"ఈడి కొడుకు ఇలాగే గోరోజనం చూపీస్తే బ్రహ్మోత్సవాల టైంలో మంగాపురం ట్రాన్స్ఫర్ చేసారు"
hari.S.babu
హిందూ పుటక పుట్టి మతం మీద గౌరవం ఉన్నవాడు మాట్లాడాల్సిన భాష ఇదేనా?వీళ్ళా హిందూమతానికి ప్రతినిధులు?క్రైస్తవుల్నీ,హిందూమతద్వేషుల్నీ TTD బోర్డులో సభ్యులుగా, చైర్మన్లుగా పెట్టి అది తప్పు అంటుంటే వేదం చదివిన బ్రాహణులని గురించి ఇలా మాట్లాడేవాళ్ళు హిందువులా?"దేవుడికి కోపం వస్తుందా?కోపం వస్తే దేవుడా?" అని అంటున్నవాళ్ళకి మతంలో బేసిక్స్ అయినా తెలుసా?అధర్మం జరిగితే దేవుడికి కోపం రాదా?దేవుడు మీ చప్రాసీయా?యెహోవా రోషము గల దేవుడు అని క్రైస్తవులు చెప్పడం లేదా?ఖురాను ధర్మం పాటించకపోతే అల్లా కోపిస్తాడు అని ముల్లాలు చెప్పడం లేదా?అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరించి అధర్మ నిధనం చేస్తాడని చెబుతున్న భగవద్గీత చదవలేదా వీళ్ళు?
నేను అసలు ఈ వివాదం గురించి పోష్టు రాయాలని మొదట్లో అనుకోలేదు.దానికి కారణం నా వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక చింతనలో ఆలయసందర్శనం అంత ముఖ్యమైనది కాదు.అసలు నియమం ప్రకారం వేళలు పెట్టుక్కుని పూజ చెయ్యాలని కూడా అనిపించదు.అయితే,ధ్యానం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.ఒక చర్చలో నీహారిక మీకు మోక్షం అక్కర్లేదా అనే అర్ధంతో ప్రశ్న వేస్తే అక్కర్లేదనే చెప్పాను.అంతకు ముందే నా బ్లాగు దగ్గిరే చంద్రిక గారు నేను సనాతనుణ్ణి అని చెప్పుకోవడం గురించి అధిక్షేపం లాంటి సందేహం వెలిబుచ్చితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఏదో ఒక నాటికి "అహం బ్రహ్మాస్మి!" అనుకోగలగడం సాధ్యమే కదా, నేను అలా అనుకోగలుగుతున్నాను కాబట్టి చెప్పుకుంటున్నాను, అందులో తప్పేమీ లేదని చెప్పాను.చాలా కాలం క్రితమే నా గురించి "నేను ద్విబాహు రపరో హరిని!" అని కూడా చెప్పుకున్నాను.
మన చుట్టూ ఉన్న విశ్వంలోని ప్రతి వ్యవస్థలోనూ అంతరువులు ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి కూడా!నేను చదివిన బయాలజీలో ఎకాలజీ చాలా ముఖ్యమైన భాగం.అందులో దాదాపు నాలుగు రకాల పిరమిడికల్ ఓరియంటేషన్ గురించిన సూత్రీకరణలు ఉంటాయి.వాటిలో ముఖ్యమైనది ఫుడ్ పిరమిడ్ - స్వయంపోషకాలైన మొక్కలు 100 ఉంటే వాటిని తిని బతికే శాకాహారులు 10, శాకాహారులు 100 ఉంటే మొక్కల్ని తినలేక శాకాహారుల్ని తినే మాంసాహారులు 10 అన్నట్టు ఉంటుంది ఈ ఆమరిక.అయితే,ఇవి స్థిరమైన అంతరువులు కాదు.వీటన్నిటిని చచ్చిపోయాక కుళ్ళబెట్టే సూక్ష్మజీవులూ,సొతంగా ఆహారసంపాదన చెయ్యకుండా బతికే పరాన్న జీవులూ, ఒకరు లేకుండా మరొకరు జీవించలేని Symbionts కొన్నీ కలిసి చాలా సంక్లిష్టమైన జీవవైవిధ్యం ఉంది ఇక్కడ. సంక్లిష్టమైన విషయాల్ని అర్ధం చేసుకోవడానికి మొదటి దశలో వాటిని విడి అస్తిత్వంలో చూసి అక్కడే ఆగిపోయేవాళ్ళు కొందరయితే,కొంత జ్ఞానం పెరిగాక ప్రతి అస్తిత్వాన్నీ దాని పితృసోదరసంతాన సంబంధంతో కలిపి చూడగలిగిన నా ఆలోచనా స్థాయి మిగిలిన వాళ్ళకన్న ప్రత్యేకంగానే ఉంటుంది.కానీ కమ్యునిష్టుల మాదిరి అందరూ నా స్థాయిలోనే ఆలొచిస్తే చాలు వర్గరహితసమాజం ఏర్పడిపోతుంది అనుకునే మూర్ఖత్వం నాకు లేదు.
