Saturday, 28 February 2015

ఔరా అయిలయ్య మాస్టారూ!యేమి చెప్పినారు సారూ?

          కొందరి మాటలు వింటుంటే యెంత మంచిగా కనిపిస్తున్నా బండబూతులు తిట్టబుద్దేస్తుంది!కొందరి మాటలు వింటుంటే యెంత వెధవలా కనిపిస్తున్నా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది?కానీ కంచె ఐలయ్య మాస్టారు వున్నారే ఈయన్ని మాత్రం ఒకేసారి రెండూ చెయ్యాలనిపిస్తుంది?!మన్లో మన మాట, చూట్టానికి వెధవలా కాకుండా జీనియస్ లాగానే కనపడతాడు లెండి!

          ఇవ్వాళ ఆంధ్రజ్యొతి డైలీలో "అమ్ముడుద్యమం" అని ఒక వ్యాసం రాశాడు,రెండు రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళూ తప్పకుండా చదవాల్సినది!నేను గతంలో ఒకసారి ఈయన్ని గురించే చాలా ఘాటుగా రెండు పోష్టులు వేశాను,కాకపోతే నాకు ఆయనంటే ద్వేషముండి కాక అప్పుదు ఆయన చెప్పిన పాయింటు చెత్తగా అనిపించటం వల్ల ఆ తప్పునే పట్టాను తప్ప ఆయన విశ్లేషణ లన్నీ చాలా శ్రధ్ధగా చదివే వాణ్ణి మొదటి నుంచీ!

          "బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?!" అనే నా పాయింటు కరెక్టే గాబట్టి విమర్శించినందుకు పశ్చాత్తాపం యేమీ లేదు గానీ వ్యక్తిగతంగా నాకు ఆయనంటే ద్వేషం మాత్రం యెప్పుడూ లేదు.

          ఆయన వాడే పదాలూ ఆ పదాల వెనక క్రమంగా పేర్చుకొస్తున్న భావం నిజంగా నెమ్మది నెమ్మదిగా యెక్కి యెక్కేటప్పుడు కాస్త ఇబ్బంది పెట్టినా తట్టుకుంటే రోగం పూర్తిగా కుదిర్చే ఇంట్రావీనస్ ఇంజెక్షన్ నరాల్లోకి జరజర పాకుతున్నట్టుంటుంది చదువుతుంటేనే!కులం అనే అస్తిత్వం ఆసేతుశీతనగం భారత ప్రజానీకంలో యెంత ప్రముఖ పాత్ర వహిస్తున్నదో ఈయనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో?మోదీ గుజరాతు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే భవిష్యత్తులో ప్రధాన మంత్రి అవుతాడని జోస్యం చెప్పాడు ఆధారాలూ లెక్కలతో సహా!

          ఆంధ్రప్రదేశ్ రాష్త్ర విభజన కోసం జరిగిన వుద్యమం లోని డొల్లతనాన్నీ విభజనాంతరం తెలంగాణంలో నడుస్తున్న నాటకాన్నీ ఒక సుప్రీం కోర్టు జడ్జి అప్పీలుకి కూడా వీలు లేకుండా ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంటు లాగ చెప్పాడు!"ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వృధ్ధిరేటు గణాంకాలు 2012-2013 సంవత్సరం కంటే ఆ జిల్లాల్లో 2014-2015ల్లో బాగా పెరిగింది అని తేల్చాయి. తెలంగాణ అభివృధ్ధి పరిస్థితి ఏందో ఇక్కడి ప్రభుత్వం చెప్పడం లేదు.కామన్ సెన్సు వున్న ఎవరికయినా అర్ధమయ్యేదేమిటంటే  2013-2014 సంవత్సరం కంటే 2013-2014 అభివృధ్ధి రేటు తెలంగాణలో బాగా తగ్గింది.గత రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ ఇండస్ట్రియల్ కీలక ఉత్పత్తి సంస్థలు పూణే,బెంగుళూరు వంటి చోట్లకి తరలి పోయాయి"

          మచ్చుకి ఒక గొప్ప సుభాషితం - "పెట్టుబడిని కోపం వచ్చినప్పుడు తిట్టి,అవసరం వచ్చినప్పుడు పొగిడితే అది తిట్టినప్పుదు వెళ్ళిపోయి పొగిడినప్పుడు తిరిగి రాదు. రాజకీయ,ఆర్ధిక రంగాలు పగటి భాగోతాలు కావు కదా!అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను అని వూరికే అన్నారా?ఆ మనిషి అట్లా గాలి పోగేసి మాట్లాడుతుంటే, ఆ మాటలు కూడా విన్నవాళ్ళు ముఖ్యమంత్రి గదా అని ముఖం మీద నవ్వకుండా సీరియస్సుగా వింటున్నట్టు నటించి పక్కకెళ్ళి నవ్వుకునేలా వుంటే  ఆయన గారి వీరభిమానులు మాత్రం "మా ముఖ్యమంత్రి యెంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి,అంతా యెంత నిశ్శబ్దంగా చెవులొగ్గి వింటున్నారో చూడండి"  అని పులకించి పోతున్నారు!

  మరో అద్భుతమయిన పరిశీలన యెంత నిక్కచ్చిగా విశ్లేషించి చెప్పాడో వినండి - "నేను చాలా కాలంగా తెలంగాణ ఫ్యూడలిజానికి అభివృధ్ధి కాముక అడ్మినిస్ట్రేటివ్ విలువలు లేవని చెప్పింది ఈ లక్షణా లన్నిటినీ దృష్టిలో పెట్టుకునే. పెట్టుబడికి కొనుక్కునే లక్షణం ఉంటే ఫ్యూడలిజానికి అమ్ముకునే లక్షణం ఉంటుంది." ఏమి పోటు పొడిచారు మాస్టారూ!ఇదే ముక్క ఆంధ్రజ్యొతి రాస్తే "పచ్చ మీడియా విషం కక్కుడు" అని పేరు పెట్టి బూకరించేసేవాళ్ళు వందిమాగధులు?

          "తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టటాన్ని దేశ స్వాతంత్ర్యంతో పోల్చారు.విడిపోవాలా వద్దా అనే అంశంపై ఒక రెఫరెండం వంటిది పెట్టి శాంతియుత వాతావరణంలో చర్చ జరక్కుండా చేశారు.ఇప్పుడు రాష్ట్రం రాగానే సంవత్సరం కూడా తిరక్కముందే భూములు,బంగ్లాలు,చెరువులు,సెక్రటేరియట్ సహా అమ్మితే తప్ప వ్యవస్థను నడుపలేమని తేలుస్తున్నారు." - నేను ఈ ముక్కకి దగ్గిరగా వుండే మాట ఒకటి భవిష్యత్తులో నిజంగా అలాగే జరిగిన యెంతో వాస్తవికమైన ఆధారాలతో ఒపిగ్గా పాయింట్ బై పాయింట్ చెప్తూ ఒక విశ్లేషణ వుద్యమ సమయంలోనే "ధర్మమేవ జయతే" బ్లాగులో వేస్తే ఆ కామెంటు పబ్లిష్ చెయ్యనేలేదు, అడ్మిన్ హోదాలో చదివినా ఆ లాజిక్ అర్ధమవలేదో,అర్ధమయినా తొక్కలే ఇలాంటివి చాలా విన్నాం అనుకున్నారో?! "ఆర్టికిల్ మూడు వుంది కదా అని మీరు మొండిగా అటువైపుకే వెళ్తున్నారు తప్ప దాని పరిణామాలు యేమిటో తెలుసుకోవడం లేదు.ఆఖరికి ఆంధ్రా పొలిటీషియన్లని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు,వాళ్ళు అడ్డం తిరిగి ఈ విభజన మాకు ఇష్టం లేకుండా జరుగుతున్నది గాబట్టి మాకు ఎక్స్ట్రా తాయిలాలు కావాలని అడిగి సాధించుకుంటూ మిమ్మల్ని కార్నర్ చేసినా చేస్తారు.ఆఖరి నిముషం వరకూ అసలు తెలంగాణా వస్తుందా రాదా అనే టెన్షన్ పుట్టించి యేదో ఒక విధంగా వస్తే చాలుననే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళదం ద్వారా మీకు అన్యాయం జరగవచ్చు,కొంచెం నిదానంగా ఆలోచించండి, సయోధ్యగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపాదించి జరిగే చర్చల ద్వారా సాధిస్తేనే మీకు మంచిది" అని వివరంగా చెప్పాను!యెంత సేపూ మేమిక్కడ అంకెకి తక్కువున్నాం, మా మాట ఇక్కడ నెగ్గదు అనే పిడివాదమే తప్ప ఒకడు బలమయిన పాయింటుతో వస్తే వందమందినైనా నోరు మూయించ వచ్చు, అక్కడ అన్యాయమే జరిగితే ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కదా ఆప్పుడే ప్రజలకి ఇదిగో యెంత దుర్మార్గంగా వున్నారో చూడండని వుద్యమాన్ని ఇంకా బలోపేతం చెయ్యవచ్చు అనే సూటి దారి గురించి ఒక్కడు కూడా ఆలోచించ లేదు?

          ఆయన గారు ఆర్టికిల్ మూడు+విలీనం ఒప్పందం అనే దగుల్బాజీ ప్లానుతో వచ్చి మిగతా వాళ్ళు "అట్లెట్ల వస్తది?" అంటే "ఇట్లిట్లె వస్తది!" అని చెప్పిన తెచ్చిన అని డప్పు కొట్టుకోవటం, వీళ్ళు ఆయనకి పల్లకీలు మొయ్యటం తప్ప చక్కని రాజమార్గం వొదిలి సందుగొందులు తిరిగి బంగారు తెలంగాణ మంటూ కంగారు తెలంగాణ తెచ్చుకున్నరు?23 జిల్లాలకి వేసిన లక్ష కోట్ల బడ్జెట్ 10 జిల్లాలకి వేశాడు!నికర ఆదాయం 6000 కోట్లు మాత్రమే అని అధికారికంగానే చెప్తున్నాడు?అది కూడా ఈ భూముల అమ్మకం ద్వారానే అట!ఇంతకీ అధికారులు నిక్కచ్చిగా లిటిగేషన్లు లేని భూమి యెంత అని ఆరా తీస్తే,జాగ్రత్తగా వినండి - కేవలం 9 యెకరాలే?!వాటిని వేలం వేస్తారట,బాబోయ్ ఆర్ధిక శాస్త్రంలో బేసిక్స్ కూడా తెలియని నాకే గుండె గుభేలు మంటున్నది మిగతా లోటు యెలా పూడుతుంది అని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి వీరభక్తులలో మాత్రం చీమ కుట్టినంత కదలిక కూడా లేదు. భవిష్యత్తు గురించి సరయిన అవగాహన లేని అజ్ఞానం లోనూ యేది యేమయినా సరే అది లేందే బతకలేననే స్థాయిలో ఒక దానిపట్ల కలిగే అమిత వ్యామోహం లోనూ ఒక వ్యక్తి పట్ల విపరీత స్థాయిలో వుండే ఆరాధన లోనూ అంత ధీమా వుంటుంది గాబోలు! పోనీ హడావిడి చేసి అన్ని దేశాలూ తిరిగి పెట్టుబడులు సాధించుకొచ్చాడా నిబ్బరంగా వుండటానికి అంటే ఒకే ఒక్కసారి సింగపూరు వెళ్ళాడు - అదీ వాళ్ళు తోడుగా వస్తామని అన్నా వొద్దని రోడ్డు మీద కారులో రయ్యిమని దూసుకుంటూ వెళ్ళి బిల్డింగుల్ని బయటి నుంచి చూసే సమస్తం గ్రహించేసి ఇక్కడ పెద్ద ట్రావెలాగ్ పురాణం విప్పాడు తప్ప యెంత స్థాయిలో పెట్టుబడులు తెచ్చాడు అనే లెక్క మాత్రం యెవరికీ తెలియదు!లోతుగా వెళ్ళకుండా పైపైన చూసినా కనపడే అంత పెద్ద బొక్క యెట్టా పూడుద్ది, ఆదాయం యెక్కణ్ణుంచి వచ్చుద్ది? తన సొంత మొక్కులూ ప్రభుత్వ ఆదాయంలోనే తీర్చాలి,అల్లుడు శీను చెప్పిన 200 సంక్షేమ పధకాలకీ దాంట్లోంచే వెసులుబాటు చెయ్యాలి, హుస్సేను సాగర్ దగ్గిర్నుంచీ కాకతీయ పధకం కింద రాష్త్రంలో వున్న చెరువుల్ని బాగు చెయ్యటానికీ అందులోంచే సర్దాలి.అడగని వాడిది పాపమన్నట్టు వాగ్దానాలు చేసిన భవంతులకి పదేసి కోట్లూ అందులోంచే సర్దాలి - యేంటండీ ఇదంతా!

          "ఉన్న వనరుల్లో ఉద్యోగులకు,ఆర్గనైజ్డ్ సంస్థలకు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు" అని ఇప్పుదు విమర్శించే ఐలయ్య గారే తన కులభవనానికి ఇచ్చినప్పుదు మాత్రం "మంచి పని చేసిండు!" అని ఆకాశాని కెత్తడం చూస్తుంటే చాలా ముచ్చటగా వుంది నాకు?బ్రాహ్మణ వర్గం వాళ్ళు అస్పృశ్యతనీ వాళ్ళ దేవుళ్ళనీ మామీద రుద్దారు అని తను క్రైస్తవ మతంలో వుండి కూడా తన తాత దేవుడై హిందూ ఆచారం ప్రకారం చిన్నప్పుడు తన అమ్మ అక్కడ తలనీలాలు తియించడం గురించి గొప్పగా చెప్పుకుని ఆయన తాత పేరు పెట్టుకున్న వాళ్ళని మంచోళ్ళనీ అలా పెట్టుకోకుండా "గణపతి" అనే సమూహానికి అధిపతి అనే అర్ధం వచ్చే పేరుని పెట్ట్టుకున్న మావోఇష్టుకి కూడా అగ్రకుల దురాంకారం అంటగట్టిన తన స్వభావం కూడా ఆ ఫ్యూడల్ సంస్కృతినే ప్రతిబింబిస్తున్నదని తనలోకి చూసుకునే అలవాటు లేకపోవడం వల్ల తనకి తెలియక పోవచ్చు గానీ చూస్తున్న మనం గుర్తు పట్టలేమా!

          ఒక వెలమ ఫ్యూడలిష్టుని ఒక దళిత ఫ్యూడలిష్టు విమర్శిస్తున్నాడు,మజ్జారే!?పరులెవ్వరైన ఇంత ధాటిగ విమర్శించ గలరా, నిస్సీ?!అందుకే కాబోలు దానవీరశూరకర్ణ సైన్మలో ధూళ్ళిపాళ్ళ మావయ్య "వజ్రాన్ని వజ్రంతొనే ఖోయవలె,ముల్లును ముల్లుతోనే థీయవలె" అని అంత ఘట్టిగా నొక్కి వఖ్ఖాండ్రించాడు!వీళ్ళిద్దరే కాదండి తెలంగాణంలో చిన్నా పెద్దా కత్తీ సుత్తీ డక్కా డవాలు అతిఘోర వుద్యమ నేతల్లో చాలామంది ఫ్యూడలిష్టు మనస్తత్వంలో వున్నవాళ్ళే!అది మనస్తత్వం అని లెక్కేసుకుంటే ఆర్ధిక అంతరువులతో సంబంధం లేకుండా యెవరిలోనైనా వుండొచ్చు - అవునా కాదా?ఈ రెండు రాష్ట్రాలూ యేర్పడిన కొత్తల్లొనే ఒక బ్లాగులో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ రాష్త్రానికి కొత్తగా అమిరిన 24X7 ప్లాను కేవలం ప్రతిపాదన వచ్చాక మొదటి వాయిదా లోనే చాన్సు ఇవ్వటం తప్ప బాబు పైరవీ వల్ల రాలేదు అనే పాయింటు మీద ఒకానొక చారిగారు ఆధారాల కోసం,లింకుల కోసం వెంటపడి వేధించి మళ్ళీ వాటిని వెతికి చూపించే వరకూ యెదటి వాళ్ళని అంటే మమ్మల్ని యెంత హింస పెట్టాడో మళ్ళీ తన కామెంటుకి సంబంధించి నిలదీస్తే మా ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు, యెవరూ ఖండించ లేదు గాబట్టి అది నిజమే అనేసుకోండి,నా దగ్గిర అంతకన్నా ఆధారాలు లేవు అని అంత నిర్లక్ష్యంగా జవాబు చెప్పడం పెత్తందారీ తనం కాదా!సాక్ష్యానికి ఈ వుదాహరణ చెప్పానే గానీ ఐలయ్య గారి వాదన ప్రకారం ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్యూడలిష్టు అయితే అతన్ని తమకి అభేదంగా చూసుకుంటూ అభిమానించే వాళ్ళు ఫ్యూడలిష్టులు కాకుండా వుంటారా?

          అసలు గతంలో ప్రామాణిక తెలుగు గురించి ప్రస్తావన రాగానే కాళోజీ దగ్గిర్నుంచి అందరూ "ఆ రెండున్నర జిల్లాలోళ్ళు ఆ రెండున్నర జిల్లాల భాష రుద్దుదమని చూస్తున్రు" అని యెగ్గెగ్గెరి గంతులేసి దాన్ని చెగొట్టేశారు!కృష్ణా గోదావరి జిల్లాల వాళ్ళకి తమ మాండలికం మీద ప్రేమ లేకనా దాన్ని ప్రతిపాదించింది?తెలంగాణ లోనే యే రెండు జిల్లాల వాళ్ళూ తమ శుధ్ధ మాండలికంలోనే మాట్లాదల్చుకుంటే ఒకడు చెప్పింది మరొకడికి పూర్తిగా అర్ధమవుతుందా?సరే అప్పటి విషయం పోనివ్వండి, ఇప్పుడు అందెశ్రీ గారు రాసిన వాళ్ళ రాష్ట్ర గీతం ఆ శుధ్ధాంధ్రంలోనే యెందుకు వుండింది?నాకు మాత్రం దెంచనాల శ్రీనివాస్ గారు రాసిన భస్మ సారంగి కవిత అయితే తెలంగాణ సామాన్య ప్రజల గురించి అద్భుతంగా కీర్తించడం వల్ల ఇప్పటిదాని కన్నా గొప్పగా వుండేదనిపించింది!పోనివ్వండి వాళ్ళిష్టం మన కెందుకొచ్చిన గోల?కానీ మా అంతట మాకు తోస్తే తప్ప నువ్వు చెప్తే మేము వినాలా అని గాకపోతే అప్పుడు ప్రస్తావించిందీ ఇదే గదా!

