ఒకప్పుడు పెళ్ళిళ్లలో కలిసిన చుట్టాలు పాత సంగతుల్ని నెమరేసుకోవటానికి "క్రిష్ణా పుష్కరా లప్పుడు","గోవర్ధనం పెళ్ళప్పుడు","అచ్యుతరావు వాళ్లబ్బాయి బారసాలప్పుడు", అని పుష్కరాల లెక్కనో బారసాలనో పెళ్ళినో కలిపి అప్పుడు జరిగింది అని చెప్పుకునేవాళ్ళు!ఇవ్వాళ రోజులు మారాయి గదా - "చికెన్ గన్యా రోజుల్లో","స్వైన్ ఫ్లూ మొదటిసారి వొచ్చినప్పుదు","లైలా తుఫాను ఇరగదీసినప్పుడు" అని రోగాలూ,గొడవలూ,భీభత్సాలతో కలిపి చెప్పుకుంటున్నాం?
పాతకాలం వాళ్ళు తుఫాన్లూ వరదలూ మన దురదృష్టం కొద్దీ దేవుడే మనమీదకి రప్పిస్తాడని సరిపెట్టుకునే వాళ్ళు.నిన్నటి దాకా కరువుల గురించి కూడా అలాగే అనుకునే వాల్ళు, కానీ కొత్తగా ఎకనమిక్సు లో DRAUGHT ECNOMY| అనేది ఒకటి మొదలయింది!దాని ప్రకారం అంతకు క్రితం ప్రభుత్వాల దుర్మారమయిన ఆర్ధిక నిర్వహణయే కరువులకి కారణమని బలమయిన ఆధారాలు కనిపిస్తున్నాయట! ఈ నాలెడ్జి యేమీ లేకుండానే ప్రపంచంలోని అతి ఘోరమయిన కరుల్లో ఒకటైన బెంగాలు కరువు "కర్జను" అనే ఒక్కడి వల్ల వొచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే గదా!
ఇదివరలో కరువంటే అందరూ భయపడి చచ్చే వాళ్ళు!ఈ రోజుల్లో కరువు కూడా కొందరికి లాభసాటి వ్యాపారమైపోయింది.అనంతపురం కరువు జిల్లా అని అందరికీ తెలుసు,కానీ ప్రపంచ మార్కెట్టులో కొత్త మోడలు కారు యేది రిలీజయినా తెల్లారేసరికల్లా ఆనంతపురం రోడ్ల మీద కూడా తిరుగుతుందట?అదెట్లా అంటే కరువు సహాయక నిధుల మీదా పశుగ్రాసం వాటాల మీదా పెరిగిన కొందరు "గుద్ విల్ కాలనీ" దొరల వైభోగ మది!మనం రోడ్దు మీద వెళ్తుంటే శవాల మీద వేసిన రూపాయీ అర్ధ రూపాయీ యేరుకునే వాళ్లని ఈసడించుకుంటాం,కానీ అదే పని భారీ యెత్తున చేసిన వాళ్ళు "శుభకామన విలాసు" లయ్యారు.చేస్తే శుధ్ధ క్షవరమే చెయ్యమన్న పెద్దల మాటని బహుచక్కగా పాటించారు గదా మరి!
ఇత్లాంటిదే ఒక పాతముచ్చట గుర్తుకొస్తున్నది - రీడర్స్ దైజస్ట్ లో చదివాను.ఒకానొక చిన్న నగరంలో ఒక వీధిలో ఒక ఫొటోగ్రాఫరు తన భార్యయే మోడల్ అవటానికి సిధ్ధపడితే ఆమె నగ్నచిత్రాలే అవుగాక సౌందర్యభరితంగా తీసి వాటిమీద వచ్చే ఆదాయంతో బతుకుదామనుకున్నాడు?చుట్టుపక్కల వున్న సంసారు లంతా అతన్ని వెంటాడి వేధించి ఆ చండాలాన్ని అపేయించారు.అతను అక్కణ్ణుంచి మరోచోటికి వెళ్ళిపోయాడు.అదే పని "ప్లే బాయ్" అనే పత్రిక చేస్తే ఆ పత్రికాధిపతి ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ప్రముఖుల్లో ఒకడయ్యాడు,తేడా యెక్కడుంది?స్థాయీ భేదంలో వుంది!