నాకు ఆలయాలతో పనిలేదు కాబట్టి తిరుమలలో ఏం జరిగితే నాకేమిటి అని అనుకోలేక కొంత కుతూహలం చూపించి వాదనల్లో నా అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టాను.తీరా చూస్తే ప్రతి ఒక్కరూ గందరగోళంలో ఉన్నట్టు నాకు అర్ధం అయ్యింది.ఇప్పుడున్న గందరగోళం వల్ల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే త్వరగా సమస్యకి పరిష్కారం కనుక్కుని గొడవల్ని చల్లార్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయ అస్తిత్వమే పునాదులతో సహా కదిలిపోతందేమోనని అనిపిస్తున్నది!
అతిగా స్పందిస్తున్నాననో,భయపెట్టడానికి చెబుతున్నాననో అనుకోకండి - ప్రస్తుతం తిరుమల చుట్టూ నడుస్తున్న జగన్నాటకం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయపార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ. మున్ముందు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఒక ప్రాంతీయ పార్టీ మధ్య నడుస్తున్నది.వాళ్ళలో ఎవరో ఒకరు తగ్గనంతవరకు ఈ వివాదం చల్లారదు.ఈ మూడు పార్టీలలో వయ్యస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్ది క్రైస్తవుడని అంటారు.అయితే,పుష్కరాల సమయంలో తండ్రికి హిందూ విధిలో శ్రాధకర్మలు చేశాడు,తరచు తిరుమలకి వస్తాడు - వాదన కోసం ఇవన్నీ ప్రజల్లో అధిక శాతం హిందువుల్ని బుజ్జగించటానికో ఈ దేవుడి కటాక్షం వల్లనైనా అధికారంలోకి వస్తాననే ఆశతోనో చేస్తున్నాడని అనుకుంటే అతనికి తిరుమల పవిత్రతని చెడగొట్టడం అనేది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు.కానీ అప్పుడప్పుడూ మసీదుకు వెళ్ళి ముస్లిములతో కలిసి మోకాటి తండా వేసినా చంద్రబాబు నికార్సైన హిందువే కదా!ఇక భాజపా వాళ్ళు పదహారణాల హిందూత్వ వాదులు!మరి ఈ రెండు పార్టీల్లోనూ ఉన్న హిందువులు ఆలయం చుట్టూ ఇంత నీచమయిన వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?
ఒక ముస్లిం రాజకీయ వేత్త తన రాజకీయ ప్రయోజనాల కోసం తన మతానికి ద్రోహం చెయ్యడు,ఒక క్రైస్తవ రాజకీయ వేత్త తన రాజకీయ ప్రయోజనాల కోసం తన మతానికి ద్రోహం చెయ్యడు - మరి,హిందూ రాజకీయ వేత్తలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు?ఇప్పుడే కాదు, రాజకీయ రంగంలో ఆధిక్యతని సాధించాలనుకుని, సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలని ఆశించే రాజకీయ హిందువులు ఏనాడూ మతం పట్ల నిబద్ధతని చూపించలేదు.ముస్లిములకి ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడమే కాకుండా ఇతర చోట్ల కూడా ముస్లిం అబ్యర్ధుల్ని నిలబెట్టి కాంగ్రెసు అంత సహకరించినా ఆ ఎన్నికల ఫలితాలు సామాన్య ప్రజలలో హిందువులే కాదు ముస్లిములు కూడా విభజనని వ్యతిరేకిస్తున్నారని తెలియజెప్పిన తర్వాత కూడా ఈ దేశం మత ప్రాతిపదికన చీలడానికి అతి ముఖ్యమైన మలుపు గాంధీ జిన్నాని కలవటం!ఇప్పుడు మనకి చెబుతున్న గాంధీ చేసిన ప్లెబిసైట్ ప్రపోజల్ నాకు నమ్మదగ్గదిగా లేదునిన్నటికి నిన్న అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ ఏర్పాటుకి ముస్లిములు కూడా విముఖమే అని తేల్చి చెప్పేశాక అంత కాలం రాజకీయాల్లో గడిపిన మనిషి ప్లెబిసైటుతో అద్భుతాలు జరుగుతాయనుకోవటం ఎలా సాధ్యం?నా విశ్లేషణ ఏమిటంటే, అప్పటి హిందూ రాజకీయ నాయకులు కూడా అప్పటికే పాకిస్తాన్ ఏర్పాటుని ఆమోదించేశారు.ప్రజలు దానికి వ్యతిరేకమైన ఫలితం ఇవ్వడం వారికీ మింగుడు పడలేదు,గాంధీ అక్కడ జిన్నాకి "విభజనకి మేము కూడా అనుకూలమే,నువ్వు పాకిస్తాన్ ఏలా సాధించుకున్నా మాకు అభ్యంతరం లేదు సుమా!" అనే సూచన ఇచ్చి ఉంటాడని నా నమ్మకం.గాలి పోగేసి చెప్పడం లేదు,అప్పటి హిందూ నాయకుల ప్రకటనలు కూడా "హిందువులు మొగలాయీ పాలకుల కాలంలో కష్టాలకి గురయ్యారు.క్రైస్తవులైనా ఇంగ్లీషువాళ్లు మనకి న్యాయమైన పరిపాలననే అందించారు.ఇంగ్లీషువాళ్ళని వెళ్ళగొడితే మళ్ళీ ముస్లిములు అధికారంలోకి వచ్చేస్తారు.వాళ్ళు మనల్ని బతకనివ్వరు" ఆనే పద్ధతిలో ఉండేవి - సరిగ్గా హిందువుల గురించి ముస్లిము నాయకుల వాదన కూడా ఇదే కదా!ఈ దేశం విడిపోకుండా ఉంటే జిన్నాయే తొలి ప్రధానమంత్రి అయి ఉండేవాడు.అది వాళ్ళకి గిట్టక వాళ్ళ రాజకీయం వాళ్ళు చేశారు.ఫలితం వేదం పుట్టిన గడ్డ అని చెప్పుకునే హరప్పా మొహెంజెదారోలు ముస్లిముల అధీనంలోకి వెళ్ళిపోయాయి.