     ఇంకా ఘోరమయిన విషయ మేంటో తెలుసా?"ఆంధ్రప్రదెశ్ సమైక్య రాష్ట్రంగా యేర్పడ్డాక నీలం సంజీవరెడ్డి,కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలుకొని ఎన్.టి.రామారావు వరకూ. మనమెవరినైతే ఆంధ్ర దోపిడీ ముఖ్యమంత్రులని తిట్టామో వాళ్ళు హైదరాబాదులో ఒక్క ప్రభుత్వ బంగ్లానంటే ఒక్కదాన్ని కూడా అమ్మిన దాఖలాలు లేవు.చివరికి నిజాము ఇంటిగా ఉన్న కింగ్ కోఠీ బంగ్లా ఆ రోజుల్లో అమ్మాలంటే,ఆనాటి విలువతో పోలిస్తే చాలా డబ్బే వచ్చేది.కాని వాళ్ళు అమ్మలేదు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ళలో ఇక్కడ ఉండదు.సెక్రటేరియట్లో ఎన్నో పెద్ద పెద్ద బంగ్లాలు ఖాళీగా ఉంటాయి.పది జిల్లాల తెలంగాణ ప్రభుత్వం ఆ బంగ్లాల్లో క్రికెట్ ఆడుకునేంత స్థలం ఉంటుంది.వాటన్నిటికీ వాస్తు బాగలేదని చెప్పిస్తారు.అమ్మకానికి పెడతారు.గిదే ఫ్యూల్ తెలంగాణ పాలక వర్గం.ఇప్పుడు వాస్తు బాగుండదు.రేపు దయ్యం పడుతుంది." అంటున్నాడు ఐలయ్య గారు!నేనింకా మొదట్లో అమాయకంగా కొద్ది మందికి అంత పెద్ద భవనం దేనికని అనుకున్నాడేమోలే ఒఖప్పుడు 23 జిల్లాల జనం కళకళ్ళాడుతూ తిరిగిన చోట 10 జిల్లాల జనం తిరుగుతూ బోసిపోయినట్టుండి బెంగగా అనిపించి పాతరోజులు గుర్తుకొస్తాయని ఇబ్బంది పడి మారుస్తున్నాడేమో ననుకున్నా,పిచ్చి పుల్లయ్యని!

          ఈ ఆమ్మకాల ప్లాను వెనక వున్న జ్వాలాదీప రహస్యం కూడా చక్కగా విప్పి చెప్పాడు!"యెన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి,ప్రతి బీద కుటుంబానికి(దళిత,దళితేతర) ఒక రెండు గదుల ఇల్లు,ప్రతి పించను దారుకు నెలకి 100 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది.ఇవి ఇస్తామని నమ్మించాలంటే ఆదాయం లేకపోయినా పెద్ద బడ్జెట్ పెట్టాలి.అందులో చాలా లోటు చూపెట్టాలి.లోటు తీర్చడానికి భూములమ్మాలి.తెలంగాణలో ప్రజల ఉనికి,అభివృధ్ధి,ప్రజా సంక్షేమం కొత్తకోణం నుండి జరుగాలంటే నగర నడిబొడ్డు ఆస్తులు అమ్మడం తెలంగాణ ప్రజల కోసమే అంటే ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు,ఇంకొంత కాలం ఉంటారు.ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి లక్షకోట్ల బడ్జెట్ పెట్టి అంత డబ్బు వస్తుందని చూపించదానికి ఆయన ప్రభుత్వ భూముల్ని హైదరాబాద్ నడిబొడ్డులో వేలం వేసి ఆర్టిఫిషియల్ కొనుగోళ్ళు చేయించి దానితో ఒక రియల్ ఎస్టేట్ బూం సృష్టించారు.రామలింగరాజు కొంప ఆ బూంలో మునిగిందే.అదే మోడల్ లో ఇంత చిన్న రాష్ట్రానికి అంత పెద్ద బడ్జెట్ పెట్టి రూ.6000 కోట్లు భూములమ్మడం ద్వారా రాబడతామని అధికారులకు అమ్మక భూములు వెతికి పట్టుకోండి అని ఆదేశిస్తే లిటిగేషన్ లేని భూములు దాదాపు 9 ఎకరాల వరకు మాత్రమే ఉన్నదని తేలిందట."యేమి ప్లాను,యేమి ప్లాను - అయ్యబాబోయ్!ఐలయ్య ఒక్కడే కాదు గదా చాలామంది ముందునుంచీ విమర్సిస్తున్నారు, అయునా అటువైపు నుంచి సమర్ధన రావడం లేదేంటి ఇంకా?యేం చెబుతారు!బహుశా మమ్మల్నిట్లా భూములమ్ముకునే స్థితికి తీసుకెళ్ళింది ఆంధ్రోళ్ళే,ఇప్పుడు మా తంటాలు మేం పడుతుంటే గోల చేసి అది కూడా చెయ్యనివ్వడం లేదని అంటారేమో?అధికారంలో ఉండి ఉత్త మాటలు చెప్పకుండా లెక్కల్ని పుట్టిస్తున్నారేమో!

          "ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మధ్య ఇప్పుడు తేడా యేమంటే విడిపోతే బాగుపడతామని ప్రజలకు తెలంగాణ వాదులు చెప్పారు.ఆంధ్ర అభిమానులు విడిపోతే చెడిపోతామని ప్రజలకు చెప్పారు.విభజన జరిగిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ ప్రభుత్వం అమ్ముడుద్యమం మొదలెట్టింది.ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచమంతా తిరిగి పెట్టుబడుల గుడ్ విల్ సమీకరించే స్థితిలో ఉన్నది.కాని తెలంగాణ రాష్ట్రానికి ఆదుకునే గుడ్ విల్ కూడా లేదు." - గుడ్డు విల్లు యెట్టా ఉంటుంది? ఇట్టాగే కావాలని యెట్టా రప్పించుకుందామని అనుకున్నారో అట్టానే వొచ్చింది! ఆంధ్రోళ్ళకి వాళ్ళని మట్లాడనివ్వకుండా ఇచ్చేశారనిపించి జాలితో కూడిన మంచిపేరూ తెలంగాణోళ్ళకి హైదరాబాదు వాటాలో కనీసం న్యాయమైన వాటా కూడా ఇవ్వకుండా ఆంధ్రోళ్ళని తన్ని తగిలేశారనే పొగరు లాంటి చెడ్డపేరూ వొచ్చింది?!భగవంతుడు ఇప్పటి నవ్యాంధ్ర ప్రజల పట్ల యెంతటి దయ చూపించాడు!వీళ్ళిప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఇంత గొడవ చేసి విడిపోకపోయుంటే అనంతకాలం వరకూ వీళ్ళతో యెన్ని అగచాట్లు పడుతూ ఉండేవాళ్ళమో గదా!

          జరీబు భూములకి పరిహారం పెంచి రాజధానికి భూములు ఇవ్వం అని ఇప్పటిదాకా బిగిసిపోయి వున్నవాళ్లని కూడా మెత్తబడేటట్టు చేస్తున్నాడు ఇప్పటి ఆంధ్రప్రదెశ్ ముఖ్యమంత్రి. జూన్ నెలలో కొత్త రాజధానికి శంకుస్థాపన ఖాయం అంటున్నారు.పచ్చని పంటపొలాలు మనకున్నాయి.మన మనసుల్లో కష్టించే తత్వముంది.మన బుధ్ధిలో చురుకుదనముంది."జోర్ సెయ్. బారు సెయ్.కోటిపల్లి రేవుకెయ్.కోనంగి రేవుకెయ్"  అనే హుషారైన పాటలు మళ్ళీ వినబడతాయి, అద్దిర బన్నా గువ్వల చెన్నా!


దుష్టాంగం దానంతటదే వూడిపోవటం యెంత అదృష్టం?!

Wednesday, 25 February 2015

రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు!

శ్రీ గురుభ్యోః నమః
శిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత మరికొన్ని ప్రశ్నలు సిధ్ధంగా వున్నాయి!

హరిశ్రీ:నాకు తెలుసు!నేను మాట్లాడే(పోష్టులోకి యెక్కించే) ప్రతి అక్షరమ్ముక్కా బాగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆ విషయమ్మీద నా పాత అభిప్రాయాలకి యేమయినా తేడాగా వుంటుందా అని మనస్సులోనే చెక్ చేసుకుని మరీ పోష్టులోకి యెక్కిస్తాను!మొదటి విషయం ఒక పాత పోష్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని  మొదట ప్రపంచంలోనే అపురూపమైన రాజధాని ప్రతిపాదించినప్పుడు అద్భుతం అని ప్రశంసించి ఆ తర్వాత అదే ముఖ్యమంత్రిని అదే విషయం గురించి యేకి పారెయ్యడం గురించినది - అవునా?

శిష్యుడు:అవునండి,దానికి మీరు అప్పుడే జవాబు చెప్పినారు - కానీ ఫైనలుగా ఒకసారి చెప్తే ఇదే ఆఖరు మాట అవుతుంది. మరి చెప్పండి!

హరిశ్రీ:ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయ జీవితం కాంగ్రెసులో మొదలైంది!ఆ పాత వాసనల్ని అతను పూర్తిగా వొదిలించుకోకుండానే మామగారి పార్టీలోకి యెకాయెకిన జంపయ్యాడు?అదీ యెప్పుడు,మామగారు పార్టీ పెట్టినప్పుడూ రాలేదు,ఆ పార్టీని ప్రజలు అప్రతిహతంగా ఆదరిస్తున్నప్పుడూ రాలేదు,యెన్నికలు దగ్గిర పడి దాదాపు ఒక ప్రభంజనం లాంటి కుదుపు వస్తున్నదని అందరూ వూహిస్తున్నప్పుడూ రాలేదు,తీరిగ్గా ఫలితాలు తెలిశాక మామగారి పార్టీ అధికారం యేర్పాటు చెయ్యటం ఖాయం అని తెలిశాక చేరాడు!అది కాంగ్రెసు లక్షణం!అందరు కాంగ్రెసు వాళ్లలో లాగే అందరూ తన చుట్టూ తిరుగుతూ వుండాలనే సరదా వుంది.ఆ సరదా కోసం పార్టీని బలమయిన అంకితభావం గల కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దడంలో అద్భుతంగా కృతకృత్యు డయ్యాడు!లక్ష్మీపార్వతి రంగప్రవేశంతో దృశ్యం హఠాత్తుగా మారిపోయింది, అప్పటిదాకా తనచుట్టూ తిరిగే జనాలంతా ఆవిడ కేసి పరిగెత్తారు!తను పోగొట్టుకున్న స్థానాన్ని దక్కించుకోవటానికే అంత భీభత్సమయిన ప్లాను వేసి ఆవిణ్ణి దుష్టశక్తిగా వర్ణించి సాక్షాత్తూ పార్టీ వయ్వస్థాపక అధ్యక్షుణ్ణే అతని వైపు నుంచి వాదన చెప్పుకునే అవకాశం కూడా లేకుండా  బహిష్కరించ గలిగాడు?!నిజంగా ఆవిడకే గనక వీళ్ళు ఆపాదించిన రాజకీయం తెలిసి వుంటే భార్య స్థానంలో వుండటం వల్ల పెద్దాయన చేతి మీదుగానే వీళ్ల నందర్నీ భూస్థాపితం చెయ్యగలిగి వుండేది!యెదటివాళ్ళతో ఒక పదినిముషాలు మాట్లాడితే చాలు యెలాగోలా బురిడీ కొట్టించి తన పాయింటే కరెక్టని వొప్పించి దారికి తెచ్చుకోగలడు - ఆ ప్రజ్ఞలో ఇతను దుర్యోధను డంతటివాడు!

కానీ యేమి లాభం?రామహత్యాపాతకం వల్లనో యేమో ఇతని హయాములో వానలు కురవలేదు.ప్రపంచ మంతట్నీ చూసి ఐటి బూం హైదరాబాదుకుకి రప్పించటంలో తను మునిగి పోతే రైతులూ నేత పని వాళ్ళూ అంతా దివాళా తీసి అప్పుల పాలయ్యారు.వాళ్ళ సమస్యల్ని అవకాశంగా తీసుకుని రోగశేఖరు డొకడు పాదయాత్రలు చేసి ప్రజాభిమానం సంపాదించుకుని అధికారం లోంచి ఈడ్చి తన్నేశాడు?తొందరగా చెడ్డపేరు పోగొట్టుకుని బాగా పేరు తెచ్చుకోవాలనే దురదతో ప్రభుత్వాధికారుల్ని మరీ అతిగా నేను నిద్రపోను మీరూ నిద్రపోవద్దనేటంతగా రుద్దడంతో అన్నీ అవతలోడికి కలిసొచ్చి తను వీధిన పడ్డాడు!కొంచెం సానునయంగా ఆత్మహత్యలు చేసుకునే సామాన్యుల్ని ఓదార్చి అయ్యా బాబూ అని ప్రజల్ని పలకరించి వోదార్చి ధైర్యం చెప్పి వుంటే అధికారం పోయి వుండేది కాదేమో?అప్పుడు పోయిన అధికారం మళ్ళీ ఇన్ని దఫాలుగా వూరించి ఇప్పుడు వచ్చింది!తనే చెప్పుకున్నట్టు తను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడూ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడూ సమస్యలతోనే వచ్చింది!మొదటిసారి తను చేసింది తక్కువేమీ కాదు.ఎలంగాణా కుతర్క పండితులు వొప్పుకోరు గానీ జాతీయ అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం హైదరాబాదు ఇటీవలి ఇరవయ్యేళ్ళలో పెరిగిన పెరుగుదలకీ అంతకు ముందరి స్థితికీ పోలికే లేదు!ఒకే ఒక నగరం మొత్తం రాష్ట్ర ఆదాయంలో సింహభాగాన్ని తీసుకొచ్చే స్థితిలో నిలబెట్టాడు.

మొదటిసారికీ రెండోసారికీ అతని సమర్ధతలో తేడా లేదు గానీ ఇతని అసమర్ధత వల్లనే రాష్ట్రం విడిపోగూడని విధంగా విడిపోయి ఒక ముక్కకి మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగాడు?!రేఖామాత్రంగా చెప్పిన ఈ మొత్తం రాజకీయ జీవితంలో రామారావుని దుర్మార్గంగా పడగొట్టటం వల్ల ఇప్పటికీ నాకు ఇతనిపైన అవ్యాజమయిన అభిమానం లేదు!తన చుట్టూ జనం మూగాలనీ తనకి మెహర్బానీల కోసం స్థాయి తక్కువ పనులు కూడా చెయ్యగలగడం అనే అవలక్షణం నాకు అస్సలు నచ్చదు కాబట్టి ఇతన్ని అతిగా నేను పొగడను.ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి వుద్యమ కాలంలో ఆధ్రావాళ్లని దొంగలు,దోపిడీదార్లు అంటున్నప్పుడు దాన్ని అడ్డుకోవటానికి అన్ని అర్హతలూ వుండి కూడా నగిరి పింగిరిగా వుండటం ఇతను చేసిన తెలివితక్కువ పని!అప్పటి కాలంలో కమ్యునిష్టుల ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి భాషాప్రయుక్త రాష్ట్రాలనే పేరుతో కలిపిన ఈ తెలుగు రాష్ట్రం విడిపోవటం అనేది యెప్పటికయినా తప్పదు, ఇవ్వాళ కాకపోయినా మరో యాభయ్యేళ్ళ తర్వాతనయినా వందేళ్ళ తర్వాత అయినా యెప్పటికయినా తెలంగాణా వాళ్ళ పైత్యకారి తనంతో ఆంధ్రా వాళ్ళు వేగలేరు, కల్సి వుండటం వల్ల యెక్కువగా నష్టపోయింది ఆంధ్రా వాళ్లే అనేది నా తిరుగులేని నమ్మకం!హైదరాబాదు మన రాజధాని అనుకుని యెన్ని రేవు పట్నాల్ని మూల పడేసుకున్నాం?ఇవ్వాళ్టికీ దేశాల మధ్యన పెద్దస్థాయిలో జరిగే రవాణా అంతా నౌకల ద్వారానే జరుగుతుందని తెలిస్తే ఈ యాభయ్యేళ్ళలో మనం యెంత రెవెన్యూ పోగొట్టుకున్నామో తెలిస్తే ప్రాణం వుసూరు మంటుంది యే కొంచెం బుర్ర గలవాడి కయినా?మంచో చెడో తన అవసరం కోసమో ఇన్నేళ్ళు దొంగలని అంత భీభత్సం చేసిన వాళ్ళ నాయకుడే ఇవ్వాళ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే సాయమడుగుతున్నాడు చూడు!ఈ మాట ఆరోజునే చంద్రబాబు యెందుకు నిగ్గదియ్యలేదు?అన్నేళ్ళ ప్రభుత్వంలో వుండి గణాంకాలతో సహా లెక్క ప్రకారం వాదించి  "కలిసి వుందటం పట్ల మేము సర్దుకు పోలేక పోతున్నాం,మీ అంత హుషారుగా మేం పరిగెత్తలేము గనక వెనకబడిపోతున్నాం.మాకు నచ్చలేదు,మేం విడిపోతాం.మా బతుకు మేం బతుకుతాం.మా పరుగు మేం పెడతాం. అని యెంత గట్టిగా అడిగినా అడుగు , నీ ఇష్టం - అంతే గానీ ఆంధ్రావాళ్ళు తెలంగాణాని దోచుకోవడం అనే మాట మాత్రం మాట్లా వద్దు" అని ధీమాగా గద్దించి మాట్లాడకుండా గోడ మీద పిల్లివాటం రాజకీయం నడిపాడు,యెందుకు?

ఆ కాలంలో అట్లా మాట్లాడి వుంటే అతనికి చాలా ముందుగానే ఆంధ్రావాళ్ళు మంచి ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు!పబ్లిక్ డయాస్ మీద యెలా మాట్లాడితే యే యెఫెక్టు వస్తుందో తెలుసుకుని వ్యూహాత్మకంగా మాట్లాడటంలో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇతను దద్దమ్మ కింద లెఖ్ఖ కొస్తాడు!అట్లా గట్టిగా నిలదీసే లక్షణం ఇతని కుంటే తప్పు వొప్పుకుని లెంపలేసుకోవాల్సిన అక్కడి అధమస్థాయి రాజకీయ నాయకుడు ఇవ్వాళ తను చేసిన తప్పు అనే సరిదిద్దుకున్న వుదారుడిగా కూడా వేషం కట్టి విర్రవీగుతున్నాడు?ప్రజలకి జాతి పరమయిన స్వాభిమానం ఒకటి వుంటుందనీ దాన్ని కాపాడటం కూడా ముఖ్యమేనని తెలుసుకోకుండా మళ్ళీ అధికారం సంపాదించడం తన చుట్టూ జనాన్ని తిప్పుకోవడం కోసమే అనే ఆలోచనా విధానంలో వుండటం వల్లనే అతడవన్నీ చెయ్యలేకపోయాడు.