మనని నష్టపెట్టి తను లాభం గుంజే పని ఇంటి పక్కవాడో,దగ్గిర్లో వున్న ఫ్యాన్సీ షాపు వాడో చేస్తే యేమయినా చెయ్యగలం, కానీ ప్రభుత్వంలో వున్నవాళ్ళు చేస్తే యేవరేమి చెయ్యగలరు?స్వైన్ ఫ్లూ బాధితులూ,చికెన్ గన్యా పీడితులూ వీళ్ళందరి దుస్థితీ ఇదే!చాలాకాలం క్రితం నుంచే డాక్టర్లంతా చాలా రోగాలకి మన చుట్టూ వున్న అపరిశుభ్రతే కారణం అని చెవినిల్ల్లు గట్టుకుని చెప్తున్నా చెప్పింది తమకు కాదన్నట్టు పన్నులు కడుతున్న ప్రజలకి పరిశుభ్రమైన పరిసరాలను సమకూర్చితే చాలు వాళ్ళు ఆయురారోగ్యాలతో వుంటారు,అరోగ్యంగా వున్నవాళ్ళు మరింత హుషారుగా వుత్పాదన పెంచుతారు అనే చిన్న విషయం కూడా వాళ్లకి యెవరయినా అరటి పండు వొలిచి పెట్టినట్టు చెబితే గానీ తెలియదా?నిజంగా తెలియకనే పారిశుధ్య శాఖకి అంత తక్కువ నిధులు కేటాయిస్తున్నారా!
అమితాబ్బచనుకి ఒక్కసారి గాజుపెంకు గుచ్చుకుందని ట్వీటు చేస్తే ఆయన అభిమానులు యెంతమంది అయ్యో అనుకున్నారో కుయ్యోమని మూలిగారో గానీ మనం నిర్లక్ష్యంగా గాజుపెంకుల కన్నా ప్రమాదకరమైన వాట్ని చెత్తకింద విసిరేస్తుంటే కొంతమది ప్రతిరోజూ వుత్తచేతుల తోనే వాట్ని యెత్తుతున్నారు గదా?స్వచ్చభారత్ పేరుతో మోదీ గారూ,రాష్త్రం మొత్తాన్న్నే సింగపూరులా చేస్తాననే బాబు గారూ,మొత్తం హైదరాబాదుని టాంకుబండుతో సహా బహుళ అంతస్తుల భవనాలు లేపి మురికివాడలు లేని నగరంగా చేస్తాననే రావు గారూ పారిశుధ్య శాఖ అనే ప్రభుత్వ శాకహ ఒకటి వున్నదనీ దాన్ని నిక్కచ్చిగా పని చేయించడానికి వీళ్ళు చెప్తున్న వాటికయ్యే డాబుసరి ఖర్చుల కన్నా చాలా తక్కువ ఖర్చుతోనే ఆ పని చెయ్యవచ్చునని తెలియనంత అమాయకులా?!నమ్మి చెడిన వారు లేరు అని చాదస్తంగా నమ్మేవాళ్ళు వున్నారేమో గానీ నేను మాత్రం నమ్మను!?
ఆ మురికి నలాగే వుంచేసి ఈ వాటా కింద కొత్తగా నిధులు కేటాయించి అందులో కూడా సొంతానికి నొక్కేసి చేసే జబర్దస్త్ దోపిడీ కాదా ఇది?మన పన్లు మనం చేసుకోలేని రోజుల్లో మన మలమూత్రాలు కడిగి మనల్ని శుభ్రం చేసిన తల్లికి దణ్నం పెట్టటం వరకూ మనం మంచివాళ్ళమే గానీ అదే పని మొత్తం సమాజాని కంతా చేస్తున్న పారిశుధ్యపు పనివాళ్లని గురించి న్యాయంగా ఆలోచించకపోవడం వల్ల మనం కూడా ద్రోహులమేనా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు నాకు?!
ప్రతి పారిశుధ్య కార్మికుడికీ చేతులకి గ్లవుజులూ,కాళ్ళకి బూట్లూ,వొంటికి యెంత మురికి కూపం లో దిగినా ఆ మురికి అంటని యూనిఫారం - ఇవ్వలేరా?జీతాలు పెంచి వాళ్లది కూడా గౌరవనీయమైన పనియే అనే గుర్తింపుని ఇవ్వలేరా?ఇప్పుడు ఆ శాఖలో పనిచేస్తున్న కార్మికులకే వాళ్ళు సంతోషంగా వాళ్ళ పని చెయ్యగలిగే యేర్పాట్లు చేస్తే ఇఇప్పుడున్న మురికి కన్నా రెండింతలు యెక్కువ మురికినైనా వొదిలించగలరు!