పోనీ గదా, వాళ్లకో దేశం ఇచ్చి పంపించేశారు గనక ఇక తమ మతానికి న్యాయం చేస్తారని అనుకుంటే తమ ఉంపుడుకత్తెల వంటి చరిత్రకారులతో శ్రీరాముడు నిర్మించి ఉంటాడని భావిస్తున్న పరమ పవిత్రమైన హిందూ ఆలయానికి కుతుబుద్దీన్ ఐబక్ కట్టిన తొలి ఇస్లామిక్ కట్టడం హోదాని కట్టబెట్టడం కోసం చెప్పకూడని అబద్ధాల్ని అన్నిట్నీ చెప్పేశారు!"అక్బర్ ది గ్రేట్!", "చెంఘిజ్ ఖాన్ ది గ్రేట్!", "అలెగ్జాండర్ ది గ్రేట్!", "కనిష్క ది గ్రేట్!" అని హైందవేతరులకి అన్ని గ్రేట్లు ఇచ్చినవాళ్ళకి హిందువుల్లో ఒక్కడు కూడా గ్రేట్ అని పిలవదగ్గవాడు కనిపించలేదు, ఎందుకు?స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ హిందువుల్ని భయంకరమైన మతతత్వవాదులుగా ముద్రవేసి అల్లరి చెసినవాళ్ళని ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది హిందువులు కాదా?నెహ్రూ ఎవరు?కాశ్మీరీ బ్రాహ్మణుడు కాదా?వెనకటి చరిత్ర దేనికి?లల్లూ యాదవ్ హిందువు కాదా?ములాయం సంగతి ఏంటి?మాయావతి ఎవరు?లింగాయతుల్ని రెచ్చగొట్టిన సిద్ధరామయ్య ఎవరు?తన గనుల కోసం సుంకులమ్మ గుడిని పడగొట్టిన గాలి రెడ్ది హిందువు కాదా?నిజాం ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు నడిపిన వాళ్లలో, ప్రత్యేకించి కమ్యునిష్టు పార్టీలోనే ముస్లిములు కూడా ఉన్నారు - వాళ్ళెవరూ ఇస్లాము గురించి చెడుగా మాట్లాడలేదే!
ఎప్పటికైనా రాజకీయ హిందువులకి మతాభిమానం పెంచడం సాధ్యమా కాదా అన్నది పక్కనపెట్టి ఇప్పటి సమస్య మూలాన్ని వెతికితే భాజపాకీ తెదెపాకీ తెగిన మైత్రీబంధమే అసలు కారణం అని తెలుస్తున్నది.వయ్యస్సార్ కాంగ్రెసు తెదెపాని ఇరుకున పెట్టడానికి ప్రత్యేక హోదా విషయంలో అల్లరి చెయ్యటం తప్ప తిరుమల వివాదం విషయంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు.
అయితే, ఆదినుంచీ హోదా విషయంలో ఎవరు అల్లరి చేసినా వాళ్ళు మాకూ భాజపాకీ పుల్లలు పెట్టటానికే చేస్తున్నారు తప్ప వాళ్ళకి రాష్ట్రం పట్ల చిత్తశుద్ద్జిలేదు అని కొట్టిపారేస్తూ తెలివి చూపించిన తెదెపా వాళ్ళు చివరాఖరికి ఎత్తెత్తి వేసిన కాలు ఎంగిలాకులో వేసినట్టు భాపాతో తెగదెంపులు చేసుకోవడం ఈజగన్నాతకంలో తొలి అంకం!దీనికి సాక్ష్యం వీళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నప్పుడే పుట్టా సుధాకర యాదవ్ గురించి ఒక ఫొటోని పట్టుకుని గొడవ చేసి తెదెపా నియామకాన్ని వాయిదా వేసి చెప్పిన జవాబుతో చల్లబడి తేడాలు వచ్చాక తెదెపా పుట్టాని కుర్చీ ఎక్కించగానే భాజ్పా అదే విషయం గురించి మళ్ళీ రచ్చ మొదలుపెట్టటమే.రమణ దీక్షితులు పక్కన భాజపా నాయకులు ఉండడం భాజపా వాళ్ళు ఉద్దేశ పూర్వకంగానే తిరుమలని తమ రాజకీయాలకి వాడుకుంటున్నారు అనుకోవడానికి మరొక సాక్ష్యం!
