Monday, 19 May 2014

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి కూలడం అంటే యేమిటో కాంగ్రెసు చూపించింది!

        100+ వయసున్న పార్టీ పదేళ్ళ పాటు అజగరం లాగ పరిపాలించి ఆఖరికి తన సుదీర్ఘ చరిత్రలో యేనాడూ యెదురవని పరాభవానికి గురయింది.భారత ప్రజ లందరికీ తనే అసలయిన ప్రతినిధి నని విర్రవీగిన ఆ విషవృక్షానికి తన పునాదుల్ని కదిలించి చూపించారు భారత ప్రజలు.విశాల ప్రజానీకం ఒప్పుదల అక్కర్లేకుండా తేలికగా అధికారాన్ని చేరుకోవటానికి వోటుబ్యాంకుల్ని తయారు చేసుకొని విర్రవీగుతున్న వాళ్ళకి ఆ యెకౌంటు యెప్పుడో మురిగిపోయిందనే నిజాన్ని కళ్ళు బైర్లు కమ్మేలా చూపించారు ముస్లిం సోదరులు.

      ఈ మధ్యనే ఒక సామాన్య కార్యకర్త తను అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెసుకి రాహుకాలపు ఫలితాన్ని చూపిస్తున్న యువనేతకి చెవిలో ఉప్పుదేశం చేసాడు, యేమని?నాయనా మీరు ముస్లిములని వోటుబ్యాంకులుగా వాడుకోవటం తెలివైన పనిగా మురిసిపోతున్నారు, కానీ ఆ లాభాలని కిట్టించుకోవటం కోసం మత సంస్థల నిండా దొంగలు చేరారు. సామాన్య ముస్లిములు వారిని అసహ్యించుకుంటూ సహేంద్ర తక్షకాయ అన్నట్టు మిమ్మల్ని కూడా లాగి పారెయ్య బోతున్నారు, కళ్ళు తెరవండి - అని!కళ్ళకి కలబంద జిగురు పూసుకుని ఉన్న మేధావులు కళ్ళు తెరిచేసరికి పీఠం కదిలి పోయింది.

        ఇప్పటి కయినా తెరిచారా అనేది కూడా అనుమానమే?ఇంకా అక్కడ - యెవరో రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని మాటి మాటికీ చూసుకుంటూ వొత్తుల్ని పలకలేక అవస్థలు పడుతూ చదువుకుంటూ పులకించిపోయే మాతృమూర్తీ, అద్భుతంగా ప్రసంగించి ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యడానికి బదులు, మా అమ్మ యేడ్చింది అని ఒకసారీ మా అమ్మ నన్ను తిట్టింది అని ఒకసారీ అఘోరించి అవతలి వాళ్లకి అడ్డంగా నిలువుగా దొరికిపోయే విదూషక యువరాజే కనిపిస్తున్నారు మరి!

         ముఖ్యంగా మన రాష్ట్రాన్ని మెడ మీద తలకాయ ఉన్న వాడెవడూ చెయ్యనంత దరిద్రంగా విభజించిన పాతకం కట్టి కుడిపింది.తెలంగాణాలో ఆ మాత్రం వోట్లన్నా యెలా పడినాయో చిత్రమే గానీ పోటుగాళ్ల మనుకున్న వాళ్ళంతా దూది పింజల్లా యెగిరిపోయారు చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే సామెతకి సాక్ష్యంగా.తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కున్న పాతకాలం పల్లెటూరి వాడు కూడా వీళ్లతో పోలిస్తే మేధావే?!

          అన్ని పార్టీలూ కాంగ్రెసుకి జరిగిన ఈ అవమానం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.వోటు బ్యాంకు రాజకీయాలు మాని ప్రజలకి నికరమయిన మేలు చేసి చూపించి అప్పుడు అధికారాన్ని కోరుకోవాలి.ఈ వోటు బ్యాంకు రాజకీయాలే  కుల, మత, ప్రాంత విభేదాలకి కారణమయి ప్రజల్ని మీరు వేరు మేము వేరు అని కలహించుకునే స్థాయికి తీసుకెళ్తున్నాయి.కాంగ్రెసుకి ఈరోజున యెదురయిన దుస్థితి తమకు యెదురు కాకూడని కోరుకునే పార్టీలు ప్రజల విచక్షణ స్థాయి మారిందని తెలుసుకుని తాము కూడా హుందాగా ఉండటం నేర్చుకోవాలి.

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...