడు మంత్రరాజం అనదగిన గాయత్రీ మంత్రదష్ట ఒక పశ్చాత్తాపం లేని శిశుహంతయా! పండితులకి ఎందుకు ఇవన్నీ తోచలేదో నాకు తెలియదు.ఇలా ఆలోచించడం నా దోషమా అని కూడా భయం వేస్తున్నది.కానీ, ఒక పశ్చాత్తాపం లేని శతహంతకుడికి సృష్టికర్త మంత్రద్రష్ట హోదా ఇచ్చాడంటే నమ్మలేకపోతున్నాను.

"వసిష్ఠ విశ్వామిత్రుల విరోధవృత్తాంతం మనకు ఋగ్వేదంలో కనబడుతోంది" అనేది నిజమా అబద్ధమా? భాగాన్ని వ్రాసిన పండితుడి పేరు ఎస్.బి.ఆర్ అని వుంది.బహుశా పుస్తకం యొక్క ప్రధాన సంపాదకుడు డాక్టర్ యస్,బి.రఘునాధాచార్య గారి షార్ట్ కట్ అయి ఉండవచ్చు.అంతటి పండితుడు లేనిది ఉన్నట్టు రాస్తారా అని అనుమానం.ఋగ్వేదంలో అది లేదు,అది మూలోక్తం కాదు ప్రక్షిప్తమే అంటే నాకు పరమ సంతోషం.ఉంది అంటే మాత్రం దాన్ని అక్కడినుంచి తొలగించాలి.అది అక్కడ ఉండి తీరాల్సిందే అంటే ఇక వేదం అపౌరుషేయం అనకూడదు.ఇదీ నా పంతం!

భరత ఖండం సత్యం పునాదుల మీద నిలబడి వేదం చెప్పిన ప్రకారం జీవించిన కాలంలో అఖండమైన సంపదలతో అలరారి విశ్వగురువై అసత్యం మీద భ్రమ పెంచుకుని నీచమైన విషయాల పట్ల వ్యామోహంతో వేద ధర్మం నుంచి పక్కకు జరిగిన కాలంలో నిత్యదరిద్రం నుంచి పరాధీనత వరకు ప్రయాణించడం అనేది చతుర్యుగ పర్యంతం ఉన్న వ్యాసపరాశరాది ఆచార్య పరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న చారిత్రక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!! 

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...