రమణ దీక్షితులు తనకి వ్యక్తిగతమైన నష్టాలు ఏర్పడటం వల్ల భాజపాని తోడు తీసుకుని గొడవ చేసినా, నిజమైన ఆర్తితోనే అధికారంలో ఉన్నవాళ్ళని ఎదుర్కోవటానికి బలమైన అండ తీసుకుని గొడవ చేసినా అతన్ని తప్పు పట్టాల్సిన పని లేదు.అతను చేస్తున్న ఆరోపణలు కొత్తవీ కావు, అతనొక్కడే చేస్తున్నవీ కావు.ఎప్పటినుంచో జియ్యర్ స్వామి చేస్తున్న ఆరోపణలు కూడా ఇవే.మరీ చిత్రం ఏమిటంటే, రమణ దీక్షితుల్ని విమర్శిస్తున్నవాళ్ళు "కొన్ని ఏళ్ళ క్రితం జరిగినవాటిని గురించి ఇప్పుడు గొడవ చేస్తున్నారే, ఇన్నాళ్ళూ ఏమి చేశారు?" అనీ "ఆలయం పరువు తీస్తున్నందుకు సిగ్గుగా లేదా?" అనీ అంటున్నారు - దీని అర్ధం ఏమిటి?అప్పుడు ఆడగకపోవటాన్నీ వాళ్ళే తప్పు పడుతున్నారు,ఇప్పుడు అడగటాన్నీ వాళ్ళే తప్పు పడుతున్నారునేను మొట్టమొదట స్పందించిన ఫేస్ బుక్ పోష్టు దగ్గిరే ఈ పోష్టులో మొదట చూపించిన ఆణిముత్యం కనబడింది.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాటం ఈ మూడున్నరేళ్ళూ చేయకుండా ఇప్పుడు గొడవ పడుతున్నారే.... అని అడిగితే చాలా రోజులు ఆలోచించుకుని బాబు గారు ఏం చెప్పారో గుర్తుందా.... సరైన సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగ్జీవన్ రామ్ గారు చెప్పారట. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని బాబు గారు అంటున్నట్టే... రమణ దీక్షితులు గారికీ సరైన సమయం ఇప్పుడు వచ్చిందేమో.ఆ వ్యాసం రాసిన వ్యక్తి తెదెపా మూలస్తంభం - అవును కదా!"ఈ చెత్త వెధవలకి ఎంత ముష్టి వేసినా మనకి వోట్లు వేసి చావడం లేదు!డూడూ బసవన్నల్లాగ మనం ఏం చేసినా తలలూపి చావడం లేదు!" అనే అహంకారపు విసుగు పుష్కలంగా కనిపిస్తున్నది.ఇంకా అక్కడ ఈ వ్యాసకర్తని పొగుడుతున్నచాళ్ళు కూడా అదే ధోరణిలో ఉన్నారు..
బ్రాహ్మలు వేదాల్ని అట్టే పెట్టుకోవడం వల్లనే అన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి,మాకూ నేర్పండి అని కంచె ఐలయ్య తరహాలో రెచ్చిపోతున్నవాళ్ళకి నిజంగా నేర్చుకుని అర్చక వృత్తి చేపట్టే దమ్ము ఉందా?ఇప్పుడు వేదాలు అచ్చులోనూ దొరుకుతున్నాయి.కొనుక్కుని చదివి అర్చకవృత్తికి అర్హత సంపాదించుకుని రండి!
టీడీపీ అంత కులపిచ్చి పార్టీ ఇంకెక్కడా లేదు అని వాగిన దద్దమ్మకి చంద్రబాబు అనంతరం సీ.యం పోష్టు గ్యారెంటీ కావడానికి కారణం ఏమిటి?అది వంశపారంపర్యం కాదా?లేదంటే తెదెపాలో ముఖ్యమంత్రి కావడానికి అంతకన్న సమర్ధుడు ఇంకెవడూ లేడన్నంతగా పార్టీ గొడ్డుపోయిందా - ముఖ్యమంత్రి పదవి ఆ బుజ్జాయికే ధారపొయ్యడానికి!రాజ్యాంగాన్ని కూడా నవ్వులపాలు చేస్తూ మీ లీడర్లకి వంశపారంపర్యం కావాలా?ఆగమాల ప్రకారం హక్కు ఉన్న అర్చకులకి పూజారిత్వానికి వంశపారంపర్యం అక్కర్లేదా?
వేదం మాకూ నేర్పండి అనే వాహినీ వారి పెద్దమనుషులకి నేను చాలెంజి చెస్తున్నా - మీ పిల్లల్ని గానీ మనవల్ని గానీ ఉద్యోగాలూ వైభవలూ తెచ్చే చదువులు మానిపించి వేదపాఠశాలకి పంపించగలరా?ఇంట్లో పిల్లాడు పుడితే నామకరణ జరపాలంటే బ్రాహ్మడు కావాలి,తండ్రి చస్తే తద్దినం పెట్టాలంటే బ్రాహ్మడు కావాలి.అవసరం వచ్చినప్పుడు "పంతులు గారూ!మీరు లేందే పని జరగదండీ!బాబ్బాబు - రండి,రండి!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకోవటం, అవసరం లేనప్పుడు "బోడి బ్రాహ్మలు,వీళ్ళు లేకపోతే గడవదా!" అనటం - ఇదేమి సంస్కారం?
బ్రాహ్మల చాదస్తం మూలంగా మతం మారుతున్నారా?ఇప్పుడు మీరు పీకుతున్నది ఏంటి?తెల్లారి లేస్తే రోజంతా చర్చిల చుట్టూ తిరిగేవాడు తప్ప హిందూ దేవాలయం బోర్డు చైర్మను పదవికి నీకు ఏ హిందువూ దొరకలేదా?అంటే అన్నందుకు బ్రాహ్మల్ని తిడతారా?హిందూమతం భ్రష్టు పట్టిపోయినా పర్లేదు,నా రాజకీయం నేను చేసుకుంటాను అనేవాడు హిందూమతాన్ని ఉద్ధరిస్తాడా?ఆలయాల్ని రాజకీయాలకి అతీతంగా ఉంచమన్నవాడు మతానికి ద్రోహం చేస్తున్నట్టా?ఏం తెలివి మీది!?
రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.కొన్ని గుళ్ళలో రోజూ దీపం పెట్టె దిక్కు కూడా లేదు.మరి ఈ పుట్టా లాంటి గొట్టాం గాళ్ళని వాటిని ఉద్ధరించడానికి పంపించరేం?టీటీడీ చైర్మన్ పదవికే ఇన్ని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు?ఆగిరిపల్లి వ్యాఘ్రలక్షీనృసింహస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవికి ఎందుకు పోటీలు పడటం లేదు?నాకోసం/నాకు నచ్చినవాడి కోసం పూజల వేళల్ని మార్చమని చెప్పినవాడు నోటికి అన్నమా?గడ్డియా?అశుద్ధమా?అక్కడున్నది కేవలం విగ్రహమని నాస్తికులు అనుకుంటే తప్పు లేదు,కానీ హిందూ పుటక పుట్టి ఆగమాల ప్రకారం జరగాల్సిన పూజల్ని జరగనివ్వనివాడు అసలు భక్తుడేనా?
అర్చకత్వానికి ఏమన్నా రాజకీయ నాయకులకి వచ్చినట్టు లక్షల కోట్ల కాంట్రాక్టులు వస్తాయా?మాలిక్యులర్ ఫిజిక్స్ చదివి ఉద్యోగం ఖాయమని తెలిసినా నాకు అక్కర్లేదని స్వామి సేవకి అంకితమైనవాడు మీకు అనామకుడిలా కనబడుతున్నాడా!
.ప్రపంచం నలుమూలల నుంచి ఈ దేవుడికి మహత్యాలు ఉన్నాయని నమ్మి వస్తున్న భక్తులకి మీ చెత్త రాజకీయాలు చూసి అసహ్యం వెయ్యదా?అలిపిరిలో మా నాయకుడికి ప్రాణం పోశాడు తిరుమల దేవుడు అనే బాబు భక్తులకి ఆ స్వామికి ఆ మహత్యం ఎట్లా వచ్చిందో తెలియదా?టీటీడీ బోర్డు చైర్మన్ వల్లనా?వేద పండితుల మంత్రబలం వల్లనా?తిరుమలకి వచ్చే భక్తులని అడగండి చైర్మను పుట్టా సుధాకర్ యాదవ్ కోసమా పూజారి రమణ దీక్షితుల కోసమా మీరు వస్తున్నది అని - వాళ్ళే గడ్డి పెడతారు!
అయినా బెజేపీ టీడెపీకి శత్రుపక్షం ఎప్పుడు అయ్యింది?2014లో బీజేపీ తమకి ఇచ్చిన స్థానాల్లో చెత్త క్యాండిడేట్లని పెట్టి మిత్రద్రోహం చెయ్యాలని చూసింది, గుర్తు లేదా?అప్పుడు పెద్ద గొడవే జరిగింది,నేనొక పోష్టు కూడా వేశాను,మీ నాయకుడు కూడా ఆఖరి నిమిషాల్లో కొన్ని స్థానాల్ని వెనక్కి తీసుకున్నట్టు గుర్తు!ఎక్కడో చెన్నయిలో కూర్చుని పేపర్లు చదివి విషయాలు తెలుసుకునే నాకు ఇలాంటి పార్టీతో అతిగా అంటకాగడం తప్పు.దూరంగా ఉండి పోట్లాడి సాధించుకోవడమే మంచిది అనిపించింది - నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం గల మీ నాయకుడికి ఆమాత్రం కామన్ సెన్సు కూడా లేదా?
ఎన్నికల్లో అంత ద్రోహం చేసిన పార్టీ వెంఠనే నలుగురు మంత్రుల్ని వాళ్ళ పక్కలో పడుకోబెట్టేటంత మిత్రపక్షం ఎట్లా అయింది?మోదీ అంత మంచివాడు ఒంకెక్కడా లేడు అని సంవత్సరం క్రితం వరకూ చంద్రబాబే పొగిడాడు కదా,చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడూ పోట్లాడలేదు,ఆర్ధికసంఘం సపోర్టు చేస్తున్నా నిధులు ఇవ్వట్లేదని తెలిసినప్పుడూ కోపం రాలేదు,మనకి ఇవ్వమని అడిగినప్పుడు మిగిలిన వాళ్ళకీ ఎత్తేస్తాం అని చెప్పిన ప్రత్యేక హోదాని మనకి తప్ప అందరికీ ఇస్తూనే ఉన్నారని తెలిసినప్పుడూ కోపం రాలేదు - అన్యాయాలు జరుగుతున్నప్పుడు రాని కోపం మీకు ఇపుడెందుకు వచ్చింది అనే ప్రశ్నకి మీరు ఏమి జవాబు చెప్తారు?