ఇతని గోమీద పిల్లివాటం కన్నా ప్రజలుగా మనం చేసిన ఒక చెయ్యగూని ఘోరమయిన తప్పు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అదేమిటంటే వ్యాపార వేత్తల్ని ప్రజా ప్రతినిధులుగా చట్టసభలకి పంపించటం అనే దిక్కుమాలిన పని?!రిగ్గింగులూ,బూతు క్యాప్చరింగులూ,యెన్నికల ప్రక్రీయలో వున్న లోపాలూ వీటి చాటున సమర్ధించుకుని ప్రయోజనం లేదు.రాష్ట్రాన్ని సమైకంగా వుంచాలని హడావిడి చెయ్యటం దగ్గిర్నుంచీ పెప్పర్ స్ప్రే దరిద్రాలకి కారణమయిన కాంగ్రెసు వాళ్ళంతా చాటుగా తనూ వ్యాపారియే అయిన వుద్యమనేతతో హైదరాబాదులో వున్న తమ వ్యాపారాలకి హాని చెయ్యననే హామీని తెచ్చుకోవడం కోసమే బహిరంగంగా ప్రజల్ని వెర్రివెధవల్ని చేశారు! అట్లా పార్ట్ టైము పొలిటీషియన్లు కాకుండా ఫుల్ టైం పొలిటీషియన్లు అక్కడ వుంటే విభజన వల్ల ఆంధ్రా నష్టపోకుండా జాగ్రత్త పగలిగే వాళ్ళు. ఆ లోపాయకారీ ఒప్పందం వల్లనే ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి తేలంగాణా పునర్నిర్మాణాన్ని కొత్తగా తెలంగాణా వ్యాపార పారిశ్రామిక రంగాన్ని వుత్సాహ పరిచడం ద్వారా కాకుండా మళ్ళీ ఆంధ్రావాళ్ళ పెట్టుబడులు మాకు కావాలి,ఆంధ్రావాళ్ళ వ్యాపార దక్షతని మేం వొదులుకోం అని వాగుతున్నాడు?తెలంగాణా పుచ్చొంకాయ్ మేధావులకి ఇవేవీ అర్ధం కావు!హైదరాబాదూ తెలంగాణా ముఖ్యమంత్రీ ఇప్పటికీ ఆంధ్రావాళ్ల గుప్పిట్లోనే వున్నది,వున్నాడు,వుంటాయి?! 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబులో ఇదివరకటి పరిపాలనాపరమయిన లోపాలు చాలావరకూ పోయాయి!మొత్తానికి పదేళ్ళు పునర్విమర్శ చేసుకుని యెదిగాడు. రాజధాని విషయంలో అతని ప్లాను మంచిదే!లోటు బద్జెట్, కేంద్రం నుంచి పూర్తి స్థాయి నిధులు రాకపోవటం, ఋణమాఫీ బరువూ - వీటన్నింటితో రాజధాని కట్టడానికి అయ్యే ఖర్చుని రాజధాని నుంచే రాబట్టటం తెలివైన ఆలోచనే - అందులో యెలాంటి వ్యతిరేకతా నాకు లేదు!వచ్చిన కోపమల్లా కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోవటం ఇతని అసమర్ధత వల్లనా అనే అనుమానం వల్ల వచ్చింది. కానీ కాంగ్రెసు ఇక్కడ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆర్ధిక వ్యవస్థని భ్రష్టు పట్టించిందని ఆర్ధిక వేత్తల విశ్లేషణలూ చెప్తున్నాయి,కాబట్టి మొత్తం దేశపు ఆర్ధిక స్థితి మెరుగుపడేవరకూ యెదురు చూడక తప్పదేమో?ప్రతుతం చంద్రబాబు నిస్సహాయుడిగా వుండటం వల్ల అతన్ని అతిగా విమర్శించి ప్రయోజనం లేదు.అతనూ ప్రజలూ వెయ్యి కళ్లతో గమనిస్తూ ఒక్కతాటి మీద నడిస్తే తప్ప రాష్ట్రం తలెత్తుకు నిలబడలేదు.ఇదీ చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నా ముందరి పోష్టుల్లో వచ్చిన భిన్నాభిప్రాయాల్ని కూడా కలిపి చేసిన నా విశ్లేషణ!ఇప్పటికీ ఇవన్నీ గందరగోళంగా అనిపిస్తే నేనిక ఇంకా విడమరిచి చేప్పలేని అశక్తుణ్ణి!

ఇంక మోదీ గారిని మొదట్లో ఆకాశాని కెత్తటం,డిల్లీ యెన్నికల్లో ఓడించమనటం,పనిలో పనిగా కెజారీవాలుడి వీరవిక్రమోపేతమయిన వుట్టికొట్టుడూ అన్నా హజరీయుని మూర్ఖ ప్రలాప సంభరిత రొడ్డకొట్టుడూ లాంటి వాటి గురించి తర్వాతి ప్రసంగంలో చెప్పుకుందాం. 
స్వస్తి!

Monday, 23 February 2015

ప్రత్యేక హోదా దక్కకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలిక ఈ రెండు పార్టీల్ని కూడా తిరస్కరించాల్సిందే?!

     ఒక పార్టీ నిన్నటి వరకూ  తనే పోరాడి సాధించానని చెప్తూ కూడా తను అధికారంలో వున్న ఇవ్వాళ దాన్ని చట్టపరంగా అన్ని హంగులతో ఇవ్వడానికి వెనుకాడుతున్నది?మరో పార్టీ ఆ పార్టీకి మిత్రపక్షంగా వుంటూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా నత్తిగా మాట్లాడుతున్నది!యేమిటి వీళ్ళ ధీమా?!

     యెంతసేపూ కాంగ్రెసు సరిగ్గా విభజించలేదు,కాంగ్రెసు బిల్లులో పెట్టలేదు అని కాంగ్రెసు మీద పడి యేడవటమే తప్ప అంత దిక్కుమాలిన విభజనకి తెలిసి తెలిసీ తనూ సహకరించింది గదా - విభజన ఈ రకంగా జరగడంలో తన బాధ్యత కూడా వుంది గదా?!

     నిక్కచ్చిగా విభజన బిల్లు నెగ్గినప్పటి బలాబలాల లెక్క తీస్తే ఈ విభజన ఇలాగే జరగడానికి భాజపా ప్రమేయమే యెక్కువ - కాదా?!అడ్వాణీ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఈ రకమయిన తప్పుల తడక బిల్లుతో విభజిస్తే కాంగ్రెసుకి తప్ప అందరికీ అప్పటికే భాజపా గెలుపు ఖాయం అని తేలిపోవదంతో రేపటి రోజున అధికారంలోకి వచ్చే మన మెడకే చుట్టుకుంటుంది, ఇప్పుడు వ్యతిరేకించుదాం అనుకుని అప్పుడు తనని కలిసిన ఆంధ్రా పొలిటీషియన్లకి అదే మాట చెప్పిన వార్త అబధ్ధమా?ఇంత తప్పుల తడక బిల్లు తను సహకరించకుండా నెగ్గే అవకాశం వుందా?యెవరి చెవుల్లో పువ్వులు పెట్టాలని కుట్ర అంతా కాంగ్రెసు మీదకి తోసేస్తున్నది బాజపా!

     ఇది ఖచ్చితంగా దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రంగా కొరకరాని కొయ్యలా వున్న పాత ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయ సాంస్కృతిక పరమయిన అన్ని అంశాల్లో బలమయిన తెలుగు రాష్ట్రాన్ని రెండు ముష్టి చిప్పలుగా మార్చి తమ స్వాభిమానం దెబ్బ తినే పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడటానికి బలమూ ధీమా లేకుండా అడుక్కు తినటానికి అలవాటు చెయ్యటం అనే వ్యూహం తప్ప మరొకటి కాదు?!యెప్పటి నుంచో ఈ దేశంలో ఉత్తరాది లాబీ ఒకటి అనధికారికంగా కేంద్రంలో ప్రభుత్వం యేర్పాటు చెయ్యగలగడానికి ఉత్తరాదిలో పట్టు సాధించడమే కీలకం అనే పధ్ధతిని చెలామణీ చేస్తున్నది!దానికి దక్షిణాదిలో వున్న ఒకే ఒక ప్రతిస్పర్ధి ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే ననేది ఈ దేశపు పార్లమెంటరీ యెన్నికల వ్యూహాల గురించి యే కొంచెం పరిజ్ఞానం వున్నవారి కయినా అర్ధ మవుతుంది!

   దక్షిణాదిలో యెంత బలమయిన పునాది వున్నా సరే ఒక పార్టీ కేంద్రంలో యెందుకు అధికారం పొందలేకపోతున్నది?రాజకీయ నిర్ణయాలలో కానీ సామాజిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ వుత్తరాది వారి మాటే దేశమంతటా యెందుకు చెల్లుబాటు కాగలుగుతున్నది?ఇదంతా నిజంగా అనుకోకుండానే యే వ్యూహమూ లేకుండానే జరుగుతున్నదా?

     కేసీఆర్ మొదటి నుంచీ కాంగ్రెసునే అంటకాగి ఒక్కనాడు కూడా భాజపాతో అనుకూలంగా వుండలేదు?మేము చిన్న రాష్ట్ర్రాలకి అనుకూలం, ఇప్పటికే మూడు రాష్ట్రాల్ని విగొట్టాం అని అన్నిసార్లు టముకేసుకున్నా ముడ్డికి తుడిచేశారు పై స్థాయిలో వున్న కేసీఆర్ దగ్గిర్నుంచి కింది స్థాయి వరకూ వున్న తెలంగాణా వుద్యమకారులు, అయినా భాజపా యెలాంటి షరతులూ లేకుండా తెలంగాణా డిమాండుకి పచ్చజెండా వూపేసింది!ఈ అతిపెద్ద రాష్ట్రం రెండు చిన్న ముక్కలయితే ప్రతిదానికీ కేంద్రం మీద ఆధారపడుతూ వుండటం వల్ల ఇక్కడ స్థానికంగా బలమున్నవేరే పార్టీ అధికారంలో వున్నా సరే కేంద్రం మీద వొత్తిడి పెట్టలేని స్థితిలో వుండటం తమకీ అవసరమే గాబట్టి ఆ రెండు పార్టీలూ విభజనకి ఒకరికొకరు సహకరించుకోవడం వల్లనే ఈ విభజన ఇలా తగలడిందనేది సుస్పష్టం!

    సుష్మా స్వారాజ్ ఆప్యాయంగా కేసీఆర్ దగ్గిరకెళ్ళి "ఈ చిన్నమ్మని కూడా గుర్తుంచుకోండి" అని బతిమిలాడుకోవటం ఆ పార్టీ ఆంధ్రా వైపు వుందో తెలంగాణా వైపు వుందో తెలియడం లేదా?నిన్నటి దాకా ఆంధ్రోళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వుద్యమ స్పూర్తిగా గొప్పగా చేప్పుకుని కేవలం భూభాగాన్నే కాకుండా మనసుల్ని కూడా చీల్చిన కేసీఆర్ ఇవ్వాళ ఒక పోరంబోకు క్షమాపణతో తన పన్నేండేళ్ళ అప్రతిహతమయిన దూషణా పర్వపు పాప సముచ్చయాన్ని కడిగేసుకోగలననుకుంటున్నాడు!? యెంత ధైర్యం వీళ్ళకి? ఆంధ్రా వాళ్ళ అతి మంచితనం మీద యెంత నమ్మకం వుంది వీళ్ళలో! ఆంధ్రోళ్ళు దొంగలు,వాళ్ళు మన భూముల్ని ఆక్రమించారు,మన నీళ్లని దోచుకున్నారు అని వాగిందంతా వుద్యమంలో వాగినవీ పట్టించుకోదగినవీ కాదంటే అవి అబధ్ధాలు అని తెలియడం లేదా? వినేవాడు వెర్రివెధవయితే పంది పురాణం చెప్తుంది!ఆంధ్రావాళ్ళు అమాయకంగా వుండటం వల్లనే వీళ్ళ దుర్మార్గం అంత న్యాయపూరితమయిన వుద్యమంగా చెలామణీ అయింది?! ఇవ్వాళ తెలంగాణాలో అధికారం తనదే గదా - యే ఆంధ్రావాడు తెలంగాణాకి యెంత అన్యాయం చేశాడో సాక్ష్యాలతో సహా బయటపెడితే కాదనగలిగినవాడు యెవడయినా వున్నాడా?ఇవ్వాళ అంతా అయిపోయాక కేసీఆర్ తెలంగాణా యెదగటానికి ఆంధ్రా వాళ్ళ తోడ్పాటు కావాలి,యెవ్వర్నీ పొమ్మనేది లేదు అని తెగేసి చెప్తుంటే మిగతా వుద్యమ నాయకులు కూడా మాట్లాడటం లేదేమిటి!

     ఆంధ్రా వాళ్ళు మాత్రం కామమ్మ మొగుడంటే కామోసని వొప్పుకునే పాతకాలం వాజెమ్మాల్లా విని యే మాత్రం వ్యతిరేకించకుండా వొప్పుకుని నిజమే నిజమే మేం ద్రోహులమే అని పశ్చాత్తాపం కురిపించేశారు - గట్టిగా మీ ప్రాంతానికి మేము ద్రోహం చెయ్యడ మేంటి అని నిలబడి మాట్లాడలేని దద్దమ్మలు ప్రజా ప్రతినిధులు కావడం వల్ల గదా ఇవ్వాళ రాజధాని లేకుండా పెంచిన ఆదాయంలో చిల్లికాణీ వాటా కూడా లేకుండా లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని మన మొహం మీదకి విసిరెయ్య్గలిగారు వాళ్ళు ?

     ఈ అబధ్ధీకుల వుద్యమాన్ని సమర్ధించి చూస్తూ చూస్తూ చరిత్రలో ఆంధ్రావాళ్లని తెలంగాణా వెనుకబాటుకు కారణమైన ద్రోహులుగా నిలబెట్టే కిరాతకానికి తమ వంతు సాయం తామూ చెసినట్టే గదా ఈ పార్టీలన్నీ!తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చెప్పడం పంచ మహా పాతకాల్లో కల్లా నికృష్టం - అది అంత ధైర్యంగా యెట్లా చెయ్యగలిగారు వీళ్ళు?

     కాబట్టి రాష్ట్రంలో కొంచెం చదవడం రాయడం తెలిసిన ప్రతివాడు ఇవ్వాళ్టి నుంచీ నోటా పధ్ధతిని వుపయోగించుకుని అయినా సరే ఇకముందు జరగబోయే యే స్థాయి యెన్నికలోనూ ఈ రెండు పార్టీల్లో దేనికీ వోటు వెయ్యకుండా ఒక నిశ్చయం చేసుకోవాలి - తప్పదు?!

Friday, 20 February 2015

దోచుకొనుడూ దంచుడూ అంతా యేమైపాయె?యేం పిట్టల దొరా మళ్ళీ రూటు మార్చిన వేంది?

ఒక్కసారిగా ఇన్ని మంచి మాటలు మీనోటి నుంచి విని తట్టుకోలేకుండా వున్నాం తెలంగాణా చక్రవర్తి గారూ,కొంచెం నిదానించండి!మిగతా రాష్ట్రమంతా మీకు అత్తెసరు మెజార్టీయే ఇచ్చినా పైన గెలిచి వచ్చిన వాళ్ళు అమ్ముడు పోయే రకాలు గాబట్టి కొనేశారు.ఇప్పటి దాకా ఆంధ్రోళ్ళని పొగిడే అవసరం రాలేదు గాబట్టి మీ హజం మీరు చూపించినా లెఖ్ఖ లేకుండా జరిగిపోయింది,కానీ మహానగర యెన్నికలంటూ కోర్టు చివాట్లు పెట్టిందే దాని దుంప తెగ?దాంతో మీరు మరోసారి మీ నరం లేని నాలికని మడత తిప్పేసి వుద్యమ స్పూర్తి నుంచి 360 డిగ్రీలు తిరగాల్సొచ్చింది,మా ఖర్మ ఇట్లా కాలింది?!

వాహనాల రీ రిజిస్ట్రేషను అని మీరు కూసిన దానికి అర్ధం యేమిటి మహాశయా?అది వుద్యమం నాడు అన్న మాట కాదు గదా?పాత ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం రిజిస్టరు కాబడిన వాహనాలనే మీరు తిరగనివ్వకూడదని ఖరారు చెయ్యడం కాదా?మెడ మీద తలకాయ వున్నవాడెవడూ మంచి వుద్దేశంతో ఆ కూత కుయ్యడు కదా!ఒకసారి ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా రిజిష్టరు అయితే మరోసారి రిజిష్టరు చెయ్యడం అనేది పిచ్చిమాట అని పదో తరగతి కుర్రాడికి తెలిసిన మాత్రం తమకి తెలియకనే ఆ కారుకూత కూశారా?!

టాంకు బండు మీద వున్న ఒకనాటి మహనీయులనే పెళ్ళగించి ఆంధ్రాకి పంపించేస్తాం అనే వరకూ వెళ్ళారు గదాముఖ్యమంత్రి స్థానంలో వున్న మీ నుంచి అట్టడుగున వున్న మీ వందిమాగధుల వరకూ!మా పాతతరం వాళ్ళ విగ్రహాలనే కంటితో చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళు మమ్మల్ని మనుషులుగా అభిమానిస్తారని యెలా నమ్ముతాం?!1956 నాటి స్థానికత సిధ్ధాంతం యెప్పుడు యెందుకు పుట్టించి యెంత మొండిగా పాటించాలని చూశారో కళ్ళముందరే జరిగింది కదా?కళ్ళముందు కనిపిస్తున్నది ఇట్లా వుంటే ఇంకా కనిపించనే కనిపించని మీ ఔదార్యాన్ని యెలా అర్ధం చేసుకోగలం,అజ్ఞానులం పూట కొక్క మాట చెబితే పిచ్చివాళ్ళ మవుతాం మహానుభావా?!