చెయ్యాల్సింది చెయ్యకుండా ఫొటోలకి పోజులిచ్చి పత్రికల్లో బొమ్మలు వేయించుకుంటే ఆ పేరున మరింత చెత్త పెరగడం తప్ప వుపయోగం యేమయినా వుందా?!లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?ఈ పారిశుధ్య కార్మికుల దగ్గిర్నుంచీ అల్పాదాయ వర్గాలు యెవ్వరూ తమ పిల్లల్ని ఖరీదయిన స్కూళ్ళలో చదివించుకోలేరు!ప్రభుత్వ పాఠశాలల్ని వుద్దేశపూర్వకంగా నీరుగార్చి అస్మదీయుల స్కూళ్ళకి గిరాకీ పెంచుతున్నారు!పరిశుభ్రమైన దేహాలతో ఆరోగ్యాన్నీ వాళ్ళకున్న తక్కువ ఆదాయంలోనే విద్యనీ అందిస్తే యే రిజర్వేషన్లూ అక్కర్లేకుండానే కోట్లలో సంక్షేమ పధకాల తాయిలాలూ పంచనక్కర్లేకుండానే వాళ్ళకేమి కావాలో వాళ్ళే సాధించుకోగలుగుతారు గదా?!వాట్ని పనిగట్టుకుని దూరం చేసి యెప్పటికీ తమ మీదనే ఆధార పడి ఆ కృతజ్ఞతతో మళ్ళీ మళ్ళీ తమకే వోట్లు వేసే వ్యూహమే ఇది?!ఆకబారు వూళ్ళోకి తెచ్చినందుకు కూడా జనాన్ని చంపేసిన నిజాము కాలానికీ ఇప్పటి ప్రజాస్వామిక ప్రభుత్వాధినేతలకీ తేడా యేమయినా వుందా?
సీ || పోయెన్ కుసుమ కోమలోజ్వల సౌరభ
ములు భూమిపై నుండి - మూక పెరిగి,
ఇరుకుతనము పెరిగి,మురికియును, మరి
కిలుము జిడ్డు ముదిరి, కర్బన ద్వ
యాంలజని విషపదార్ధమై , కరగని
ధూళులు నీటి యందమితమై పె
రుగుచు ధరణి పెద్ద రొచ్చుగుంటై పోయె!
మనుషుల ఆంతర్యములును సరిగ
తే || లేవు - పరధనాసక్తియు, లోభము, మర
సూయలున్ మస్తుగా మనసులకు పట్టి
వేసెను, మనిషి నుండి వివేకము తొల
గంగ - ముక్కులు బద్దలౌ కంపు మిగిలె!
(27/08/1996)
ఇవ్వాళ జరగాల్సింది స్వచ్చభారత్ హడావిడి కాదు,ఘర్ వాపసీ గందరగోళం కాదు - మురికిని ద్వేషంచే మనస్తత్వం పెరగాలి,ప్రజలూ ప్రభుత్వం రెండూ కేవలం నినాదాలతో సరిపెట్టకుండా యుధ్ధమే చెయ్యాలి!బయటి మురికికీ లోపలి మురికికీ అవినాభావ సంబంధం ఖచ్చితంగా వుంది - క్షాళన రెండు చోట్లా జరగాలి!?మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం యెక్కడ కనిపించినా సహించకూడదు.దోపిడీకి అసలైన పునాది దోపిడీకి గురయ్యే వాడి అమాయకత్వం అని తెలిస్తే విద్య నేర్పి అజ్ఞానాన్ని తొలగించదం యెంత అవసరమో తెలుస్తుంది?!కులపిచ్చి,మతపిచ్చి ప్రాంతం పిచ్చి ఇవన్నీ అమాయకమైనవి కావు - తమాషాకి చెయ్యడం లేదు వాళ్ళు!శ్రీశ్రీ చెప్పినట్టు న్యాయంగా ఆడితే పాయింట్లు యెదటివాడికే పోతాయని తెలిసి రిఫరీని "నువ్వూ నేనూ ఒక్కలాంటివాళ్ళం,వాడు వేరే కాబట్టి నాకు పాయింట్లు వెయ్యి" అనే విధంగా బెల్లించి గెలవటం!అలాంటివాళ్ళు నీతిసూత్రాలకి లొంగరు.ఆ లాభాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తేనే తిక్క కుదురుతుంది!కానీ అలా చెయ్యగలమా?ఈ ట్రిక్కు నంతా యెన్నికల రోజున జరిగే తంతుకి అప్లై చేసి అక్కద రిఫరీలం మనమే అని తెలుసుకుంటే కాస్త వివేకం పెరుగుతుందేమో?!