"నీ తప్పుల్లొ మచ్చుకి వెయ్యికాళ్ళమండపం కూల్చాలని సలహాచ్చి బాబుని అలిపిరి దెబ్బకు గురిచేసావు"
hari.S.babu
ఏమిటి దీని అర్ధం?అలిపిరి దగ్గిర నక్సలైట్లు చేసిన దానికి కూడా రమణ దీక్షితులే కారణమా?కుక్కని కొడితే తప్పు కాబట్టి పిచ్చికుక్క అని ముద్ర వెయ్యడం కాదా ఇది?అతను గానీ జియ్యర్ స్వామి గానీ ప్రస్తావించిన తప్పుల్లో ఒకదానికి కూడా జవాబు చెప్పకుండా ఇకముందు అలాంటి తప్పులు జరగనివ్వం అని చెప్పకుండా దీక్షితులు మీద ఎదురుదాడి చెయ్యడంలోనే తెదెపా వాళ్ళ దుర్మార్గం తెలియడం లేదా?
టీడీపీ వాళ్ళు గమనించాల్సినది యేమిటంటే, నాతో సహా సామాన్య హిందువులు ఎవ్వరూ రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి హడావిడి చేస్తే చాలుననే ఎత్తుగడని మెచ్చుకోలేరు.అక్కడున్న అసలు సమస్య ఆలయాల మీద ప్రభుత్వం యొక్క అతి పెత్తనం అయినప్పుడు దాన్ని పట్టించుకుని ఆలయాలని రాజకీయాలకి దూరంగా ఉంచడంలో నిజాయితీ చూపిస్తే టీడీపీ పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది.
హిందువులు ఇదివరకట్లా లేరు.2014లో జాతీయస్థాయిలో భాజపా గెలుపు ముస్లిముల్నీ క్రైస్తవుల్నీ బుజ్జగిస్తూ హిందువుల్ని పట్టించుకోని సెక్యులర్ పార్టీల మీద హిందువులకి ఉన్న కోపం వల్ల సాధ్యపడింది - మొదటిసారి హిందువులు ఓటుబ్యాంకుగా మారి తమకిష్టమైన ఒక పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.
ఏ ప్రాంతంలోనైనా సరే హిందువులు వోటుబ్యాంకుగా మారితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది బీజేపీకే లాభం.ఇవ్వాళ లింగాయతుల్ని రెచ్చగొట్టింది కాంగ్రెసు అయినా ముందుముందు వాళ్ళని తేలిగ్గా బీజేపీ లాక్కోగలదు - చూస్తూ ఉండండి!
తెదెపా తిరుమల విషయంలో తెలివిగా వ్యవహరించి సమస్యని సానుకూలంగా పరిష్కరించకపోతే అంధ్రాలో కూడా హిందువులు బలమైన వోటుబ్యాంకుగా మారిపోతారు - తస్మాత్ జాగ్రత్త!
ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ సమస్య కానే కాదు.ప్రతిపక్షం చేసే గొదవ ఎప్పుడూ ఉన్నదే గానీ ప్రజలు పట్టించుకోవటం లేదని అందరికీ తెలిసినదే అయినప్పుదు అనువు గాని సమయంలో తెగదెంపులు చేసుకోవడానికి సమబంధించి నా వూహ యేమిటంటే బాబుకీ మోదీకీ ఎగో ప్రాబ్లెంస్ వచ్చి ఉండాలి.కర్నాటక గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి బీజీపీకి నష్టం చేశాక మళ్ళీ కలవడం ఇక కుదిరే పని కాదు.2019లో ఓడిపోతే బీజేపీకి నష్టం ఏమీ లేదు.కానీ టీడీపీ ఐక మళ్ళీ కోలుకోలేదు!టీడీపీ ఓడిపోవాలని కోరుకునేటంత శాడిజం నాలో లేదు.ప్రజల్లో కూడా బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా బాబు నెట్టుకు రాగలడు అని నమ్మకం కలిగించిన చంద్రబాబు నాయకత్వ పటిమ గొప్పదే,అందులో సందేహం అక్కర్లేదు.
బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడానికి అన్ని గతిలేని పనులు చెయ్యాల్సి రావడం కాంగ్రెసు క్రమేణా బలం పుంజుకుంటున్నదనే దానికి సంకేతం - అది వాళ్ళకి అర్ధం కావడం లేదు!బండ పద్ధతుల్లో అప్పటికి అధికారం దక్కితే దక్కవచ్చు గాక,వాటి నుంచి పాఠం నేర్చుకోవటం లేదు వాళ్ళు.అధికారంలో లేని కాంగ్రెస్ ఏమి మంచి పనులు చేసిందని ప్రజలు కాంగ్రెసుకి అంత బలం ఇస్తున్నారు?తమ పట్ల వ్యతిరేకత కాదా!ఒక వోటరు తను వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషిస్తాడు,అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా రాకపోతే అందుకు కారణమైనవాణ్ణి మరింత ద్వేషిస్తాడు - ఇది జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే నిజం!2019 ఎలెక్షన్స్ బీజేపీకి నల్లేరు మీద బండి నడక కాదు - ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి.కర్నాటకలో మిగిలిన అన్ని అంశాలతో పాటు చంద్రబాబు స్టేట్మెంటు కూడా పనిచేసింది.ఎన్నికల తర్వాత 2014లో కన్న బలహీనపడినప్పుడు చంద్రబాబు అవసరం తప్పనిసరి!
