Monday, 21 July 2014

రెండు కళ్ళ సిధ్ధాంతికి కళ్ళు మసకలు గమ్మినట్టున్నాయి!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నాకు 167 – జగన్
          అది నిజమే కావచ్చునని నాకు కూడా అనిపిస్తున్నది.రెండు కళ్ళ సిధ్ధాంతికి కళ్ళు మసకలు గమ్మినట్టున్నాయి, చుట్టూ చూడటం లేదు.వెంట్రుకవాసి మెజారిటీ తోనే తెలంగాణా ముఖ్యమంత్రి యెంత చురుగ్గా కదుల్తున్నాడో అఖంద ప్రజాబలం తో గెల్చిన ఆంధ్రా ముఖ్యమంత్రి యెంత నిదానంగా కదుల్తున్నాడో చూశారా?ఇంతవరకూ రాజధాని యెక్కడో తేల్చుకోలేదు.బెజవాడ – గుంటూరు అని లీకు చేసి స్థలాల రేట్లు పెంచడం తప్ప జరిగింది యేమయినా వుందా?లీకు చెయ్యకుండా గబుక్కున పని కానిచ్చేసి వుంటే రూపాయితో అయిపోయేది పది రూపాయలకు చేరింది.ఇంకా మీనమేషాలు యెందుకు లెక్కెడుతున్నట్టు?అక్కడున్న అసమదీయులైన వాళ్ళకి అక్కడి స్థలాల రేట్లు వంద దాకా డేకించి మేలు చెయ్యటానికి కాకపోతే!కాపరం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని వూరికే అన్నారా?చంద్రబాబు చురుకు తెచ్చుకుని తనని తను ఆంధ్రా ముఖ్యమంత్రిగా చూసుకోకపోతే రాష్ట్రం జగన్ చేతుల్లోకి వెళ్ళడం ఖాయం.
                  అయినా భూములు కొనాలి, కట్టడాలు ప్లాన్లు వెయ్యాలి, నిధులు తెచ్చుకోవాలి – ఇంత పని వుంది గదా యెప్పటికి పూర్తి అయ్యేను?రాజధాని పూర్తి అయ్యేదాకా ప్రభుత్వం పని చెయ్యదా!.ఒకవేళ రాజధాని గురించి ఇప్పట్లో తేల్చదల్చుకోకపోతే సచివాలయంలో అధికారికంగానే ఆంధ్రాకి వాటా వుందిగా, ఆ మాత్రం ధీమా కూడా లేనప్పుడు నూతన రాష్ట్ర పునర్నిర్మాణం అతని వల్ల అవుతుందా?విభజన వల్ల ఆంధ్ర ప్రాంతం సమస్యలతో మొదలు కానుందని సర్వులకూ తెలిశాక కూడా ఇంకా శ్వేతపత్రాలతో కాలం గడిపేస్తున్నాడు,ఇప్పుడప్పుడే రంగం లోకి దిగే వుద్దేశం లేదా?
                పైగా 2019లో తెలంగాణాలో అధికారంలోకి మనమే రావాలి, మీకు సపోర్టు కోసం నేను ఇక్కదే వుంటాను అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు,2019 వరకూ హైదరాబాదును వొదిలి పెట్టదల్చుకోలేదా?ఇంతకాలం కేంద్రం నుంచి రాజధాని యేర్పాటు కోసం ఒక సంఘం తిరిగాక ఇప్పుడు కొత్తగా నిర్దేశకాలతో మరో సంఘం వేసాడు, అంటే కేంద్ర సంఘం యే నిర్దేశక సూత్రాలూ లేకుండానే తిరిగిందా?రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఈ కొత్త సంఘం యెన్నేళ్ళు సాగదీస్తుంది?ముహూర్తాలు చూసి ఆర్భాటంగా దేశంలోని ప్రముఖు లందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గం ఇంత దయనీయమయిన పరిస్థితిలో వుంటే ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే రాష్ట్రప్రజలంతా యే హోమం చెయ్యాలో?
                అయినా 2019లో తెలంగాణాలో పీఠం యెక్కాలంటే ముందు తను నాలుగేళ్ల లోపు ఆంధ్రాని ముందుకు తీసుకెళ్లాలి గదా?ఆంధ్రాలో ఫెయిల్ అయ్యి తెలంగాణాలో యే ముఖం పెట్టుకుని వోట్లు అడుగుతాడు?ఇక్కడో గంతూ అక్కడో గంతూ అని ఇప్పటికీ వూళ్ళు పట్టుకు తిరుగుతుంటే ప్రభుత్వం యెక్కణ్ణించి పని చేస్తుంది?ఇప్పటి వరకూ తీసుకున్న నాలుగు కీలకమయిన  నిర్ణయాలూ తప్పుల తడకలే. అంత అనుభవమూ యే గాలికి కొట్టుకు పోయిందో,ఇలా తడబడుతున్నాడు!
            రాజధాని విషయంలో తను చేసింది పూర్తిగా తెలివి తక్కువ పనే.కరెంటు పంపకాలకి సంబంధించి పీపీయేల విషయంలో తను యెందుకంత తొందర పడ్డాడు?ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే మరొకరి ప్రమేయంతో ఆ నిర్ణయం అమలు కాకుండా ఆగిపోయిందంటే ఖచ్చితంగా అది అతని అసమర్ధతే కదా!ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాక ఆదిలోనే దానికి హంసపాదు పడి కేంద్రంలోని ఒక సంఘానికి విచారణకు పంపించి దాన్ని నెగ్గించుకోవటం కోసం మళ్ళీ వాదనలూ సమర్ధనలూ తయారు చేసుకోవటం పరువు తక్కువ కాదా? తెలంగాణా ముఖ్యమంత్రి తమ విధ్యార్దులకి మాత్రమే ఫీజులు కట్టుకుంటాం అని అనగానే సరే, మా పిల్లలకి మేమే చెల్లించుకుంటాం అని ఒకసారి ధీమాగా జవాబు చెప్పి శభాష్ అని అనిపించుకున్నాక అదే ధీమాని కొనసాగించకుండా అది అన్యాయం, రాజ్యాంగ విరుధ్ధం అనే ఆక్రందనలు చేస్తూ జావగారి పోవటం యెందుకు?మన పిల్ల్లలకి మనమే ఫీజులు కట్టుకుందాము అని అనుకున్నప్పుడు ఇక తెలంగాణాలోనే చదవాలా, దేశం మొత్తం గొడ్డు పోయిందా?ఆంధ్ర ప్రజల అన్నపూర్ణ భాండాగారం ఖాళీ అయిందా?మంగలి మంత్రుల సలహాలు విని అమోఘంగా ఆలోచించి పరపరా వుత్తరం రాస్తే యేమి జవాబు వచ్చింది? నాలుగు వెక్కిరింతలూ ఆరు తిట్లూ కలిపి వడ్డించాడు తెలంగాణా ముఖ్యమంత్రి. ప్రపంచంలో యెక్కడి కెళ్ళినా మంచివాళ్ళనే పేరు తెచ్చుకున్న వాళ్లం గత అరవయ్యేళ్ళుగా వాళ్ళ నోట్లో పడి దొంగలు దోపిడీ దార్లు అనే మాటలు పడి కడుపు రగిలిపోయి తెదెపాకి ఇంత ఆధిక్యతని ఇస్తే రేపటి 2019లో తెలంగాణాలో అధికారం మీద చూపుతో మళ్ళీ అదే వెక్కిరింతకి తను గురి కావదం అంటే ఆంధ్ర ప్రజల స్వాభిమానానికి ద్రోహం చెయ్యడం కాదా?!
             ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం ఆంధ్ర ప్రజల పౌరుషానికి ప్రతీకగా వుండాలి తప్ప నత్తి మాటలూ కుంటి సాకుల్తో కాలం గడుపుతూ యెదటివాళ్ళ చేత మాటలు పడుతూ కాలహరణం చెయ్యకూడదు. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణాలో కూడా అధికారాన్ని కోరుకోవడం మంచిదే, కానీ అక్కడ ప్రజలకి ధీమాగా చెప్పటాని కయినా ఆంధ్రా పునర్నిర్మాణంలో తన సత్తాను చాటి చెప్పాలి కదా?1956లో గుడారాల్ల్లో కాలం గడుపుతున్న మీరు పాడికుండ లాంటి మా తెలంగాణాని బలవంతంగా కలుపుకుని మామీద పడి బతికారు అని అంటున్న వాళ్ళ మాట అబధ్ధం అని రుజువు చెయ్యాలి. తెలంగాణా మీద ఆధార పడకుండానే తెలంగాణాని మించి బాగుపడగలిగిన సత్తా ఆంధ్రావాళ్ళకి వుందని తెలియజెప్పటమే ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రధమ కర్తవ్యం అని తెలుసుకుని తెలంగాణా వ్యవహారాలకి యెవరయినా నమ్మకస్తుడ్ని ఇన్ చార్జిగా వుంచి  తను ఆంధ్రప్రదేశ్ కి పూర్తికాలపు ముఖ్యమంత్రిగా వుండాలి.
         మరీ ముఖ్యంగా ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పునర్నిర్మాణంతో పాటు నిర్వహించాల్సిన అదనపు బాధ్యత యేమిటంటే తెలంగాణా ప్రభుత్వం తో సామరస్యానికి అతిగా చేతులు చాపి మూతి కాల్చుకోకుండా ధీరోధ్ధతంగా  వుండాలి.ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుంది.శంఖాలూ భేరీలూ డమరు ధ్వనులూ మోగాల్సిన కాలంలో వేణుగానాలూ వీణానాదాలూ పని చెయ్యవు.తమ నోటి నుంచి బయటి కొచ్చే మాటకి అర్ధం యేమిటో  కూడా తెలియని మూర్ఖులు వాళ్ళు.తను మాట్లాడే తెలుగు భాషామ తల్లినే యెవనికి తల్లిరా అని అన్న గాడిదకి తను ఆ కూత వుర్దూ లోనో ఇంగ్లీషులోనో కుయ్యడం లేదని తెలిస్తే ఆ ప్రేలాపన చెయ్యగలడా?మూర్ఖులకి మూర్ఖభాష అని ఒకటి ప్రత్యేకంగా వుంటుంది,వాళ్ళతో ఆ భాషలో మాట్లాడితేనే వాళ్ళకి బాగా అర్ధం అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది యెంత తొందరగా తెలిస్తే అంత మంచిది.లేని పక్షంలో వుప యెన్నికలు జరిపించి అయినా సరే అధికార మార్పిడికి సిద్ద పడటమే ఆంధ్ర ప్రజలకి వుత్తమం.యెన్ని ఆరోపణలు వున్నా రుజువు అవుతాయో లేదో తెలియదు గనక పాప్యులారిటీ త్రాసు ఇప్పటికీ జగన్ వైపుకే యెక్కువగా వొరిగి వుంది, అది గమనించుకోవాలి బాబు! స్వాభిమానం ఆభిజాత్యం అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడిలా యెగరాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖుమంత్రి వూరపిచ్చుకలా కిచకిచ లాడటం మాని పాంచజన్యం పూరిస్తూ దిక్కుంజరంలా కదిలితే చూడాలని ఆంధ్రప్రజలు మనసారా కోరుకుంటున్నారు, శుభం!