నీతిసూత్రాలు యెక్కువగా దంచడం నాకూ ఇష్టం లేదు గాబట్టి ఒక సినిమా కధ చెప్తాను.బాటసారి అక్కినేని నాగేశ్వర రావు నటించిన సినిమాల్లో కల్లా అత్యధ్బుతంగా నటించిన సినిమా.అన్ని సినిమాల్లోనూ చేసిన నటన కన్నా ప్రత్యేకంగా ఇష్టపడి చేశాడు.మీ సినిమాల్లోకల్లా మీకిష్తమైన సినిమా యేది అని యెప్పుడు యెవరడిగినా ఆ పాత్ర గురించే చెప్పేవాడు!సినిమా లో తనది హీరోఇజం అస్సలు లేని పాత్ర.ఒక రకంగా భానుమతి హీరోయినుగా వున్న సినిమాలో తను సైడు క్యారెక్టరు చేసినట్టు లెఖ్ఖ!ఇవ్వాళ శ్రీయ నేర్చుకుని చేస్తున్నానని చెప్పే మెథడ్ యాక్టింగ్ ఆ రోజుల్లోనే వుపయోగించాడు ఆపాత్రలో.సినిమా అంతా ఒక బాల వితంతువు చుట్టూ తిరుగుతుంది.దేవదాసులో కొంత రొమాన్సూ,భగవాన్లు పాత్రతో చేసే క్యామిడీ అన్నా వుంది,ఇందులో అస్సలు అవేమీ లేవు.మామ్మూలు ప్రేక్షకు డెవ్వడూ వోపిగ్గా చూదలేడు.కానీ అందులో ఒక డైలాగు వుంటుంది అది తను యెలా చెప్పాడు అనే కుతూహలంతో చూద్దామని నా బెజవాడ లయోలా కాలేజి న్యూ హాస్టలు రోజుల్లో విశ్వప్రయత్నం చేశాను!కుదర లేదు.సినిమా హాలు గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరగాల్సొచ్చింది - టిక్కెట్లు దొరక్క కాదు?మా ఫ్రెండ్సులో ఒకడు "ఇందులో కామిడీ లేదు బోరుగా వుంటుందిరా" అని వినపడీ వినపడనట్టు నసిగేసరికే బృందంలో మిగిలిన వాళ్లంతా భయపడి వెనక్కి తిప్పేశారు.ఆ ఒక్క ముక్కకే వాళ్ళలా యెందుకు భయపడ్డారో తెలుసా - ఆ ముక్క అన్నవాడు ప్రేమాభిషేకం పదిహేను రోజుల్లోనే ముఫ్ఫయ్ సార్లు చూసిన ఏన్నార్ పంఖా?!పోనీ నేనొక్కణ్నే చూద్దామా అంటే సెకండు షో తర్వాత బెంజి కంపెనీ నుంచి పోస్టలు కాలనీ దాకా ఒక్కణ్నే నడుచుకుంటూ రావాలి!అంత దృశ్యం లేదు నాకు:-<>)
అప్పుడు కుదరనిది యూట్యూబు పుణ్యమా అని ఈమధ్యనే చూశాను.ఆ డైలాగు పట్ల నాకంత పిచ్చ యెందుకు పట్టిందీ అంటే మా మామయ్యల్లో ఒక చాదస్తుడు అది చదివి ఆ సన్నివేశాన్ని పైకి వాగి నా బుర్రలోకి యెక్కించాడు!ఈయనా నేనూ మిగతా విషయాల్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళం గానీ పుస్తకాల విషయంలో మా ఇద్దరి టేష్టూ ఒకటే!ఆ డయలాగ్ నాకు యెక్కినట్టు మీకూ యెక్కాలంటే కధ కొంచెంగానన్నా మీకూ తెలియాలి.భానుమతి క్యారెక్టరు పేరు మాధవి.బాల్య వివాహం జరగడమూ ముసలి భర్త తొందరగా పోవడంతో పిల్లలు లేకుండానే వితంతువు ఐపోయింది.కానీ యేడుస్తూ కూర్చునే మనిషీ కాదు.జమీందార్లు కావడంతో అన్నీ తనే చూసుకుంటూ వుండేది."భూమి జనించీ భుక్తి కొసగనీ ఫలము లున్నవీ కొన్ని" అని తన స్నేహితురాలే అన్యాపదేశంగా దేవుణ్ణి తిడుతుంటే "వేదశాస్త్రములు చదివిన వారే యెరుగరు సృష్తి విలాసం" అని జవాబిచ్చేసి సరిపెట్టుకునే మనస్తత్వంలో వుంది!చెల్లెలికి చదువు చెప్పించి పెళ్ళి చేసి పంపించడం ఒక్కటే తన పని ఆ వాతావరణంలోకి హీరో వొచ్చి పడతాడు.