బహుశా మెదక్కులో పుట్టి పెరిగినందువల్ల ఆంధ్రోళ్ళ గురించి తెలియక పోవచ్చు!ఆంధ్రోళ్ళు యేమి చేసినా యేది మాట్లాడినా లెక్క ప్రకారం మాట్లాడతారు!ముందు యే అంధ్రోడు తెలంగాణా మాణ్యాన్ని యెంత దోచుకున్నాడో పేరుపేరునా లెక్కలు తియ్యి!లెక్క ప్రకారం దొంగయితే తరిమి కొట్టు తెలంగాణా బోర్దరు దాటే వరకూ,ఒక్కడు నిన్ను తప్పు పట్టడు!ఇవ్వాళ సర్వాధికారాలూ వున్నయి నీకు -  నిజం నిరూపించ లేవా?తప్పు చెయ్యలేదా తప్పు చెయ్యనోణ్ణి తప్పు పట్టిన నువ్వు తల దించుకో?!నువ్వు ఒకప్పుదు "నో ఆప్షన్స్" అన్నావు యెదటివాళ్ళకి,గుర్తుందా?ఆంధ్రోణ్ణి నీకు నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నా?!లెక్క ప్రకారం మాట్లాడు.నువ్వే చెత్త మాట్లాడినా నెత్తిన పెట్టుకు వూరేగడానికి మేము తెలంగాణా పుచ్చొంకాయ్ తెలివితేటల మేతావులం కాదు,గుర్తుంచుకో!

అందరూ నీకులాగ మాటే గదా అనుకోరు!తనువున విరిగిన అలుగులు పద్యం తెలుసా నీకు?మాట అన్నవాణ్ణి కాదు పడ్డవాణ్ణి బాధిస్తుంది!ఒకటా? రెండా?పన్నెండేళ్ళు వరసగా అన్ని కారుకూతలు కూసి ఇవ్వాళ ఒక్క మాటతో సరిపెట్టుకోమంటున్నావు,యేం తిని పెరిగావు నువ్వు?!లక్ష తిట్లు తిన్నా లెక్కచెయ్యని సిగ్గులేని తనం నీకుండొచ్చు.మాకు మాత్రం రోషమెక్కువ, అది తెలుసుకో?మహానగర్ యెన్నికల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పకు. నిజాయితీగా ద్వేషించడమే నీకు తగినది - మరొకటి నీకు నప్పదు? సరిపని వేషం కట్టి అభాసు పాలు కావద్దు,పది కాలాల పాటూ చప్పట్లు కొట్టించుకోవాలనుకనే యే నటుడూ అట్లాంటి తెలివితక్కువ పని చెయ్యడు?

లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నిస్తానంటే పులకించిన వాళ్ళూ ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములన్నిట్నీ లాక్కుని వస్తానంటేనూ మురిసి ముక్కలై వోట్లు వేసే జనం తెలంగాణాలో చాలామంది వున్నారు,అక్కడ చెప్పు నీ సొల్లు కబుర్లు.నీ మాట మాకు నిబధ్ధం కాదులే,యెన్నిసార్లు మాట తిప్పలేదు."దాదాపు 58 ఏళ్ళు కలిసి వున్నాం.విడిపోవలసిన అవసరం వచ్చింది కాబట్టి విడిపోయాం.అనతే కానీ తెలుగు వారిమధ్య విభేదాలు లేవు?!" - యేమి పచ్చి నిజం చెప్పావయ్యా నీ ఇల్లు బంగారం గానూ!58 అంటే నువ్వు 12 యేళ్ళ పాటూ తిట్టిన తిట్టు తిట్టకుండా ఆంధ్రోళ్ళని తిట్టిన కాలాన్ని కూడా కలిపావన్న మాట,వామ్మో?

విడిపోవలసిన అవసరం నీ కుటుంబానికి అధికారం కోసం నీ సొంత వ్యవహారమా?విశాల ప్రజా ప్రయోజనాల కోసమా?ముందు అది తేల్చు!ఆంధ్రోళ్ళు మన భూములన్నీ కబ్జా చేశారు,వాటన్నిట్నీ విడిపిస్తాను అని కూసి ఇవ్వాళ నువ్వు చేస్తున్న దేమిటి?కబ్జాదారులు కొంత డబ్బు చెల్లించితే చాలు వాళ్ళు కబ్జా చేసిన భూములకే చట్టబధ్ధమయిన యజమానులై పోతారని అంటున్నావు!నీ పిట్టకధలు తెలంగాణా పిచ్చిపుల్లయ్యల దగ్గిర చెప్పు,మా దగ్గిర కాదు.లెక్క ప్రకారం దోచుకున్న దెవరు?దోపిడీకి గురయిన దెవరు?దొంగలు కానివాళ్లని దొంగలు అన్నదెందుకు?అన్నిటికీ లెక్కలు చెప్పి మాట్లాడు, అబధ్ధాలు చెప్పొద్దు?!అన్నవాడివి నీకు నీ మాట చిన్నదే కావచ్చు పడ్డవాళ్ళం మాకు మా కష్టం పెద్దదే?!

యేమి చాలాకు కబుర్లు జెప్తా వుండావు ఇప్పుడు!అప్పుడు తరిమి కొడ్తానన్నది యెవర్ని?ఇప్పుదు నెత్తిన పెట్తుకుంటున్నది యెవర్ని?అంతా చూస్తానే వుండామప్పా!వ్యాపారం జేసి సంపద పెంచితే అందరూ పంచుకున్నారు?అందరూ కలిసి పెంచింది గదాని న్యాయమైన వాటాయే అడిగినా ముగమాటానికయినా సరే అనకపోతివి!మా ప్రాంతం అని తెలిసి రావడం మీ వెర్రిబాగుల తనం మా ప్రాంతంలో పుట్టిన సంపద అంతా మాదే మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వం అన్న లెఖ్ఖన మాట్లాడినారు గదా నోరున్న తెలంగాణోళ్లు అందరూ?!ఇప్పుడు మళ్ళా ఆంధ్రోళ్ళు తెలంగాణాని పెంచాలె,మీ పెట్టుబడులూ,మీ తెలివితేటలూ అన్నీ మాగ్గావాలె అంటున్నవు,అది నోరా మరొకటా?హైదరాబాదు ఆదాయంలో వాటా ఇవ్వకుండా నువ్వు తన్ని తగిలేసినా తమ సొంత రాష్ట్రం అల్లల్లాదుతుంటే మనసులో యేమాత్రం కసి లేకుండా నీ రాష్ట్రాన్ని బాగు చెయ్యడానికి యే ఆంధ్రోడు అమాయకంగా ముందుకొస్తాడు?అట్లా వొస్తే ఆంధ్రోళ్ళు వాణ్ణి వుతికి అరెయ్యకుండా వుంటారా?ప్రాంతీయాభిమానం మీకు మాత్రమే కావాలా దొరా?!ఆంధ్రోళ్ళ కక్కర లేదా!

ద్వేషించినా నిజాయితీగా ద్వేషించు?!పలుమార్లు మాటలు మార్చి అభాసు పాలు కావద్దు!!

Thursday, 19 February 2015

ఈ విభజన నామ సంవత్సరంలో ఒక యవనిక యేదో జారుతున్నట్లనిపిస్తున్నది!

అంతము లేని యీ భువనమంత పురాతన పాంథశాల; వి
      శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా
                                        క్రాంతులు పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ
                                        గొంత సుఖించి పోయి రెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్!

      ఈ ఒక్క సంవత్సరం లోనే కవులు,కళాకారులు చాలామంది కీర్తిశేషు లయ్యారు?!నిన్ననే డి.రమానాయుడు అస్తమించాడు!సినిమా నిర్మాతల్లో హీరో లాంటివాడు?నిర్మాత పరిశ్రమకి యెంత ముఖ్యమో అందరికీ తెలిసింది రామానాయుడు ద్వారానే.యెన్నో సినిమాలు తీసినా ఒక్క ముక్కలో యెవరీ రామానాయుదు అని చెప్పాలంటే "ప్రేం నగర్ ప్రొడ్యూసరు" అంటేనే అందరికీ తెలుస్తుంది! 

      చిన్న వయస్సు లోనే నిర్మాతగా మారింది కూడా రామానాయుడే అనుకుంటాను.మొదటి సినిమా రాముడు భీముడు -యెత్తుకోవడమే పెద్ద హీరోతో,అదీ దబల్ రోలు?యే కాస్త అటూ ఇటూ అయినా నెత్తికి చెంగూ మొహం మీదే జోకులూ గ్యారెంటీ! అయినా సరే కధ కున్న సత్తాయే యెక్కువ అని తెలిసే ధైర్యం చేశాడోమో!ఆ హీరోనే తన మీద తనకున్న అతి నమ్మకంతో అయిదు వేషాలు వేసినా అట్టరు ఫ్లాపు అయిపోయింది గదా?కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తియ్యాలనుకోవడం చూస్తే సినిమా అంటే అతనికి యెంత వదలని పిచ్చి?!

      అంటే అన్నానంటారు గానీ అసలు విషయం వొదిలేసి కొసరు విషయం యెత్తుకున్నానని కొందరు విసుక్కుంటారేమో గానీ ఈ మధ్యన వరసగా పోతున్న వాళ్ళ చావులు మొదలయిన తొలినాళ్ళ నుంచీ ఒక ముక్క లోపల్లోపలే తన్నుకుంటున్నది!వీళ్ళంతా రాష్ట్రం ఒక్కటిగా వున్నప్పుడు 23 జిల్లాల వాళ్ళని సమానంగా పలకరించిన వాళ్ళు!!ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి చూసుకుని రెండు రకాల జీవితాల్నీ పోల్చుకుని యేడ్చే ఖర్మ నుంచి తప్పుకుని పోతున్నారు?ఒకరకంగా చూస్తే వాళ్ళు అదృష్తవంతులు!కాలపురుషుడు గజ్జె కదిలించి ఆడే చిరనర్తనంలో ఈ గజ్జె సవ్వడి వెనక కవ్వడి చెప్తున్న ముచ్చట యేమిటో తెలుసా?!


      యాభయ్యేళ్ళ వటవృక్షం కూలిపోయింది?పక్షులన్నీ చెల్లా చెదరవ్వాల్సి వుంది!కూలిన అదురుకి గాలికెగెరిన వాటికి తిరిగి వాలడానికి చెట్టు కూడా లేక గాల్లోనే గిరికీలు కొడుతున్నాయి కొన్ని పక్షులు?యాభయ్యేళ్ళలో అంతో ఇంతో యెదిగి కొంచెం తలెత్తి చూస్తే 23 జిల్లాలకీ కలిపి లక్ష కోట్ల బడ్జెట్టుతో ధీమాగా వుండి దక్షిణాదిలో రాజకీయంగా సాంస్కృతికంగా పెద్ద రాష్ట్రంగా వున్నాము అని సొంతోషపడుతున్న సమయంలో పాలకుండ భళ్ళున పగిలింది?!పాలన్నీ ఇంకిపోయాయి.ఒక్కటిగా వుండి యెంతో కొంత యెదిగిన ధీమా అంతా యేమయింది?ఇప్పుడు విడిపోయాక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముష్టి కబుర్లు చెప్తున్నారెందుకు?తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూముల అమ్మకానికి దిగాడు!నాలుగు చోట్ల వున్న ఆఫీసు లన్నిట్నీ ఒక చోటికి చేర్చి మిగతా మూడిట్నీ అమ్మాలట?10 జిల్లాలకే లక్ష కోట్ల బడ్జెట్ వేశాడు?యెంత గట్టిగా లెక్కేసినా ఆదాయం 6000 కోట్లు మించేలా లేదు-ట! మిగతా కొరతంతా భూములమ్మడంతోనే పూడుతుందా?సంక్షేమ పధకాలే రెండు వందలు-ట?ఒక్కోదానికీ హీనపక్షం ఒక కోటి వేసుకున్నా 200 కోట్లు ఆదాయం లేని ఖర్చు.కులానికి పది కోట్లకి తక్కువ కాకుండా అడిగిన వాడిది పాపం అన్నట్టు కేటాయించేస్తున్నాడు.డప్పులు మోగించుకోవటానికీ రికార్డింగు డ్యాన్సులకీ తప్ప యెందుకు పనికొస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా లేదు?!


      ఇటు చూస్తే చెన్నై నుంచి వలస వచ్చిన నాటి దృశ్యం మళ్ళీ కనబడుతున్నది!రాజధాని లేదు.ఆర్భాటంగా మొదలు పెట్టిన రాజధాని యెప్పటికి పూర్తవుతుందో తెలీదు?ముఖ్యమంత్రి నన్ను చూడండి,నా సమర్ధతని చూడండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని దేశాలు పట్టి అడుక్కుంటున్నాడు?తిరుగుడు ఖర్చులన్నా గిట్టుబాటవుతాయో లేదో?అటు చూస్తే నిజాము కట్టిన భవంతులు తప్ప మొత్తం కూలగొట్టి కట్టే వూపు కనబడుతున్నది!మొత్తం మీద తెలుగువాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటిసారి కలవక ముందరి కాలాన్ని మళ్ళీ చూడబోతున్నారు ఈ తరం వాళ్ళు?!సరిగా ఇదే రకం సన్నివేశం మహాభారతంలో నడిచింది! సత్యవతీ మాతతో వేదవ్యాసుడు "అమ్మా!ఇప్పటి కేమి చూశావో చూశావు. గతకాలమె మేలు వచ్చు కాలం కంటె. ఇప్పుడు చూసిన వాటికే ఇలా అయిపోయావు.ముందు ముందు జరిగేవి ఇంకా భయంకరంగా వుండవచ్చు" అని ఆవిణ్ణి ప్రయాణానికి సిధ్ధం చేశాడు!


      కాలపురుషుడు బల్ల మీద వున్న పాత పావుల్ని మొత్తం తుడిచేస్తున్నాడు!కొత్త పావుల్ని సిధ్ధం చేస్తున్నాడు?కొత్త రాష్ట్రం,కొత్త రాజధాని,కొత్త తరం,కోటి ఆశలు అంతా కొత్తగా వుంది కానీ - అదిరిందయ్యా చంద్రం అని మాత్రం అనుకోలేకుండా వున్నాం?ద్వేషబీజాలు నాటడం చాలా తేలిక!విత్తనం లా చూస్తే అవి కూడా అన్ని విత్తనాల లాగానే అమాయకంగానే వుంటాయి!కానీ అవి మొలిచి పెరిగి పెద్దయి అసలు ఫలితం యేమిటో చూపించాక అందుకు కారకు లయినవాళ్ళు మాత్రం సొంతానికి దక్కించుకోవలసింది దక్కించుకుని తప్పుకుంటారు.అప్పటికి బల్లమీద మిగిలిన పావులు వాటి ఆట అవి ఆడాక తప్పదు గదా,కష్టమయినా నష్టమయినా?!



ఇల చదరంగ; మందు జనులెల్లరు పాపు; లహస్సులున నిశల్
   దెలుపును నల్పుగళ్ళు; కదలించును రాజును బంటుఁ దక్కు పా
  వుల విధియాటకాఁడు; పలుపోకలఁ ద్రిప్పును గళ్ళు మార్చు, న
                                    వ్వల నొకటొక్కటిం జదిపివైచు నగాధ సమాధి పేటికన

Wednesday, 18 February 2015

తిరుపతిలో కూడా తిరుక్షవరమేనా?చింత మరీ ఇంత మోహనమా!

     అనుకోనిది జరిగితే కదా వింత!అనుకున్నది జరగకపోతేనే కదా చింత!వూహించరానిది యేమి జరిగినదని ఈ వగపంత?!ఓటమి అలవాటై పోయి ఆపో సోపో యెవరు గెలిచినా సంబరపడిపోతున్న ఈ తరుణంలో పొరపాటున గెలిస్తే ఆనందం పట్టలేక యెన్ని గుండెలు ఆగిపోతాయో లెక్కేసుకుంటే అంతా మన మంచికే అనిపిస్తుంది!

     తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం కోరి వలచుట యేలనో!వికట కవి చెప్పినట్టు "గోవిందా గోవిందా నన్ను బాగుచెయ్యి గోవిందా" అంటూ ఆపదమొక్కుల వాడి సన్నిధిలో నన్నా బోణీ కొడదామని ఆశపడిన మోహనుడి ఆశల వేణువు స్వామివారు కూడా విరగ్గొట్టేశారే,కరుణ యొకించుక యైనను లేకుండగ?చింత చచ్చినా పులుపు చావనట్టు కొందరికి సత్యం కళ్లముందు కనబడినా బుర్రకెక్కదని సరిపెట్టుకోవాలే తప్ప ఇపుడతిగా ఆవేశపడి లాభమేమి?కాలం కలిసిరాకపోతే గాంధీ గారు కూడా బ్రాందీ షాపు పెట్టుకోవలసొస్తుంది,మనమెంత అని బొత్సబాబు యెప్పుడో చెప్పాడంట?!పోగాలము దాపురించిన వారు బ్రాందీమార్గం కనరు కదా!

     చచ్చినోడి పెళ్ళికి వొచ్చిందే కట్నం అని యెన్ని వోట్లు పడ్డాయో లెక్కేసుకుని సంతోషించక పాత అలవాటు చొప్పున రిగ్గింగుల గురించి మాట్లాడతాడేంటి లఘుశంకవీరుడు?మూలిగే నక్కమీద తాండిపండు పడ్డట్టు ఓడిపోతామని తెలిసిన ఇట్టాంటి యెన్నికల్లో పోటీ చెయ్యడాన్ని గురించి మేం విడగొడ్తాం రాష్ట్రాన్ని అంటే మేం విడగొడ్తాం అని పోటీలు పడి మాకంతా తెలుసు యెట్టా విడగొట్టి యెట్టా లాభం తెచ్చుకోవాలో అని గంతులేసి ఇంత దారుణానికి కారణమైన డిగ్గీరాజా కూడా చివాట్లేశాడంట ఆఖరికి - ముఖం యెక్కడ పెట్టుకోవాల్రా నాయనా?!

ఓడిపోయే యెన్నికల్లో పొటీ చెయ్యగూడదనుకుంటే ఇంక పోటీ చెయ్యగలిగిందెక్కడ?!
గెలిచే యెన్నికల్ని కూడా ఓటమికి నడిపించగలిగిన రాహుబాబు యెటూ వున్నాడు!?

Saturday, 14 February 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం

సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వాడనై నేడిలా వేడుతున్నానయా!
         కావవే దేవరా కాస్త శాంతి

         నివ్వు నా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినానుగా, స్వామి?నా చేయి పట్టి
        నాకు నీవెతోడై సదా నన్ను తప్పు 
        చేయనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(08/02/2015:ఇందులో రామనామం లోని "ర" గణం మాత్రమే వాడాను,"మ" గణం వాడకూదు గాబట్టి అందులోని అకారంతో ధ్వనిసామ్యం వున్న "హ" గణం వాడాను!)
_______________________________________________________________
శ్రీ గురుభ్యో న్నమః

          అవతార ప్రాధాన్యాన్ని బట్టి కాలక్రమాన్ని లెక్కిస్తే రామకధ ముందుగా వచ్చినా మొదట గ్రంధస్థ మయింది మాత్రం మహాభారతమేనని కొందరి వాదన!అరణ్యపర్వంలో ధర్మరాజుని చూసి పలకరించిన మునులు నువ్వొక్కడివే కాదు మంచివాళ్లయి వుండి కూడా కాలం కలిసిరాక బాధలు పడినవాళ్ళు గతంలో కూడా వున్నారు,వాళ్ళకి లాగే నీ కష్టాలూ తీరుతాయిలే అని ధైర్యం చెప్పడం కోసం చెప్పిన కధల్లో ప్రముఖమైనవి నలచరిత్ర, రామకధ.రామాయణం యొక్క ముఖ్యకధ అంతా అదే వరసలో నడవటాన్ని బట్టి వాల్మీకి తనకంటూ శాశ్వతత్వాన్ని సాధించుకోవటానికి ఆ చిన్న కధని వుపయోగంచుకున్నాడని అనుకోవాలి.ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు ఒక కవి మరో కవికి వుషారు నిచ్చాడు!