అట్లాగే తెదెపాకీ 2019లో రాష్ట్రస్థాయిలో మెజారిటీ తెచ్చుకోవటం తెలిక కాదు.తెదెపా ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని బ్లేం చేస్తే సరిపోతుందని అనుకోకూడదు - నేనే అడుగుతున్నాను కదా,నాలుగేళ్ళు ఏం పీకారని!చాకిరేవు బాబు గారు తెదెపా వీరాభిమాని.అయనే తెదెపాకి ఉన్న సంస్థాగతమైన బలహీనతల్ని ఏకరువు పెట్టాడు.ఇట్లా ఎవరి బలహీనతలు వాళ్ళకి ఉన్నప్పుడు సాక్షాత్తూ తిరుమలనే రణరంగం చేసుకుని మొత్తం హిందూమతాన్నే భ్రష్టు పట్టించే స్థాయిలో అహాలకి పోతూ ఇద్దరూ నష్టపోయేకన్న ఎన్నికలకి ముందే విభేదాల్ని పరిష్కరించుకుంటే ఇద్దరూ లాభపడతారు.బీజేపీకి ఫర్వాలేదు గానీ కొడుక్కి తరిఫీదు ఇచ్చి చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిన సమయంలో అధికారం పోతే తెలుగుదేశానికి జరిగే నష్టమే ఎక్కువ.
కాబట్టి రాష్ట్రప్రభుత్వం రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి బీజేపీని ఎక్స్పోజ్ చేసి ఏదో సాదించుదాం అనే ప్లాను మానేసి శత్రువుని వూహించని చోట కొట్టి గెలవడానికి అంది వచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకుని చిత్తశుద్ధితో తిరుమలని రాజకీయాల నుంచి దూరం పెట్టడమే మంచిది.బీజేపీ కోరుకుంటున్నది రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో గెలవడం కాబోలు - దానికి సంబంధించిన బేరసారాల్లో చొరవ చూపిస్తే వాళ్ళు కూడా దారికి రావచ్చు.2014లో ఎన్నికల్లో బెండు కొట్టడాన్ని మర్చిపోయి వెంఠనే మిత్రపక్షం అయిపోవడమే అసలైన తప్పు,పదే పదే అన్యాయాలు జరుగుతున్నా పోరాటపంధాకి వెళ్ళకపోవడం తీవ్రమైన తప్పుఅన్నేళ్ళు ఆగినవాళ్ళు ఎన్నికలు నెత్తిమీదకి వచ్చిన సమయంలో తందరపడి ఒంటరి కావడం ఘోరమైన తప్పు - ఇన్ని తప్పులు చేశాక అహంకరించి ప్రయోజనం లేదు.ఈ రెండు పార్టీలూ ఒక్కటి కావటానికి చొరవ తెదెపా చూపించాలి, తెలివి భాజపా చూపించాలి!
ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారమే నడవాలి!ముస్లిం వక్ఫ్ బోర్డుకి నియామకాలు ఎలా జరుగుతాయో తెలుసా!అవి కూడ ప్రభుత్వ సంస్థలే, మెంబర్ల దగ్గిర్నుంచీ అన్ని స్థానాలకీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుని పేర్లని ప్రభుత్వానికి పంపిస్తే అనుమతులు మాత్రం ఇస్తారే తప్ప ఇలా పైనుంచి నియామకాలు జరపరు.వక్ఫ్ బోర్డులకి సంబంధించిన వివాదం ఏదన్నా వస్తే చాలు - అర్జెంటుగా స్పందించి వాటిని పరిష్కరించేసి వాళ్ళని సంతోష పెడతారు.మరి హిందూ ఆలయాల మీద మాత్రం అధికారుల పెత్తనం దేనికి?
భక్తుల విషయంలో ఉదారంగా ఉండాల్సిందే - బీబీ నాంచారు వల్ల కొందరు ముస్లిములకి కూడా తిరుమల ఇష్టమైనదే.ఆ మధ్యన ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి బంగారు పువ్వులు సమర్పించుకున్నాడని చదివాను.వాళ్లని మనం ప్రోత్సహించాల్సిందే!కానీ యాజమాన్యం, నిర్వహణ విషయంలో హిందూ మత సంప్రదాయాలు ఖచ్చితంగా అమలు జరగాలి.
ఇప్పటికిప్పుడు నేను క్రైస్తవం పుచ్చుకోగలను బాప్తిజం తీసుకుంటే చాలు!కానీ, చేరిన వెంటనే ఒక చర్చి మీద పెత్తనాన్ని నాకు అప్పగిస్తారా?కనీసం బ్రదర్ హుడ్ అయినా వెంటనే ఇవ్వరే?బైబిలు మీద అధికారం కావాలి,ఇతరుల సందేహాలకి జవాబులు చెప్పే పాండిత్యం లేనిదే ఫాదర్ అవ్వలేను కదా!ఇక్కడ ఆ పాండిత్యం బ్రాహ్మణులకి ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా?సందు దొరికింది గదాని రమణ దీక్షితుల్ని ఆడు,ఈడు అంటున్నవాళ్ళు హిందువులేనా?