వీళ్ళు వుండేది కలకత్తాలో.అతను కూడా జమీందారే.సవతి తల్లి మొదట్లో గారాబంగా పెంచి తర్వాత మరీ దద్దమ్మ లాగా తయారవుతున్నాడని కొంచెం ఈసడిస్తున్నట్టు ఒక మాటతో పొడుస్తుంది.అంతే!ట్రంకు పెట్టెలో బట్టలు సర్దుకుని కొంప నుంచి బయట పడి పోలీసు స్టేషను వరకూ వెళ్ళి అక్కణ్ణించి ఈమె ఇంటికి తన చెల్లెలికి లెక్కలు నేర్పే ట్యూటరుగా అడుగు పెడతాడు.కళ్ళజోడు పగిలిపోతే అది బాగు చేయించుకోవడం కూడా తెలీక పోగా బడదీదీ అని అందరూ పిల్చే హీరోయిను బాగు చేయించి పెడితే కనీసం యెవరు బాగు చేయించారు అని అడగటం గానీ థాంక్సు చెప్పటం గానీ తెలియని మొద్దావతారం అతను!యెంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా మాయమైపోతాడు?ట్యూషను చెప్పడం తప్ప మిగిలిన సమయాల్లో ఇతని యవ్వారమంతా కలకత్తా వీధుల్లో చక్కర్లు కొట్టటం.అలా చక్కర్లు కొడుతుండగా ఇతని కోసం వెతుకుతున్న మనిషొకడు అమ్మగారు మీకోసం బెంగెట్టుకున్నారు పదండి వెళ్దాం అనగానే అట్నించటే రైలెక్కేశాడు!వీళ్ళ పనివాడొకడు యెవర్నో రైలెక్కించడానికొచ్చి చూసి చెప్పాడు గాబట్టి తెలిసి ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటుంది.కానీ తన జమీకి తిరిగి వెళ్ళాక మాత్రం తెలివిగా వుండి జమీందారీని చూసుకుంటుంటాడు.అప్పుడొస్తుంది ఈ మాట.దివాను డబ్బు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తనకి లెక్చరు ఇస్తుంటే నెమ్మదిగానే అన్నా స్థిరంగా "డబ్బుతో కొనలేనివి కూడా వున్నాయి ఆళ్వార్!" అంటాడు?!మా మామయ్య నా చెవుల్లోకి ఇది యెక్కించిన రోజుల్లోనే మరో మంచి కొటేషను ఆంధ్రజ్యొతి దినపత్రికలో ఎడిటోరియల్ పైన ఇచ్చే బాక్సులో చదివాను,"డబ్బుతో దేన్నయినా సాధించగలను అనుకున్న వాడే డబ్బు కోసం యే గడ్డయినా కరవడానికి సిధ్ధ పడతాడు?" అని!ఈ రెండూ నన్ను అతాలాకుతలం చేసేసి ఆఖరికి యెముకల్లోకంటా ఇంకిపోయాయి.ఒకటి గుండెకి పట్టే ఆర్ద్రత నిండినది.ఒకటి కొరకంచు లాగా కాల్చే వ్యంగ్యం నిండినది.మిత్రులంతా ఇవ్వాళ నా భాషని మెచ్చుకుంటున్నది ఆ రెండూ 50-50 లాగా కలిసి పోవటం వల్లనే!
ఆ అరెండు ముక్కలూ యెవరికి యెక్కినా డబ్బు పిచ్చి తప్పకుండా వొదుల్తుంది.అది వొదిల్తే మిగతావీ వొదుల్తాయి,అవునా కాదా?!మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం - వీట్ని వొదిలించుకోకుండా యెవ్వడూ బాగుపద లేడు?!