          సామాన్య జనం పై రెండు కధలతో మమేకం కావడం కూడా వాళ్ళు పడిన కష్టాలను తమ కష్టాలతో పోల్చుకుని తమ కష్టాలు కూడా అట్లాగే పోతాయనే ఆశ కలిగించడమే! ఆ కవులు తమ కధలకి కోరిన ప్రయోజనం కూడా ఆ కధ చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తమ కష్టాలకి కుంగిపోయి అర్ధాంతరపు ప్రాణత్యాగాలకి పోకుండా ఆ కధలోని నాయకుడి లాగే వీళ్ళు కూడా పోరాడి గెలవాలనే వుత్సాహాన్ని తెచ్చుకోవడమే!రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే ఇచ్చాడన్నట్టు ఆ ప్రయోజనం పూర్తిగా సిధ్ధించాలంటే కధ ఆకుకీ పోకకీ అందకుండా పోయి పాఠకుణ్ణి కంగారు పెట్టగూడదు,కధానాయకుడు చదువరి లాగే వుండి, చదువరి ఆ పాత్రలో తనని చూసుకోవడం మొదలయ్యాక రచయిత మెల్లగా అతన్ని యే రకం మనస్తత్వంలో నిలబెట్టాలని అనుకున్నాడో అవన్నీ కధానాయకుడి ప్రవర్తన లోని అంశాలుగా సన్నివేశాల్ని కల్పించి చూపించాలి - ఇన్ని గొడవ లున్నాయి జగధ్ధితం కోసం సాహిత్య రచన చెయ్యాలంటే?!

      అవన్నీ తనకి పుష్కలంగా వున్నాయనే ధీమా వుంది గనకనే "నా రామకధ ఈ ప్రపంచంలో నదులు పారుతున్నంతవరకూ పర్వతాలు స్థిరంగా వున్నంతవరకూ నిలిచి వుంటుంది" అని గొప్పగా చెప్పుకున్నాడు!సాహిత్య రచన అనేది మొదలయిన తర్వాత ప్రపంచంలోని యే భాషకి చెందిన కవీ తన సృజన గురించి ఈ మాట అనడానికి సాహసించ లేదు?తను రాసిన దాన్ని పదేళ్ళ తర్వాత తనే మర్చిపోయే రకం చెత్త సాహిత్యాన్ని సృష్టించిన మనిషి వాల్మీకి కన్నా నా తెలివి యెక్కువ నాకందులో తప్పులు కనబడ్డాయి అంటే తెలివైన వాడెవడయినా నమ్ముతాడా?మరి, కొన్ని దశాబ్దాల తర్వాత మరో కమ్యునిష్టు మేధావి రామాయణం గురించి చాగంటి వారూ మల్లాది వారూ కూడా చెప్పని విషయాల్ని చెబుతూ ప్రశంసించినప్పుడు జనం యెవరిని నమ్మాలి?మూలకధ అదే అయినా ఉపకధలకీ కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలకీ యెక్కడెక్కడో లింకులు కనబడుతున్నాయంటే అవన్నీ తెలుసుకునే రాశాడని అనుకోవాలి గదా!అంతటి విజ్ఞానిని ఇంతటి అజ్ఞాని వెక్కిరించటానికి పూనుకోవటమే దరిద్రమయితే దాన్ని అభిమానించే వాళ్ళు కూడా వుండటం మరీ నికృష్టం కాదా?!

          రామాయణంలో మొట్టమొదటి మార్మిక సన్నివేశం అహల్యా సంక్రందనం?!రాముణ్ణి దేవుడిగా కొలవడానికి జనానికి వచ్చే మొదటి వూహ "అహల్యకి శాప విమోచనం కలిగించినట్టు మన బాధల్నీ తొలగిస్తాడు" అనే ఆశ!రాయిని నాతిగ చేసిన రామపాదరజం యొక్క మహిమల్ని యెంతోమంది కవులు,భక్తులు కీర్తనల్లో గానించి పులకించిపోయారు?కానీ ఒక ముఖ్యమయిన విషయం - వాల్మీకి రాముడికి యే విధమయిన మహిమలూ ఇవ్వలేదు.పూర్తిగా మనలాగే నవ్వాడు,కోపగించుకున్నాడు,సంతోష పడ్డాడు - అచ్చం మనలాగే భార్య కనపడకపోతే పొర్లిగింతలు పెట్టి యేడ్చాడు?!అసలు కధ అహల్య రాయిలాగా రోడ్డు పక్కన పడివుంటే రాముడు నేనిప్పుడు ఈ రాయిని తన్నాలి గాబోల్ను అని డైరెక్టరు గారు చెప్పినట్టు చేసే ఇవ్వాళ్టి చెక్కమొహం విశ్వనటుల్ల్లాగా పోయి తన్నడమూ ఆ రాయి కాస్తా గ్రాఫిక్సులో మోకాటి తండా వేసిన ఆహల్యగా మారడం లాగానూ జరగలేదు!విశ్వామిత్రుడు తనతో తీసుకు వెళ్ళినప్పుదు కుర్రాళ్ళకి బోరు కొట్టకుండా పురాణ కధలూ అవీ చెప్పడం దారిలో వచ్చే ఆశ్రమాలకి సంబంధించిన కధలూ అవీ చెప్పడం అనే వరసలో అహల్యా గౌతముల కధ కూడా చెప్పి ఆశ్రమం కనబడగానే "ఇక్కణ్ణించే ఒక నమస్కారం చేసుకుని ముందుకు పద" అన్నాడు, కానీ రాముడు నాకు స్వయంగా గౌతముల వార్ని చూడాలని వుంది అంటాడు!ముచ్చట పడి తన అవసరం కోసం వెంట తిప్పుకుంటున్న శిష్యుడు ముచ్చట పడుతున్నాడు గదా అనిపించి "సరే పద!" అని ఆశ్రమం వైపుకి నడవటం మొదలు పెట్టారు!ఇది తెలిసిన గౌతముడికి అహల్యకి తను వేసిన శిక్ష నుంచి విడుదల చెయ్యక తప్పలేదు!అందరూ అపోహ పడినట్టు గౌతముడు రాయిలా పడి వుండమని శపించలేదు."మనుషులకి కనపడకుండా,నువ్వేమి తింటున్నావో యెవరికీ తెలియకుండా భస్మరూపివై - అంటే జీవించి ఉందా మరణించిందా అనేది తెలియకుండా బతుకు"  అని శాసించడమే తప్ప రాయిలాగా మారే శాపం ఇవ్వలేదు? ఇప్పుడు ఆశ్రమానికి వస్తున్న వాళ్ళు లోకారాధ్యుడైన విశ్వామిత్రుడూ, అప్పటికే ఋషుల్లో ఫలానా దశరధుల వారబ్బాయి,వశిష్టుల వారి శిష్యుడూ యెప్పటికయినా మనందరికీ పనికొచ్చే వాడూ అని తెలిసిపోయిన రాముడూ, అంతటి వాడే అయిన అతని తమ్ముడూనూ!సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన అతిధులకి మర్యాదలు కాళ్ళకి నీళ్ళీవ్వడంతో మొదలౌతాయి.అది కూడా పెళ్ళి కాని ఆడపిల్ల వుంటే తప్పనిసరిగా తనూ లేదంటే భార్య గానీ చెయ్యాలి.లోపలి కెళ్తే కాళ్లకి నీళ్ళిచ్చే మనిషి లేదనే విశ్వామిత్రుడు మొదట ముందుకు పదమన్నది!ఆ మర్యాద జరిపించాలి గాబట్టి తన శిక్షని తనే రద్దు చేశాడు గౌతముడు!ఇదంతా చూడాలని అడగటం వల్ల జరిగింది కాబట్టి  అడిగిన రాముణ్ణి గురించి ఒక విశేషణంలా వాడిన మాట కధలోకి రాయిని తీసుకొచ్చింది?!రాముణ్ణి దేవుణ్ణి చేసింది!

          అసలు అహల్యా గౌతముల కధలోనే మరింత నిగూడత వుంది!N.T.R తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చూసిన వాళ్లకి ఆ సన్నివేశానికి ముందు నెర్రెలు విచ్చిన బీడు భూమినీ తర్వాత నాట్లు వేస్తున్న వరిపొలాల్నీ చూపించటం గుర్తుందా?మన పౌరాణికాలన్నీ వ్యవసాయ సంస్కృతిలో తలబంటిగా మునిగిన వాళ్ళు రాసినవి గాబట్టి దానికి సంబంధించిన విషయాలు సందర్భానికి తగ్గట్టుగా వుంటే అక్కడ నిక్షేపించటం జరుగుతుంది!"అహల్య" అంటే నాగలి వెయ్యని భూమి అని అర్ధం!"గోతమ" అంటే గోవుల్ని పోషించేవాడని అర్ధం.అహల్యను కూడిన ఇంద్రసూర్యు లిద్దరూ వ్యవసాయాన్ని నష్టపరిచే అతివృష్టీ అనావృష్టీ అనేవి!ఇద్దరు పరపురుషులతో సంగమించిన తర్వాత కూడా అహల్యకి పంచమహాపతివ్రతల్లో స్థానం చెక్కుచెదరకుండా అలాగే వుంది అంటే తాత్కాలికంగా ఆ భూమి సేద్యయోగ్యం కాకపోయినా ఆ భూమిలోని సారం పూర్తిగా నశించలేదని!నార్మన్ జాకోబీ అనే ఫ్రెంచి పండితుడు మొత్తం రామాయణమే వ్యవసాయ సంస్కృతికి సంబంధించిన విశేషాల్ని పాత్రలుగా సన్నివేశాలుగా రూపు దిద్దిన కధ అని వ్యాఖ్యానించాడు.ఇక్కడి అర్ధం ఒక వ్యవసాయ దారుడు తనకి ప్రాప్తించిన భూమిలో యెంత కష్టపడినా అతివృష్టీ అనావృష్టీ వేధించటం వల్ల విసుగు పుట్టి సేద్యభూమిని బీడునేలగా వదిలేస్తే ఒక సులువు తెలిసిన రైతు కౌలుకి తీసుకుని దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి అప్పజెప్పటం అనే పైకి వాచ్యంగా కనపడని మరో రహస్యమైన కధ దాగి వుంది?!ముందూ వెనకా ఆ రెండు దృశ్యాల్నీ పనిగట్టుకుని చూపించటం వల్ల N.T.R ఆ రకం విశ్లేషణలు చదివాడనే తెలుస్తుంది!

          ఇంద్రుడూ సూర్యుడూ కోడికూతతో గౌతముణ్ణి నదికి పంపించాక గౌతముడి వేషంలో వచ్చి పక్కన జేరారనే సినేమా మసాలా దట్టించి చెప్పలేదు అహల్య కదని వాల్మీకి! అలా జరిగి వుంటే నీ వేషంలో ఉండటం వల్ల నువ్వనుకున్నాను నా తప్పేమిటి అని అహల్య నిలదీసే అవకాశం లేదా?తమ నిజరూపాల్లో మేము ఫలానా అని తెలిపి అహల్యని యే బలాత్కారమూ చెయ్యనక్కరలేకుండానే తమ కోరిక తీర్చుకున్నారు?వాల్మీకి ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళిద్దరూ  నిజరూపాల్లోనే వున్నారనీ పైగా అహల్య అంగీకారంతోనే అదంతా జరిగిందనీ తెలిసిన మరుక్షణం మనకి చాలా సందేహాలు వస్తాయి - రావాలి కూడా!ఇద్దరు పరపురుషుల్ని సంగమించినా గౌతముడు వేసిన శిక్షని భరించడమే తప్ప పంచ మహాపతివ్రతల్లో ఆమె స్థానానికి మాత్రం భంగం రాలేదు,యెందుకని?రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇద్దరు మగవాళ్ళలో ఇంద్రుడికే భయంకరమైన శాపాన్ని ఇచ్చిన గౌతముడు సూర్యుణ్ణి యెందుకు వదిలేశాడు?నా విశ్లేషణ ఇది:ఇప్పటి వుద్యొగినులు బాసు చెయ్యి పట్టుకుంటే వెంటనే వేరే వుద్యోగం తెచ్చుకోగలిగితే అక్కడ వుద్యోగం మానెయ్యటం లేదా పరిస్థితి తప్పనిసరిగా ఆ వుద్యోగమే చెయ్యాల్సిన విధంగా వుంటే ఇష్టం లేకపోయినా లొంగిపోయేటటువంటిదే అహల్య పరిస్థితి కూడా!యెదురుగా వున్నవాళ్ళలో ఒకడు స్వర్గాధిపతి మరొకడు కర్మసాక్షి.తను తిరస్కరించడం వల్ల వాళ్ళకి క్రోధం కలిగితే భర్తకి హాని చేసే ప్రమాదం వుంది.ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలియకపోవడం వల్ల వీళ్ళు యేదయినా చేస్తే గౌతముడు తనని తను రక్షించుకోలేని పరిస్థితి!అవినీతి,నేరం అనే వాటి నిర్వచనాలు పాతకాలపువైనా కొత్తకాలపువైనా అన్ని న్యాయసూత్రాల లోనూ ద్రోహబుధ్ధితో పూనుకుని చేసినప్పుడే ఆ మనిషికి కర్తృత్వం ఆపాదించడం జరుగుతుంది!అహల్య మనసులో జారత్వం లేదు గాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా దోషానికి పరిహారంతో సరిపెట్టేసి ఆ సన్నివేశానికి ముందూ ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడూ ఆ సన్నివేశం తర్వాతా అహల్య మనసా వాచా కర్మణా గౌతముడి క్షేమాన్ని కోరుతూనే వుండటం వల్ల పంచమహాపతివ్రతాల్లో ఆమెకున్న స్థానం అలాగే వుంది!అహల్య గనక తిరగబడి,"నేనెలా పుట్టానో నీ దగ్గిర కెలా వచ్చానో నీకూ తెలుసు.మా నాన్న బ్రహ్మదేవుడు మా అమ్మ సరస్వతి తన సృష్టిలో యేదీ పరిపూర్ణంగా వుండకపోవటాన్ని చూసి వెక్కిరిస్తుంటే వుడుకుమోత్తనం తెచ్చుకుని అన్నిటా సర్వొత్తమంగా ఉండేటట్టు సృష్టించి కూడా షరా మామూలే అన్నట్టు ఇంద్రుడు అంతగా ఆశపడి తనకిమ్మని అడుగుతున్నా నొసటి రాతలో అన్యాయం చేసి నీ భార్యగా పంపించాడు!నా తండ్రి చేసిన తెలివితక్కువ పనికి బలయి గడుపుతున్న ఇంత దుర్భరమైన జీవితంలో ఒకే ఒక్కసారి ఈడూజోడైన వాళ్ళతో కూడితే తప్పేంటి?" అని నిగ్గదీస్తే గౌతముడు కోపానికి బదులు జాలి చూపించాల్సి వచ్చేది కాదా?సూర్యుడు ఇంద్రుడు ప్రలోభపెట్టగా వచ్చాడు.గౌతముడి ముందు తప్పు వొప్పుకుని తల దించుకు నిలబడ్డాడు.ఇవ్వాళ్టి న్యాయసూత్రాల్లో కూడా అప్రూవరయి అసలు ముద్దాయిని పట్టిచ్చే సహాయం చేసినా తప్పు వొప్పేసుకుని శిక్షకి తలొగ్గినా తక్కువ శిక్షతో సరిపెట్టెయ్యడం గానీ అసలు యే శిక్షా లేకుండా వొదిలెయ్యటం గానీ చేస్తారు గదా!ఇక ఇంద్రుడికి వేసిన శిక్ష పూర్తి స్వభావం తెలిస్తే వొళ్ళు జలదరిస్తుంది!కళ్లని కాకుండా అక్షులు అని పిలిచే వాటిలో కుష్టు రోగులకి చర్మం చిట్లి కనబడే గాయాలు కూడా వున్నాయి!గౌతముడు ఇంద్రుడికి ఇచ్చిన శాపం మొత్తం దేవలోకాన్నే జలదరింపజేసింది, యెందుకంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాల్సింది వాళ్ళే గదా!దానికి సర్దుబాటుగా తనవైపు చూసుకుంటే తనకి తప్ప మిగిలినవాళ్లకి మామూలుగానే కనబడే విధంగా శాపం తీవ్రతని తగ్గించారు!యెంతటి నేరమయినా చేసేటప్పుడు పేరుకున్న తిమ్మిరి కరుగుతుంది గనక సర్దాగానే వున్నా ఒకసారి నేను అలా చేసి వుండాల్సింది కాదు అనే గిల్ట్ తొలచడం మొదలయితే ఆ మనిషి నరకాన్ని చూస్తాడు!ఇంద్రుడి కిచ్చిన శాపం మనిషిలోని అపరాధభావన?!ఆ ఉపకధకి రామాయణ కధలో వున్న ప్రాధాన్యమేమిటో అందులో మనం నేర్చుకోవలసిందేమిటో తెలియక పోవడం వల్లనే "నదికి పోలేదా స్వామీ" అంటూ క్యామిడీ నాటకంగా చూపిస్తే జనం కూడా నిజం సీను కూడా ఇలాగే జరిగింది కాబోలనుకుని నవ్వుతూ చూశారు?!