Monday, 14 July 2014

నానాటి బ్రతుకు దుర్భరము, ఈశ్వరా!

సీ||      యేది చేయందగు నేది తగదనేది
           తెలిసిన మనిషి పతనము చూడ

           డు. గొడుగొక్కటి,చెప్పులు, ఒక సంచి, కలుక్కు
           మంటున్న ముల్లొక టండి ఈశు

           డు మనల్ని పంపేప్పుడు మనకిచ్చు బహు చి
           త్రపు కాన్కలు: సలుపు తగిలి నప్పు

           డల్లాను కంటి చెలమలూ పెదిమలపై
           నవ్వులూ కలిపి మందును తయారు

తే||      చేసుకోవాలి.చెప్పు లర్గే వరకు న
           డవక తప్పదు, వెతుకు లాడ్డాన్కి సంచి
           ఉంది.యెండవానకి గొడుగుంది - ఇంత
           కన్న యేముంటది సగటు మనిషి బతుకు?
(22/03/2014)
-----------------------------------------------------------------------------------------------------------------
పుట్టిన ప్రతి మనిషికీ పుట్టుకతో వచ్చేవి - ధర్మాధర్మ విచక్షణజ్ఞానం.అదనంగా కష్టాల్లో తోడుగా వుండే ఒక గొడుగు,యెందుకు బతకాలనే ప్రశ్నకు జవాబుగా ఒక లక్ష్యం రూపంలో నడవాల్సిన దారికి గుర్తుగా ఒక జత చెప్పులు,మనకు భగవంతుడు ఇవ్వాలనుకున్నవి అన్నీ మూటగట్టిన సంచితం అనే సంచి,అన్నీ వున్నట్టుగా అనిపించినా యేదో లోపించినట్టుగా అనిపించే ఒక బాధ! వీటినే అటూ ఇటూ తిరగేసి మరగేసి వాడుకుంటూనే బతకాలి ప్రతివాడూ!!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...