ప్రముఖమైన ఆలయాలు పదే పదే వివాదాలకు గురి కావడంలో బ్రాహ్మణుల పాత్ర కూడా ఉంది - నా తీర్పు ప్రకారం వారి తప్పే ఎక్కువ!కొన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణులు కొత్తదనానికి దూరమైపోయారు.తొలినాడు ఆలయనిర్మాణం అనేది చాలా శాస్త్రీయమైన పద్ధతిలోనే చేశారు.దానికి వాటి నిర్మాణంలో వాడిన సాంకేతికతయే సాక్ష్యం!కానీ కాలం గడిచే కొద్దీ ఆలయాలకు అంటిపెట్టుకుని అక్కడ దక్కుతున్న సంపదకీ ఐశ్వర్యానికీ దాసులైపోయి ప్రజల మీద పెత్తనం చెయ్యడం కోసం రాజులకి ఉపాయాలు చెప్పడానికీ,మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసి ప్రజల్ని తమకి విధేయులుగా ఉంచుకోవడానికీ తమ జ్ఞానాన్నీ కొన్ని శతాబ్దాల విలువైన కాలాన్నీ వృధా చేసేశారు.
ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, జ్యోతిషం, వ్యవసాయం, యంత్రవినియోగం వంటివాటిలో గత వెయ్యేళ్ళలో ఏమి విప్లవాత్మకమైన కృషిని చేశారు వీరు?అన్నీ వేదాల్లో ఉన్నాయి అనే పాత గొప్పల్ని చెప్పుకుంటే ఎవడు వింటాడు?ఎంత కాలం వింటాడు?వేదాల్లో ఉంటే మరి ఎందుకు వినియోగం లోకి తీసుకురాలేదు?నాకు తెలిసినంత వరకు భారత దేశంలో వరాహ మిహిరుడే ఆఖరి శాస్త్రవేత్త - తర్వాత శాస్త్రవేత్తలు ఎందుకు పుట్టలేదు?భక్తియార్ ఖిల్జీ వల్ల చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే!కానీ తిరిగి వైభవాన్ని పొందడానికి జరిగిన కృషి ఎక్కడ!ఇప్పటికీ మనదైన శాస్త్రవిజ్ఞానం అనేది రూపొందాలంటే అది బ్రాహ్మణుల వల్లనే సాధ్యం!
మూర్త్యార్చన అనేది భగవంతుణ్ణి చేరడానికి ఉన్న అనేకానేకమైన మార్గాలలో ఒకటి మాత్రమే - అది నాకు స్పష్టంగా తెలుసు.కాబట్టి బ్రాహ్మణులు ఆలయాల చుట్టూ పెనవేసుకుని రుబ్బురోలు పొత్రాల మాదిరి అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చోకుండా సమాజంలోకి రావాలి, ఇతరులకి వేద విజ్ఞానాన్ని పరిచయం చేసి బ్రాహ్మణేతరులకి కూడా ఇది కేవలం బ్రాహ్మణుల కోసం పుట్టిన మతం కాదు నాకు కూడా ఈ మతాన్ని రక్షించే బాధ్యత ఉంది అనే ఆప్యాయతని పెంచాలి!ఒకప్పుడు భక్తి ఉద్యమం, ఆర్యసమాజం వంటివి విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చాయి.కానీ వాటిని కూడా మళ్ళీ ఈ రొచ్చులోకి లాగేశారు.ఈసారి ఆ పొరపాటు చెయ్యకుండా నిజమైన వైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యగలిగితేనే మీరు ధర్మాన్ని నిలబెట్టినవాళ్ళు అవుతారు.లేని పక్షంలో బ్రాహ్మణులు చరిత్రహీనులు కావడమే కాదు హిందూమతం కూడా అంతరించి పోతుంది!
ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని పూర్తిగా ఎత్తెయ్యటం సాధ్యపడేది కాదు,ముస్లింల వక్ఫ్ బోర్డులు కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలే!ధర్మకర్తల అధీనంలో ఉన్నప్పుడు దేవదాసీల పేరుతో వ్యభిచారం, నరబలుల వంటి మూఢనమ్మకాలూ, ధర్మకర్తల అక్రమాలూ అందుకు పూజార్లు కూడా సహకరించటం లాంటివి వెలుగులోకి వచ్చాకనే తప్పనిసరై జోక్యం చేసుకుని ప్రభుత్వం కిందకి తెచ్చారు.కోర్టులు కూడా ప్రభుత్వ జోక్యాన్ని సమర్ధిస్తూ తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది.అన్ని వైపుల నుంచీ పరిశీలించకుండా నేను ఏదీ మాట్లాడను.హిందూ ఆలయాలని మళ్ళీ ధర్మకర్తల కాలానికి తీసుకెళ్ళాలని నేను అనుకోవడం లేదు.ఆలయాలు సర్వస్వతంత్రమైన స్వేచ్చా మందిరాలు అయితే అది అరాచకానికి దారి తీస్తుంది.
బోర్డు సభ్యులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి - రోజువారీ నిర్వహణకు కావలసిన యంత్రాంగం, సామగ్రి, మార్గదర్శకాలు భక్తుల నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అమరితే మంచిది.స్వామికి జరిగే కైంకర్యాలు మొత్తం ఆగమ శాస్త్రాల ప్రకారం నిష్ఠగా జరగాలి.ఏదైనా అక్రమం జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే చట్టం ద్వారా సరిదిద్దడం వంటివాటికి ప్రభుత్వం పరిమితం అయితే బాగుంటుంది.అంతకన్న ఎక్కువ కోరుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెరవేరడం కష్టం!