           రామాయణంలో మొట్టమొదటి గందరగోళపు సన్నివేశం - పట్టాభిషేకం?!మొదట్లో అంత భీకరంగా పంతం పట్టి అడవులకి పంపించిన కైక భరతుడితో వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడుతుంది!అందువల్లనే కాబోలు కొందరు వ్యాఖ్యాతలు పట్టాభిషేకాన్ని తప్పించటానికి దేవతలు కైకకి మాయపొర కమ్మించారు అనే రకం కల్పనలు చేశారు?కొందరు జాతక రత్నాలు వశిష్టుడు తప్పుడు ముహూర్తం పెట్టాడు,అందుకే అట్టా జరిగిందీ అని కూడా తీర్మానించేశారు.కొందరు వాస్తు పండితులు సీతాపహరణాన్ని లక్ష్మణుడి మీదకి తోశారు పర్ణశాల వాస్తువిరుధ్ధంగా కట్టాడు,అందుకే అట్టా జరిగిందని!కానీ పట్టాభిషేకం అట్లా భ్రష్టు పట్టిపోవటానికి కారణమైన అసలు విలన్ దశరధుడు?!కైక కూడా మంచిదే పాపం!మొదట పట్టాభిషేకం వార్త మంధర ద్వారా వినగానే సంతోష పడుతుంది అమాయకంగా!అంటే పుట్టింటి వాళ్ళు తనని ఇక్కడికి పంపించేప్పుడు తనకి పుట్టిన వాడే రాజవ్వాలని కండిషన్ పెట్టి పంపించటాన్ని పట్టించుకోకుండా రాముడు రాజవటానికి మానసికంగా తను కూడా సిధ్ధంగా వున్నదనే గదా?మంధర పూర్తిగా చెప్పాల్సింది చెప్పాక అప్పుడు మొదలైంది అసలు భీభత్సం, అవునా?యేమి చేప్పింది మంధర!"తల్లీ నీకు అసలు విషయమే తెలియదు గానీ కౌసల్య మందిరంలో పండగ చేసుకుంటున్నారు!అన్ని విషయాల్లోనూ నీకు చెప్పి చేసే రాజుగారు ఈ విషయం మాత్రం నీకు చెప్పలేదు చూశావా?అందరూ కలిసి నీచుట్టూ వుచ్చులు బిగిస్తున్నారు!" అని బోధపర్చింది?ఈ మంధర యెవరు?కైక పుట్టింటి నుంచి ఇక్కడ తమ కూతురికి అన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా అని కనిపెట్టుకుని వుండటానికి వచ్చింది కదా, మరి జరిగేవి అనుమానం పుట్ట్టించే విధంగా వున్నప్పుడు కైకని హెచ్చరించకపోతే తన బాధ్యతని విస్మరించినట్టు కాదా!ఇంతకీ దశరధుడు చేసిన పనులేమిటి?సరిగ్గా ఒక్కరోజు ముందు భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపించాడు!హఠాత్తుగా నిండుసభలో ఇప్పటికిప్పుడు నేను రాముణ్ణి రాజుని చెయ్యాలని అనుకుంటున్నాను,ముహూర్తం వెంఠనే పెట్టండి అని వశిష్టుణ్ణి తొందర పెట్టాడు!తెలిసి చేసినా వుషారు కొద్దీ చేసినా దశరధుడి ప్రవర్తన అంతా కైకని అనుమానించి అన్నీ పూర్తి చేసేసి అప్పుడు చెబుదామనే ప్లానుతో చేసినట్టుగానే వుంది!అందుకే కైకకి అంతగా కాలింది?!ఇప్పటికీ ఆడవాళ్ళ మనస్తత్వంలో ఒక ట్విస్టు వుంటుంది గమనించారా - చేప్పి చేస్తే యెంత దుర్మార్గం చేసినా సహిస్తుంది గానీ భర్త చేసింది మంచిపనే అయినా వేరే  వాళ్ళ ద్వారా తెలిస్తే మాత్రం తన కోపం తగ్గేదాకా నరకం చూపిస్తుంది,అవునా?!వాల్మీకి మహా గడుసువాడు - ఒకవైపు నుంచి చూస్తే దశరధుడు కావాలనే చేశాడు అని అనిపించేటట్టూ మరోవైపు నుంచి చూస్తే పాపం అనవసరంగా తొందరపడి అన్యాయంగా కొడుకు మీద బెంగతో కక్కటిల్లి చచ్చిపోయాడేమో అనిపించేటట్టూ సన్నివేశాలని రన్నింగ్ కామెంటరీ లాగా చెప్పేసి వొదిలేస్తాడు తప్ప తనుగా యేమీ చెప్పడు?!మన సంస్కారాన్ని బట్టి నాలాంటి శాడిష్టు అయితే ముసలోడు కావాలనే చేశాడు ఆ శాస్తి జరగాల్సిందే అనుకుంటాడు,శ్యామలీయం మాస్టారి లాంటి శాంతమూర్తు లయితే దశరధుడి మీద జాలిపడి క్షమించేస్తారు!

          చాలామంది రాముడు తండ్రి మీద వున్న ప్రేమ వల్ల పితృవాక్య పరిపాలన కోసం సింహాసనాన్ని త్యజించి వనవాసం వెళ్ళాడని అపోహ పడుతున్నారు!జరగకూడని హాని అంతా జరిగి మఠధ్వంసం అయ్యాక అప్పుడు దశరధుడు రాముడు కనబడగానే "నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకో" మంటాడు!నిజంగా కూడా రాముడు ఆ పని చేస్తే కధ అక్కడితో ఆగిపోయి వుండేది.ఎందుకంటే,కైక కూడా రాముడి రాజరికాన్ని వొప్పుకుందంటే మిగతా ప్రభుత్వాధికారులు అప్పటికే విధేయులై పోయి వుండాలి గదా?అన్నింటికీ కైక చుట్టూ తిరుగుతూ భర్త తనని నిర్లక్ష్యం చెయ్యడం లోటు తప్ప కౌసల్య హోదా కూడా తక్కువదేం కాదు.ఆవిడ అయోధ్యా నగరానికి రక్షకురాలు!ఆవిడ అధీనంలో వున్న బలగం చాలు నగరాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి!రాముడు లెక్క ప్రకారం రెండు విషయాలు ప్రస్తావిస్తూ జవాబు చెప్పాడు - "మాట ఇచ్చినది ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజు.ఆ మాట పొల్లు పోతే నీ రాజపదవికీ మన వంశచరిత్రకీ కళంకం గనక ఆ పని పొరపాటున కూడా చెయ్యను." అని తిరస్కరించి "పట్టపు రాణి స్థానంలో వున్నా నీ పక్షపాతం వల్ల ఇన్నాళ్ళూ నన్ను చూసుకుని బతికింది నా తల్లి,ఇప్పుడదీ లేకుండా చేశావు!నేను లేను గదా అని తనకి దుఃఖం కలిగించే పని చేస్తే మాత్రం సహించను?" అని హెచ్చరించాడు.ఈ కటువైన మాటల్లో తండ్రి మీద ప్రేమ కన్నా తండ్రి యొక్క బహుభార్యాత్వం పట్ల వున్న అసహ్యమూ అందులో కూడా పక్షపాతం చూపించి యెవరో ఒకరి వైపుకి మొగ్గి మిగతా భార్యల్ని చిన్నచూపు చూడటం పట్ల వున్న తిరస్కారమూ కనపడటం లేదా?!సరిగ్గా ఈ పాయింటు మీదనే - తండ్రి చేసిన తప్పు తను చెయ్యకూడదనే పట్టుదల తోనే  అరుంధతీ వశిష్టుల్ని దగ్గిర్నుంచి చూసిన రాముడు యేకపత్నీవ్రత దీక్షని పాటించాడు!దశరధుడు గుండె బద్దలై మరణించింది రాముడితో యెబాటు వల్ల కాదేమో, రాముడి అంతరాంతరాల్లో తనపట్ల వున్న అసహ్యం అనుకోకుండా బయట పడటం వల్లనేమో!లేదంటే పధ్నాలుగేళ్ళ తర్వాతైనా వస్తాడనే ఆతో బ్రతికి వుండే వాడేమో?!ఈ మొత్తం భీభత్సం అంతా పూర్తయ్యాక కైక సాధించింది శూన్యం?!భరతుడు కూడా తల్లినే తప్పు పట్టడం, రాముణ్ణి తిరిగి తీసుకు రావాలని ప్రయత్నించి అది కుదరక (భలే తమ్ముడు లెండి!పాదుకలడిగి అడివిలో అన్నగారికి చెప్పులు కూడా లేకుండా చేసేడు?) తను రాముడి ప్రతినిధి గానే శృంగిబేర పురం నుంచి పరిపాలన సాగించటంతో భర్తని పోగొట్టుకుని కొడుకు దృష్టిలో చెడ్డదానిగా నిలబడింది!నిదానంగా చెయ్యాల్సిన పని హడావిడిగా చేసిన దశరధుడు ఒక్కరోజులో తన జీవితాన్ని యెంత భయంకరమైన మలుపు తిప్పుకున్నాడు?!

          భరతుడు వచ్చే సమయానికి రాముడూ సీతా మంచి రొమాంటిక్ సీనులో వున్నారు?తమ్ముడు గారు చంపి తెచ్చిన మాంసాన్ని వొరుగులుగా యెండబెట్టి "సీతా!ఈ ముక్క బావుంది,తీసుకో" అనీ "కాదు కాదు,ఇదింకా బావుంది - మీరూ తిని చూడండి" అనీ ఒకరికొకరు తినిపించుకునే సరదాలో వున్నారు!ఇది యెందుకు చెప్తున్నానంటే పైన చెప్పానే రామాయణాన్ని అంత గొప్పగా పొగిడిన కమ్యునిష్టు మేధావి ఈ దృశ్యాన్ని వర్ణించగానే రామభక్తులంతా మూర్ఖంగా రెచ్చిపోయారు?తెరవెనక యెంత గందరగోళం జరిగిందో తెలియదు గానీ తర్వాత కొద్ది వారాల్లోనే ఆ సీరియల్ ఆగిపోయింది?మరి కొన్ని వారాల్లోనే అసలు ఆంధ్రజ్యోతి కూడా అదృశ్యమైపోయింది!వీళ్ళ పిచ్చి గాకపోతే రాజుగారబ్బాయి మాంసం తింటే తప్పా?ఆయనేమన్నా వైదీక బ్రాహ్మణోత్తముడా?రాముడికి పెట్టిన నియమం నారచీరలు గట్టుకుని వనవాసం చెయ్యమని గానీ మునివృత్తి చెయ్యమనీ కాదు,మౌనిత్వం వృత్తీ కాదు!ఇంకొక్క మెలిక చెప్పి తిన్నగా సీతాపహరణం దగ్గిరకి జంప్ జిలానీ ఐపోతా!రాముడు చంపిన కబంధ,విరాద మొదలైన కొందరు రాక్షసుల వధ జరిగాక వాళ్లలోంచి ఒక తేజస్సు రాముడిలో లీనమైనట్టుగా వర్ణించిన జ్ఞాపకం వుంది!శ్రీకాంత్ చారి లాంటి నాలో తప్పులు పట్టడం కోసం యెదురు చూసేవాళ్ళు పొరపాటున ఆ భాగం గనక ముక్కస్య ముక్కః చదివితే రాముడికి వాల్మీకి మహత్యాలు అంటగట్టలేదన్నావుగా,మరి దీనికేం చెప్తావు అని నిలబెట్టి వుతికి ఆరేసే ప్రమాదం వుంది గనక దాని విశ్లేషణ కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను!

          కబంధుడి వర్ణన ఇలా వుంటుంది:తల లేదు,పొట్టలో నోరు,యోజన దూరం వరకూ చాపగలిగిన చేతులు?అంతరార్ధం లెక్క ప్రకారం ఇవన్నీ మనిషిలోని దురాశకి రూపచిత్రణలు!చంపగానే తేజస్సు రాముడిలో లీనమవ్వటం వెనక దుష్టగుణాల్ని వున్నతీకరించటం అనే సూచన వుంది.మామూలుగా మనకి దుష్టగుణాల్ని గురించి చెప్పే వారంతా నిగ్రహం,శమం,దమం గురించి మాత్రమే చెప్పారు గానీ వాటిని వున్నతీకరించటం అంటే యేమిటో యెవరూ చెప్పలేదు.ఈనాటి ఒక సైకో అనలిష్టు చెడు లక్షణాల్ని పోగొట్టుకోవటానికి, "మీ పక్కింటి కుర్రాడు మీ ఇంట్లో అల్లరి చేస్తున్నాడనుకోండి,యేమి చేస్తారు?వాడి తలిదండ్రుల్ని పిలిచే లోపు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్లో దేన్నో ఒకదాన్ని పగల గొట్టనూ వచ్చు!ఒకటే దారి - వాడిని మెల్లగా మచ్చిక చేసుకుని ఆ కబురూ ఈ కబురూ చెబుతూ చల్లగా గుమ్మం దాటించి తలుపేసుకోవటం, ఇదంతా చాలా ఓర్పుగా నేర్పుగా చెయ్యాలే తప్ప పిల్లాడే గదాని తన్నేస్తే పగబట్టి వేధిస్తాడు?!" అని ఒక సరదా పిట్టకధ చెప్పాడు.వాల్మీకి సూచించిన దుష్టగుణాల్ని వున్నతీకరించటంలో వున్న ప్రాక్టికాలిటీ కూడా ఇదే!

          సీతాహరణం జరిగిన కాలాన్ని లెక్కిస్తే పట్టాభిషేకం తప్పిపోవటం లాగే దురదృష్టం మరోసారి విరుచుకు పడ్డట్టు అనిపించి యెలాంటివాడికయినా అలాంటివి పగవాడిక్కూడా జరగకూడదనిపించేటంత జాలి వేస్తుంది ఆ దంపతుల మీద!సీతాహరణం జరిగాక వెతుక్కుంటూ తిరిగి తిరిగి శబరి ద్వారా సుగ్రీవుణ్ణీ కలుసుకోవడానికి సుమారొక రెండు మాసాలు గడిచినట్టు చెప్తాడు,వాలివధ తర్వాత రాజ్యం రాగానే సుగ్రీవుడు కొన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తాడు,లక్ష్మణుడి ధాటికి జడిసి అగ్గగ్గలాడుతూ వొచ్చిపడి వర్షాకాలంలో వెతకటం కష్టం అది కాగానే వెతకటం మొదలు పెడతానంటాడు,ఇదంతా జరిగి హనుమంతుల వారు చెట్టుకొమ్మల మీద నుంచి సీతా రావణ సంవాదం వింటున్నప్పుడు వాడు "ఒక మాసం లోపు నాకు లొంగకపోతే మరుసటి రోజున ప్రాతఃకాల భోజనం చేస్తాను నిన్ను?!" అంటాడు. రావణుడు సీతతో ఆ కారుకూత కూసిన నెల తిరిగే లోపు రణభూమిలో హతమారిపోయి తనే కాకులకీ గద్దలకీ ప్రేతభోజనమై పోయాడు!మాయ మొదట దుర్మార్గుడితో వాడి అంతాన్ని వాడి నోటితోనే చెప్పిస్తుంది యెదరున్న సజ్జనులకి చేస్తాననేటట్టు?అప్పుడు హరి రంగంలోకి దిగి వాడు యేదయితే యెదటివాళ్ళకి చేస్తానని విర్రవీగాడో వాడికి దానినే విధిగా చేసి చూపిస్తాడు - హరిమాయ?!అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు సమయమెరిగి చేసే దుష్టశిక్షణ అట్లాగే వుంటుంది!,రావణ వధ జరిగాక వీళ్ళు పుష్పకం మీద వెళ్ళేనాటికి భరతుడు అగ్నిప్రవేశానికి సిధ్ధమై వున్నాడు - ఇవన్నీ యెంత వుజ్జాయింపుగా లెక్కేసినా పదమూడు సంవత్సరాల తర్వాతే జరిగి వుండొచ్చు ఆ దుర్ఘటన?!

        యెక్కడి అయోధ్య!యెక్కడి చిత్రకూటం!యెక్కడి రాజభవనం?యెక్కడి పర్ణశాల?మాంసం వొరుగులే పంచభక్ష్య పరమాన్నంగా తిన్నారు!అడివిలో మాత్రమే దొరికేవీ రాజభవనంలో దొరకనివీ అయిన ప్రతిదాన్నీ దాచి పెట్టుకోవటమే సీతకున్న వ్యాపకం! అయోధ్య వెళ్ళాక మిగిలిన ఆడవాళ్ళకి చూపించి "మేం ఇంత హాయిగా బతికాం తెలుసా!" అని గొప్పగా చెప్పుకుని వాళ్ళంతా కుళ్ళుకునేలా చెయ్యాలని ఆలోచిస్తున్న అతి సామాన్యత్వం సీతది!ఆ ఘటన జరక్కుండా వుండి ప్రశాంతంగా అయోధ్యకి తిరిగి వెళ్ళగలిగీతే కల్పవృక్షపు తరుచ్చాయల్లో గడిపినట్టుగా అనిపిస్తూ ఒక మధురానుభవంలా మిగిలిపోవలసిన వనవాసం శూర్పణఖ అనే కాముకురాలి రంగప్రవేశంతో విషవృక్షపు గంధక ధూమం విసిరికొట్టినట్టుగా అనిపిస్తూ గుర్తు చేసుకోవడానికే మనస్కరించనంతటి భయంకరమైన అనుభవంగా మారింది,యేమి నాటకీయ విషాదం?!

          ఈ శూర్పణఖ లంకాధిపతి అయిన రావణుడి చెల్లెలు!వాడు యెడాపెడా యుధ్ధాలు చేస్తూ ఆ హడావిడిలో దీని మొగుణ్ణి కూడా మట్టగించేస్తే ఇది పోయి నేను బతికేదెట్టా అని గగ్గోలు పెడితే పోయి దండకారణ్యాన్ని యేలుకో మంటే పుట్టింటోళ్ళూ తరిమేశారూ కట్టుకున్నోడూ ఖతమైపోయాడూ అని పాడుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్నది మహాజనానికి మరదలు పిల్లలాగ! సీత ఖర్మ కాలి దీనికి రాముడు నచ్చాడు?వింత వింత మేకప్పు లేసుకుని తక్కుతూ తారుతూ వొచ్చి రాముణ్ణి అడిగేసింది తన కోరిక తీర్చమని!మొత్తం కధలో యెవరితోనూ హాస్యాలాడని గంభీర మూర్తి రాముడు దీనిమీద జోకు లెయ్యడం చూస్తే ఆ ఆడమనిషి యెంత చవకబారుదో అర్ధం చేసుకోవచ్చు!పెళ్ళి చేసుకుని సాధికారిక శృంగారంతో పరస్పరం ఆనందించాలనే ఔన్నత్యపు కోరిక కూడా కాదు కేవలం నరాల వేడి చల్లబరుచుకోవాలనే పశుకామపు సరదా?అన్నా చెల్లెళ్ళిద్దరిదీ భలే జారత్వపు జాతం - చెల్లెలు పరాయి మొగోడ్ని మోహిస్తే అన్న పక్కోడి పెళ్ళాన్ని ఆశించాడు!వీళ్ళిద్దర్నీ గౌరవనీయులుగా నిలబెట్టి రాముడు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడనీ సీత రావణుణ్ణి లోలోపల ఇష్టపడిందనీ ఆ పాతివ్రత్యమూ ఈ యేకపత్నీవ్రతమూ జనంలో మెప్పుకోసం చేసిన నటననే విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వెక్కిరించాలని చూసిన వాళ్ళు అన్నింటినీ యదార్ధాల ప్రాతిపదిక మీద విశ్లేషించాలని చెప్పే ఘనమైన కమ్యునిష్టు తాత్విక చింతన ప్రకారం చూసినా నిజంగా గౌరవనీయులేనా?

        దాని తింగరితనానికి రాముడు నవ్వేసి "అమ్మాయీ!నేను పెళ్లయిన వాణ్ణి.నాకిలాంటి వాటి మీద వ్యామోహం లేదు. పెళ్ళి చేసుకున్నా సవతి పోరు వుంటుంది. మా తమ్ముడున్నాడు,నాకన్నా అందగాడు" అని లక్ష్మణుడి కేసి పంపించాడు.నిజమే గదా నల్లోడి కన్నా ఎర్రోడు మాంచి షోగ్గా వున్నాడనుకుని లక్ష్మణుడి దగ్గిర కెళ్తే "చూశావుగా!తమ్ముణ్ణని కూడా చూడకుండా కులుకుతూ నాతో పన్లన్నీ చేయించుకుంటున్నాడు!నాపక్కన జేరితే నీకూ ఈ చాకిరి తప్పదుగా!యెందుకొచ్చిన గోల చెప్పు?!" అని తనూ నవ్వాడు.దాంతో ఈ యెగతాళి అర్ధమయి కోపమొచ్చింది, ఇంతలో సీతని చూసింది, అన్ని సింగారాలతో వున్న తనకన్నా నారచీరల్తోనే సీత అందంగా యెందుకుందనేది ఆలోచించకుండా అందంగా వున్న ఆడది పెళ్ళాంగా వుండటం వల్లనే నన్ను కాదంటున్నాడు అనే రీజనింగు తీసుకుని సీతని చంపడానికి బయల్దేరింది?!అది సీతని చేరే లోపు  అప్పటిదాకా ఆడదనే భావంతోనే తిట్టడం దేనికిలే అని అలా హాస్యాలకి దిగిన రాముడు తమ్ముణ్ణి హెచ్చరించటం కోపమొస్తే ముందూ వెనకా చూడకుండా కాటువేసే పాములాగా లక్ష్మణుడు కన్నుమూసి తెరిచేలోగా దాని ముక్కూ చెవులూ కోసెయ్యడం జరిగిపోయింది!గాయాలకి కట్టు కట్టుకుందో లేదో వాల్మీకి చెప్పలేదు గాబట్టి ఆ రూపంతోనే పోయి ఖరధూషణుల్ని వుసిగొలిపింది.వీళ్ళు 14,000 మంది సైన్యంతో వచ్చిపడినా ఒకే ఒక్క కోదండంతో రాముడు పాస్పోర్టు లడక్కుండా వొచ్చినవాళ్ళందరికీ ఎంట్రీ ఇచ్చే యమసదనానికి పంపించటంతో ఇంకా మొండిగా అదే వూపుతో పెద్దన్న రావణుడి దగ్గిరికి పోయి పడింది!సీత అందం గురించి వర్ణించి చెప్పి యెత్తుకొచ్చి పండగ జేస్కోమని నీచపు సలహా ఇచ్చింది, యేమి ఆడతనం దానిది?తను చెడింది గాక తన చెత్తకోరిక తీరడానికి అడ్డంగా వున్నదని మరొక ఆడదాన్ని చెడగొట్టాలనుకునే ఆడదాన్ని యేమని పిలవాలి?ఆ ఆడదాన్ని మంచిదని కధలు చెప్పి సమర్ధించిన మరో ఆడదాన్ని యేమని పిలవాలి?

          ఆ చెల్లికి అన్న గదా!పెళ్ళయితేనేం,పిల్లయితేనేం,తల్లయితేనేం,పండు ముసిల్దైతేనేం అనుకునే ఇవ్వాళ్టి కక్కుర్తిగాళ్లకి మూలపురుషుడు గదా! వీడు పోయి మారీచుడి ముందు పెట్టాడు ఒక మాస్టర్ ప్లాను?ప్లాను సంగతి తర్వాత రాముడి పేరు వినగానే వాడు కంగారు పడ్డాడు?!చిన్నప్పుడు విశ్వామిత్రుడికి సహాయంగా వెళ్ళిన చోట అల్లరి చేస్తున్న మారీచ సుబాహులనే వాళ్లలో వీడూ ఒకడు.సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో కొడితే వాడు బూడిదై పోయాడు!ఒకే అస్త్రం రెంసార్లు వాకూదు గనక వీణ్ణి వాయువ్యాస్త్రంతో కొడితే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి "కొట్టిందెవరో తెలీదు గానీ లేపింది మాత్రం నన్నే" అన్నట్టు అక్క కొడితే ఇక్కడ కొచ్చి పడ్డాడు వీడు!ఆ దెబ్బకి రాక్షసత్వం వొదిలేసి కందమూలాలు తింటూ తపస్సులో మునిగి వున్నాడిప్పుడు?వయస్సులో రావణుడి కన్నా పెద్దవాడయ్యుంటాడు - ముక్కచివాట్లేశాడు!"యెప్పుడో కొట్టిన దెబ్బకి ఇప్పటికీ చుక్కలు కనిపిస్తున్నయి నాకు,రాముడు అనే పూర్తిపేరు గాదు ర అనే అక్షరం వినపడ్డా వులిక్కిపడి చస్తున్నాను,నీకీ యెదవ సలహా యెవడిచ్చాడో గానీ లంకకి చేటు తెచ్చినట్టే,మర్యాదగా వెనక్కి వెళ్తే క్షేమంగా వుంటావు" అని యెంత చెప్పినా "ఎహే,అసలు యెత్తుకొచ్చింది నేనని తెలియదు గదా నేనేసిన ప్లాను ప్రకారం - నామాట వింటావా నాచేతులో చస్తావా?" అనేసరికి మారీచుడు "నీలాంటి పాపిష్టోడి చేతుల్లో చావడం కన్నా ఆలాంటి పుణ్యాత్ముడి చేతుల్లో చావడమే బెస్టు!" అని విసుక్కుంటూ వొప్పుకున్నాడు.హ్యారీపోటరు కధల్లో మాదిరి ఈ మారీచుడికి జంతువుగా మారే శక్తి వున్నట్టూ ధ్వన్యనుకరణ కూడా తెలిసినట్టూ కల్పించాడు వాల్మీకి!రావణుడి ప్లాను మారీచుడు కాంచనమృగం లాగ మారి రామలక్ష్మణుల్ని దూరంగా తీసుకెళ్తే తను ఒంటరిగా వున్న సీతని మళ్ళీ రామలక్ష్మణులు తిరిగొచ్చే లోపు తన ఆనవాళ్ళు కూడా తెలియకుండా యెత్తుకు పోవాలని.మరీచిక అంటే యెండమావి!కాంచనమృగం అంటే బంగారు లేడి!అన్ని కాలాల్లోనూ కొందరు ఆడవాళ్ళు మిగతావాళ్ళ కన్నా గొప్పగా కనబడాలని యెక్కువ బంగారం కోసం భర్తల్ని యెండమావుల వెంట పరిగెత్తిస్తూ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి అనంతవిషాదాన్ని మూటగట్టుకోవటం చూస్తుంటే వాల్మీకి యెంత రియాలిటీని చూపిస్తున్నట్టు?!

          సీతకి ఇక్కడివన్నీ పోగేసుకుని అయోధ్యకి తీసుకుపోవాలనే అమాయకపు ముచ్చట వుండటం రావణుడికి కలిసొచ్చింది!లక్ష్మణుడు రోజూ అడివంతా కలయదిరిగేవాడు గనక ఇప్పటి దాకా కనబడనిది ఇప్పుడెలా వచ్చింది రాక్షస మాయ కావచ్చునన్నా భార్య గారాబంగా అడిగితే వుబ్బులింగడై యెంత కష్టమయినా తీర్చాలనుకునే మామూలు భర్త మనస్తత్వంతో మర్మమయితే చేదించి వస్తాన్లే నువ్వు మాత్రం సీతని వదిలి పోవద్దు అని చెప్పి రాముడొక్కడే వెళ్ళాడు?మరి లక్ష్మణుణ్ణి దూరంగా పంపించాలి గదా!విసుక్కుంటూ వెళ్ళినా క్రియేటివిటీ వున్నవాడు గాబట్టి దానికి ఠస్సా మారీచుడు వేశాడు - చస్తూ చస్తూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేశాడు.కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టు రాముడు వీరాధివీరుడని తెలిసినా సీత భయపడి పోయి లక్ష్మణుణ్ణి సాయంగా వెళ్ళమని తొందర పెట్టింది.ఒక్కరోజులో రాజరికం కాస్తా వనవాసానికి దారి తీసినట్టు అనుకోనిది యేదయినా జరిగిందేమోననే ఆలోచన విచక్షణని కోల్పోయేలా చేసి వుండొచ్చు వెళ్ళనని మొండికేస్తున్న లక్ష్మణుణ్ణి అనకూడని మాట అనేసింది "మీ అన్నగారు పోతే నన్ను పెళ్ళాడదామని చూస్తున్నావు" అని?!వెళ్ళేందుకు ఒప్పించటానికే అన్నా లక్ష్మణుణ్ణి అస్సలు అనకూడని మాట గదా అది?తనంటే భార్య గాబట్టి తోడుగా వచ్చింది,లక్ష్మణుడికేం ఖర్మ వీళ్ళతో వచ్చి వీళ్ళకి పనివాడిగా వుండటానికి!రావణుడు తనని యెత్తుకెళ్తూ జటాయువుతో యుధ్ధం చేసే హడావిడిలో వున్నప్పుడు తను విసిరిన నగల మూటని ఆంజనేయ భగవాన్లు దాచి వుంచి రామలక్ష్మణులకి చూపిస్తే రాముడు దుఃఖంతో కళ్ళు మసకలు గమ్ముతున్నాయి నువ్వు చూడమన్నప్పుదు బయటి కెళ్ళేటప్పుడు నమస్కరించి వెళ్ళేవాణ్ణి గాబట్టి కాలి అందెల్ని తప్ప మిగిలినవాట్ని నేనూ గుర్తు పట్టలేనంటాడు!అట్లాంటి లక్ష్మణుణ్ణి అంతమాట యెట్లా అనగలిగింది!ఒకదాని మీద వ్యామోహం యెక్కువగా వుండి అది దూరమవుతుందేమోనన్న భయం గనక కలిగితే మనిషి యెంత చిత్రంగానైనా ప్రవర్తిస్తాడు!సరిగ్గా ఈ పాఠాన్నే తనకప్పటికి తెలిసొచ్చిందన్నట్టు అశోకవనంలో మెడకురి బిగించుకోబోయిన సన్నివేశంలో సీత నోటి నుంచే చెప్పిస్తాడు వాల్మీకి.

          అలా లక్ష్మణుడు కూడా దూరం వెళ్ళాక సాధువు వేషంలో వచ్చి భిక్షమడిగి దగ్గిరగా వచ్చాక మొదలు పెట్టాడు దాడి!యెంత పెనగులాడినా యేమి లాభం?దణ్ణాలు పెట్టినా జాలిపడ్డం లేదే ఇవ్వాళ్టి రేపిష్టులు!వీళ్ళు చేసేవన్నీ వాడూ చేశాడు, చెట్టుని కావిలించుకుంటే జుట్టుపట్టి లాగి నెప్పి భరించలేక చేతుల పట్టు వొదిలేసి ఆ వూపుకి కిందపడేలా చెయ్యడం నుంచి నడుం మీదా పిరుదుల మీదా పిడికిళ్ళతో వుడుం పట్టు పట్టి యెత్తి రధంలో కూలవెయ్యడం వరకూ కామం కళ్ళకి పొరలు గమ్మిన మదాంధుడు అసహాయురాలైన స్త్రీమీద యెంత భయంకరంగా దాడి చెయ్యగలడో అంత భయంకరంగా జరిగిన భీభత్స కాండతో రెచ్చిపోయిన రావణుడు, స్త్రీత్వం పట్ల గౌరవం వున్నవాడెవడయినా అసహ్యించుకోదగిన రావణుడు - శీఘ్రస్ఖలనాలతో తడిసిపోవటానికి తప్ప మరెందుకూ పనికిరాని చెత్త సాహిత్యాన్ని సృష్టించిన గుడిపాటి వెంకట చలం అనే గొప్ప రచయితకి సీతని అపురూపంగా ప్రేమించిన ఆదర్శ ప్రేమికుడిలా కనపడ్డాడు, అమ్మతోడు -  నిజం?!

          గుర్రాల స్థానంలో గాడిదలు వున్న రధం మీద వొచ్చి తనకున్న అతీంద్రియశక్తులతో రధంతో సహా గాలిలో ప్రయాణిస్తూ మధ్యలో అడ్డుకోబోయిన జటాయువుని రెక్కలు నరికి తప్పించుకుని తిన్నగా తన లంకా నగర రాజ్యానికే తీసుకుపోయి తనకున్న అతి గొప్ప భవనాలన్నిట్నీ తిప్పి చూపించినా వాటిల్లో చచ్చినా వుండనని చెప్పటంతో తనకే విసుగు పుట్టి అశోకవనంలో వుంచాడు.స్త్రీ తనంతట తను వరించి వస్తేనే మజా వుంటుందని తెలుసు గనక నన్ను వరించి సుఖపెట్టమని ఒత్తిడి చెయ్యటమే తప్ప యెట్లాగయినా అనుభవించి పారేద్దామని అనుకోకపోవడం వల్ల ఇవ్వాళ్టి కక్కుర్తివెధవల కన్నా వున్నతుడే!ఇక్కడ రామలక్ష్మణులు సీత కోసం గాలిస్తూ ఉంటే మొదటి అదృష్టం శబరి రూపంలో కనపడింది!శబరి కర్రపోటేసుకుని వొణుక్కుంటూ వొచ్చి యెంగిలి పళ్ళు తినిపించిన పండుమసలి కాదు దివ్యతేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనస్థయై రామలక్ష్మణులకి సుగ్రీవుడి గురించి చెప్పి అతని దగ్గిర మంత్రిగా వున్న హనుమంతుడనే కార్యసాధకుడున్నాడు అతనివల్ల మీకార్యం తప్పక నెరవేరుతుందని ధైర్యం చెప్పి చూస్తుంగానే యోగాగ్నిలో దగ్ధమైపోగలిగిన మహాయోగిని!అక్కణ్ణుంచి మళ్ళీ సుగ్రీవుడి కోసం ఋష్యమూక పర్వతం వైపుకి బయల్దేరినప్పుడు మొట్టమొదటిసారిగా అంతరార్ధం ప్రకారం ఆచార్య స్థానంలో కనబడే శ్రీ మదాంజనేయ గురువరేణ్యుడు "మా భయ!మా సంవిక్త!" అంటూ కధలోకి ప్రవేశిస్తాడు.

          అలా ప్రవేశించిన సుగ్రీవసచివుడు వారిద్దరికీ సఖ్యత నేర్పరచి రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుని చేస్తే సుగ్రీవుడు రామకార్యాన్ని నెరవేర్చే విధంగా వుభయతారకమైన వ్యూహం సిధ్ధం చేశాడు!ఇక్కడ మళ్ళీ నగల మూట కనబడటం మరో గొప్ప క్లూ!ఆ నగల మూట వల్లనే ఆమె సీతయేనని తెలిసింది గనక అందరికీ పని తేలికైంది,లేకపోతే ఇంత కధా నడిచాక ఆ స్త్రీ సీత కాదు రావణుడు అలవాటుగా యెత్తుకొచ్చే ఆడవాళ్ళలో మరొకరు అని తెలిస్తే?మళ్ళీ సీతకోసం వెతుకులాట మొదటి కొచ్చినట్టే గదా!ఇవ్వాళ్టి వాలి ఫ్యాన్స్ అసోసియేషను వాళ్ళు మా హీరో వాలిని చెట్టుచాటు నుంచి చంపిన విలన్ మీ రాముడు అని ప్రతి శ్రీరామనవమికీ నల్లబ్యాడ్జీల వూరేగింపు చేస్తారు గానీ వాస్తవంగా ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటి కొచ్చి యుధ్ధం ఆపేసి చూస్తున్న వాణ్ణి యెదుర్రొమ్ము మీదకి అమ్ము వేసి చంపాడు!కొందరు వాలిగాడికి యెదటివాళ్ళ బలాన్ని లాక్కునే శక్తి వుందనే కల్పన ఒకటి ప్రచారంలోకి తెచ్చారు గానీ అలాంటి పిచ్చి వూహలు వాల్మీకి మహాశయుడికి రాలేదు.ఈ మట్ట్టిబుర్రలకి తట్టని డౌట్లు గూడా అడిగాడు.మీరు కోతిమాంసం తినరు గదా నన్నెందుకు చంపావు అని యెటకారాలు గూడా వాగాడు."నువ్వే నాతో యుధ్ధం చేసి చంపొచ్చు గదా అంటున్నావు నువ్వూ నేనూ సమ వుజ్జీలం కాదు,తమ్ముడేమి చెప్తున్నాడో వినకుండా నీకు నువ్వే వూహించుకున్న కారణాలతో అమాయకుణ్ణి వేధించటమూ వావి వరుసలు మర్చిపోయి తమ్ముడి భార్యని వరించినందుకు నిన్ను శిక్షించడమే నా లక్ష్యం తప్ప నీతో యుధ్ధం చేసి నిన్ను గెలవాల్సిన అవసరం నాకు లేదు.నన్ను కలిస్తే రావణుడితో మాట్లాడి నా భార్యని అప్పగించేవాణ్ణిగా అంటున్నావు నీలాంటి వాడి నుంచి నేను సహాయం తీసుకోను - అది నా ధర్మానికి విరుధ్ధం.ఇది మా వానర రాజ్యానికీ అన్నదమ్ములకీ సంబంధించిన సొంత విషయం కదా నీకేం హక్కుంది కలగజేసుకోవటానికి అంటున్నావు,అట్లా కుదరదు.నా చేత కోదండ ముంది,యేది ధర్మమో యేది అధర్మమో తెలుసు. ధర్మం తెలిసిన శక్తిమంతుడికి అధర్మపరుల్ని నిగ్రహించడానికీ ధర్మాన్ని స్థాపించడానికీ స్థలకాలాలు వుండవు!" అని అన్ని ధర్మసూక్ష్మాలూ వివరించి చెబితే నోర్మూసుకుని కన్నుమూశాడు!?ఒక్క వాలి తప్ప రామ బాణం తగిలిన వాళ్ళంతా మంచినీళ్ళక్కుండా చచ్చారు,బహుశా ఈ వాలి ఫ్యాన్సు అసోసియేషను వాళ్ళకి జవాబులు చెప్పించటం కోసమే వాల్మీకి వాలికి ఆ ప్రత్యేకతని కట్టబెట్టాడేమో?!

        వాలివధ అనంతరం సుగ్రీవ పట్టాభిషేకం తర్వాత వర్షర్తువు ముగిశాక మళ్ళీ అందరూ కలిశారు.జటాయువు చెప్పిన దాని ప్రకారం లంక వైపుకే వెళ్ళినా రావణుడు ప్రపంచంలో అన్ని రాజ్యాల్నీ ఓడించిన వాడు గాబట్టి యెక్కడైనా దాచవచ్చు సీతని.అందుకని ముఖ్యులైన జాంబవంతుడూ హనుమంతుడూ అంగదుడూ లాంటి వాళ్లని లంకానగరం వైపుకి పంపించి మిగతావాళ్ళని కూడా అన్నిదిక్కులకీ పంపించాడు సుగ్రీవుడు. లంక వైపు వెళ్ళిన వాళ్ళలో వున్న హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించి దాటి లంకని చేరాడు.అశోకవనంలో సీతని చూశాడు.ఆమెకి చెప్పాల్సిన విధంగా ధైర్యం చెప్పి ఆనవాలు కూడా తీసుకున్నాడు.పుల్లయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు రానూ వచ్చాడు గానీ యెందుకెళ్ళావురా అంటే మాత్రం రాత్రి మీరు రేప్పొద్దున్న పుల్లయ్యని వేమవరం వెళ్ళిరమ్మనాలి అనుకోవడం విన్నాను గాబట్టి వెళ్ళాను వచ్చాను అన్నట్టు హనుమంతుడు కూడా చూసిరమ్మన్నారు గాబట్టి చూసొచ్చాను అంతకి మించి నన్నడక్కండి అంటే దద్దమ్మకి దద్దమ్మ మేధావిలా కనబడినట్టు ముప్పాళ రంగనాయకమ్మకి తెలివిగా కనబడి వుండేదేమో గానీ హనుమంతుడికి మాత్రం వెంటనే ఇక్కణ్ణుంచి దాటుకుని వెళ్ళవడం కన్నా ఇక్కడ తను చెయ్యాల్సింది ఇంకొంచెం వుందనిపించింది - అది యెంత తెలివైన పనో నేను చెప్తాను వినండి! వీళ్ళు తనకేదో హాని చేస్తారనే భయం లేదు, రావణుణ్ణి కలవాలి, వాడి బలమేంటో తెల్సుకోవాలి, కలిసి మాట్లాడాలి, నయానో భయానో మనవైపు నుంచి మనం కూడా ఒక మాట చెప్పి చూడాలి గదా, మనం చెప్పే మాట గట్టిగా చెప్పగలిగితే వాడు మాటల్తోనే లొంగివస్తే ఇక్కడికిక్కడే నూరుశాతం పని పూర్తయిపోయినట్టు గదా, పుల్లయ్య లాగా వెళ్ళాను చూశాను వచ్చాను అని చెప్తే అప్పుడైనా మళ్ళీ యెవడో ఒకడు ఇంతదూరం మళ్ళీ దూతగా రావాల్సిందే గదా - ఇవ్వన్నీ ఆలోచించిన లంకా భయంకరుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి తనకి తనే పట్టుబడి మొత్తానికి రావణుడి ముందు కెళ్ళాడు!ఈ అశోకవనాన్ని ధ్వంసం చెయ్యడం తర్వాత లంక మొత్తం తగలబడినా సీత క్షేమంగా వుండటానికి పనికొచ్చింది?!


(గూగులమ్మ కానుక)

         చాలా వాదన జరిగింది ఇద్దరి మధ్యా."ప్రస్తుతం నీ అధీనంలో నీకు లొంగివున్న ఆడవాళ్ళంతా నువ్వు యుధ్ధాల్లో గెలుచుకొచ్చిన వాళ్ళూ నీ వైభవాన్ని చూసి మోహపడి వరించిన వాళ్ళూ, ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం పాపమే!" అని పావని అంటే "నేను శివుడి ఆత్మలింగాన్ని సాధించిన శివభక్తుణ్ణి, యెన్నో పుణ్యకార్యాలు చేశాను ఒక్క సీతాపహరణం అనే పాపం నన్నేమి చేస్తుంది?" అన్నాడు రావణుడు.చాలా గొప్ప సమర్ధన ఇది!ఇప్పుడు మనం కూడా ఇలా మాట్లాడే వాళ్లనీ పైకి అనకపోయినా మనసులో ఇలాంటి ఆలోచన తోనే పది పాపాలు చేసి యేదో ఒక గుడికి యేవరో ఒక దేవుడికి ఒక కైంకర్యం చేయించో ఒక కానుక ఇచ్చో దేవుణ్ణ్ణి కూడా తమ పాపాలకి పార్ట్నర్ని చేసేశాం గనక మనం బేఫికరుగా వుండొచ్చుననుకునే వాళ్లని చూస్తూనే వున్నాము గదా!అదీ వాల్మీకి రామాయణం యొక్క సార్వకాలిక లక్షణం,అందువల్లనే ఇంతకాలం నిలబడింది, ఇకముందు కూడా నిలబడుతుంది!ఆ పొగరుకి విరుగుడుగా "నిజమే, నువ్వు పుణ్యాలు చెశావు.దాని ఫలితం మీద నీకు నమ్మక ముంది.కానీ పాపానికి కూడా ఫలితం వుంటుంది గదా!దాన్ని కూడా అనుభవించాల్సిందే గదా?సీతని వదలకపోతే నీ పుణ్యానికి సరిపడా వైభవం పూర్తయిపోతుంది.రెండోది దాని పని మొదలు పెడుతుంది - ఆలోచించుకో" అని వాడు పట్టించుకోవడాని కిష్టపడని అసలు పాయింటు చెప్పాడు.దుర్మార్గుడికి వాడిని కార్నర్ చేస్తున్నట్టు కనిపించే నీతుల్ని చెప్తే ఇంకా రెచ్చిపోతాడు!మంచి చెప్పిన వాడు తన కోరికని తీర్చుకోవడాని కడ్డమొచ్చే దుర్మార్గుడిలా కనబడతాడు?మొదట వీణ్ణి సంహరించెయ్యమన్నాడు, విభీషణుడు ఆపి దూతని చంపగూడదు యేదో ఒకటి చెయ్యల్సిందే ననుకుంటే అవమానించి పంపించెయ్యవచ్చు అని ధర్మసూక్ష్మం వివరిస్తే తోక కాల్చి వదల మన్నాడు.ఈ బుధ్ధిమంతుడు దాంతో లంకనంతా కాల్చి సముద్రంలో ముంచి చల్లార్చుకుని మరోసారి సీతని చూసి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. హనుమంతుడి ద్వారా విషయమంతా తెలుసుకుని ఇక యుధ్ధమే శరణ్యమని సైన్యసమేతంగా మళ్ళీ లంకనగరం చేరారు అందరూ. కాల్చడానికి లంక మొత్తం తిరిగాడు గాబట్టి రావణుడి బలాబలాలు కూడా తెలుకోగలిగి వుండటంతో సైన్యసంచాలనానికీ వ్యూహనిర్మాణానికీ పూర్తిగా ఆంజనేయుడి మీదనే ఆధార పడ్డాడు రాముడు. అయోధ్యలో జరిగిన కధకి "అయోధ్య కాండ" అనీ దండకారణ్యంలో జరిగిన  కధకి "అరణ్య కాండ" అనీ కిష్కింధలో జరిగిన కధకి "కిష్కింధ కాండ" అనీపేరు పెట్టిన వాల్మీకి వాలి వధ అనంతరం జరిగిన ఈ మొత్తం కధ వున్న భాగానికి "సుందర కాండ" అని పేరు పెట్టాడు,యెందుకని?.వరస ప్రకారం "లంకా కాండ" అని పెట్టాలి, అవునా!అన్నిటికీ మూస పధ్ధతిలో పోవడానికి వాల్మీకి అట్టాంటిట్టాంటి రొడ్డకొట్టుడు రచయిత కాదు,"పుంసాం మోహన రూపాయ" అని చెబ్బబడే మగవాళ్లలోకల్లా అందగాడూ "సీతే జగత్సుందరీ" అని చెబ్బబడే ఆవాళ్లలోకల్లా అందగత్తె తమ స్వభావంలో వున్న ప్రత్యేకతల్ని చూపిస్తారు!వీళ్ళిద్దరికీ సుందర నామధేయుడైన హనుమంతుడు ఒకరి క్షేమాన్ని మరొకరికి చెప్పి ఆనందం కలిగిస్తాడు,ఆ విశేషాన్ని సూచించడానికే అట్లా చేశాడు.చదివే వాళ్ళకి కూడా దీన్ని మీరు ఇంకొంచెం శ్రధ్ధగా చదవాలి అనే హెచ్చరిక వుంది అందులో?!

          సకల దేవతా గణాలూ ఆకాశాన చేరి ఇప్పటికయినా రావణపీ వొదుల్తుందనే ఆశతో ధైర్యంగా రాముడికి సహాయాలు కూడా అందించగా, అరిషడ్వర్గాలని జయించిన దేవర్షి సంఘాలలో కూడా యెవరు గెలుస్తారో ననే వుత్సుకతా లోపల్లోపల రాముడే గెలవాలనే మోహం పుట్టగా వారు జపతపాల సంగతి కూడా మర్చిపోయి వుద్విగ్నంగా చూస్తూ వుండగానే కేవలం పక్షం రోజుల్లో అంతవరకూ యెవ్వరికీ జయింపశక్యంగాని రావణుడు రాముడు వేసిన బాణాల రూపంలో వచ్చిపడిన తన పాపాల ధాటికి హతమారి పోయి కాలీకాలనికాష్ఠంగా మిగిలిపోయా డిప్పటికీ కాల్తూనే వున్నాడు?!

          రావణ సంహారం జరిగిపోయింది!విభీషణుడు రాజయ్యాడు!తన పట్టాభిషేకం జరిగేటప్పుదు రాముడు వుంటే బాగుంటుందని విణీషణుడు అడిగితే పురప్రవేశం నాకు నిషిధ్ధం నా బదులుగా లక్ష్మణుడు వస్తాడని సున్నితంగా తిరస్కరించి నియమ పాలనకే కట్టుబడ్డ సత్యవిక్రముడు రాముడు!అయోధ్యకి చేరుకోవడానికి సమయం తక్కువగా వుంది గనక విభీషణుడు పుష్పక విమానంతో సిధ్ధమయ్యాడు.ఇక రావలసినది సీత!అంతటి అపురూపమైన స్త్రీని అప్పటిదాకా చూడని వాళ్లంతా ఆమెని చూడాలని మీదకి తోసుకొస్తుంటే వెనక్కి తోస్తున్న వాళ్ళని యెవరూ వూహంచని విధంగా అలా చెయ్యవద్దని గద్దించాడు రాముడు?అతని వాలకం కూడా వింతగా వుంది!అంతకాలం దూరంగా వున్న భార్య దగ్గిర కొస్తున్నదనే సంతోషం లేదు,మొహం గంటు పెట్టుకుని వున్నాడెందుకో?పలికిన మాటలూ వినపడిన గొంతూ మాటల్లోని భావమూ అన్నీ పరుషంగా వున్నాయి - అందరూ చేష్టలుడిగి చూస్తున్నారు!దగ్గిరకొచ్చి నిలబడిన సీతతో అతడు మాట్లాడినవి చాలా తక్కువ మాటలు. - "అపహరించబడిన భార్యని తిరిగి సాధించుకోలేని అసమర్ధుడు రాముడు అనే చెడ్దపేరుని భరించలేకనే కేవలం వంశప్రతిష్ఠ కోసమే రావణుడితో యుధ్ధం చేసి అతని చెరనుంచి నిన్ను విడిపించాను కానీ నీమీద మోహంతో కాదు.నిన్ను నేను స్వీకరించను.ఇక్కడ జాంబవంతు డున్నాడు,సుగ్రీవు డున్నాడు,లక్ష్మణు డున్నాడు.వీరిలో యెవరినైనా నువ్వు చేపట్టవచ్చు" అని ముఖం పక్కకి తిప్పుకుని మాట్లాడకుండా వుండిపోయాడు!రామాయణంలో అత్యంత వివాదాస్పదమయిన సన్నివేశం ఇదే.రాముడి మాల్లో వున్న కాఠిన్యం తప్పులు పట్తేవాళ్లకి చాలా హుషారు ఇచ్చింది.రాముడే పరీక్ష పెట్టి అందులో నెగ్గితేనే నిన్ను స్వీకరిస్తానని అన్నట్టుగా ఈ సన్నివేశానికి కూడా "అగ్ని పరీక్ష" అని పేరు తగిలించి రాముడు మొత్తం స్త్రీజాతినే అవమానించిన పురుషాదిక్య సమాజానికి ప్రతినిధిగా ముద్రవెయ్యడానికి పనికొచ్చిన సన్నివేశ మిది!అప్పటి వరకూ అన్ని విశేషణాలతో తను ఆదర్శవంతుడని పొగిడిన రాముడి చేత అంతగానూ పొగిడి లోకంలో ఆదర్శవనితగా నిలబెట్టాలని చూసిన సీతని అవమానించాలనే దుర్బుధ్ధిని వాల్మీకి రాముడి కెందుకు అంటగడతాదనే సందేహం కూడా రాలేదు వాళ్ళకి?!అప్పుడెప్పుడో సీత లక్ష్మణుణ్ణి అన్న మాటలకి ఇప్పుడు సీతకి కౌంటర్ ఇచ్చాడు రాముడు!

          లిస్టులో లక్ష్మణుడి పేరు కూడా వుండటంతో ఆ కౌంటర్ సీతకి వెంటనే అర్ధమయింది!దాంతోపాటు మరొక విషయం కూడా అర్ధమయింది?. సరిగ్గా ఇరవై నానుగు వేల శ్లోకాలలో వెయ్యి శ్లోకాల కొకచోట మొదటి అక్షరంగా గాయత్రి మంత్రంలోని అక్షరాల్ని నింపి లెక్కప్రకారం కధ చెప్పిన వాల్మెకి రాముడికీ లెక్క ప్రకారం మాట్లాడే అలవాటు పెట్టాడు.ఒకటే మాట!తను అంత ఖచ్చితంగా తెగేసి చెప్పాక బతిమిలాడినా ప్రయోజనం లేదని తెలిసి తన ఆభిజాత్యం నిలుపుకోవడానికి ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకుంది! అగ్గిలో దూకి మొగ్గలాగా వచ్చిన తర్వాత కూడా రాముడు మాత్రం కరగలేదు,ఆఖరికి దివ్యదేహంతో వున్న దశరధుడు కోడలి మీద వాత్సల్యంతో ఇంటికోడలికి అన్యాయం జరగడం వంశాన్ని కాల్చేస్తుందని యెంతగానో నచ్చజెప్పాక మాట తిప్పుకున్నాడు.నిజానికి ఈ సన్నివేశం ఇక్కడ వుండకపోయినా కధకి పెద్ద లోపం వుండదు అప్పటికే రాముడి మూలంగా ధర్మతత్వ నిరూపణ చేసి చూపించిన అంశాలు చాలా యెక్కువగానే వున్నాయి.కానీ ఈ సన్నివేశంలో నిక్షేపించిన అంతరార్ధం గురించి తెలుసుకుంటే గానీ దీని ప్రాముఖ్యత తెలియదు!రాముడనే ఒక యోగసాధకుడు మొదట తన ఓంకార సాధనతో సీత అనే భగవత్స్వరూపంతో సంస్పర్శన సుఖాన్ని పొందినా ప్రకృతిలోని మార్మిక సౌందర్యానికి విస్మితుడైన సందర్భంలో మాయ ప్రభావంతో పంచేంద్రియాలు పంచవికారాలు విజ్రంభించగా దానికి దూరమై ఆంజనేయుడనే ఒక ఆచార్యుడి సాయంతో తిరిగి సాధించి దైవాన్ని తన మనసులో సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవటం అనే అంతర్గత యోగప్రయాణమే రామకధ?!రెండవసారి సాధించినప్పుడు ఆ అధికారాన్ని నిరూపించుకోవడమనే చిత్రమైన సన్నివేశానికి బాహ్యరూపమే సీత అగ్నిప్రవేశ ఘట్టం!అన్నమయ్య బాలుణ్ణి చేసి జోలపాడినా రామదాసు యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు అన్నా వారు ప్రదర్శిస్తున్నది అలాంటి అధికారమే!భక్తుడు భగవంతుడి మీద ధాష్టీకం చెయ్యడం భగవంతుడు అతని ముందు తలవంచడం అనే యోగశాస్త్ర రహస్యాన్ని అక్కడ రాముడూ సీతా మనకి చూపించారు!

          ఇక్కడి సంగతులేమీ తెలియవు గనక అక్కడ భరతుడు ముహూర్త కాలం కూడా ఆగడని గుర్తొచ్చి విషయం చెప్పి అతడి అగ్నిప్రవేశాన్ని ఆపడానికి ముందు ఆంజనేయుణ్ణి పంపి వీళ్ళు ప్రశాంతంగా పుష్పకవిమానప్రయాణ సుఖాన్ని అనుభవిస్తూ అయోధ్య చేరుకున్నారు!పధ్నాలుగేళ్ళ తరవాత యే అడ్డంకులూ లేకుండా శ్రీరామపట్టాభిషేకం జరగడంతో రామకధని సంపూర్ణం చేశాడు వాల్మీకి! "ఉత్తరే రామచరిత్రే భవభూతిర్విశిష్యతి" అన్న మాటతో వున్న ఉత్తర రామచరిత్ర తప్ప వాల్మీకి పేరుతో యెక్కడా కనబడటం లేదు.శ్రీరామ చూర్ణిక కూడా "పట్టాభిషేక మహోత్సవానందం గోవిందం" అనే పదంతోనే ముగుస్తుంది గాబట్టి ఈ శుభప్రదమైన ముగింపుతో వున్న కధయే సంపూర్ణమైన రామాయణం!


స్వస్తి!
_______________________________________________________________
సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వారమై నేడిలా వేడుతున్నామయా!
         కావవే దేవరా కాచి రక్ష

         నివ్వు మా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినాముగా, స్వామి?మా చేయి పట్టి
        మాకు నీవెతోడై సదా మమ్ము బాధ 
        చూడనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(12/02/2015:పైనున్న పద్యంలో యేకత్వాన్ని బహుత్వంగా మార్చాను.తప్పు చెయ్యనివ్వక పోవడానికి బదులుగా బాధ చూడనివ్వవద్దని మార్చాను, భావం ధర్మాధర్మవిచక్షణ నుంచి సంపూర్ణశరణాగతికి తిరిగింది!)
_______________________________________________________________

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...